బడిబాట
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
విద్యార్థులకు సమస్యల స్వాగతం
నత్తనడకన తరగతి గదుల నిర్మాణం
మౌలిక సమస్యలు యథాతధం
వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత
మోడల్ స్కూళ్లలోనూ ఇక్కట్లే..
ఆటపాటలతో వేసవి సెలవుల్లో ఉత్సాహంగా గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిమెట్లు ఎక్కబోతున్నారు. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే విద్యార్థులకు మాత్రం పాఠశాలలు సమస్యలతో స్వాగతం పలకనున్నాయి. తరగతి గదుల కొరత, సబ్జెక్టు టీచర్లు లేకపోవడం మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలు అలాగే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఆటపాటలకు సెలవు ప్రకటించిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. నెలన్నర విరామం తర్వాత గురువారం పాఠశాలలు పునః ప్రారంభం కానుండడంతో అందుకు సన్నద్ధమవుతున్నారు. ఎంతో ఉత్సాహంగా స్కూళ్లలో అడుగిడే విద్యార్థులకు ఈసారీ పలు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. అయితే ఎన్నడూ లేనివిధంగా ఈసారి పాఠ్యపుస్తకాలు ముందే రావడం శుభపరిణామం.
- విద్యారణ్యపురి
వేసవి సెలవులు ముగిసి గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాబోతుండడంతో పుస్తకాల మోతకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. బ్యాగులు, పుస్తకాలు సర్దుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే కావాల్సినవన్నీ తల్లిదండ్రులు కొనిపెట్టారు. అయితే విద్యార్థులకు మాత్రం సమస్యల స్వాగతం తప్పేలా కనిపించడం లేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూరాయి. అయితే అదనపు తరగతుల కొరత, సబ్జెక్టు టీచర్లు లేకపోవడం, మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలు అలాగే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత విద్యాసంవత్సరంలో రేషనలైజేషన్‌లో 171 స్కూళ్లను మూసివేయడంతో సర్కారు బడులను పరిరక్షించుకోవాలనే తపన ఉపాధ్యాయుల్లో కొంత పెరిగింది.
దీంతో జిల్లాలో చాలాచోట్ల ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. పిల్లలను ప్రభు త్వ స్కూళ్లలోనే చేర్పించాలంటూ తల్లిదండ్రులను అభ్యర్థించారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా విద్యాబోధన చేస్తామని, ఇంగ్లిష్ మీడియం కూడా అందుబాటులో ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు.
వేధిస్తోన్న టీచర్ల కొరత
చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. జిల్లాలో 14,400మందికి పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రధానంగా హైస్కూళ్లలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమం ఉన్నాయి. అయితే రెండు సెక్షన్‌లకు అనుగుణంగా స్కూల్ అసిస్టెంట్లు లేరు. దీంతో తెలుగు,హిందీ,మ్యాథ్స్,ఇంగ్లిష్ తదితర స్కూల్ అసిస్టెంట్‌ల కొరత కూడా ఉంది. వీటిని త్వరితగతిన భర్తీచేయాల్సి ఉంది. ఇక స్వీపర్లు, అటెండర్లు, నైట్‌వాచ్‌మన్‌లు కూడా లేని స్కూళ్లు కూడా జిల్లాలో ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. కొన్ని స్కూళ్లలో జూనియర్ అసిస్టెంట్లు కూడా లేరు.
మోడల్ స్కూళ్లలోనూ ఇక్కట్లే
గతేడాది జిల్లాలో 29 మోడల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. వీటిలోనూ చాలా సమస్యలు ఉన్నాయి. చాలా స్కూళ్ల భవన నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పది భవనాల్లో చిన్నచిన్న పనులు మిగిలిపోయాయి. చాలాచోట్ల రెండో అంతస్తు పనులు కొనసాగుతున్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్ పూర్తయిన గదుల్లో క్లాసులు చెబుతున్నారు. బచ్చన్నపేట, ములుగు, ముస్త్యాల, చిలుకోడు, వంచనగిరి, కల్వల, కొడకండ్ల, నేరడ, మద్దూరు, మహబూబాబాద్, మరిపెడ, కొరికిశాల, బండారుపల్లి మోడల్‌స్కూళ్లలో తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరిపెడ, బండారుపల్లి, నర్మెట, గుర్తూరు, జఫర్‌గఢ్ స్కూళ్లలో టాయిలెట్ సౌకర్యం ఉన్నా నీటి కనెక్షన్ లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. రఘునాధపల్లిలో మోడల్‌స్కూల్ భవనం నిర్మాణంలో ఉండడంతో అక్కడి హైస్కూల్‌లోనే కొనసాగిస్తున్నారు. టీజీటీ,పీజీటీ పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. మొత్తంగా 72 పీజీటీలు, 99 టీజీటీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలు పూర్తికాగా, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు జరగనున్నాయి.
