►కరీంనగర్ నుంచి మేడ్చల్‌లోని ఓ స్కూల్‌కు ఓ టీచర్‌ను పైరవీతో బదిలీ చేశారు. నిజానికి ఆ టీచర్ సోషల్ సబ్జెక్టు చెప్పే టీచర్. కానీ ఆ స్కూల్లో ఆ సబ్జెక్టులో ఖాళీల్లేవు. ఇలాంటప్పుడు ఖాళీల్లేవని తిప్పి పంపాలి. కానీ ఖాళీ ఉన్న ఇంగ్లిష్ పోస్టులో ఇరికించేశారు. ఇదే జిల్లాలో మరో రెండు బడుల్లో సోషల్ సబ్జెక్టు పోస్టుల్లో ఇతర సబ్జెక్టు టీచర్లను తెచ్చారు.
►బదిలీల షెడ్యూల్ వెలువడకుండానే రంగారెడ్డి జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన టీచర్‌ను హయత్ నగర్ మండలానికి బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో రూ.10 లక్షలు చేతులు మారినట్టు తెలిసింది. మరో టీచర్ నారాయణ పేట నుంచి మేడ్చల్ జిల్లాకు రూ.8 లక్షలు మధ్యవర్తి ద్వారా ఇచ్చి బదిలీ చేయించుకున్నట్టు చెప్పుకుంటున్నారు.
సాక్షి, హైదరాబాద్: బదిలీల్లో ఇలా పైరవీలకు పెద్దపీట వేయడం టీచర్లలో కలకలం రేపుతోంది. ఒకవైపు షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులు స్వీకరిస్తూనే, మరోవైపు అడ్డగోలుగా పోస్టింగ్‌లు ఇవ్వడంపై గగ్గోలు పెడుతున్నారు. ఇది ప్రక్రియను ఆపహా స్యం చేయడమేనని టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటివరకూ దాదాపు 200 మందిని నిబంధనలకు విరుద్ధంగా వాళ్లు కోరుకున్న స్కూళ్లకు పోస్టింగ్ ఇచ్చినట్టు సంఘాల నేతలు చెబుతున్నారు.
నేరుగా ప్రభుత్వపెద్దల నుంచే సిఫార్సు లు వస్తున్నాయని, వాటిని ఉన్నతాధికారులు సంబంధిత డీఈవోలకు పంపుతున్నారని అంటున్నారు. డీఈవోలు ఏకంగా పోస్టింగ్ ఆర్డర్లే ఇచ్చేస్తున్నారని టీచర్లు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై అనేక ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదిలాఉండగా, పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయంలోకి ఉపాధ్యాయ సంఘాల నేతలతోపాటు ఇతరులెవరినీ అనుమతించడం లేదు.
ఇందుకేనా 317 జీవో...
ప్రభుత్వం 317 జీవో ద్వారా దాదాపు 25 వేల మందిని మారుమూల ప్రాంతాలకు బదిలీ చేసింది. ఈ సందర్భంగా వారికి అన్యాయం జరిగినట్టు చెబుతున్నారు. స్థానికత ఎంపిక సందర్భంగా కొత్త జిల్లాల్లో అర్బన్ ప్రాంతాల్లో పోస్టులను చూపించకుండా జాగ్రత్త పడ్డారు. కనీసం వాటిని చూపించినా సీనియారిటీ ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లను కొంతమంది టీచర్లు ఎంచుకునే వీలుంది. ఇప్పుడు బదిలీకి ఏ స్కూల్లోనైనా రెండేళ్లు పనిచేసి ఉండాలి. కాబట్టి 317 జీవో ద్వారా మారుమూల ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు తిరిగొచ్చే అవకాశమే లేదు. పట్టణ ప్రాంతాల్లో బడులను బ్లాక్ చేయడంతో తిరిగి ఇప్పుడు నచ్చినవారికి పోస్టులు ఇచ్చుకునే వీలుకలుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.
గణతంత్ర దినోత్సవాన కూడా...
ప్రభుత్వ యంత్రాంగం మొత్తం జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్లో నిమగ్నమై ఉన్న రోజు కూడా ఏకంగా ఏడు పైరవీ బదిలీలకు ఉత్తర్వులు వెలువడ్డాయి. వీళ్లంతా పట్టుమని 30 కి.మీ. దూరం కూడా లేని బడుల్లో పనిచేస్తున్నవారే కావడం గమనార్హం. మంత్రులు, ఎమ్మెల్సీల పైరవీలతో ఇవన్నీ జరిగినట్టు చెబుతున్నారు. దీంతో తామేమీ చేయలేకపోతున్నామని విద్యా శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ వ్యవహారంలో అధికారులకూ ముడుపులు ముడుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఆ బదిలీలను రద్దు చేయాలి: చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పైరవీలతో బదిలీలు చేయడమంటే ప్రక్రియను అపహాస్యం చేయడమే. నిబంధనలకు విరుద్ధంగా మంత్రులు, ఎమ్మెల్సీల పైరవీలను అనుమతిస్తే ఉపాధ్యాయ వృత్తికే కళంకం ఏర్పడుతుంది. ఈ బదిలీలను రద్దు చేయాలి.
లక్షల్లో బేరసారాలు
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో పోస్టింగుల కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఇదే అదునుగా మధ్యవర్తులు టీచర్లతో బేరాలు కుదుర్చుకుని ఒక్కో పోస్టుకు రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బేరం కుదిరిన వెంటనే టీచర్లకు మాత్రం కోరు కున్న ప్రాంతాల్లో పోస్టింగ్‌లు వస్తున్నాయని అంటున్నారు.
వాస్తవానికి బదిలీ కోసం దర ఖాస్తు చేసుకునే ప్రక్రియ బుధవారంతో ముగుస్తుంది. కానీ కొంతమందికి షెడ్యూల్ విడుదల కాకముందే పోస్టింగ్‌లు వస్తే... మరికొంత మందికి బదిలీలకు దరఖాస్తు గడువు ముగియకుండానే పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఇప్పుడు బదిలీ చేసినా ఏప్రిల్ తర్వాతే రిలీవ్ చేస్తామని షెడ్యూల్లో స్పష్టంచేసినా... పైరవీల టీచర్లు మాత్రం కొత్త ప్రాంతాల్లో చేరిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment