TRT
-
టెట్, టీఆర్టీ నోటిఫికేషన్ల నిలుపుదలకు ‘నో’
సాక్షి, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ భర్తీ పరీక్ష (టీఆర్టీ), ఏపీ టీచర్ అర్హత పరీక్ష (టెట్)ల నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే, పరీక్షల వాయిదాకు సైతం తిరస్కరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదంది. ఈ వ్యవహారంపై తుది విచారణ జరుపుతామని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. టీఆర్టీ, టెట్ పరీక్షల నోటిఫికేషన్లను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టెట్, టీఆర్టీ నోటిఫికేషన్లను రద్దుచేయాలని కోరారు. రెండు పరీక్షల మధ్య తగినంత సమయంలేదని, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఆ సమయం సరిపోదని వారు వివరించారు. టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్ పరీక్ష నిర్వహణకు 8న నోటిఫికేషన్లు జారీచేశారని తెలిపారు. టెట్‌లో అర్హత సాధించిన వారు టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తారని వివరించారు. టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనన్నారు. ఇది ఎంతమాత్రం సరిపోదన్నారు. టీఆర్టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు కోరారు. నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేయడంతో పాటు పరీక్షలను వాయిదా వేసి తిరిగి షెడ్యూల్‌ను ఖరారు చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యంకాదని, అలా ఇస్తే తుది ఉత్తర్వులు ఇచ్చినట్లేనన్నారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ అవసరమని పిటిషనర్లు చెబుతున్న నేపథ్యంలో ఈనెల 28న తుది విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టంచేశారు. -
టెట్, టీఆర్టీపై నేడు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ), టీచర్ అర్హత పరీక్ష (టెట్)ల మధ్య తగిన సమయం ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయంలో తన నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్టీ, టెట్ పరీక్షల మధ్య తగిన సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత నోటిఫికేషన్లను రద్దు చేసి, రెండు పరీక్షల మధ్య తగిన సమయం ఇస్తూ తిరిగి నోటిఫికేషన్లు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వారు కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ మరోసారి విచారణ జరిపారు. పరీక్షలపై తీవ్ర ప్రభావం.. ప్రభుత్వ న్యాయవాది వీకే నాయుడు వాదనలు వినిపిస్తూ.. ఐదుగురు అభ్యర్థుల కోసం మొత్తం నోటిఫికేషన్లను నిలుపుదల చేయడం సరికాదన్నారు. పరీక్ష నిర్వహణను వాయిదా వేస్తే టీసీఎస్ సంస్థ పరీక్షల నిర్వహణకు మరో స్లాట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇది పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. దీనివల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. అందువల్ల పరీక్షల నిర్వహణలో జాప్యం చేయలేమన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది జవ్వాజి శరత్చంద్ర వాదనలు వినిపిస్తూ.. టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్‌కు 8న నోటిఫికేషన్లు జారీ చేశారని తెలిపారు. టెట్‌లో అర్హత సాధించిన వారు టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తారని వివరించారు. టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనన్నారు. ఇది ఎంత మాత్రం సరిపోదని, టీఆర్టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. -
టీఆర్టీలో స్థానికత చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) విషయంలో స్థానికత అంశంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ దీనిపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వం 317 జీవోను అమలు చేసింది. దీని ప్రకారం స్థానికతను నిర్థారించింది. అయితే ఇది ఇప్పటివరకూ ఉద్యోగులకే పరిమితమైంది. తాజాగా టీచర్ల నియామకంలోనూ దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఒకటి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ నాలుగేళ్ళు చదివితే ఆ జిల్లాను స్థానికతగా పరిగణిస్తారు. గతంలో 4–10 తరగతుల్లో ఎక్కడ నాలుగేళ్ళు చదివి ఉంటే దాన్ని స్థానికతగా చూసేవాళ్ళు. ఈ నిబంధనలో మార్పు వల్ల స్థానికత నిర్ధారణలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు. అప్పటి స్కూళ్ళు ఇప్పుడు లేవు! సాధారణంగా ప్రాథమిక విద్యను సమీపంలో ఉన్న స్కూల్లో పూర్తి చేస్తారు. 6వ తరగతి నుంచే సరైన రికార్డు ఉంటుంది. కాబట్టి 4 నుంచి 10 తరగతుల వరకు కనీసం నాలుగేళ్ళు ఎక్కడ చదివిందీ ధ్రువీకరించడం కొంత తేలికగా ఉంటుంది. ఇప్పుడు టీఆర్టీ పరీక్ష రాసే అభ్యర్థులు దాదాపు 15 ఏళ్ళ క్రితం ఒకటి నుంచి 5 తరగతి వరకు చదివి ఉంటారు. ఇందులో చాలా స్కూళ్ళకు అనుమతి కూడా లేదని అభ్యర్థులు చెబుతున్నారు. ఆ తర్వాత 6, 7 తరగతులు వేర్వేరు స్కూళ్లలో చదివిన వారున్నారు. ఇందులో కొంతమంది వేరే జిల్లాల్లోనూ చదివి ఉంటారు. దీనివల్ల ‘1 నుంచి 7వ తరగతి వరకు’ అనే నిబంధన కింద నాలుగేళ్ళు వరసగా ఏ జిల్లాలో చదివారనేది నిరూపించుకోవడం కష్టంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. 1–5 వరకు చదివిన ప్రాథమిక ప్రైవేటు స్కూళ్ళు అనేకం ఇప్పటికే మూతపడటం, కొన్నిటికి అనుమతి లేకపోవడంతో డీఈవో కార్యాలయాల్లోనూ వారి డేటా లభించకపోవడంతో స్థానికత నిరూపణ కష్టంగా ఉందని అంటున్నారు. తల్లిదండ్రుల ఉద్యోగాల దృష్ట్యా, హాస్టళ్ళ కోసం ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల వేర్వేరు తరగతులు చదివిన వాళ్ళకూ ఈ సమస్య తప్పడం లేదని వాపోతున్నారు. ఇప్పుడు జిల్లాల విభజన జరిగి కొత్త జిల్లాలు ఏర్పడటం వల్ల కూడా స్థానికత ఏదో చెప్పడం కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాన్–లోకల్‌కు అవకాశమే లేదు! రాష్ట్రవ్యాప్తంగా 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రోస్టర్ విధానం తర్వాత అనేక జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు ఒక్కటి కూడా లేకుండా పోయాయి. 16 జిల్లాల్లో ఎస్ఏ గణితం, ఏడు జిల్లాల్లో ఎస్ఏ ఇంగ్లీష్, మూడు జిల్లాల్లో ఎస్ఏ ఫిజికల్ సైన్స్, రెండు జిల్లాల్లో సోషల్ పోస్టులే లేవు. దీంతో ఈ జిల్లాలకు చెందిన అభ్యర్థులు వేరే జిల్లాలో ఉండే పోస్టులకు నాన్–లోకల్ కేటగిరీ కింద పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే నియామకాల్లో స్థానికేతరుల కోటాను కేవలం 5 శాతానికే పరిమితం చేశారు. అంటే ఇతర జిల్లాల్లో కనీసం 20 పోస్టులు ఉంటేనే నాన్–లోకల్‌కు ఒక పోస్టు అయినా ఉంటుంది. కానీ ఏ జిల్లాలోనూ ఏ సబ్జెక్ట్‌కు సంబంధించి కూడా ఇన్ని పోస్టులు లేవు. అలాంటప్పుడు నాన్–లోకల్‌గా పరీక్ష రాసి ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నా స్థానికత తేలడం లేదు మహబూబాబాద్‌లో 1–5 వరకూ చదివాను. ఆ స్కూల్ ఇప్పుడు లేదు. ఆరు, ఏడు తరగతులు ప్రస్తుత వరంగల్ జిల్లాలో చదివాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇంటర్ వరకూ చదివాను. దీంతో నాలుగేళ్ళు ఎక్కడ చదివింది నిరూపించుకోవడం కష్టంగా ఉంది. – చదలవాడ నవీన్ (వరంగల్, టీఆర్టీ దరఖాస్తుదారు) స్థానికత నిబంధనపై ఆలోచించాలి 1 నుంచి 7 తరగతుల్లో నాలుగేళ్ళు ఎక్కడ చదివితే అక్కడి స్థానికులుగా పరిగణింపబడతారనే నిబంధన చాలామంది అభ్యర్థులకు ఇబ్బందిగా ఉంది. నాన్–లోకల్ కోటాను తగ్గించడం వల్ల కూడా చాలా జిల్లాల్లో టీచర్ పోస్టులు పొందే అవకాశం ఉండటం లేదు. దీనిపై అధికారులు పునః సమీక్షించాలి. – రావుల రామ్మోహన్‌రెడ్డి (తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు) -
