Locality
-
పీజీ మెడికల్ ప్రవేశాలకు ‘స్థానికత’ బ్రేక్
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. స్థానికత వివాదంపై విద్యార్థులు కోర్టుకు ఎక్కడంతో కౌన్సెలింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. కోర్టు కేసు తేలాకే ప్రవేశాలుంటాయని కాళోజీ వర్సిటీ స్పష్టం చేసింది. తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేస్తే వారు తెలంగాణలో జరిగే పీజీ మెడికల్ అడ్మిషన్లలో స్థానికేతరులు అవుతుండటంతో వివాదం నెలకొంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించిన పీజీ మెడికల్ నోటిఫికేషన్ ప్రకారం స్థానిక అభ్యర్థి అంటే వరుసగా నాలుగు సంవత్సరాలకు తక్కువ కాకుండా తెలంగాణలో చదివి ఉండాలి. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో చదివిన రాష్ట్ర విద్యార్థులు కూడా స్థానికులే అవుతారని వర్సిటీ పేర్కొంది. ఈ విధానం వల్ల తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. వారు ఎక్కడా స్థానికులు కాని పరిస్థితి నెలకొంటోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల్లో టాప్ ర్యాంకర్లు ఎక్కువగా జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్‌లో చేరుతున్నారు. అలా జాతీయ విద్యాసంస్థల్లో చదివిన వారు రాష్ట్రంలో పీజీ మెడికల్ అడ్మిషన్లలో అన్యాయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారు కోర్టును ఆశ్రయించారు. ఇక కౌన్సెలింగ్ తరువాయి అనగా.. ఈ ఏడాది పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ బాగా ఆలస్యమైంది. ఎట్టకేలకు గత నెలాఖరున 2024–25 సంవత్సరానికి కనీ్వనర్ కోటా కింద ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. కాళోజీ వర్సిటీకి, నిమ్స్‌కు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. నీట్ పీజీ–2024లో అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి గత నెల 31 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు. వెంటనే కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ‘స్థానికత’నిబంధనపై అభ్యర్థులు కోర్టుకు ఎక్కడంతో నిలిచిపోయింది. కోర్టు కేసు తేలాకే తదుపరి ప్రక్రియ జరుగుతుందని కాళోజీ వర్గాలు చెబుతున్నాయి. ఈ జాప్యం కేవలం ప్రవేశాలు పొందే విద్యార్థులకే కాకుండా... ప్రస్తుతం మొదటి సంవత్సరం కోర్సు పూర్తి చేసిన పీజీ విద్యార్థులకు సైతం ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. జూనియర్లు ప్రవేశాలు పొందితే తప్ప వారు అక్కడ్నుంచి రిలీవ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. 50% జాతీయ కోటాతోనూ అన్యాయం! స్థానిక కోటాతోపాటు తెలంగాణ విద్యార్థులకు నేషనల్ పూల్ కింద జాతీయ స్థాయికి వెళ్లే సీట్లలోనూ అన్యాయం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో 26 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2,800 పీజీ మెడికల్ సీట్లున్నాయి. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో 50 శాతం జాతీయ కోటా కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని తెలంగాణ వాసులకు కేటాయిస్తారు. ఈ క్రమంలో జాతీయ కోటా కిందకు దాదాపు 600 సీట్లు వెళ్తాయి. ఇంత పెద్ద సంఖ్యలో సీట్లను జాతీయ కోటా నింపుతుండటంపై రాష్ట్ర విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కడ ఎక్కువగా అవకాశం పొందుతున్నారని వారంటున్నారు. ఎంబీబీఎస్‌లో నేషనల్ పూల్ కింద ప్రభుత్వ సీట్లలో 15 శాతం జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుండగా, పీజీ మెడికల్ సీట్లలో మాత్రం ఏకంగా సగం కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. జాతీయ కోటాలో నింపే మన రాష్ట్రంలోని 600 పీజీ మెడికల్ సీట్లలో దాదాపు 300 ఇతర రాష్ట్రాల వారే దక్కించుకుంటున్నారని కాళోజీ వర్సిటీ వర్గాలు సైతం చెబుతున్నాయి. -
