ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
ఉపాధ్యాయుల నియామకానికి ప్రభుత్వ మెమో జారీ
మచిలీపట్నం: ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్ ఈ నెల 4వ తేదీన మెమో నం.18,836ను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో 2015 జనవరి 6వ తేదీ, 2015 సెప్టెంబర్ 14వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 2004 అక్టోబర్ 20వ తేదీ నుంచి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టుల నియామకాన్ని చేపట్టవచ్చని పేర్కొన్నారు.
అయితే దీని అమలుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 12 సంవత్సరాలుగా ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టుల నియామకంపై నిషేధం ఉంది. ఈ మధ్యకాలంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పలువురు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయటంతో ఎయిడెడ్ పాఠశాలల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన నియామకాలు చేపడతారన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.