పెరిగిన సిలబస్... ఆధునిక బోధనపైనే దృష్టి
సాక్షి, హైదరాబాద్ః ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కు హాజరయ్యే అభ్యర్థులు లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా బోధన విధానాల్లో వస్తున్న మార్పులపై నిశిత పరిశీలన ఉండేలా ప్రశ్నలుంటాయని విద్యాశాఖ వెల్లడించింది. సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) అవగాహన పరిధిని విస్తృతంగా పరిశీలించాలని నిర్ణయించింది. రాష్ట్ర సిలబస్‌కు సంబంధించి 8వ తరగతి వరకూ కొన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడుగుతామని మొదట చెప్పినా, మెథడాలజీలో మాత్రం ఇంటర్మీడియేట్ స్థాయిలోని ఆలోచన ధోరణికి సంబంధించిన చాప్టర్లను జోడించింది. నవంబర్ 20 నుంచి జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి విద్యాశాఖ గురువారం పరీక్ష సిలబస్‌ను విడుదల చేసింది. ఏ చాప్టర్ నుంచి ఏయే ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని ఇందులో పేర్కొంది. ఎస్జీటీ పోస్టులకు పరీక్ష రాసే వారు 1–8వ తరగతి, స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసేవారికి 1–10 తరగతులతో పాటు ప్లస్ టు నుంచి ప్రశ్నలు ఇస్తామని విద్యాశాఖ పేర్కొంది. జాతీయ విద్యా విధానంలో వస్తున్న మార్పుల విషయంలో ప్రశ్నలుంటాయని తెలిపింది. ఈ క్రమంలో ఎస్జీటీలకు ఇచ్చే ప్రశ్నలు నిర్ణీత తరగతులు దాటి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కంప్యూటర్ బేస్డ్గా జరిగే పరీక్ష కావడంతో టీఆర్టీకి ఈసారి ప్రత్యేకంగా శిక్షణ ఉండాలని అభ్యర్థులు అంటున్నారు. ప్రతీ ప్రశ్నకు అర మార్కు ఉంటుంది. దీంతో ప్రతి ప్రశ్న కూడా కీలకంగానే భావిస్తున్నారు. మెథడాలజీపై గురి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతున్నారు. దీనిపై పెద్దగా అభ్యంతరాలు రావడం లేదు. అయితే నవీన విద్యా బోధనపై 20 ప్రశ్నలు ఇస్తున్నారు. స్వాతంత్య్రం పూర్వం, తర్వాత విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, వివిధ విద్యా కమిషన్లు, సిఫార్సులు, చట్టాలపై ప్రత్యేకంగా ప్రశ్నలు ఇస్తున్నారు. ’’స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖుల ఆలోచనల్లో విద్యా విధానం’’ అనే సబ్జెక్టుల్లోంచి ప్రశ్నలు ఇస్తున్నారు. ఇవి అకడమిక్ పుస్తకాలతో సంబంధం ఉన్నవి కావని, జనరల్ నాలెడ్జ్‌గానే భావించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. విద్యార్థి, శిక్షణలో అభివృద్ధి అనే అంశంలో వివిధ రకాలుగా వస్తున్న మార్పులు, అధ్యయనాల నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు. కేంద్ర విద్యా చట్టం, మార్పులు అనే అంశాన్ని నేరుగా ప్రస్తావించకుండానే, జాతీయ విద్యా చట్టాలపై ప్రశ్నలు ఇస్తున్నారు. మేథమెటిక్స్‌లోనూ ఆలోచన ధోరణి ప్రధానంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పాతకాలం విధానాలు కాకుండా, సరికొత్త పద్ధతిలో గణితం విద్యార్థులకు బోధించే ధోరణìలపై ప్రశ్నలు ఉంటాయని సిలబస్‌లో పేర్కొన్నారు. ఎస్‌ఏలకు 88 ప్రశ్నలు.. ఎస్జీటీలకు 160 ప్రశ్నలు ఎస్‌ఏలకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడిట్ స్థాయి వరకూ 88 ప్రశ్నలు ఇస్తున్నారు. దీనిపైనా స్పష్టత లేకుంటే ప్రిపరేషన్ సమస్యగా ఉంటుందని అభ్యర్థులు అంటున్నారు. సీనియర్ సెకండరీ స్థాయి (ఇంటర్మీడియేట్) స్థాయి ప్రశ్నలు ఇస్తామని చెప్పినా, ఇందులో కమ్యూనికేషన్ స్కిల్ పరీక్షకు సంబంధించినవి ఉంటాయా? సబ్జెక్టు నుంచి ఇస్తారా? అనే దానిపై స్పష్టత కోరుతున్నారు. టీచింగ్ విధానాలపై 32 ప్రశ్నలు ఇస్తున్నారు. రాష్ట్ర యూనివర్సిటీలు రూపొందించిన వివిధ బోధన పద్ధతుల నుంచి ఈ ప్రశ్నలు ఉంటాయని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు అన్ని కోణాల నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు. ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ సహా 18 సబ్జెక్టులకు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. ప్రతీ సబ్జెక్టు నుంచి 5కు మించకుండా ప్రశ్నలు ఇస్తున్నారు. మొత్తం 100 ప్రశ్నలను ఈ తరహాలోనే విభజించారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్‌కు 160 ప్రశ్నలు ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఇంటర్మీడియేట్ సిలబస్‌తో పాటు, కొత్త విద్యావిధానంపై తర్ఫీదు అవ్వాల్సిన అవసరం ఉందని సిలబస్ స్పష్టం చేస్తోంది. -
ఈ టీచర్లకు 30 శాతం పీఆర్సీ వర్తించదా?
సాక్షి, హైదరాబాద్: తాజా పీఆర్సీలో రాష్ట్రంలో 2017 టీఆర్టీ ద్వారా కొత్తగా నియమితులైన టీచర్లకు భారీ నష్టం వాటిల్లనుంది. కిందిస్థాయి పోస్టు లో ఉండి, ఎస్ఏ పోస్టులకు ఎంపికైన టీచర్లకు పే ప్రొటెక్షన్ లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లనుండగా, నియామకాల్లో జాప్యం కారణంగా కొత్త పీఆర్సీ ద్వారా లభించాల్సిన ప్రయోజనాలు ఎక్కు వ మందికి దక్కకుండాపోయే పరిస్థితి నెలకొంది. మొత్తంగా 8,792 మంది టీచర్లకు నష్టం వాటిల్లనుండటంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి పే ప్రొటెక్షన్ లేక నష్టం రాష్ట్రంలో 2017 టీఆర్టీ ద్వారా ప్రభుత్వం 1,941 ఎస్ఏ పోస్టులను భర్తీ చేసింది. అందులో దాదాపు వెయ్యి పోస్టులకు ప్రస్తుతం స్కూళ్లలో ఎస్జీటీలుగా, భాషా పండితులుగా (ఎల్పీ) పని చేస్తున్నవారే ఎంపికయ్యారు. మిగతా పోస్టుల్లో కొత్తవారు ఎంపికయ్యారు. ఇలా ఎస్ఏ పోస్టులకు ఎంపికైన వారిలో కొందరికి పలు కారణాలతో 2019లో నియామక పత్రాలు అందజేయగా, మరికొందరికి 2020లో నియామక పత్రాలు అందజేశారు. ఇంకొందరికైతే 15 రోజుల కిందటే అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేశారు. వారిలో 95 శాతం మంది పంచాయతీరాజ్ టీచర్లే ఉన్నారు. అయితే వారికి ఇప్పుడు కొత్త పీఆర్సీ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలోని కనీస మూల వేతనంతోనే వేతనాలను చెల్లించనున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏదేని ఉన్నత స్థాయి పోస్టుకు ఎంపికైనప్పుడు వారికి అంతకుముందు ఉద్యోగంలో వచ్చిన వేతనాన్ని కాపాడుతూ (పే ప్రొటెక్షన్ ఇస్తూ) ఉత్తర్వులిచ్చి కొత్త వేతనం ఖరారు చేస్తారు. అంతకుముందు వచ్చిన కనీస మూల వేతనానికి పీఆర్సీ అమలుతేదీ నాటికి ఉన్న డీఏ, ఫిట్‌మెంట్‌ను కలిపి కొత్త పోస్టులో కనీస మూల వేతనాన్ని ఖరారు చేస్తారు. కానీ ఇప్పుడు నియమితులైన పంచాయతీరాజ్ టీచర్లు, ఉద్యోగులకు ప్రభుత్వం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయలేదు. వాస్తవానికి 2013 డిసెంబర్ తరువాత ప్రభుత్వం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో వారికి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా రూ.10 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని, సర్వీస్ మొత్తం లెక్కిస్తే నష్టం లక్షల్లో ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. నియామకాల్లో ఆలస్యంతో ఎక్కువ మందికి... 2017 టీఆర్టీ ద్వారా ఎస్జీటీ, ఎల్పీ, ఎస్ఏ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ), ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ)గా నియమితులైన 7,792 మంది టీచర్లకు తాజా పీఆర్సీలో ప్రకటించిన వేతన స్థిరీకరణలో కీలకమైన 30 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ అందని దుస్థితి ఏర్పడింది. ఎప్పుడో పూర్తి కావాల్సిన 2017 టీఆర్టీ నియామకాలను 2019 నుంచి 2021 వరకు సాగదీయడమే ఇందుకు కారణం. తాజా పీఆర్సీ ఇప్పుడు ప్రకటించినా 2018 జూలై 1 నుంచే అమల్లోకి రానుంది. కాబట్టి అప్పటివరకు సర్వీస్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రమే 30 శాతం ఫిట్మెంట్ ప్రయోజనం కలుగుతుంది. ఆ తర్వాత నియామకమైన వారికి నియమితులైన రోజు నుంచి లెక్కించి తాజా పీఆర్సీలో మినిమమ్ బేసిక్‌తో వేతనం ఖరారు చేసి, కరెస్పాండింగ్ పేస్కేల్ ఇస్తారు. ఒకవేళ వారు అంతకుముందే నియమితులై ఉంటే వారికి అప్పుడు ఉన్న ఇంక్రిమెంట్‌తో కూడిన మూల వేతనంపై 30.392 శాతం డీఏ, 30 శాతం ఫిట్మెంట్ వచ్చేది. కానీ వారు 2018 జూలై 1 నాటికి నియమితులు కాలేదు కాబట్టి ఇప్పుడు వారికి 30 శాతం ఫిట్మెంట్ వర్తించదు. పైగా ఇప్పుడు రూపొందించిన మాస్టర్ స్కేల్ ప్రస్తుతం ఉన్న 30 శాతం ఫిట్మెంట్తో కాకుండా 15 శాతం ఫిట్మెంట్తోనే రూపొందించినందున వారికి రెండు రకాలుగా కలిపి నెలకు ఐదారు వేల రూపాయల నష్టం వాటిల్లుతుందని సంఘాల నేతలు పేర్కొంటున్నారు. టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ–2017) ద్వారా నియమితులైన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)కు తాజా పీఆర్సీతో ఇప్పుడు రూ.31,040 కనీస మూల వేతనం రానుంది. అదే టీచర్ 2018 జూలై 1కి ముందు నియమితులై ఉంటే పాత స్కేల్‌పై 30 శాతం ఫిట్మెంట్ కలసి రూ.34,690 కనీస మూల వేతనం వచ్చేది. అలాగే అదే టీఆర్టీ ద్వారా స్కూల్ అసిస్టెంట్‌గా (ఎస్ఏ) నియమితులైన వారికి ఇప్పుడు రూ.42,300 కనీస మూల వేతనం రానుంది. ఈ టీచర్ కూడా ముందే నియమితులై ఉంటే 30 శాతం ఫిట్మెంట్ కలసి రూ.47,240 వచ్చేది. 2017 టీఆర్టీ అయినప్పటికీ నియామకాల్లో ఆలస్యం కావడం వల్ల ఫిట్మెంట్ వర్తించకపోవడంతో ఒక్కో టీచర్ నెలకు నాలుగైదు వేలు నష్టపోనున్నారు. ఒక అభ్యర్థి 2008లో ఎస్జీటీగా ఎంపికయ్యారు. 2018 జూలై 1నాటికి ఆయన కనీస మూల వేతనం రూ. 31,460. ఆయన 2017 టీఆర్టీ ద్వారా ఎస్‌ఏగా ఎంపికయ్యారు. ఆయనకు ఇప్పుడు ఎస్ఏ పోస్టులో రూ.42,300 కనీస మూల వేతనం రానుంది. అయితే పే ప్రొటెక్షన్ ఉంటే 2018 జూలై 1 నాటికి ఉన్న కనీస మూల వేతనంపై 30.392 కరువు భత్యం (డీఏ), 30 శాతం ఫిట్మెంట్ కలిపి రూ.51,320 కనీస మూల వేతనంగా వచ్చేది. అది లేకపోవడం వల్ల ఇంక్రిమెంటు కలుపుకొని నెలకు రూ.10 వేల వరకు నష్టం వాటిల్లనుంది. న్యాయం చేయాల్సిందే టీఆర్టీ–2017లో భాగంగా రాత పరీక్ష, ఇతరత్రా నియామకాల ప్రక్రియ 2018 జూలై 1 నాటికి పూర్తయ్యింది. అయితే పోస్టింగ్‌లు ఇవ్వడంలో ఆలస్యం అయ్యింది. అందువల్ల వారికి 30 శాతం ఫిట్‌మెంట్‌ను వర్తింపజేసి న్యాయం చేయాలి. అలాగే పైస్థాయి పోస్టులకు ఎంపికైన టీచర్ల కోసం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయాలి. లేకపోతే వారు తీవ్రంగా నష్టపోతారు. – మానేటి ప్రతాప్‌రెడ్డి,టీఆర్టీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చదవండి: ఉచిత నీటి పథకానికి తిప్పలెన్నో.. -
టెట్ ఇంకెప్పుడో..! అభ్యర్థుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్ష (టీఆర్టీ) రాయాలంటే కచ్చితంగా ఉండాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణపై అడుగులు ముందుకు పడట్లేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం ఆదేశాలు జారీ చేసి నెల కావొస్తున్నా టెట్ నిర్వహణపై ఉన్నత స్థాయిలో ఎలాంటి కదలిక లేదు. టెట్ నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే అందుకు అవసరమైన కార్యాచరణ ఒక్కటీ మొదలు కాలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాకముందే టెట్ నిర్వహించాలని అభ్యర్థులకు కోరుతున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఖాళీల వివరాలను విద్యా శాఖ ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. ఇప్పటివరకు వాటికి ఇంకా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ ఆమోదం వస్తే నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం టెట్ నిర్వహించకుండా ముందుకు పోతే లక్షల మంది పోస్టుల భర్తీకి దూరం అయ్యే ప్రమాదం నెలకొంది. నెలన్నరలో వ్యాలిడిటీ ముగింపు.. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు. 2011 నుంచి రాష్ట్రంలో నిర్వహించిన ఆరు టెట్లలో మూడు టెట్ల (2011 ఒకసారి, 2012లో రెండుసార్లు) వ్యాలిడిటీ ఇప్పటికే ముగిసిపోయి 4 లక్షల మంది అభ్యర్థులు టెట్ అర్హత కోల్పోయారు. ఇక 2014 మార్చి 16న నిర్వహించిన టెట్ ఏడేళ్ల వ్యాలిడిటీ వచ్చే మార్చి 16వ తేదీతో ముగియనుంది. అందులోనూ మరో 1.5 లక్షల మంది అభ్యర్థులు అర్హతను కోల్పోతారు. మరోవైపు రాష్ట్రంలో 2015లో ఒకసారి టెట్ నిర్వహించగా, 2017లో చివరి టెట్‌ను నిర్వహించారు. ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను గత మూడేళ్లలో ఒక్కసారి కూడా నిర్వహించలేదు. దీంతో గడిచిన మూడేళ్లలోనూ మరో 1.5 లక్షల మంది బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు అసలు టెట్ రాయలేదు. ఇప్పుడు వారంతా టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా మొత్తం దాదాపు 5.5 లక్షల మంది అభ్యర్యుర్థులకు టెట్ కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత నెలలోనే ఓకే చెప్పిన నేపథ్యంలో వెంటనే టెట్ నిర్వహణకు చర్యలు చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. టెట్ నిర్వహించకుండా టీఆర్టీ నోటిఫికేషన్ వస్తే తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలు అవసరం.. రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. అందుకే విద్యా శాఖ త్వరగా టెట్ నిర్వహణకు చర్యలు చేపడితేనే తమకు టీఆర్టీ రాసే అవకాశం వస్తుందని పేర్కొంటున్నారు. మార్చి తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్? టీఆర్టీ నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా శాఖ ఇప్పటివరకు ఉన్న ఖాళీల వివరాలను ఆర్థిక శాఖకు పంపింది. ఇప్పటికిప్పుడు 8 వేల పోస్టులు భర్తీ చేయొచ్చని పేర్కొంది. మరోవైపు ఉపాధ్యాయుల పదోన్నతుల కోసం ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపించింది. అందులో 8 వేలకు పైగా పోస్టుల్లో పదోన్నతులు కల్పించొచ్చని పేర్కొంది. పదోన్నతులు చేపట్టాక టీఆర్టీ నోటిఫికేషన్ ఇస్తే 15 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసే వీలుంటుంది. అయితే పదోన్నతుల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి విద్యా శాఖకు ఇంకా ఆమోదం రాలేదు. ఇప్పటికిప్పుడు ఆమోదం తెలిపినా పదోన్నతులు ఇచ్చేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం అవుతుంది. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే ఫిబ్రవరిలో టీఆర్టీ నోటిఫికేషన్ జారీ కుదరదు. ఇక మార్చి తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వీలైనంత త్వరగా టెట్ నిర్వహిస్తే తాము టీఆర్టీకి సిద్ధం అయ్యేందుకు సమయం దొరుకుతుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. -
టీఆర్టీ కంటే ముందే టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) నిర్వహించడానికి కంటే ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. టెట్ నిర్వహించకుండా పోస్టులను భర్తీ చేస్తే అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ముందుగా టెట్ నిర్వహించడంపై విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా, ప్రస్తుతం ఉపాధ్యాయ ఖాళీలు 8వేల వరకు ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. అయితే వాటిల్లోనూ మార్పులు ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ పాఠశాలల హేతుబద్దీకరణ చేపడితే పోస్టుల సంఖ్య 5వేలకు మించకపోవచ్చని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అలాగే అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తే మాత్రం 12వేలకు పైగా పోస్టులు రావచ్చని వెల్లడించారు. చదవండి: (ఖజానాకు మరో రూ. 1,500 కోట్లు!) లెక్చరర్ల బదిలీలపై మంత్రి సబిత ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: డిగ్రీ లెక్చరర్ల బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘డిగ్రీ కాలేజీల్లో అర్ధరాత్రి బదిలీలు’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి స్పందిస్తూ విద్యా సంవత్సరం మధ్యలో, ప్రభుత్వ ఆమోదం లేకుండా ఎలా బదిలీ చేస్తారని ఉన్నతాధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ బదిలీల వ్యవహారంపై మంగళవారం ఆమె సమగ్రంగా సమీక్షించనున్నారు. మరోవైపు ఈ బదిలీల వ్యవహారంపై ఉన్నతాధికారులు కూడా స్పందించారు. బదిలీలు పొందిన లెక్చరర్లను రిలీవ్ చేయవద్దని సోమవారం ఆదేశాలు జారీచేశారు. అయితే అప్పటికే బదిలీ పొందిన లెక్చరర్లంతా కొత్త స్థానాల్లో చేరిపోయారు. దీంతో బదిలీ స్థానాల్లో చేరిన తర్వాత నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని మరికొంతమంది లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు. వారిని తిరిగి పాత స్థానాల్లోకి పంపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. -
విధుల్లోకి 2,788 మంది టీచర్లు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాల్లో (టీఆర్టీ–2017) భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) నియామక ప్రక్రియ మంగళవారం రాత్రి వరకు పూర్తయింది. ఏజెన్సీ మినహా మైదాన ప్రాంతాల్లో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పాఠశాల విద్యా శాఖ నియామకపత్రాలు అందజేసింది. మొత్తంగా మైదాన ప్రాంతంలో 3,127 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టగా, అందులో 2,822 పోస్టులకు టీఎస్పీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇటీవల ఎంపికైన అభ్యర్థుల జాబితాలను జిల్లాల వారీగా విద్యా శాఖకు టీఎస్పీఎస్సీ అందజేసింది. దీంతో విద్యాశాఖ నియామకాల కౌన్సెలింగ్ నిర్వహించింది. ఈ కౌన్సెలింగ్‌కు 2,788 అభ్యర్థులు హాజరుకాగా, వారందరికీ మంగళవారం పోస్టింగ్ ఆర్డర్లను జిల్లా అధికారులు అందజేశారు. పోస్టింగ్ ఆర్డర్లను పొందినవారు బుధవారం సంబంధిత పాఠశాలల్లో హెడ్మాస్టర్లకు రిపోర్ట్ చేసి విధుల్లో చేరనున్నారు. కౌన్సెలింగ్‌కు హాజరుకాని 34 మందికి పోస్టింగ్ ఆర్డర్లను రిజిస్టర్‌పోస్ట్ ద్వారా డీఈవోలు పంపించనున్నారు. -
ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్), పీఈటీ ఫలితాలు ప్రకటించాలంటూ అభ్యర్థులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. బుధవారం ప్రగతి భవన్‌ను ముట్టడించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్టీ, పీఈటీ ఫలితాల జాబితాను ప్రకటించి పోస్టింగులు ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో బేగంపేట పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక 2017లో తెలంగాణ ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయగా ఇప్పటికీ నియామక ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో అభ్యర్థులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. -
ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత
-
టీఆర్టీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) తెలుగు మీడియం పోస్టుల భర్తీకి చేపట్టిన టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) తుది ఫలితాలను టీఎస్పీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. 3,325 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. 2017లో జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 3,786 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. మరో 910 ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం పోస్టుల భర్తీ కోసం 2018 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు టీఎస్పీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించింది. అదే ఏడాది డిసెంబర్లో ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం ఫలితాలు వెల్లడించింది. దీంతో రీలింక్విష్మెంట్ తీసుకోవాలంటూ కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టుల అవసరం లేని వారు రీలింక్విష్ మెంట్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ పేర్కొంది. ఆ మేరకు అభ్యర్థులు కొందరు రీలింక్విష్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులకు ఎంపికైన వారి ఫలితాలు వెల్లడించిం ది. అయితే తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లిష్ మీడి యం పోస్టులు వస్తే అవి వద్దంటూ రీలింక్విష్‌మెంట్‌కు అవకాశం ఇవ్వాలంటూ మరికొంత మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో మళ్లీ రీలింక్విష్‌మెంట్‌కు అవకాశం ఇవ్వాల్సి రావడంతో తుది ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. ఎట్టకేలకు శుక్రవారం 3,325 ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులకు అభ్య ర్థులను ఎంపిక చేసింది. వికలాంగుల కేటగిరీకి సంబంధించి విద్యాశాఖ నుంచి రావాల్సి ఉన్నందున 270 పోస్టుల ఫలితాలను తర్వాత ప్రకటి స్తామని పేర్కొంది. ఏజెన్సీ ప్రాంతా నికి సంబంధించిన అంశాల్లో కోర్టు వివాదాలు ఉన్నందున 117 పోస్టుల ఫలితాలను విత్ హెల్డ్‌లో పెట్టింది. మరోవైపు వివిధ కేటగిరీల్లో అర్హులైన అభ్యర్థులు లభించనందున 74 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. మొత్తానికి 3,325 పోస్టుల ఫలితాలను వెల్లడించింది. ఈ జాబితాను త్వరలోనే తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని టీఎస్పీఎస్సీ తెలిపింది. మరోవైపు ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం పోస్టుల ఫలితాలు త్వరలోనే వెల్లడిసా ్తమని టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత గ్రూప్–2 ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించాయి. టీఎస్పీఎస్సీ ఫలితాలు విడుదల చేయడంతో తదుపరి కార్యాచరణను ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధం అవు తోంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చేందుకు 15 రోజుల్లో షెడ్యూలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై మంత్రి సబిత విద్యాశాఖ, టీఎస్పీఎస్సీ అధికారులతో చర్చించిన సంగతి తెలిసిందే. -
భర్తీ ప్రక్రియ షురూ..
సాక్షి, మహబూబ్‌నగర్: ఎంతో కాలంగా టీఆర్టీ అభ్యర్థులు ఎదురుచూసిన ఘడియ రానేవచ్చింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మొదటి ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ప్రతిపాధికన భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలోని ఆర్వీఎం సమావేశ మందిరంతో పాటు, డైట్ కళాశాలలో వివిధ సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కేవలం స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు మాత్రమే పిలుపువచ్చింది. తదుపరి ప్రభుత్వం ప్రకటించే షెడ్యూల్ ప్రకారం ఎస్టీటీలకు నిర్వహించనున్నారు. 374 పోస్టులకు కసరత్తు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1,979 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా, ఇందులో భాగంగా మొదట 374 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. టీఆర్టీ పరీక్షలో మొత్తం 50వేలకు పైగా అభ్యర్థులు పరీక్ష రాయగా అందులో కేవలం కొంతమంది మాత్రమే అర్హత సాధించారు. వారికి మాత్రమే వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. గురువారం జరిగిన వెరిఫికేషన్‌కు 8 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. సబ్జక్టుల వారీగా.. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ పోస్టుల వెరిఫికేషన్ జరిగిన క్రమంలో 374 పోస్టుల్లో వివిధ సబ్జెక్టుల వారీగా ప్రక్రియ ప్రారంభమైంది. వీటిలో పోస్టులు, తెలుగు పండిట్ 67 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ ఉర్దూలో 4 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో గణితం 36, సోషల్ 139 పోస్టులు, ఉర్దూ పోస్టులు 6, ఇంగ్లీష్ 17, ఫిజికల్ సైన్స్ 23, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 44, జీవశాస్త్రం 41 పోస్టులు ఉన్నాయి. వీరి వెరిఫికేషన్ అనంతరం 15లోగా వివిధ స్థానాల్లో భర్తీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. 13న ఖాళీల వివరాల ప్రదర్శన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జిల్లా అధికారులు ప్రభుత్వం సూచించిన షెడ్యూల్ ప్రకారం ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అభ్యర్థులకు 1.3 రెషియో ప్రకారం గతంలో ఒకమారు నిర్వహించిన వారిలో పూర్తిస్థాయి అర్హత సాధించిన వారికి గురువారం ఒకమారు నిర్వహించారు. అనంతరం వివిధ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులకు ఏయే పాఠశాలల్లో ఖాళీగా ఉన్నాయన్న అంశంపై గురువారం సాయంత్రంలోగా, శుక్రవారం ఉదయం లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఖాళీల వివరాలను ప్రదర్శించాల్సి ఉంది. అభ్యర్థులకు ఖాళీలను ఎంపిక అనంతరం ఈనెల 13న కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. తర్వాత ఈనెల 15న కలెక్టర్ ఆధ్వర్యంలో వారికి భర్తీకి సంబంధించిన ఉత్తర్వులు అందజేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
కొత్త సార్లొస్తున్నారు..
ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు రానున్నారు. పెండింగ్‌లో ఉన్న టీఆర్టీ(టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) పోస్టులను భర్తీ చేసేందుకు రెండు రోజుల క్రితం జీఓ రాగా, అనంతరం షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటివరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్లతో నెట్టుకురాగా.. ఆయా పోస్టుల్లో కొత్త టీచర్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో 130 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో టీఆర్టీ ప్రకటన చేసింది. 2018 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించింది. అదే ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి.. విడతలవారీగా సెప్టెంబర్ 2018, ఏప్రిల్ 2019లో జాబితా విడుదల చేసింది. అయితే టీఆర్టీ నియామకాలపై మార్గదర్శకాలు జారీ చేసి.. అభ్యర్థుల ఎంపిక చేపట్టకపోవడంతో దాదాపు 20 నెలలపాటు అభ్యర్థులు నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం నియామక పత్రాలపై జీఓను విడుదల చేయడంతో త్వరలోనే అభ్యర్థులు టీచర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు.. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి జిల్లాకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్.. కార్యదర్శిగా డీఈఓ మదన్మోహన్ వ్యవహరించనున్నారు. పలువురు జిల్లాస్థాయి అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. పాఠశాల విద్యాశాఖ టీఆర్టీ జాబితాను ఇప్పటికే జిల్లా కమిటీకి సమర్పించింది. రోస్టర్, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో జిల్లా కమిటీలు తమ పరిధిలోని సబ్జెక్టులవారీగా ఖాళీలను గుర్తించి.. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. షెడ్యూల్ ఇలా.. టీఆర్టీ నియామకాలకు సంబంధించి షెడ్యూల్ ఇలా ఉంది. ఎంపికైన అభ్యర్థుల లిస్టును కేటగిరీ, మీడియంవారీగా ఈనెల 10న ప్రదర్శించనున్నారు. 11న జిల్లాస్థాయి కమిటీ సమావేశమై ఖాళీల పరిస్థితిని తెలుసుకొని కేటగిరీ, మీడియంలవారీగా ఖాళీలను వెల్లడిస్తారు. 13, 14వ తేదీన అభ్యర్థులకు కేటగిరీ, మీడియంవారీగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పోస్టింగ్ పొందిన కొత్త టీచర్లు ఈనెల 15న పాఠశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 17న జాయిన్ కానీ, రిపోర్టు చేయని అభ్యర్థుల వివరాలను గుర్తిస్తారు. 19న ఎంపికైన టీచర్లు జాయినింగ్ రిపోర్టును ఎంఈఓలు, హెచ్ఎంలకు అందజేయాలి. వేగవంతం చేస్తున్నాం.. టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పూర్వ ఖమ్మం జిల్లా నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం. కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఆదేశాల మేరకు త్వరలోనే నియామకాలు చేపట్టనున్నాం. మొత్తం 130 పోస్టులను భర్తీ చేయనున్నాం. – పి.మదన్మోహన్, జిల్లా విద్యాశాఖాధికారి -
పదోన్నతుల మాటేమిటి?
సాక్షి, మహబూబ్‌నగర్ : టీఆర్టీ ద్వారా ఉద్యోగాలకు అర్హత సాధించిన ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భర్తీకి ప్రభుత్వం ఓకే చెప్పిడంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2017నవంబర్‌లో పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసి రెండేళ్లు పూర్తయింది. భర్తీ ఉత్తర్వులు అందకపోవడంతో అభ్యర్థులు అనేక విధాలుగా ఉద్యమాలు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1,979 ఉపాద్యాయ పోస్టుల గాను 2018 ఫిబ్రవరీ, మార్చిలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించన పరీక్షకు దాదాపు 50వేల మందికి పైగా అభ్యర్థులు టీఆర్టీ పరీక్ష రాశారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి అనందంగా ఉన్నా సీనియర్ ఉపాధ్యాయులకు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోకుండానే నేరుగా పోస్టులు భర్తీ చేయడం సరికాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. 1,979 పోస్టుల భర్తీకి కసరత్తు టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా జరగనుంది. ఇందుకు సంబందించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. కలెక్టర్ కమిటీ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్‌ను వైస్ చైర్మన్‌గా, డీఈఓను కార్యదర్శిగా నియమించారు. ఈ కమిటీ పాత జిల్లాలో ఎంపికైన అభ్యర్థుల రోస్టర్ పాయింట్లకు సంబంధించిన వివరాలను విద్యాశాఖకు అందిస్తారు. పాత, కొత్త జిల్లాల వారీగా ఖాళీలు, సబ్జెక్టు, మాధ్యమం, ప్రాంతాల వారీగా వివరాలు సేకరించాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమిస్తూ కమిటీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. వివిధ సబ్జెక్టుల వారీగా 1,979 పోస్టులను ఖాళీలకు భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. 1979 ఎస్జీటీ, 1400 ఎస్టీటీ పోస్టులు ఇవ్వనుండగా, మిగతావి వివిధ సబ్జెక్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వనున్నారు. ప్రమోషన్లు కల్పించాల్సిందే గత డీఎస్సీలో సీనియర్ల ఉపాధ్యాయులకు ప్రమోషన్లు బదిలీలు ఇచ్చిన తర్వాత మాత్రమే నూనతంగా వచ్చిన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉంది. కనీసం అడ్హాక్ పద్ధతిలో అయినా పోస్టింగ్‌లు ఇచ్చి, విద్యాసంవత్సరం ప్రారంభంలో వారిని రివర్ట్ చేస్తే ఇబ్బంది ఉండదు. లేకపోతే సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోయే అవకాశం ఉంది. -గట్టు వెంకట్‌రెడ్డి,పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి ప్రస్తుతం ప్రభుత్వం టీఆర్టీ అభ్యర్థుల అభ్యర్థుల భర్తీ ప్రక్రియను ఎటువంటి న్యాయపరైమన ఇబ్బందులు రాకుండా భర్తి చేస్తే బాగుటుంది. మొదటిగా సీనియర్ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు ఇవ్వాలి. అదికూడా పాత జిల్లాల ప్రకారమే ఇస్తే ఇబ్బందులు ఉండవు. కానీ నూతనంగా ఏర్పడిన జిల్లాల వారీగా ఇస్తే సమస్యలు ఎదురవుతాయి. పాత జిల్లాల వారీగా టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చి, ప్రమోషన్లు మాత్ర కొత్త జిల్లాల ప్రకారం ఇవ్వడం సరికాదు. – దుంకుడు శ్రీనివాస్, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
