usarani
-
ప్రియుడే హంతకుడు
బెంగళూరు : సాసలు క్లస్టర్ పరిధిలోని కల్లుకుంటె గ్రామ శివార్లలో ఈనెల 7వ తేదీన జరిగిన మహిళ హత్యకేసు మిస్టరీ వీడింది. తరచూ డబ్బు కోసం వేధిస్తుండటంతో ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు తేల్చిన పోలీసులు... బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్ట క్లస్టర్ పరిధిలోని తురబన హళ్లికి చెందిన గంగాధర్(32)ను అరెస్ట్ చేశారు. డీవైఎస్పీ కోనప్పరెడ్డి కథనం మేరకు..కుణిగల్ తాలూకా బన్నికుప్పెకు చెందిన ఉషారాణి(26)కి 8 సంవత్సరాల క్రితం రాజ్‌కుమార్ అనే వ్యక్తిని వివాహమైంది. హెసరఘట్ట క్లస్టర్ పరిధిలోని తరబనహళ్లిలో గంగాధర్ అనే వ్యక్తి ఇంట్లో వీరు అద్దెకు ఉండే వారు. ఈ క్రమంలో ఉషారాణికి గంగాధర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. గంగాధర్‌కు వివాహమైన తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగింది. పసిగట్టిన గంగాధర్ భార్య భర్తతో గొడవ పడేది. మరోవైపు ఉషారాణి గంగాధర్‌ను తరచూ డబ్బులు ఇవ్వమని పీడించేది. దీంతో విసుగుచెందిన గంగాధర్...ఉషారాణిని హత్య చేయాలని పథకం పన్నాడు. ఈనెల 7వ తేదీన ఆమెను బైక్‌పై దొడ్డబళ్లాపురం తాలూకా కల్లుకుంట గ్రామ శివార్లకు తీసుకెళ్లాడు. ప్రభుకుమార్‌కు చెందిన స్థలంలో ఆమెను వేల్తో గొంతు బిగించి హత్య చేశాడు. తాళిబొట్టు, చెవి దుద్దులు తీసుకున్నాడు. వెంట తీసుకువచ్చిన పెట్రోల్ పోసి కాల్చివేసి పరారయ్యాడు. ఇదిలా ఉండగా భార్య కనిపించకపోవడంతో ఉషారాణి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో కల్లుకుంటె గ్రామం శివార్లలో మహిళను పెట్రోల్ పోసి కాల్చి హత్య చేసినట్లు తెలుసుకున్న ఎస్ఐ లూయీ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి హతురాలు ఉషారాణిగా నిర్ధారించి దర్యాప్తు ముమ్మరం చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
టీచర్ పోస్టుల్లో తెలంగాణ వారికి అవకాశం లేనట్లే!
ఓపెన్ కోటా ఏపీలోని జిల్లాలకే పరిమితం? ఉన్నతాధికారులతో చర్చించాక తుది నిర్ణయం పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఉషారాణి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఏపీలో చేపట్టనున్న ఉపాధ్యా య నియామకాల్లో ఓపెన్ కోటా పోస్టుల భర్తీపై నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. రాష్ట్రంలోని 13 జిల్లాల వారికే ఈ ఓపెన్ కోటాను పరిమితం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఓ స్పష్టతకు వచ్చారు. తెలంగాణ ప్రాంతం వేరే రాష్ట్రం కావడంతో అక్కడి వారిని ఈ పోస్టులకు అనుమతించరు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశం సున్నితమైనది కావడంతో నోటిఫికేషన్ విడుదల చేయడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. టీచర్ పోస్టుల నియామకంపై మంగళవారం ఇవ్వనున్న నోటిఫికేషన్లో ఈ అంశాన్ని పొందుపరచడం లేదని తెలుస్తోంది. ప్రాధమిక విద్యాశాఖ డైరక్టరేట్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచే ఆన్లైన్ దరఖాస్తుల్లో దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేక కాలమ్‌లను పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఈ కాలమ్‌ల ఆధారంగా ఏపీలోని 13 జిల్లాల వారికే ఈ పోస్టులను అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో నియామకాల సమయంలో ఓపెన్ కోటా భర్తీపై న్యాయపరమైన సమస్యలు రాకుండా కూడా జాగ్రత్తలు చేపడుతున్నారు. నేరుగా స్పష్టం చేస్తే ఇబ్బందికరమే... పోస్టులను ఏపీకే పరిమితం చేస్తే ఇతర రాష్ట్రాల వారి మాదిరిగానే తెలంగాణ రాష్ట్రం వారికి అవకాశం దక్కదు. దీన్ని నోటిఫికేషన్లోనే పెడితే ఇరు రాష్ట్రాల మధ్య మరో వివాదంగా మారుతుందని ప్రభుత్వ ముఖ్యులు భావి స్తున్నారు. ఏపీ విద్యా మంత్రి సూచనల మేరకు సాధారణ పరిపాలనా కార్యదర్శి పాణిగ్రాహి దీనిపైపై ప్రత్యేక నోట్‌ను రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావుకు సోమవారం సమర్పించారు. ‘‘ఇప్పటివరకు ఓపెన్ కోటాపై తుది నిర్ణయానికి రాలేదు. బుధవారం ఉన్నతాధికారులతో చ ర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ వి.