సాయం చేసేదెవరు!
- ఆదర్శ రైతులను తొలగించిన ప్రభుత్వం
- ఎంపీఈవోల నియామకానికి ఖరారు కాని విధివిధానాలు
- వ్యవసాయ సమాచారం ఇచ్చేవారు కరువు
- ఆందోళనలో అన్నదాతలు
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు అన్నదాతలను రోజురోజుకూ మరింత కుంగదీస్తున్నాయి. హామీల వర్షంతో ఆశలు రేపిన పాలకులు కొద్దికాలంలోనే వాటిని వమ్ము చేశారు. హామీలను అమలు చేయకపోగా, రైతులకు అన్ని విధాలా ఉపయోగపడుతున్న ఆదర్శ రైతు వ్యవస్థను కూడా తొలగించారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో సాగు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరు సాయం చేస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తిరువూరు/మచిలీపట్నం : రైతులకు మరో కష్టం వచ్చిపడింది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోయినా.. సకాలంలో సాగునీరు రాకపోయినా అష్టకష్టాలు పడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ ద్వారా కనీస సేవలు కూడా అందకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల గురించి రైతులకు కనీస సమాచారం కూడా అందడం లేదు. ఆదర్శరైతు వ్యవస్థను రద్దు చేయడమే ఇందుకు కారణం. ఎరువుల వినియోగం, సబ్సిడీ పరికరాల సమాచారం తదితర అంశాలపై రైతులకు సమాచారం సకాలంలో అందేది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదర్శరైతు వ్యవస్థను రద్దు చేయటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
సమాచారం ఇచ్చేవారు కరువు
ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు కల్పిస్తున్న ప్రయోజనాల గురించి క్షేత్రస్థాయిలో వివరించేవారు కరువయ్యారు. పెద్ద రైతులకు మినహా సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ శాఖకు సంబంధించిన సమాచారం అందని దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వం నియమించిన ఆదర్శ రైతులను ప్రస్తుత పాలకులు తొలగించారు. వారి స్థానంలో ఎంపీఈవోలను నియమిస్తామని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేయటంలో జాప్యం చేస్తోంది. ఎంపీఈవోల నియామకం ఎప్పటికి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
గతంలో మండలంలో 50 మంది చొప్పున ఆదర్శరైతులు ఉండేవారు. దీంతో గ్రామస్థాయిలో రైతులకు సకాలంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండేది. వ్యవసాయ శాఖ సబ్సిడీపై అందించే వరి విత్తనాలు, యంత్రపరికరాలు, జిప్సం, యూరియా తదితర ఎరువుల వివరాలను ఆదర్శరైతులు తమ పరిధిలోని రైతులకు తెలియజేసి అవసరమైతే వారే వెంటపెట్టుకుని తీసుకెళ్లేవారు. రైతులకు అన్ని విధాలా సాయం చేసేవారు.
ప్రస్తుతం ఆదర్శరైతులు లేకపోవడంతో మండల వ్యవసాయాధికారి లేదా వ్యవసాయ విస్తరణాధికారులపై అదనపు భారం పడుతోంది. జిల్లాలోని 49 మండలాల్లో సగానికి పైగా మండలాల్లో వ్యవసాయశాఖ విస్తరణాధికారులు లేరు. పంటలకు తెగుళ్లు వ్యాపించిన సమయంలో ఎలాంటి మందులు వాడాలి, ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలనే విషయం తెలుసుకునేందుకు వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళితే అధికారులు, సిబ్బంది కనిపించడంలేదని రైతులు చెబుతున్నారు.
ఎంపీఈవోల నియామకంలో జాప్యం
ఆదర్శరైతు వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం ప్రతి మండలానికి నలుగురు, ఐదుగురు వ్యవసాయ విస్తరణ అధికారి(ఎంపీఈవో)లను కాంట్రా క్టు ప్రాతిపదికన నియమించనున్నట్లు ప్రకటించింది. వ్యవసాయ విభాగం లో డిప్లమో చేసిన వారిని ఈ పోస్టుల్లో నియమిస్తారనే ప్రచారం జరుగుతోం ది. దీనికి అనుగుణం గా స్పష్టమైన ఉత్తర్వులు జారీ కాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలొస్తేనే ఎంపీఈవోల నియామకా నికి అవకాశం ఉంటుం దని వ్యవసా య శాఖ అధికారులు చెబుతున్నారు.
మొక్కుబడిగా కార్యక్రమాలు
ప్రతి మంగళ, బుధవారాల్లో ‘పొలం పిలుస్తోంది’, ప్రతి నెల 16వ తేదీన వ్యవసాయ మార్కెట్లలో రైతులకు సలహాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని విధిగా రెండు గ్రామాల్లో నిర్వహించాల్సి ఉంది. ఈ సమాచారాన్ని రైతులకు అందించే వారు లేక మొక్కుబడిగానే జరుగుతోంది.