మద్యం లెసైన్సులకు గ్రీన్‌సిగ్నల్
- నేటి నుంచి దరఖాస్తుల విక్రయం
- జిల్లాలో రూ.126.95 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
మచిలీపట్నం : జిల్లాలో మద్యం షాపుల లెసైన్సుల జారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో మచిలీపట్నం ఈఎస్ పరిధిలో 182 షాపులు ఉండగా వీటిని 173కు కుదించారు. విజయవాడ ఈఎస్ పరిధిలో 153 షాపులు ఉన్నాయి. మొత్తంగా జిల్లాలోని 326 మద్యం దుకాణాలకు మంగళవారం నుంచి దరఖాస్తులు విక్రయించనున్నారు.
ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు మద్యం షాపులకు దరఖాస్తులు సమర్పించుకునేందుకు అవకాశం ఇచ్చారు. 28వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు మచిలీపట్నం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో లాటరీ పద్ధతిన మద్యం షాపులు కేటాయించనున్నారు. 24 నుంచి 27 వరకు విజయవాడ, మచిలీపట్నం ఈఎస్ పరిధిలో మద్యం దుకాణాల లెసైన్సులు పొందేందుకు దరఖాస్తులను విజయవాడ ఈఎస్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంది.
మద్యం షాపులకు లెసైన్సు ఫీజుల ద్వారా రూ.126.95 కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో మొత్తం 326 షాపుల్లో కొన్నింటికి దరఖాస్తులు రాకుంటే కొంత ఆదాయం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. రూ.64 లక్షలు లెసైన్సు ఫీజు చెల్లించే షాపులు విజయవాడ ఈఎస్ పరిధిలోనే అధికంగా ఉన్నట్లు చెప్పారు. దరఖాస్తు ధరను రూ.25 వేలుగా నిర్ణయించారు.