టీఆర్టీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: టీఆర్టీ–2017 నియామకాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్దేశిత తేదీల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. -
టీఆర్టీ అభ్యర్థులకు తీపికబురు
సాక్షి, ఆదిలాబాద్ : ఎట్టకేలకు టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో టీఆర్టీ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంతో ఉపాధ్యాయుల కొరత తీరనుంది. ప్రభుత్వం ఇది వరకే ఫలితాలు విడుదల చేసినా నియామకాలు చేపట్టకపోవడంతో గత కొన్ని రోజులుగా ఎంపికైన అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం విద్యావలంటీర్ల నియామకాలు చేపట్టినా టీఆర్టీ నియామకాలు చేపట్టకపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. తాజా నిర్ణయం వారికి తీపి కబురును అందించినట్టయింది. అయితే ఇప్పటికే అభ్యర్థుల ఫలితాలను ప్రకటించారు. సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది. అయితే కేవలం విద్యాశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా ప్రాంతాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వడమే మిగిలి ఉంది. త్వరలోనే పాఠశాలలకు కొత్త పంతుళ్లు రానున్నారు. ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,582 పోస్టులు ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ 2017 అక్టోబర్ 21న విడుదల చేశారు. 2018 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఫలితాలు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. గతేడాది చివరి మాసంలో ఫలితాలు విడుదలయ్యాయి. అయితే నియామకాలు మాత్రం జరపలేదు. కొంతమంది కోర్టుకు వెళ్లడంతో నియామకాలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ఈ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.10 విడుదల చేసింది. కాగా ఈ నియామకాలు ఉమ్మడి జిల్లా పరిధిలో చేపట్టనున్నారు. మొత్తం 1,582 పోస్టులు భర్తీ కానున్నాయి. వీటిలో లాంగ్వేజ్ పండితులు 122, ఎస్జీటీ పోస్టులు 1314, పీఈటీ పోస్టులు 25, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 118, మూడు ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. తీరనున్న ఇబ్బందులు.. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 2012లో డీఎస్సీ నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే నియామకాలు చేపట్టడంలో జాప్యం జరిగిన విషయం తెలిసిందే. పరీక్షలు రాసి ఎంపికైన అభ్యర్థులు నియామకాల కోసం గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోవడంతో మానసికంగా ఆందోళన చెందుతున్నారు. టీఆర్టీ నిర్వహించిన తర్వాత గతేడాది, ఈ ఏడాది కూడా విద్యావలంటీర్లతోనే చదువులను కొనసాగిస్తోంది. అయితే ఎంపికైన అభ్యర్థులు నియామకాలు చేపట్టకపోవడంతో ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం ప్రభుత్వం నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియామకాలు జరగనున్నాయి. ఇదివరకు జరిగిన డీఎస్సీల్లో విద్యా శాఖాధికారులే సర్టిఫికెట్ల పరిశీలన, రోస్టర్, మెరిట్ జాబితాను ప్రకటించేది. కాని ఈసారి ప్రభుత్వమే ప్రక్రియను పూర్తి చేసింది. కేవలం విద్యాశాఖాధికారులు ఆయా ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, ఉమ్మడి జిల్లా డీఈఓ కార్యదర్శిగా, సభ్యులుగా జెడ్పీ సీఈఓ, ఉమ్మడి జిల్లా పరిధిలోని డీఈఓలు ఉంటారు. నియామకాలు పారదర్శకంగా చేపడతాం టీఆర్టీ నియామకాలను పారదర్శకంగా చేపడతాం. దీనికి సంబంధించిన షెడ్యూల్ రాగానే మొదట కేటగిరి–4, తర్వాత 3,2,1 వారీగా పోస్టులు భర్తీ చేస్తాం. బాలికల పాఠశాలలకు మహిళా ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇస్తాం. మొదట ఒక్కరుకూడా ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో పోస్టులు భర్తీ చేస్తాం. ఆ తర్వాత ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు చేపడతాం. ఈ నియామకాలకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. – ఎ.రవీందర్‌రెడ్డి, డీఈఓ -
నియామకాలెప్పుడో..!
కరీంనగర్‌ఎడ్యుకేషన్: టీఆర్టీ నియామకాలపై సందిగ్ధం నెలకొంది. పాఠశాలల్లో ఇది వరకు పనిచేస్తున్న విద్యావాలంటీర్లనే తాజాగా కొనసాగించాలని ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. బడులు ప్రారంభమయ్యే సమయం దగ్గరపడిన కొద్దీ ఉపాధ్యాయుల నియామకంపై తర్జనభర్జన కొనసాగింది. ప్రభుత్వం టీఆర్టీ నియామకాలు చేపడుతుందా.. విద్యావాలంటీర్లను కొనసాగిస్తుందా అనే సందేహాలు ఉండగా తాజాగా తాత్కాలిక బోధకుల వైపే విద్యాశాఖ మొగ్గు చూపింది. ఈ నెల 11న రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారులకు వెల్లడించారు. దీంతో ఏడాదిన్నరగా నియామకాల కోసం ఎదురు చూస్తున్న టిఆర్టీ అభ్యర్థుల కథ మళ్లీ మొదటికొచ్చింది. నియామకాలను భర్తీ చేసి మిగతా ఖాళీలను విద్యావాలంటీర్ల ద్వారా భర్తీ చేయాల్సిన విద్యాశాఖ టీఆర్టీ అభ్యర్థులను పక్కనబెట్టి విద్యావాలంటీర్లను కొనసాగించడంతో సందిగ్ధత నెలకొంది. పాతవారే కొనసాగింపు.. సర్కారు బడుల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కొన్నేళ్ల నుంచి విద్యావాలంటీర్లను నియమిస్తోంది. రెండేళ్ల నుంచి నెలకు రూ.12 వేల వేతనం అందజేస్తూ వారితో వివిధ సబ్జెక్టుల వారీగా బోధన చేయిస్తోంది. కిందటేడాది వరకు కొత్తగా నియామకాలు చేపడుతూ అర్హత ప్రకారం నియమించేవారు. ఇలా ప్రతీ ఏడాది దరఖాస్తులు చేసుకోవడం, మెరిట్ తదితర కారణాల రీత్యా ఇబ్బందులు పడుతున్నామని కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఇదివరకు పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావాలంటీర్లనే ఈ ఏడాది నుంచి కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం సైతం ఇందుకు సుముఖంగా ఉండడంతో తాత్కాలిక బోధకులను బడుల్లో కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బడులు పునః ప్రారంభం కావడంతో ఆయా జిల్లాల విద్యాధికారులు సైతం ఉపాధ్యాయుల కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో వారు తాత్కాలిక బోధకులను కొనసాగించాలని ఆదేశించారు. జిల్లా అధికారులు వారికి బడుల్లో చేరాలని సమాచారం అందించారు. ఇది వరకు ఉపాధ్యాయులు లేనిచోట, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి బోధకుల కొరత ఉన్నచోట, ప్రాధాన్యతక్రమంలో వీరిని నియమించారు. ఆయా పాఠశాలల్లో తాజా సంఖ్యను బట్టి మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చని అధికార వర్గాల ద్వారా తెలిసింది. కిందటేడాదిలో పలువురు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయడంతో వారి స్థానంలో కొత్తగా మరికొందరిని కూడా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారు 134 మంది వరకు ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. తాజాగా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతున్న పాఠశాలలకు విద్యావాలంటీర్లు రావడంతో కొంత ఉపశమనం కలిగినట్లవుతోంది. టీఆర్టీ అభ్యర్థులకు నిరీక్షణ తప్పదా..! ప్రభుత్వం తాజాగా సర్కారు బడుల్లో విద్యావాలంటీర్లను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల టీఆర్టీ నియామకాలపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఇప్పటి కే తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు సంబంధించి ఫలితాల ను ప్రకటించింది. ఫలితాలు ప్రకటించి సుమారు నాలు గు నెలలు కావస్తున్నా... వీరికి నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. బడులు తెరిచే నాటికి వీరిని బడుల్లో నియమించాలని అనేక డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం ఎటూ తేల్చలేకపోతోంది. ఎంపికైన అభ్యర్థులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. పలు ఉపాధ్యాయ సంఘాలు సైతం నియామక ఉత్తర్వులు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం తాత్కాలికంగా విద్యావాలంటీర్లనే బడుల్లో కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. దీంతో మరికొంత కాలం టీఆర్టీ అభ్యర్థులకు నిరీక్షణ తప్పదనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వి ద్యావాలంటీర్లను కొనసాగిస్తున్నామని డీఈవో వెంకటేశ్వర్లు వివరించారు. పాఠశాలల్లో ప్రాధాన్య క్రమంలో వారిని నియమించినట్లు వివరించారు. -
