కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఉల్లిగడ్డల విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి ఉషారాణి తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం హైదరాబాద్ నుంచి పౌరసరఫరాల శాఖ కమిషనర్ సునీల్‌శర్మ, మేనేజింగ్ డెరైక్టర్ వెంకట్రామిరెడ్డి జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉల్లిగడ్డల విక్రయం, రేషన్‌కార్డుల అప్‌లోడ్‌పై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
జిల్లాలో ఉల్లిగడ్డలను సామాన్యులకు అందుబాటులో ఉంచడానికి వర్తకులతో మాట్లాడి రూ.34కు కిలో చొప్పున విక్రయిస్తున్నామని వెల్లడించారు. ఉల్లిగడ్డల విక్రయం కోసం 5 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. తొలిరోజు శనివారం ప్రత్యేక కౌంటర్ల ద్వారా 800 కిలోల ఉల్లిగడ్డలు విక్రయించామని చెప్పారు. రచ్చబండ-2 రేషన్‌కార్డుల దరఖాస్తులను అప్‌లోడ్ చేస్తున్నామని ఆమె వివరించారు. కార్యక్రమంలో సివిల్ సప్లైస్ అధికారి కొండల్‌రావు, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉల్లి విక్రయ కేంద్రం ప్రారంభం
ఎన్జీవోస్ కాలనీ : ఎక్సైజ్ కాలనీ రైతుబజార్‌లో రాయితీపై ఉల్లిగడ్డ అమ్మకం కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఉషారాణి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బయటమార్కెట్‌లో కిలో ఉల్లి గడ్డను రూ. 60 నుంచి రూ. 65 వరకు అమ్ముతున్నారన్నారు. దీంతో పేద, సామాన్య ప్రజలు ఉల్లి కొనుక్కోలేని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో ప్రభుత్వం రాయితీపై ఉల్లి విక్రయించే కేంద్రాలు ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ ప్రత్యేక కేంద్రాల ద్వారా రూ. 34కే కిలో ఉల్లిగడ్డను వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఒక్కో వినియోగదారునికి ఒక కిలో చొప్పున ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఇలాంటివి ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాస్, రామకృష్ణ పాల్గొన్నారు.