ఉషారాణి వివరించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూళ్లలోని 9,061 పోస్టులతోపాటు మున్సిపల్ స్కూళ్లకు సంబంధించిన 1,252 పోస్టులనూ ఈ డీఎస్సీలోనే భర్తీచేయనున్నామన్నారు. పోస్టుల వివరాలు, ఇతర సమాచారాన్ని ‘‘హెచ్‌టీటీపీ://ఏపీడీఎస్సీ.సీజీజీ.జీఓవీ.ఇన్’’ అనే పొందుపరిచినట్లు వివరించారు. -
ఆత్మహత్యలను తొక్కిపెడుతున్న టీడీపీ
మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ‘పచ్చ’ పత్రికల తీరు దారుణం అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్షా సమావేశం సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లాలో 60 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే బయటి ప్రపంచానికి తెలియకుండా టీడీపీ ప్రభుత్వం, దాని అనుకూల పత్రికలు తొక్కి పెడుతున్నాయని మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన తరువాత కనీవినీ ఎరుగని రీతిలో కరువు సంభవించినందున అనంత జిల్లాలో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ నేతలతో అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనంత టీడీపీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. సమస్యలతో సతమతమవుతున్న రైతులు బలవన్మరణాలకు పాల్పడు తుంటే జిల్లా మంత్రి ఆత్మహత్యలు లేనేలేవని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ సమక్షంలో జరిగిన జిల్లా సమీక్షలో పార్టీ నిర్మాణం గురించి ప్రధానంగా చర్చించామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకరనారాయణ తెలిపారు. కదిరి ఎమ్మెల్యే అత్తారు చాంద్‌బాష, మాజీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఇతర నేతలు బోయ తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, నవీన్ నిశ్చల్, ఏ.సాంబశివారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వి.ఆర్.రామిరెడ్డి, రమేష్‌రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. తెలుగు మహిళ నేత చేరిక తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉషారాణి సోమవారం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఆమెకు జగన్ పార్టీ కండువా వేసి ఆహ్వానం పలికారు. -
విద్యా వ్యవస్థలో మార్పులు
ప్రైవేటు విద్యాసంస్థలపై నిఘా నైతిక విలువలపై టీచర్లకు శిక్షణ విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి విశాఖపట్నం: అందరికీ విద్య అందించేందుకు అవసరమైతే ఓ ఉద్యమంలా పటిష్టమైన చర్యలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి అన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుకు భవిష్యత్‌లో విద్యా వ్యవ స్థలో పలు మార్పులు తీసుకొస్తామని ఆమె చెప్పారు. స్వచ్ఛ విద్యాలయం కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలసి ముచ్చటించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం విద్యావ్యవ స్థలో నైతిక విలువలు కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న పిల్లలకు సులభతరమైన రీతిలో నైతిక విలువలు, సమాజం పట్ల అవగాహన, దేశభక్తి తదితర అంశాల్లో అదనపు తరగతల ద్వారా బోధన అందంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. మన టీవీ ద్వారా ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. రాష్ర్టంలో విద్యార్థులు అత్యధికంగా ఉన్న పాఠశాల్లో మొదటిది మదనపల్లి కాగా, రెండోది విశాఖలోని మధురవాడ హైస్కూల్ అని తెలిపారు. అయినా ఈ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఉత్తమ ఫలితాలను అందిస్తున్న పాఠశాలలకు తల్లితండ్రులు, స్థానికులు సహకరించాలని కోరారు. విద్యావ స్థలో రాజకీయ జోక్యం ఇబ్బందికరంగా మారిందని కాలక్రమేనా ఇది రూపుమాపేందుకు కృషిచేస్తామని తెలిపారు. బట్టీ పద్ధతికి స్వస్తి.. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులను రోబోలు లాగా మారిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బట్టిపద్ధతికి స్వస్తిపలికేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అకడమిక్ కేలండర్‌ను రూపొందిస్తున్నామని, ఇది ప్రవేటు పాఠశాలలకూ వర్తింపచేయనున్నామని తెలిపారు. విద్యాశాఖ ఆస్తులను రక్షిస్తాం మధురవాడలోని ఎమ్మార్సీ కార్యాలయానికి చెందిన స్థలంలో అనధికారికంగా వెలసిన ఆక్రమణలపై విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి కిందస్థాయి అధికారులపై మండిపడ్డారు. ఎంతో విలువైన స్థలాన్ని ఆక్రమణలకు గురైతే ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. -
హైస్కూళ్ల అభివృద్ధికి శ్రీకారం
ఒంగోలు వన్‌టౌన్ :ఉన్నత పాఠశాలలు (హైస్కూళ్లు)ను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా జిల్లాలోని 51 ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు 2.83 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ఆర్‌ఎంఎస్‌ఏ ఎక్స్ అఫిషియో డెరైక్టర్ వి.ఉషారాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో పాఠశాలకు 5.55 లక్షల రూపాయలు కేటాయించారు. ఆర్‌ఎంఎస్‌ఏ మొదటి ఫేజ్‌లో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తయిన పాఠశాలలకు ఈ నిధులు విడుదల చేశారు. పాఠశాలకు విడుదల చేసిన నిధులతో ఏమేం కొనుగోలు చేయాలో కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. 9, 10 తరగతుల విద్యార్థుల తరగతి గదులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఒక్కో పాఠశాలకు విడుదలైన మొత్తం రూ.5.55 లక్షల్లో రూ.4.45 లక్షలు ఫర్నిచర్ కొనుగోలుకు, లక్ష రూపాయలు ల్యాబ్ పరికరాల కొనుగోలుకు వినియోగించాలని వివరించారు. ఒక్కో తరగతి గదికి లక్ష రూపాయల చొప్పున 9, 10 తరగతి గదులు రెండింటికి రెండు లక్షల రూపాయలతో ఫర్నిచర్ ఏర్పాటు చేయమన్నారు. సైన్స్ ల్యాబ్‌కు 1.50 లక్షల రూపాయలతో పరికరాలు, ఫర్నిచర్ సమకూర్చుకోమన్నారు. ల్యాబ్ ఎక్విప్మెంట్కు లక్ష రూపాయలు, కంప్యూటర్ రూంకు రూ.40 వేలు, ఆర్డ్ అండ్ క్రాప్ట్ రూంకు రూ.40 వేలు, లైబ్రరీ గదికి రూ.25 వేలతో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకోవాలని ఉషారాణి విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫర్నిచర్, పరికరాల కొనుగోలుకు మార్గదర్శకాలు ఇవీ... పాఠశాలకు విడుదలైన నిధులతో ఫర్నిచర్, సైన్స్ పరికరాలు ఇతరత్రా కొనుగోలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటి ప్రకారం.. ఉన్నత పాఠశాలల్లోని పాఠశాల నిర్వహణ, అభివృద్ధి కమిటీల (ఎస్ఎండీసీ) ఆధ్వర్యంలో వీటిని కొనుగోలు చేయాలి. ఎస్ఎండీసీ తీర్మానం ప్రకారం నిధులు విడుదల చేయాలి. తరగతి గదుల్లో డ్యూయల్ డెస్కులను ఒక్కొక్కటి రూ.4,430 చొప్పున ఒక్కో తరగతి గదికి 20 కొనుగోలు చేయాలి. 