టీఆర్టీ అభ్యర్థుల అరెస్ట్..విడుదల
సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయ నియామకాల జాప్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వచ్చిన టీఆర్టీ అభ్యర్థులను పోలీటసులు అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ వద్దకు వేళ్లేందుకు పోలీసులు అనమతి నిరాకరించారు. అయినప్పటికీ టీఆర్టీ అభ్యర్థులు టీఆర్టీ ప్రగతి భవన్‌లోకి వేళ్లేందుకు ప్రయత్నించగా అరెస్ట్ చేసి గోషామాల్ పోలీస్టేషన్‌కు తరలించారు. దీనికి నిరసనగా అభ్యర్థులు అక్కడే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఉదయం నుండి ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో మహిళల పరిస్థితి చాలా ఆందోళనగా మారింది. దీంతో అరెస్ట్ చేసిన టీఆర్టీ అభ్యర్థులను రిలీజ్ చేశారు. -
టీఆర్టీ–ఎస్జీటీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: టీఆర్టీ–ఎస్జీటీ(తెలుగు మాధ్యమం) పోస్టులకు ఎంపికైన 3,375 మంది అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ గురువారం రాత్రి ప్రకటించింది. 3,786 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయగా, వివిధ కారణాలతో 411 పోస్టులకు సంబంధించిన ఫలితాలను పెండింగ్‌లో ఉంచింది. వైద్య నివేదికలు పెండింగ్‌లో ఉండటం/ఆయా శారీరక వైకల్య(పీహెచ్) కేటగిరీల అభ్యర్థులు లేకపోవడంతో ఇతర అంతర్గత కేటగిరీలకు మార్చడం/ఫర్దర్ పికప్ వంటి కారణాలతో పీహెచ్ కేటగిరీలోని 269 పోస్టుల ఫలితాలను పెండింగ్‌లో ఉంచింది. బీసీ–సీ, ఎస్టీ(డబ్ల్యూ) ఏజెన్సీ అభ్యర్థులు లేక 73 పోస్టులను భర్తీ చేయలేకపోయింది. కోర్టు కేసుల కారణంగా 23 పోస్టులు, ఏజెన్సీ ప్రాంతాలకు ఎంపికైన అభ్యర్థుల స్థానిక క్లైం విషయంలో మరో 46 పోస్టుల ఫలితాలను పెండింగ్‌లో ఉంచామని కమిషన్ కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 45 కేటగిరీల్లో 7,485 ఉపాధ్యాయ పోస్టుల ఫలితాలను ప్రకటించామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్సైట్ ఠీఠీఠీ. ్టటpటఛి. జౌఠి. జీn లో చూసుకోవాలని సూచించారు. -
రెగ్యులర్ ఉపాధ్యాయులేరి?
భైంసాటౌన్ ఆదిలాబాద్ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యమంటూ ఊదరగొడుతున్న సర్కారు.. విద్యార్థులకు సరైన విద్య అందించడంపై మాత్రం శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, రెగ్యులర్ ఉపాధ్యాయుల భర్తీపై దృష్టి సారించడం లేదు. జిల్లాలో మొత్తం 510 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలున్నాయి. అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఆ ఖాళీల్లో విద్యావలంటీర్ల భర్తీతో సరిపెట్టనుంది. మరోవైపు ఇటీవల నిర్వహించిన టీఆర్టీలో మెరిట్ సాధించిన అభ్యర్థులు నియామకాల ప్రక్రియ జాప్యం అవుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 764 ప్రభుత్వ పాఠశాలలు.. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు అన్నీ కలిపి 764 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 3047 ఉపాధ్యాయులు అవసరం ఉండగా, ప్రస్తుతం 2537 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. 510 ఖాళీలున్నాయి. ఏళ్ల తరబడిగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపట్టకపోవడంతో ఇప్పటికే పలుచోట్ల ఉపాధ్యాయులు లేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు ఆసక్తి చూపడం లేదు. అయినా ఉపాధ్యాయులు ఏటా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తూ విద్యార్థుల ప్రవేశాలను పెంచుతున్నారు. సమస్యలతో సతమతం.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనైనా నిరుద్యోగ సమస్య తీరుతుందని నిరుద్యోగ యువత భావించింది. ప్రభుత్వం కూడా టీచర్ల భర్తీ అంటూ చాలాసార్లు ప్రకటనలు చేసింది. ఎట్టకేలకు ప్రభుత్వం ఇటీవల టీఆర్టీ నిర్వహించినా.. దానికి సంబంధించిన ఫలితాలు, నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. మూడేళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న పాఠశాలల్లో విద్యార్థులకు సరైన విద్యాబోధన అందక ఇబ్బందులు పడ్డారు. అంతేగాకుండా ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలంటూ బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కానీ అందుకనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు విద్యాబోధన అందించడం కష్టంగా మారింది. అయోమయంలో టీఆర్టీ అభ్యర్థులు.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పలు ఉపాధ్యాయ పోస్టుల్లో ప్రభుత్వం విద్యావలంటీర్లతో భర్తీ చేయనుంది. 510 ఖాళీలుండగా, ప్రభుత్వం అన్ని చోట్ల టీచర్ల భర్తీకి వీవీ పోస్టులను మంజూరు చేసింది. ఈనెల 16వరకు దరఖాస్తుల స్వీకరించారు. ప్రస్తుతం డీఈవో కార్యాలయం నుంచి ప్రొవిజనల్ లిస్టు ఎంఈవో కార్యాలయాలకు చేరింది. ఏమైనా అభ్యంతరాలుంటే పరిశీలించిన అనంతరం తిరిగి డీఈవో కార్యాలయానికి లిస్టు పంపనున్నారు. అనంతరం అభ్యర్థులు తుది ఎంపిక ప్రక్రియ పూర్తికానుంది. నేడో, రేపో అభ్యర్థులు విధుల్లో చేరే అవకాశముంది. దీంతో విద్యార్థులకు కొంతమేర ఇబ్బంది తొలగినా.. అది తాత్కాలికమేనని అనిపిస్తోంది. ఒకవేళ టీఆర్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయితే వీవీల పరిస్థితి ఏమిటోనన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2600 దరఖాస్తులు జిల్లాకు 510 విద్యావలంటీర్ల పోస్టులు మంజూరుకాగా, ఆయా మండలాల్లోని ఎంఈవో కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 2600 దరఖాస్తులు వచ్చినట్లు డీఈవో తెలిపారు. దరఖాస్తులదారులకు సంబంధించి నిబంధనల మేరకు రోస్టర్ పాయింట్లు కేటాయించారు. ఎంఈవో కార్యాలయాలకు అభ్యర్థుల లిస్టు పంపించారు. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసి, అనంతరం అభ్యర్థుల తుది ఎంపిక లిస్టు రానుంది. నేడో, రేపో అభ్యర్థులు విధుల్లో చేరే అవకాశం ఉంది. రెగ్యులర్ టీచర్లను నియమించాలి మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులకు సరైన విద్యాబోధన అందకపోవడంతో తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపడానికి ఆసక్తి చూపలేదు. ప్రభుత్వం టీఆర్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలి. – బివి.రమణారావు,పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
‘టీఆర్టీ’ ఫలితాల్లో గందరగోళం