స్థానికత ఆధారంగా కేటాయింపులు జరపాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లో భాగంగా తీసుకొచ్చిన జీవో 317 ద్వారా తీవ్రంగా నష్టపోయామంటూ బాధిత ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో జీవో 317 బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ పది నెలలైనా ఆ హామీని అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికత ఆధారంగా కేటాయింపులు జరపాలని డిమాండ్ చేస్తూ బాధిత ఉద్యోగులు బుధవారం గాందీభవన్‌ను ముట్ట డించారు. గాం«దీభవన్ ఎదుట రోడ్డుపైన ఉద్యోగులు బైఠాయించి నిరసన తెలి పారు. జీవో 317కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఉద్యోగి చదువుకున్న ప్రాంతాన్ని స్థానికతగా పరిగణించాలని, అలాకాకుండా సంబంధం లేని ప్రాంతాల్లో ఉద్యోగుల కేటాయింపులు జరిపి తమ భవిష్యత్తును ఆందోళనకరంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు గాం«దీభవన్ వద్ద మోహరించారు. నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం జీవో 317 బాధితుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉసంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు. బాధిత ఉద్యోగుల నుంచి వినతులు స్వీకరించిన ప్రభుత్వం.. వాటి పరిష్కారానికి సంబంధించిన బాధ్యతలను మంత్రివర్గ ఉపకమిటీకి అప్పగించింది. ఈ కమిటీ పలుమార్లు సమావేశమైనప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాదాపు ఎనిమిది నెలలైనా ఈ అంశంపై నిర్ణయం తీసుకోకపోవడంతో ఆగ్రహించిన బాధిత ఉద్యోగులు ప్రస్తుతం ఆందోళనబాట పట్టారు. పరిష్కారానికి మంత్రి, మహేశ్‌గౌడ్ హామీ ఆందోళన చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ గాం«దీభవన్ లోపలికి పిలిచి చర్చలు జరిపారు. జీవో 317పై ప్రభుత్వం సబ్‌కమిటీని నియమించిందని, పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఈ నెల 3న సబ్‌కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ ఉంటుందని హామీనిచ్చారు. దీంతో ఉద్యోగులు ఆందోళనను విరమించారు. -
‘స్థానికత’పై వర్సిటీ తీరు సరికాదు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యా అడ్మిషన్లకు సంబంధించి కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ ‘స్థానికత’పై వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు తప్పుబట్టింది. నేరుగా ప్రభుత్వం సిఫార్సు చేసిన సైనిక పాఠశాల విద్యార్థిని స్థానిక అభ్యర్థిగా పరిగణించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థిని స్థానికుడిగా పరిగణించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వ సిఫార్సు మేరకు రంగారెడ్డి జిల్లా వనస్థలిపురానికి చెందిన చేపూరి అవినాశ్ డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ స్కూల్లో 8 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించారు. రాష్ట్ర కోటా నుంచి అతను ఎంపికయ్యారు. ఆ తర్వాత ఇంటరీ్మడియట్ తెలంగాణలో పూర్తి చేశారు. ఎంబీబీఎస్ అడ్మిషన్ల సమయంలో అతను తెలంగాణలో 9, 10 చదవలేదని పేర్కొంటూ స్థానిక అభ్యర్థిగా పరిగణించడానికి విశ్వవిద్యాలయం నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ హైకో ర్టులో అవినాశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున ఎ.వెంకటేశ్, ప్రభుత్వం తరఫున ఏజీపీ స్వప్న, కాళోజీ వర్సి టీ తరఫున ఎ.ప్రభాకర్‌రావు హాజరయ్యారు. రెండు రోజుల క్రితం విచారణ సందర్భంగా పిటిషనర్ స్థానిక అభ్యర్థే కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది. సమస్యను పరిష్కరించాలని వర్సిటీకి సూ చించింది. అయితే గురువారం విచారణ సందర్భంగా స్థానికుడిగా పరిగణించలేమని వర్సిటీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. వర్సిటీ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థి నాన్ లోకల్ ఎలా అవుతారో సర్కార్‌ను అడిగి చెప్పాలని ఏఏజీని ఆదేశించింది. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది. -
