హైస్కూళ్ల అభివృద్ధికి శ్రీకారం | High schools started to develop | Sakshi
Sakshi News home page

హైస్కూళ్ల అభివృద్ధికి శ్రీకారం

Published Sun, Aug 31 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

High schools started to develop

 ఒంగోలు వన్‌టౌన్ :ఉన్నత పాఠశాలలు (హైస్కూళ్లు)ను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా జిల్లాలోని 51 ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు 2.83 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ఆర్‌ఎంఎస్‌ఏ ఎక్స్ అఫిషియో డెరైక్టర్ వి.ఉషారాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో పాఠశాలకు 5.55 లక్షల రూపాయలు కేటాయించారు. ఆర్‌ఎంఎస్‌ఏ మొదటి ఫేజ్‌లో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తయిన పాఠశాలలకు ఈ నిధులు విడుదల చేశారు. పాఠశాలకు విడుదల చేసిన నిధులతో ఏమేం కొనుగోలు చేయాలో కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
 
 9, 10 తరగతుల విద్యార్థుల తరగతి గదులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఒక్కో పాఠశాలకు విడుదలైన మొత్తం రూ.5.55 లక్షల్లో రూ.4.45 లక్షలు ఫర్నిచర్ కొనుగోలుకు, లక్ష రూపాయలు ల్యాబ్ పరికరాల కొనుగోలుకు వినియోగించాలని వివరించారు. ఒక్కో తరగతి గదికి లక్ష రూపాయల చొప్పున 9, 10 తరగతి గదులు రెండింటికి రెండు లక్షల రూపాయలతో ఫర్నిచర్ ఏర్పాటు చేయమన్నారు. సైన్స్ ల్యాబ్‌కు 1.50 లక్షల రూపాయలతో పరికరాలు, ఫర్నిచర్ సమకూర్చుకోమన్నారు. ల్యాబ్ ఎక్విప్‌మెంట్‌కు లక్ష రూపాయలు, కంప్యూటర్ రూంకు రూ.40 వేలు, ఆర్డ్ అండ్ క్రాప్ట్ రూంకు రూ.40 వేలు, లైబ్రరీ గదికి రూ.25 వేలతో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకోవాలని ఉషారాణి విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
 ఫర్నిచర్, పరికరాల
 కొనుగోలుకు మార్గదర్శకాలు ఇవీ...
 పాఠశాలకు విడుదలైన నిధులతో ఫర్నిచర్, సైన్స్ పరికరాలు ఇతరత్రా కొనుగోలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటి ప్రకారం.. ఉన్నత పాఠశాలల్లోని పాఠశాల నిర్వహణ, అభివృద్ధి కమిటీల (ఎస్‌ఎండీసీ) ఆధ్వర్యంలో వీటిని కొనుగోలు చేయాలి. ఎస్‌ఎండీసీ తీర్మానం ప్రకారం నిధులు విడుదల చేయాలి. తరగతి గదుల్లో డ్యూయల్ డెస్కులను ఒక్కొక్కటి రూ.4,430 చొప్పున ఒక్కో తరగతి గదికి 20 కొనుగోలు చేయాలి. 9, 10 తరగతుల్లో ఉపాధ్యాయుల టేబుళ్లకు 3,616.75 రూపాయలు, కుర్చీలకు రూ.1,375, అలమరాలకు రూ.13,291 ధరలను నిర్ణయించారు.
 
 నాణ్యత పరిశీలనకు కమిటీ...
 పాఠశాలలు కొనుగోలు చేసిన ఫర్నిచర్, సైన్స్ పరికరాల నాణ్యతను పరిశీలిచేందుకు జిల్లాస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యూఐడీసీ) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, మరో విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, జిల్లా పరిశ్రమల శాఖ నుంచి ఒక అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సభ్యులుగా ఉంటారు. కమిటీ సభ్యులు ఫర్నిచర్, పరికరాల నాణ్యతను పరిశీలించి ధ్రువీకరించిన తరువాతే సంబంధిత సంస్థలకు నగదు చెల్లింపులు చేయాలి.
 
 నిధులు మంజూరైన పాఠశాలలు ఇవీ...
 జిల్లాలో 51 ఉన్నత పాఠశాలలకు నిధులు మంజూరు చేశారు. పుల్లలచెరువు, త్రిపురాంతకం, దొనకొండ, పెద్దారవీడు, మార్కాపురం బాలురు, తిప్పాయపాలెం, తర్లుపాడు, గొట్లగట్టు, ముండ్లమూరు, తిమ్మాయపాలెం, బల్లికురవ, మార్టూరు, వలపర్ల, చెరుకూరు, స్వర్ణ, ఈపూరుపాలెం బాలికలు, వేటపాలెం బాలికలు, కొండమంజులూరు, మేదరమెట్ల, బేస్తవారిపేట బాలికలు, రాచర్ల, ముండ్లపాడు, సీఎస్ పురం, వెలిగండ్ల, పీసీ పల్లి, చెరువుకొమ్ముపాలెం, సంతనూతలపాడు, హెచ్.నిడమానూరు, చిన్నగంజాం, ఈతముక్కల, జరుగుమల్లి, కందుకూరు బాలురు, మాచవరం, పందిళ్లపల్లి, ఇంకొల్లు, కనిగిరి బాలికలు, గుడ్లూరు, కందుకూరు బాలికల జిల్లా పరిషత్ హైస్కూల్, యర్రగొండపాలెం, పెదదోర్నాల, పొదిలి బాలురు, దర్శి, తాళ్లూరు, సంతమాగులూరు, మద్దిపాడు, చీమకుర్తి, కొమరోలు, పామూరు, ఉలవపాడు ప్రభుత్వ హైస్కూళ్లు, పేరాల మున్సిపల్ హైస్కూలు, ఒంగోలు డీఆర్‌ఆర్‌ఎం హైస్కూళ్లకు వాటిని కేటాయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement