బడికి వేళాయె..
నేడు పాఠశాలల పునఃప్రారంభం
- సర్కారు బడులకు సమస్యల స్వాగతం
- వేధిస్తున్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు
- పర్యవేక్షణకు ఎంఈవోలు కరువు
- మూలపడిన కంప్యూటర్లు
ఖమ్మం : వేసవి సెలవులు పూర్తయ్యాయి. గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. అయితే పుస్తకాలు, నోట్‌బుక్‌లకు పెరిగిన ధరలు వారిని బెంబేలెత్తిస్తున్నాయి. ఇక కోట్ల రూపాయలు వెచ్చించినా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. నూతన విద్యా సంవత్సరానికి ఆ సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి.
వెంటాడుతున్న ఖాళీల కొరత...
విద్యాశాఖను ఖాళీల కొరత వెంటాడుతోంది. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలు 3,336 ఉండగా ఇందులో 1624 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 68 పాఠశాలలకు అసలు ఉపాధ్యాయులే లేరు. అక్కడ ఇతర పాఠశాలల నుంచి డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులను పంపిస్తున్నారు. ఇక 686 పాఠశాలల్లో ఒక్కో ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. ఏ కారణంగానైనా ఆ టీచర్ బడికి రాకుంటే ఆరోజు అనధికారిక సెలవు ప్రకటించినట్లే. అలాగే జిల్లాలోని 46 మండలాలకు గాను 41 మండల విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వీటిని భర్తీ చేయకపోవడంతో ఆయా మండలాల్లో ఉన్న సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే అటు ప్రధానోపాధ్యాయుడి విధులు, ఇటు ఎంఈవో విధులలో ఏ ఒక్కటీ సక్రమంగా నిర్వహించలేక వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది. జిల్లాలోని నాలుగు డిప్యూటీ ఈవోల పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయులపై పర్యవేక్షణ కొరవడంతో పలు పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పలు పాఠశాలల్లో స్వీపర్లు లేక, ఉన్నచోట వారికి సకాలంలో వేతనాలు అందక పోవడంతో పాఠశాలలు ఊడ్చడం, నీళ్లు తెచుకోవడం వంటి పనులు విద్యార్థులే చేయాల్సిన దుస్థితి నెలకొంది.
వీటికి తోడు నిత్యం ఏదో సమస్యలతో ఉపాధ్యాయ సంఘాల ఆందోళన, దశాబ్దాల తరబడి కార్యాలయాల్లో తిష్టవేసిన వారు ఉన్నతాధికారులు చెప్పిన మాటలు వినకుండా వారి కోటరీని కొనసాగించడం, నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతి పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంగ్లిష్ ఉపాధ్యాయులపై కేసు నమోదు చేయడం వంటి కారణాలతో పాఠశాలల పనితీరు అధ్వానంగా మారింది. ఇకపోతే ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల పదోన్నతి గొడవలూ ఓ కొలిక్కి రాలేదు. వీటిని చక్కదిద్దేందుకే డీఈవో సమయం అంతా సరిపోతోంది. మరోవైపున పోలవరం ముంపునకు గురవుతున్న ఏడు మండలాల ఉపాధ్యాయుల, విద్యార్థుల భవితవ్యం అయోమయంగా మారింది. అక్కడి ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర పరిధిలో పనిచేయాలా.. ఆంధ్రలోకి వెళ్లాలా అనేది ఇప్పటివరకూ తేల్చలేదు.
సమస్యల వలయంలో సర్కారు బడులు...
రాజీవ్ విద్యామిషన్, ఆర్‌ఎంఎస్‌ఏతోపాటు ఇతర పాఠశాల గ్రాంట్లు కోట్ల రూపాయలు వస్తున్నా ప్రభుత్వ పాఠశాలలు మాత్రం సమస్యలకు నిలయాలుగానే విరాజిల్లుతున్నాయి. 2012-13, 2013-14 విద్యా సంవత్సరంలో జిల్లాలో 1500 అదనపు తరగతి గదులు కావాలని జిల్లా అధికారులు ఉన్నతాధికారులను కోరారు. దీంతో జిల్లాకు రూ. 38.78 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు 1358 గదుల నిర్మాణ పనులు మాత్రమే ప్రారంభం కాగా, మిగిలిన వాటి పనులు నేటికీ మొదలు కాలేదు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనా సకాలంలో భవనాలు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
వీటికి తోడు ఈ విద్యా సంవత్సరానికి మరో 526 అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. గతంలో మంజూరైన వాటినే పూర్తిచేయని అధికారులు కొత్తవాటి నిర్మాణానికి ఇంకెంత కాలం గడుపుతారోననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక చోట్ల భవనాలు లేక పూరిగుడిసెలలోనే తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. ఇక పలు పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్నింటిలో తాగునీటి వసతి లేదు. మరికొన్ని పాఠశాలలకు విద్యుత్ సౌకర్యం లేక, కొన్ని చోట్ల బోధించేవారు లేక కంప్యూటర్లు మూలనపడ్డాయి. ఇలా అనేక ప్రాంతాలలో పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మరి ఈ ఏడాదైనా విద్యాశాఖ గాడిన పడుతుందో.. లేదో వేచి చూడాల్సిందే.