దేవరుప్పుల : ప్రభుత్వ పాఠశాలలకు ముందస్తుగా పుస్తకాలు అందజేసిన తరుణంలో విద్యార్థులను ఆకర్షించేందుకు బడిబాట చేపట్టకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు ప్రైవేటు పాఠశాలలు తమ విద్యార్థులు సాధించిన ఫలితాలను చూపెట్టి తల్లిదండ్రులను ఆకర్షించే పనిలో పడితే విద్యాశాఖ మాత్రం తమకు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే బడిబాట, విద్యా సంబరాల పేరిట గ్రామాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేది. కానీ ఈసారి మాత్రం అటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లలను చేర్చుకునేందుకు ప్రభుత్వ పాఠశాలలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం ప్రైవేటు పాఠశాలలకు కలిసి వస్తోంది. విస్తృత ప్రచారం చేస్తున్న ప్రైవేటు స్కూళ్లు తమ టార్గెట్లను పూర్తిచేసుకుంటున్నాయి. కొన్ని ప్రైవేటు స్కూళ్లు టెక్నో విద్య పేరిట విస్తృత ప్రచారం చేపట్టి విద్యార్థులను ఆకర్షించడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది.
బడిబాట ఆదేశాలు రాలేదు : ఎంఈఓ
బడిబాట నిర్వహించాలని ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని ఎంఈఓ మేకల రవికుమార్ తెలిపారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో ప్రమాణాలు పెంచేందుకు సీఆర్‌పీలతో ప్రత్యేక తరగతులు నిర్వహించినట్టు చెప్పారు. ఇదే సందర్భంలో ఇంటింటికీ తిరిగి బడిఈడు పిల్లల వివరాలు సేకరించినట్టు పేర్కొన్నారు.
పీడిస్తున్న మరుగుదొడ్ల సమస్య
ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య విద్యార్థులను పట్టి పీడిస్తోంది. ప్రధానంగా బాలికలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. బాలికల డ్రాపవుట్‌కు ఇది కూడా ఓ కారణమని సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రభుత్వం అలసత్వం వీడడం లేదు. జిల్లాలోని 223 పాఠశాలల్లో మరుగుదొడ్లు అసలే లేవని రికార్డులు చెబుతున్నాయి. ఉన్నచోట నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారుతున్నాయి. మరికొన్ని చోట్ల శిథిలమై పనికిరాకుండా పోయాయి. పాఠశాల నిర్వహణ గ్రాంటు నుంచి రూ.400-500 వరకు నిర్వహణకు వాడుకోవచ్చని అధికారులు చెబుతున్నా నిర్వహణకు అవి సరిపోకపోవడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ముందస్తుగానే పాఠ్యపుస్తకాలు
బడులు తెరిచి నెలలు గడిచినా రాని పాఠ్యపుస్తకాలు ఈసారి ముందే వచ్చి రికార్డు సృష్టించాయి. ఏప్రిల్ చివరి వారం నాటికే చాలా స్కూళ్లకు పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. ఇప్పటివరకు 98శాతం పాఠ్యపుస్తకాలు వచ్చాయి. జిల్లాకు 27,80,540 పాఠ్యపుస్తకాల అవసరం ఉండగా ఇప్పటి వరకు 27,37,24 పుస్తకాలు వచ్చాయి. జిల్లాకేంద్రం నుంచి మండలాల్లోని ఎంఆర్‌సీ భవనాలకు 24,99,509 పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. కొన్నిచోట్ల స్కూల్‌పాయింట్లకు కూడా చేరుకున్నాయి. ఇంకా కేవలం 50వేల పుస్తకాలు మాత్రమే రావాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పాఠశాలల ముగింపు రోజునే పదో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయడం విశేషం. ఇక 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పాఠశాలల ప్రారంభం రోజునే పుస్తకాలు పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.