సాక్షి, జనగామ అర్బన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన టీఆర్టీ ఫలితాలు వివిధ జిల్లాల్లోని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలను చూసిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌పై సంబంధంలేని వివరాలు ఉండడంతో కంగుతింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఎంతోకాలంగా కష్టపడి పరీక్ష కు ప్రిపేర్ అయితే.. టీఎస్పీఎస్సీ అధికారులు తమ జీవితాలతో చెలగాటమాడారని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. ఈ విషయంలో అధి కారులు సాంకేతిక తప్పిదం జరిగిందని తప్పించుకుని మరోమారు నిరుద్యోగులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పరీక్ష రాసిన అనంతరం తాము చూసుకున్న ఫైనల్‌కీ మార్కులకు ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలకు కూడా వ్యత్యాసం ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు వాపోతున్నారు. ఫలితాల్లో తప్పులు.. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఎన్. సాయిబాబు బీసీ బీ కులానికి చెందిన పురుషుడు. ఈయనకు ఫైనల్ కీలో 58 మార్కులు వచ్చాయి. కాగా, ఫలితాల్లో మాత్రం ఎస్సీ కేటగిరీగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళగా చూపించి 54 మార్కులు ఉన్నట్లు ప్రకటించారు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన సీహెచ్.కల్యాణి బీసీ బీకి చెందిన మహిళ. ఈమెను బీసీ డీ పురుషుడిగా, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినట్లు ఫలితాల్లో చూపించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జె. రమేష్ బీసీ బీ పురుషుడు. ఈయనను నల్లగొండ జిల్లా బీసీ డీ అభ్యర్థిగా ఫలితాలు ప్రకటించారు. ఇదే జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులకు సైతం ఫలితాలు తారుమారు వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్టీ మహిళ అభ్యర్థికి రంగారెడ్డి జిల్లా వ్యక్తిగా, బీసీ డీగా చూపించారు. మారుతీరెడ్డి కరీంనగర్ జిల్లా ఓసీ అభ్యర్థిగా పరీక్షకు హాజరుకాగా, ప్రకటించిన ఫలితాల్లో బీసీ డీ, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అభ్యర్థిగా ప్రకటించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం.. టీఎస్పీఎస్సీ ప్రకటించిన ఫలితాలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. చాలాకా లం పాటు కష్టపడి చదివి ఫలితాల కోసం ఎదురుచూస్తే తీవ్రనిరాశ కలిగించాయి. ప్రకటించిన ఫలితాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ అధికారులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదు. –నోముల సాయిబాబు, జనగామ జిల్లా ప్రతిసారి ఇదే తంతు కొనసాగుతోంది.. టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న ప్రతి పోటీ పరీక్షల్లో తప్పులు దొర్లడం సర్వసాధారణమైంది. పరీక్ష రాసిన అభ్యర్థిలో ప్రతిసారి ఫలితాలు ఎలా వస్తాయో అనే ఆందోళన నెలకొంది. ప్రభుత్వం తక్షణమే చొరవచూపి ప్రకటించిన ఫలితాల్లో సాంకేతిక లోపాన్ని సరిచేసి అభ్యర్థులకు న్యాయం చేయాలి. –మారుతిరెడ్డి, కరీంనగర్ జిల్లా -
టీఆర్టీ ఫలితాల్లో గందరగోళం
జనగామ అర్బన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన టీఆర్టీ ఫలితాలు వివిధ జిల్లాల్లోని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలను చూసిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌పై సంబంధం లేని వివరాలు ఉండడంతో కంగుతింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఎంతోకాలం కష్టపడి పరీక్షకు ప్రిపేర్ అయితే టీఎస్పీఎస్సీ అధికారులు తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. సాంకేతిక తప్పిదం జరిగిందంటూ అధికారులు నిరుద్యోగులను మరోమారు మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పరీక్ష రాసిన తర్వాత తాము చూసుకున్న ఫైనల్ కీ మార్కులకు ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలకు వ్యత్యాసం ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందని వారు వాపోతున్నారు. ఫలితాల్లో తప్పులు.. ♦ జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఎన్.సాయిబాబు బీసీ బీ కులానికి చెందిన పురుషుడు. ఈయనకు ఫైనల్ కీలో 58 మార్కులు వచ్చాయి. కాగా, ఫలితాల్లో మాత్రం ఎస్సీ కేటగిరీగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళగా చూపించి 54 మార్కులు ఉన్నట్లు ప్రకటించారు. ♦ వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన సీహెచ్.కల్యాణి బీసీ బీ మహిళ. ఈమెకు బీసీ డీ పురుషుడిగా, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినట్లు ఫలితాల్లో ఉంది. ♦మహబూబ్‌నగర్‌కు చెందిన జె.రమేష్ బీసీ బీ పురుషుడు. ఈయనను నల్లగొండ జిల్లా బీసీ డీ అభ్యర్థిగా ఫలితాల్లో ప్రకటించారు. ఇదే జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులకు సైతం ఫలితాలు తారుమారు వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. ♦ ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్టీ మహిళ అభ్యర్థి అయితే రంగారెడ్డి జిల్లా బీసీ డీ అని ఉంది. ♦ మారుతీరెడ్డి కరీంనగర్ జిల్లా ఓసీ అభ్యర్థిగా పరీక్షకు హాజరుకాగా, ప్రకటించిన ఫలితాల్లో బీసీ డీ, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అభ్యర్థిగా ప్రకటించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం టీఎస్పీఎస్సీ ప్రకటించిన ఫలితాలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. చాలా కాలం పాటు కష్టపడి చదివి పరీక్ష రాస్తే ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ అధికారులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం సరికాదు. ఫలితాలు సైతం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. –నోముల సాయిబాబు, జనగామ జిల్లా -
‘స్కూల్ అసిస్టెంట్’ ఫలితాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. అభ్యర్థికి వచ్చిన మార్కుల వివరాలతో పాటు మెరిట్ ఆధారంగా వారికి రాష్ట్ర ర్యాంకులను కేటాయించింది. పోస్టుల భర్తీలో పారదర్శకతతో పాటు జిల్లాలోని 20 శాతం ఓపెన్ కేటగిరీ పోస్టులకు అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పించడంతో ఈ ర్యాంకులను ప్రకటించింది. 1941 స్కూల్ ఆసిస్టెంట్ పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా అభ్యర్థికి వచ్చిన రాష్ట్ర ర్యాంకు, హాల్‌టికెట్ నంబరు, మార్కులు, రిజర్వేషన్ కేటగిరీ, జిల్లా వివరాలతో ఫలితాలను ప్రకటించింది. మొత్తం 27 సబ్జెక్టులకు 1,17,410 మందితో మెరిట్ జాబితాను రూపొందించింది టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం జారీ చేసిన ర్యాంకుల జాబితాల నుంచి ఒక్కో పోస్టుకు 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను సిద్ధం చేసి ఆయా జిల్లాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పంపించనుంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక జిల్లాల నుంచి వచ్చిన జాబితాలను బట్టి అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనుంది. మరోవైపు సెకండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, పండిట్ పోస్టులకు సంబంధించిన ర్యాంకులను కూడా త్వరలోనే ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ వివరాలు
-
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి : ఆశావాహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్‌పై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ప్రకటన చేశారు. మే 4న టెట్, జులై 6న డీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. డీఎస్సీ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసకమిషన్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తుందని చెప్పారు. ఆరు కేటగిరీల్లో(ఎస్జీటీ, ఎస్ఏ, పీఈటీ, ఎల్పీ, మ్యూజిక్) మొత్తం 10,351 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. టెట్, డీఎస్సీల సిలబస్‌ను వారంలోగా వెల్లడిస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంత్సరానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జూన్ 12 కల్లా భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ : 6-7-2018 దరఖాస్తు గడువు : 7-7-2018 నుంచి 9-8-2018 వరకూ హాల్ టికెట్స్ : 15-08-2018 పరీక్షలు : 23-08-2018 నుంచి 30-08-2018 ( రెండు సెషన్లలో 9.30 నుంచి 12, 2.30 నుంచి 5 గంటల వరకూ పరీక్షలు ) ప్రాథమిక కీ : 31-08-2018 అభ్యంతరాల గడువు : 31-08-2018 నుంచి 07-09-2018 వరకూ ఫైనల్ కీ :10-09-2018 తుది ఫలితాలు : 15-09-2018 ఖాళీల వివరాలు ఎస్జీటీ - 4,967 ఎస్ఏ - 2978 లాంగ్వేజ్ పండిట్స్ - 312 పీఈటీ - 1056 మ్యూజిక్, డాన్స్ - 109 మోడల్ స్కూల్స్ - 929