సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) విషయంలో స్థానికత అంశంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ దీనిపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వం 317 జీవోను అమలు చేసింది. దీని ప్రకారం స్థానికతను నిర్థారించింది. అయితే ఇది ఇప్పటివరకూ ఉద్యోగులకే పరిమితమైంది.
తాజాగా టీచర్ల నియామకంలోనూ దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఒకటి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ నాలుగేళ్ళు చదివితే ఆ జిల్లాను స్థానికతగా పరిగణిస్తారు. గతంలో 4–10 తరగతుల్లో ఎక్కడ నాలుగేళ్ళు చదివి ఉంటే దాన్ని స్థానికతగా చూసేవాళ్ళు. ఈ నిబంధనలో మార్పు వల్ల స్థానికత నిర్ధారణలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు.
అప్పటి స్కూళ్ళు ఇప్పుడు లేవు!
సాధారణంగా ప్రాథమిక విద్యను సమీపంలో ఉన్న స్కూల్‌లో పూర్తి చేస్తారు. 6వ తరగతి నుంచే సరైన రికార్డు ఉంటుంది. కాబట్టి 4 నుంచి 10 తరగతుల వరకు కనీసం నాలుగేళ్ళు ఎక్కడ చదివిందీ ధ్రువీకరించడం కొంత తేలికగా ఉంటుంది. ఇప్పుడు టీఆర్టీ పరీక్ష రాసే అభ్యర్థులు దాదాపు 15 ఏళ్ళ క్రితం ఒకటి నుంచి 5 తరగతి వరకు చదివి ఉంటారు. ఇందులో చాలా స్కూళ్ళకు అనుమతి కూడా లేదని అభ్యర్థులు చెబుతున్నారు.
ఆ తర్వాత 6, 7 తరగతులు వేర్వేరు స్కూళ్లలో చదివిన వారున్నారు. ఇందులో కొంతమంది వేరే జిల్లాల్లోనూ చదివి ఉంటారు. దీనివల్ల ‘1 నుంచి 7వ తరగతి వరకు’ అనే నిబంధన కింద నాలుగేళ్ళు వరసగా ఏ జిల్లాలో చదివారనేది నిరూపించుకోవడం కష్టంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. 1–5 వరకు చదివిన ప్రాథమిక ప్రైవేటు స్కూళ్ళు అనేకం ఇప్పటికే మూతపడటం, కొన్నిటికి అనుమతి లేకపోవడంతో డీఈవో కార్యాలయాల్లోనూ వారి డేటా లభించకపోవడంతో స్థానికత నిరూపణ కష్టంగా ఉందని అంటున్నారు.
తల్లిదండ్రుల ఉద్యోగాల దృష్ట్యా, హాస్టళ్ళ కోసం ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల వేర్వేరు తరగతులు చదివిన వాళ్ళకూ ఈ సమస్య తప్పడం లేదని వాపోతున్నారు. ఇప్పుడు జిల్లాల విభజన జరిగి కొత్త జిల్లాలు ఏర్పడటం వల్ల కూడా స్థానికత ఏదో చెప్పడం కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాన్–లోకల్‌కు అవకాశమే లేదు!
రాష్ట్రవ్యాప్తంగా 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రోస్టర్ విధానం తర్వాత అనేక జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులు ఒక్కటి కూడా లేకుండా పోయాయి. 16 జిల్లాల్లో ఎస్‌ఏ గణితం, ఏడు జిల్లాల్లో ఎస్‌ఏ ఇంగ్లీష్, మూడు జిల్లాల్లో ఎస్‌ఏ ఫిజికల్ సైన్స్, రెండు జిల్లాల్లో సోషల్ పోస్టులే లేవు. దీంతో ఈ జిల్లాలకు చెందిన అభ్యర్థులు వేరే జిల్లాలో ఉండే పోస్టులకు నాన్–లోకల్ కేటగిరీ కింద పరీక్ష రాయాల్సి ఉంటుంది.
అయితే నియామకాల్లో స్థానికేతరుల కోటాను కేవలం 5 శాతానికే పరిమితం చేశారు. అంటే ఇతర జిల్లాల్లో కనీసం 20 పోస్టులు ఉంటేనే నాన్–లోకల్‌కు ఒక పోస్టు అయినా ఉంటుంది. కానీ ఏ జిల్లాలోనూ ఏ సబ్జెక్ట్‌కు సంబంధించి కూడా ఇన్ని పోస్టులు లేవు. అలాంటప్పుడు నాన్–లోకల్‌గా పరీక్ష రాసి ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
నా స్థానికత తేలడం లేదు
మహబూబాబాద్‌లో 1–5 వరకూ చదివాను. ఆ స్కూల్ ఇప్పుడు లేదు. ఆరు, ఏడు తరగతులు ప్రస్తుత వరంగల్ జిల్లాలో చదివాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇంటర్ వరకూ చదివాను. దీంతో నాలుగేళ్ళు ఎక్కడ చదివింది నిరూపించుకోవడం కష్టంగా ఉంది.
– చదలవాడ నవీన్ (వరంగల్, టీఆర్టీ దరఖాస్తుదారు)
స్థానికత నిబంధనపై ఆలోచించాలి
1 నుంచి 7 తరగతుల్లో నాలుగేళ్ళు ఎక్కడ చదివితే అక్కడి స్థానికులుగా పరిగణింపబడతారనే నిబంధన చాలామంది అభ్యర్థులకు ఇబ్బందిగా ఉంది. నాన్–లోకల్ కోటాను తగ్గించడం వల్ల కూడా చాలా జిల్లాల్లో టీచర్ పోస్టులు పొందే అవకాశం ఉండటం లేదు. దీనిపై అధికారులు పునః సమీక్షించాలి.
– రావుల రామ్మోహన్‌రెడ్డి (తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు)
Comments
Please login to add a commentAdd a comment