9, 10 తరగతుల్లో ఉపాధ్యాయుల టేబుళ్లకు 3,616.75 రూపాయలు, కుర్చీలకు రూ.1,375, అలమరాలకు రూ.13,291 ధరలను నిర్ణయించారు. నాణ్యత పరిశీలనకు కమిటీ... పాఠశాలలు కొనుగోలు చేసిన ఫర్నిచర్, సైన్స్ పరికరాల నాణ్యతను పరిశీలిచేందుకు జిల్లాస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యూఐడీసీ) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, మరో విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, జిల్లా పరిశ్రమల శాఖ నుంచి ఒక అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సభ్యులుగా ఉంటారు. కమిటీ సభ్యులు ఫర్నిచర్, పరికరాల నాణ్యతను పరిశీలించి ధ్రువీకరించిన తరువాతే సంబంధిత సంస్థలకు నగదు చెల్లింపులు చేయాలి. నిధులు మంజూరైన పాఠశాలలు ఇవీ... జిల్లాలో 51 ఉన్నత పాఠశాలలకు నిధులు మంజూరు చేశారు. పుల్లలచెరువు, త్రిపురాంతకం, దొనకొండ, పెద్దారవీడు, మార్కాపురం బాలురు, తిప్పాయపాలెం, తర్లుపాడు, గొట్లగట్టు, ముండ్లమూరు, తిమ్మాయపాలెం, బల్లికురవ, మార్టూరు, వలపర్ల, చెరుకూరు, స్వర్ణ, ఈపూరుపాలెం బాలికలు, వేటపాలెం బాలికలు, కొండమంజులూరు, మేదరమెట్ల, బేస్తవారిపేట బాలికలు, రాచర్ల, ముండ్లపాడు, సీఎస్ పురం, వెలిగండ్ల, పీసీ పల్లి, చెరువుకొమ్ముపాలెం, సంతనూతలపాడు, హెచ్.నిడమానూరు, చిన్నగంజాం, ఈతముక్కల, జరుగుమల్లి, కందుకూరు బాలురు, మాచవరం, పందిళ్లపల్లి, ఇంకొల్లు, కనిగిరి బాలికలు, గుడ్లూరు, కందుకూరు బాలికల జిల్లా పరిషత్ హైస్కూల్, యర్రగొండపాలెం, పెదదోర్నాల, పొదిలి బాలురు, దర్శి, తాళ్లూరు, సంతమాగులూరు, మద్దిపాడు, చీమకుర్తి, కొమరోలు, పామూరు, ఉలవపాడు ప్రభుత్వ హైస్కూళ్లు, పేరాల మున్సిపల్ హైస్కూలు, ఒంగోలు డీఆర్ఆర్ఎం హైస్కూళ్లకు వాటిని కేటాయించారు. -
ఉల్లి విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఉల్లిగడ్డల విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి ఉషారాణి తెలిపారు. కలెక్టరేట్లో శనివారం హైదరాబాద్ నుంచి పౌరసరఫరాల శాఖ కమిషనర్ సునీల్‌శర్మ, మేనేజింగ్ డెరైక్టర్ వెంకట్రామిరెడ్డి జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉల్లిగడ్డల విక్రయం, రేషన్‌కార్డుల అప్లోడ్పై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఉల్లిగడ్డలను సామాన్యులకు అందుబాటులో ఉంచడానికి వర్తకులతో మాట్లాడి రూ.34కు కిలో చొప్పున విక్రయిస్తున్నామని వెల్లడించారు. ఉల్లిగడ్డల విక్రయం కోసం 5 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. తొలిరోజు శనివారం ప్రత్యేక కౌంటర్ల ద్వారా 800 కిలోల ఉల్లిగడ్డలు విక్రయించామని చెప్పారు. రచ్చబండ-2 రేషన్‌కార్డుల దరఖాస్తులను అప్లోడ్ చేస్తున్నామని ఆమె వివరించారు. కార్యక్రమంలో సివిల్ సప్లైస్ అధికారి కొండల్రావు, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఉల్లి విక్రయ కేంద్రం ప్రారంభం ఎన్జీవోస్ కాలనీ : ఎక్సైజ్ కాలనీ రైతుబజార్లో రాయితీపై ఉల్లిగడ్డ అమ్మకం కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఉషారాణి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బయటమార్కెట్లో కిలో ఉల్లి గడ్డను రూ. 60 నుంచి రూ. 65 వరకు అమ్ముతున్నారన్నారు. దీంతో పేద, సామాన్య ప్రజలు ఉల్లి కొనుక్కోలేని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో ప్రభుత్వం రాయితీపై ఉల్లి విక్రయించే కేంద్రాలు ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ ప్రత్యేక కేంద్రాల ద్వారా రూ. 34కే కిలో ఉల్లిగడ్డను వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఒక్కో వినియోగదారునికి ఒక కిలో చొప్పున ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఇలాంటివి ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాస్, రామకృష్ణ పాల్గొన్నారు.