భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయ శిక్షణ పొందిన గిరిజన అభ్యర్థులకు శుభవార్త.. ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు మరో డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 ఐటీడీఏల పరిధిలో 2,825 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వగా.. అందులో భద్రాచలం ఐటీడీఏకు 659 పోస్టులు కేటాయించింది. సున్నంవారిగూడెం గిరిజన డిక్లరేషన్‌లో భాగంగా ఈ పోస్టులకు అనుమతి ఇస్తూ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సోమేష్‌కుమార్ మంగళవారం జీవో 233 పేరిట ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను ఐటీడీఏ అధికారులు త్వరలోనే ప్రారంభించనున్నారు. స్పెషల్ డీఎస్సీ -2012 పేరిట 493 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అలాగే 2013 జనరల్ డీఎస్సీలో 42 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఐటీడీఏ అధికారులు బుధవారం నోటీస్‌బోర్డులో పెట్టనున్నారు. తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులతో ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మంజూరైన పోస్టులలో 70 శాతం పదోన్నతుల ద్వారానే భర్తీ చేయనున్నారని తెలిసింది.
మంజూరైన పోస్టుల వివరాలు...
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. పీజీ హెచ్‌ఎం 23, గణితం 44, ఫిజికల్ సైన్స్ 61, బయలాజికల్ సైన్స్ 52, ఇంగ్లిష్ 63, సాంఘికశాస్త్రం 34, తెలుగు 63, హిందీ 62, ఫిజికల్ డెరైక్టర్ పోస్టులు 59, పీఈటీలు 02, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు 79 భర్తీ చేయనున్నారు. అలాగే ఎస్జీటీ 117 పోస్టుల భర్తీకి కూడా అనుమతి వచ్చింది. ఈ ఉత్తర్వులతో దాదాపు ఏజెన్సీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ కానున్నాయి. కాగా, ప్రతిసారీ ఏజెన్సీ డీఎస్సీ ప్రక్రియ ప్రహసనంలా మారుతోంది. ఏజెన్సీ సర్టిఫికెట్ల వివాదాల నేపథ్యంలో డీఎస్సీ ప్రక్రియ సజావుగా సాగడం లేదు. కుప్పలు తెప్పలుగా వస్తున్న దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హులైన వారి జాబితాను రూపొందించటం ఐటీడీఏ విద్యాశాఖలోని సిబ్బందికి తలనొప్పిగా మారుతోంది.
ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా కార్యాలయ సిబ్బంది పోస్టులు పెరగకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. మరోసారి భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో వివాదాలు తలెత్తకుండా ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఐటీడీఏ విద్యాశాఖ విభాగంలో అదనపు సిబ్బందిని నియమించి ఎలాంటి ఆరోపణలు రాకుండా నిష్పక్షపాతంగా, వేగవంతంగా ఈ ప్రక్రియ కొనసాగేలా చర్య తీసుకోవాలని ఐటీడీఏ పీవోను కోరుతున్నారు.
ఏజెన్సీలో కొలువుల జాతర
Published Wed, Aug 14 2013 5:03 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement
Advertisement