సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి పోస్టుల వారీగా పరిగణనలోకి తీసుకునే సిలబస్ ఖరారు దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), పండిట్ పోస్టులకు సంబంధించిన సిలబస్‌ను టీఎస్‌పీఎస్సీకి అందజేసిన విద్యాశాఖ... బుధవారం పీఈటీ పోస్టులతోపాటు మరో కేటగిరీకి చెందిన పోస్టుల సిలబస్‌ను కూడా అందించినట్లు తెలిసింది. దీనిపై విద్యా శాఖ అధికారులు, టీఎస్‌పీఎస్సీ అధికారులు పరిశీలన చేపట్టారు. దీంతో సిలబస్ ఖరారుపై కసరత్తు దాదాపు ముగింపునకు వచ్చింది.
‘తెలంగాణ’పై ప్రత్యేక అంశాలు
గత డీఎస్సీల్లో ఇచ్చిన తరహాలోనే సిలబస్‌ను ఖరారు చేస్తున్నా.. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశమున్నట్లు తెలిసింది. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలోని పాఠశాలల సిలబస్‌లో మార్పులు చేసి.. తెలంగాణకు సంబంధించిన అంశాలను చేర్చారు. ముఖ్యంగా తెలుగు, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో... తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, జిల్లాలు, చారిత్రక అంశాలు, కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమం, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ప్రముఖులు తదితర చాలా అంశాలను జోడించారు. ఈ నేపథ్యంలో డీఎస్సీలో ఆయా అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రశ్నలు అడిగే అవకాశమున్నట్లు సమాచారం. గురుకులాల్లోని టీజీటీ పోస్టులకు నిర్వహించిన తరహాలో కాకుండా.. టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టీఆర్‌టీ)ను ఒకే పేపర్‌గా 160 ప్రశ్నలతో 80 మార్కులకు నిర్వహించే అవకాశముంది.
పోస్టులు, రోస్టర్ పాయింట్లపైనా..
విద్యా శాఖ ఇప్పటికే 31 జిల్లాల వారీగా పోస్టులు, వాటి రోస్టర్ పాయింట్ల వివరాలను టీఎస్‌పీఎస్సీకి అందజేసింది. వాటిపైనా విద్యాశాఖ, టీఎస్‌పీఎస్సీ అధికారులు పరిశీలన జరుపుతున్నారు. ఈ ప్రక్రియ కూడా కొలిక్కి వస్తుండటంతో నోటిఫికేషన్ జారీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈనెల 20 నుంచి 22వ తేదీల మధ్య నోటిఫికేషన్ జారీచేసే అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఎంచుకునే అవకాశం అభ్యర్థికే
కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యం లో.. జిల్లాల వారీగా అభ్యర్థుల స్థానికతపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాత జిల్లా పరిధిలోని అభ్యర్థి పుట్టిన గ్రామం, చదువుకున్న ప్రాంతాలు వేర్వేరు కొత్త జిల్లాల పరిధిలోకి వస్తే.. ఎక్కడ స్థానికత కావాలనేదానిపై అభ్యర్థులకే అవ కాశమివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. పుట్టిన గ్రామం, నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన ప్రాంతం.. ఈ రెండింటిలో అభ్యర్థి తనకు ఇష్టమైన జిల్లాలో స్థానికుడిగా క్లెయిమ్ చేసుకునే అవకాశమివ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఈ నెల 23న సుప్రీంకోర్టులో కేసు విచారణకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్వయంగా హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 23వ తేదీకంటే ముందే డీఎస్సీ నోటిఫి కేషన్ జారీ చేసి.. ఆ నోటిఫికేషన్ కాపీని కోర్టుకు సమర్పించవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment