- జిల్లాలో 935 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
- రెండేళ్లుగా నియామకాలు నిల్
- కొత్త ప్రభుత్వంలో ఉపాధ్యాయ నియామకాలపై సందిగ్ధత
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రెండేళ్ల నుంచి కొత్తగా ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీకి నోచుకున్నది లేదు. ప్రతీ పాఠశాలలో 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఉండాలని విద్యాహక్కు చట్టం స్పష్టం చేస్తున్నప్పటికీ నాలుగేళ్లయినా దానిని అమలు పరిచిన దాఖలాలు జిల్లాలో లేవు. రెండేళ్లుగా ఉపాధ్యాయ నియామకాలు నిలిచిపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఆటంకం ఏర్పడుతోంది. ఉద్యోగ విరమణతో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఎక్కడికక్కడ ఖాళీలు పేరుకుపోతున్నాయి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల్లోకి అడుగుపెట్టిన విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు లేకపోవడంతో తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు వెనకాడుతున్నారు.
ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో వందలాది ఎస్జీటీ పోస్టులు పేరుకుపోవడంతో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కరువయ్యారు. ఉన్నత పాఠశాలల్లో సైతం సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా మారడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
జిల్లాలో 935 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
వేసవి సెలవులను సరదాగా గడిపి భవితపై కోటి ఆశలతో మళ్లీ పాఠశాలల్లో అడుగుపెడుతున్న విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా లేరు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 935 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటమే ఇందుకు నిదర్శనం. డీఎస్సీ 2012 ద్వారా జిల్లాలో 404 పోస్టులు భర్తీ చేయగా, మళ్లీ ఇప్పటివరకూ ఉపాధ్యాయ నియామకాల ఊసే లేదు. ఫలితంగా రెండేళ్లుగా నూతన నియామకాలు, పదవీ విరమణతో ఖాళీ అయిన పోస్టులు భారీగా పేరుకుపోయాయి.
కేటగిరీ వారీగా భర్తీ చేయాల్సిన పోస్టులు
జిల్లాలోని 30 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం-50 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-300, ఎస్జీటీ పోస్టులు-577 సహా భాషా పండిత, పీడీ, పీఈటీ పోస్టులు-62 భర్తీకి నోచుకోకుండా ఉండిపోయాయి.
ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత
రెండేళ్ళుగా డీఎస్సీ నిర్వహణపై దృష్టి సారించని ప్రభుత్వ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఆర్నెల్లకోసారి నిర్వహిస్తూ వచ్చింది. సాధారణంగా టెట్ పరీక్ష తరువాత డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాల్సిండగా, రెండేళ్ళుగా టెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులే వేల సంఖ్యలో ఉన్నారు. గత మార్చిలో జరిగిన టెట్‌కు జిల్లాలో బీఈడీ, డీఈడీ అభ్యర్థులు 19,496 మంది హాజరయ్యారు. టెట్‌లో అర్హత సాధించిన నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఇప్పటివరకూ ఉపాధ్యాయ కొలువులపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ ఏడాదిలోనైనా డీఎస్సీ ప్రకటన వస్తుందో లేదో తెలియని సందిగ్ధత నెలకొంది.
పాఠాలు చెప్పేవారేరి..!
Published Thu, Jun 19 2014 12:20 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement