భద్రాచలం, న్యూస్‌లైన్ : ఏజెన్సీ డీఎస్సీకి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. 2012 నోటిఫికేషన్ ద్వారా గుర్తించిన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసుకోవచ్చని కోర్టు నుంచి ఉత్తర్వులు అందడంతో ఐటీడీఏ అధికారులు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఐటీడీఏ పరిధిలో గల పాఠశాలల్లో 370 ఎస్జీటీ, 182 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం 2012లో స్పెషల్ డీఎస్సీ పేరిట నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలోని భద్రాచలం ఏజెన్సీలో 493 పోస్టులకు అనుమతి వచ్చింది.
అయితే మిగతా జిల్లాల్లో ఉపాధ్యాయుల ఎంపిక పూర్తి అయినప్పటికీ భద్రాచలం ఐటీడీఏ పరిధిలో మాత్రం కోర్టు కేసుల వివాదాలతో భర్తీప్రక్రియ నిలిచిపోయింది. డీ ఎస్సీకి దరఖాస్తు చేసుకున్న పలువురు లంబాడా అభ్యర్థులు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారు కాదని ఆదివాసీ అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టును సైతం అశ్రయించారు. దీంతో ఉపాధ్యాయల ఎంపిక ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనిపై ఏడాదికి పైగా కోర్టులో వాదనలు జరిగాయి. లంబాడా అభ్యర్థులు సమర్పించిన ఏజెన్సీ సర్టిఫికెట్లు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఐటీడీఏ అధికారులు కోర్టుకు నివేదించారు. ఇందుకు సమ్మంతించిన కోర్టు పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఇప్పటికే ప్రకటించిన జాబితా ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 11న ఐటీడీఏ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ సరస్వతి తెలిపారు.
తేలని పీఈటీల పంచాయితీ...
ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆమోదం లభించినప్పటికీ పీఈటీ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం లేకుండా పోతోంది. 41 పీఈటీ పోస్టుల భర్తీకి ఐటీడీఏ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించి అర్హుల జాబితా కూడా ప్రకటించారు. అయితే పీఈటీ ఉద్యోగాలకు ఐటీడీఏ అధికారులు ప్రకటించిన జాబితాలో కొందరు నకి లీ సర్టిఫికెట్లు జతచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదివాసీ తెగకు చెందిన అభ్యర్థులు సమాచార హక్కు చట్టం ద్వారా ఎంపికైన అభ్యర్థుల మార్కుల జాబితాలను యూనివర్శిటీ నుంచి తెప్పించి ఐటీడీఏ అధికారులకు అందజేయటంతో అవి నకిలీవిగా తేలాయి. వారిని తొలగించి మరో సారి జాబితా ప్రకటించినప్పటికీ అందులో కూడా కొన్ని అభ్యంతరాలను లేవనెత్తిన ఆదివాసీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై తుది నిర్ణయాన్ని కోర్టు పెండింగ్‌లో పెట్టడంతో పీఈటీ పోస్టుల భర్తీకి ఆమోదం లభించలేదు.
ఏజెన్సీ డీఎస్సీకి లైన్ క్లియర్
Published Thu, Aug 8 2013 4:09 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement
Advertisement