► నెలాఖరులో డీఎస్సీ నోటిఫికేషన్!
► సన్నద్ధమవుతున్న టీఎస్‌పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: గురుకుల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలు దసరాలోపు వెలువడనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు అందనందున.. ఆ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు పదిహేను, ఇరవై రోజుల సమయం పట్టవచ్చని సమాచారం.
గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ ఇటీవలే పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలన్నీ ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించినందున.. త్వరగానే ఫలితాలు విడుదల చేసేందుకు అవకాశముందని, ఆ దిశగా కసరత్తు జరుగుతోందని టీఎస్‌పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. ఈ పరీక్షల ఫలితాలన్నీ నెలాఖరులోగానే వెల్లడించేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిపాయి.
విద్యా శాఖ నుంచి సమాచారం కోసం..
8,452 టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన నేపథ్యంలో నోటిఫికేషన్ జారీకి టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే సంబంధిత పోస్టుల వివరాలు, జిల్లాల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు, స్థానికత నిబంధనలు తదితర సమాచారం విద్యా శాఖ నుంచి రావాలని.. ఆ వెంటనే నోటిఫికేషన్ జారీకి కసరత్తు మొదలవుతుందని కమిషన్ వర్గాలు తెలిపాయి.
ఈ సమాచారం అందించేందుకు విద్యా శాఖకు కనీసం వారం పట్టవచ్చని.. ఆ తర్వాతే సిలబస్ ఖరారు, మార్గదర్శకాలు, అర్హతలను నిర్ధారించాల్సి ఉంటుందని వివరించాయి. ఈ నేపథ్యంలో టీచర్ పోస్టుల నోటిఫికేషన్ సెప్టెంబర్ నెలాఖరులోగానీ అక్టోబర్‌లో గానీ వెలువడే అవకాశముందని పేర్కొన్నాయి.
దసరాలోగా ‘గురుకుల’ ఫలితాలు
Published Fri, Sep 8 2017 3:08 AM | Last Updated on Tue, Sep 12 2017 2:10 AM
Advertisement