అర్ధరాత్రి అమ్మకాలపై సందిగ్ధం!
♦ మద్యం అమ్మకాల సమయం పెంచాలని కోరుతున్న వ్యాపారులు
♦ సానుకూలంగానే స్పందించిన ప్రభుత్వం
♦ ఇతర రాష్ట్రాల వివరాలతో సర్కార్‌కు ఎక్సైజ్ కమిషనర్ నివేదిక
♦ మద్యం విక్రయాలకు గంటపాటు సమయం పెంచాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం అమ్మకాల సమయం పెంచాలన్న నిర్ణయంపై ప్రభుత్వ శాఖల్లోనే తర్జనభర్జన జరుగుతోంది. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌తో పాటు పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో అర్ధరాత్రి వరకు మద్యాన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఫిబ్రవరిలోనే ఎక్సైజ్ శాఖను నివేదిక కోరింది. ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాల సమయాన్ని పెంచడంపై పరిశీలన జరిపారు. సమయాన్ని మరో గంట పాటు పెంచాలంటూ సీఎంకు సూచించారు కూడా. నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త సమయాన్ని అమలు చేయాలని భావించారు. కానీ అప్పట్లో చీప్‌లిక్కర్‌పై తలెత్తిన వివాదం నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రభుత్వం పక్కనబెట్టింది.
శాంతిభద్రతల సమస్యతో..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అంబర్‌పేట నుంచి రామంతాపూర్ దాకా రాత్రి 10 గంటల వర కు మద్యం దుకాణాలు, రాత్రి 11.00 వరకు బార్లు తెరిచి ఉంటాయి. కానీ గ్రేటర్‌లోనే భాగమైన ఉప్పల్ ప్రాంతంలో మాత్రం రాత్రి 9.30కు మద్యం దుకాణాలను, 10.30కు బార్లను మూసివేయాల్సిందే. శాంతిభద్రతల కారణంతో రంగారెడ్డి జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే పరిస్థితి అన్ని జిల్లాల్లోనూ ఉంది.
బార్లలో 11 గంటలకు మద్యం విక్రయాలు నిలిపివేసినా... అర్ధరాత్రి 12 గంటల వరకు రెస్టారెంట్లు పనిచేసే వెసులుబాటును కొద్ది నెలల క్రితం కార్మిక శాఖ కల్పించింది. కానీ పోలీస్ యంత్రాంగం శాంతిభద్రతల కారణంతో కార్మికశాఖ ఉత్తర్వులను పాటించడం లేదు. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారులు, బార్ల యజమానులు ఇటీవలే ఎక్సైజ్ మంత్రి పద్మారావుగౌడ్‌ను కలసి సమయం పెంపు గురించి విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోనైనా మద్యం విక్రయాల సమయాన్ని పెంచాలని కోరారు.
సచివాలయంలో ఆగిన ఫైలు
మద్యం విక్రయాల సమయాన్ని పెంచడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను పేర్కొంటూ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, చెన్నై, ఒడిశా, హరియాణా, కేరళలో, మన రాష్ట్రంలో బార్లు, మద్యం దుకాణాల సమయాలను కూడా పొందుపరిచారు. సమయం పెంచడం వల్ల విక్రయాలు పెరిగి, ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుందని సూచించారు. అయితే ఈ ఫైలు సచివాలయంలో అధికారుల వద్దే నిలిచిపోయినట్లు సమాచారం. ఈ ఫైలు మంత్రి పద్మారావు ద్వారా ముఖ్యమంత్రికి చేరి, ఆయన ఆమోద ముద్ర వేస్తే... సమయం పెంపు అమలులోకి వస్తుంది.