మరింత మోత
- ఆస్తి పన్ను పెంపునకు గ్రీన్ సిగ్నల్
- ఏప్రిల్ నుంచి నగర వాసులపై బీబీఎంపీ భారం
- వాణిజ్య కట్టడాలపై 25 శాతం, నివాసాలకు 20 శాతం పెంపు
- ఇక ఐదేళ్లకోసారి పెంచేలా నిర్ణయం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ)ను ఆదుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆస్తి పన్ను పెంచడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. వచ్చే ఏప్రిల్ నుంచి నగర వాసులపై మరింత ఆస్తి పన్ను భారం పడనుంది. వాణిజ్య కట్టడాలపై 25 శాతం, నివాసాలకు 20 శాతం చొప్పున పన్ను పెరగనుంది. దీనికి తోడు ఐదేళ్లకోసారి ఆస్తి పన్నును సవరించాలని కూడా ప్రభుత్వం బీబీఎంపీకి సూచించింది. పన్ను పెంపు వల్ల బీబీఎంపీకి అదనంగా రూ.850 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా.
ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక, అప్పులు కట్టలేక డీలా పడిపోయిన బీబీఎంపీకి ప్రభుత్వ అనుమతి ద్వారా కాస్త ఊరట లభించినట్లయింది. ఆస్తి పన్ను వసూలు చేయడంలో బీబీఎంపీ అధికారులు ఐదేళ్లుగా విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. 2014-15లో ఆస్తి పన్ను వసూలు లక్ష్యం రూ.2,500 కోట్లు కాగా, అందులో సగం కూడా వసూలు చేయలేక పోయారు. కేవలం రూ.1,120 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. మూడు లక్షల మందికి పైగా ఆస్తి పన్ను చెల్లించకపోయినా, బీబీఎంపీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారనే ఆరోపణలొచ్చాయి.
బీబీఎంపీ తొలి మేయర్ ఎస్‌కే. నటరాజ్ హయాం నుంచే ఆస్తి పన్ను పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, ప్రజలపై భారం పడుతుందనే ఉద్దేశంతో బీబీఎంపీ సర్వ సభ్య సమావేశం సమ్మతించలేదు. అధికారంలో ఉన్న బీజేపీ గత నాలుగేళ్లుగా ఆస్తి పన్ను పెంపు పట్ల పెద్దగా సుముఖత చూపలేదు. 2015లో బీబీఎంపీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున, ప్రభుత్వం పన్ను పెంపునకు ఆమోదం తెలపడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.