
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాల్లో (టీఆర్‌టీ–2017) భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) నియామక ప్రక్రియ మంగళవారం రాత్రి వరకు పూర్తయింది. ఏజెన్సీ మినహా మైదాన ప్రాంతాల్లో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పాఠశాల విద్యా శాఖ నియామకపత్రాలు అందజేసింది. మొత్తంగా మైదాన ప్రాంతంలో 3,127 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టగా, అందులో 2,822 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది.
ఇటీవల ఎంపికైన అభ్యర్థుల జాబితాలను జిల్లాల వారీగా విద్యా శాఖకు టీఎస్‌పీఎస్సీ అందజేసింది. దీంతో విద్యాశాఖ నియామకాల కౌన్సెలింగ్ నిర్వహించింది. ఈ కౌన్సెలింగ్‌కు 2,788 అభ్యర్థులు హాజరుకాగా, వారందరికీ మంగళవారం పోస్టింగ్ ఆర్డర్లను జిల్లా అధికారులు అందజేశారు. పోస్టింగ్ ఆర్డర్లను పొందినవారు బుధవారం సంబంధిత పాఠశాలల్లో హెడ్‌మాస్టర్లకు రిపోర్ట్ చేసి విధుల్లో చేరనున్నారు. కౌన్సెలింగ్‌కు హాజరుకాని 34 మందికి పోస్టింగ్ ఆర్డర్లను రిజిస్టర్‌పోస్ట్ ద్వారా డీఈవోలు పంపించనున్నారు.