టీచర్ పోస్టుల్లో తెలంగాణ వారికి అవకాశం లేనట్లే!
- ఓపెన్ కోటా ఏపీలోని జిల్లాలకే పరిమితం?
- ఉన్నతాధికారులతో చర్చించాక తుది నిర్ణయం
- పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఉషారాణి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఏపీలో చేపట్టనున్న ఉపాధ్యా య నియామకాల్లో ఓపెన్ కోటా పోస్టుల భర్తీపై నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. రాష్ట్రంలోని 13 జిల్లాల వారికే ఈ ఓపెన్ కోటాను పరిమితం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఓ స్పష్టతకు వచ్చారు. తెలంగాణ ప్రాంతం వేరే రాష్ట్రం కావడంతో అక్కడి వారిని ఈ పోస్టులకు అనుమతించరు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశం సున్నితమైనది కావడంతో నోటిఫికేషన్ విడుదల చేయడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
టీచర్ పోస్టుల నియామకంపై మంగళవారం ఇవ్వనున్న నోటిఫికేషన్‌లో ఈ అంశాన్ని పొందుపరచడం లేదని తెలుస్తోంది. ప్రాధమిక విద్యాశాఖ డైరక్టరేట్ అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచే ఆన్‌లైన్ దరఖాస్తుల్లో దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేక కాలమ్‌లను పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఈ కాలమ్‌ల ఆధారంగా ఏపీలోని 13 జిల్లాల వారికే ఈ పోస్టులను అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో నియామకాల సమయంలో ఓపెన్ కోటా భర్తీపై న్యాయపరమైన సమస్యలు రాకుండా కూడా జాగ్రత్తలు చేపడుతున్నారు.
నేరుగా స్పష్టం చేస్తే ఇబ్బందికరమే...
పోస్టులను ఏపీకే పరిమితం చేస్తే ఇతర రాష్ట్రాల వారి మాదిరిగానే తెలంగాణ రాష్ట్రం వారికి అవకాశం దక్కదు. దీన్ని నోటిఫికేషన్‌లోనే పెడితే ఇరు రాష్ట్రాల మధ్య మరో వివాదంగా మారుతుందని ప్రభుత్వ ముఖ్యులు భావి స్తున్నారు. ఏపీ విద్యా మంత్రి సూచనల మేరకు సాధారణ పరిపాలనా కార్యదర్శి పాణిగ్రాహి దీనిపైపై ప్రత్యేక నోట్‌ను రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావుకు సోమవారం సమర్పించారు.
‘‘ఇప్పటివరకు ఓపెన్ కోటాపై తుది నిర్ణయానికి రాలేదు. బుధవారం ఉన్నతాధికారులతో చ ర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ వి.ఉషారాణి వివరించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూళ్లలోని 9,061 పోస్టులతోపాటు మున్సిపల్ స్కూళ్లకు సంబంధించిన 1,252 పోస్టులనూ ఈ డీఎస్సీలోనే భర్తీచేయనున్నామన్నారు. పోస్టుల వివరాలు, ఇతర సమాచారాన్ని ‘‘హెచ్‌టీటీపీ://ఏపీడీఎస్సీ.సీజీజీ.జీఓవీ.ఇన్’’ అనే పొందుపరిచినట్లు వివరించారు.