స్థానికత రిజర్వేషన్: సుప్రీంకు తెలంగాణ సర్కార్
ఢిల్లీ: స్థానికత రిజర్వేషన్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ శాశ్వత నివాసులు రాష్ట్రం బయట చదువుకున్నంత మాత్రాన స్థానిక రిజర్వేషన్ వర్తించవని ప్రభుత్వ నిబంధనను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణలో చదువుకోలేదన్న కారణంతో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ నిరాకరించరాదని స్పష్టం చేసింది. తాజాగా హైకోర్టు తీర్పును తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని తెలంగాణ తరఫు సీనియర్ నాయకుడు గోపాల్ శంకర్ నారాయణ సుప్రీం కోర్టును కోరింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను త్వరలోనే విచారణ జాబితాలో చేరుస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వెల్లడించారు.చదవండి: ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌పై నీలినీడలు -
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌పై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంబీబీఎస్ రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. స్థానికతపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరింత గందరగోళం నెలకొంది. ఈ తీర్పు నేపథ్యంలో కౌన్సెలింగ్ నిర్వహించడం సాధ్యం కాదని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. స్థానికతపై కోర్టును ఆశ్రయించిన వారే కాకుండా కాళోజీ విశ్వవిద్యాలయం రూపొందించిన నాన్ లోకల్ జాబితాలో ఉన్న దాదాపు 1,100 మంది విద్యార్థులకు కొత్త మార్గదర్శకాలు అమలు చేయాలని తీర్పులో ఉందని... అందువల్ల అది తేలకుండా కౌన్సెలింగ్ నిర్వహించడం సాధ్యంకాదని పేర్కొన్నాయి. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయంపైనే అంతా ఆధారపడి ఉందని తెలిపాయి. ప్రభుత్వం అప్పీలుకు వెళ్లడం ద్వారా పరిష్కారం వెతకడమో లేదా కొత్త మార్గదర్శకాలు ఖరారు చేసి అమలు చేయడమో ఇప్పుడున్న ప్రత్యామ్నాయ మార్గాలని అధికారులు అంటున్నారు. దీనివల్ల కౌన్సెలింగ్ మరింత ఆలస్యం కానుందని చెబుతున్నారు. స్థానికతపై రాజుకున్న లొల్లి... రాష్ట్రంలో ఎంబీబీఎస్ సహా ఇతర మెడికల్ కోర్సుల్లో స్థానికత నిర్ధారణకు ప్రభుత్వం ఈసారి మార్పులు చేసింది. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్ మధ్యలో ఏదైనా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగా గుర్తించేది. అయితే ఈ నిబంధన వల్ల చాలా మంది ఏపీకి చెందిన విద్యార్థులు 6–9 తరగతులు చదివినట్లు తప్పుడు సర్టిఫికెట్లు తెచ్చి తెలంగాణ స్థానికులుగా చెలామణి అవుతున్నారని ప్రభుత్వం భావించింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు 9, 10, ఇంటర్ రెండేళ్లు కలిపి మొత్తం నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదివిన వారినే స్థానికులుగా గుర్తించాలని ఉత్తర్వులు జారీచేసింది. దీంతో కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమకు అన్యాయం జరుగుతుందని కోర్టుకు వెళ్లారు. కౌన్సెలింగ్ జరిగేదెప్పుడు? ప్రస్తుతం 15 శాతం ఆలిండియా కోటా సీట్లు డీమ్డ్ వర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఈఎస్ఐసీ, ఏఎఫ్ఎంసీ, బీహెచ్‌యూ, ఏఎంయూ సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతోంది. తొలివిడత కౌన్సెలింగ్ పూర్తయింది. రెండో విడత జరుగుతోంది. వాస్తవానికి జాతీయ స్థాయిలో తొలివిడత కౌన్సెలింగ్ ముగిశాక రాష్ట్రస్థాయిలో తొలివిడత కౌన్సెలింగ్ నిర్వహించాలి. కానీ స్థానికత అంశం కోర్టులో ఉండటంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కౌన్సెలింగ్ మొదలవలేదు. ఏదిఏమైనా తెలంగాణలో ఈసారి కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కానుందని కాళోజీ వర్గాలు తెలిపాయి. మరో రెండు వారాలు కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం లేదని పేర్కొన్నాయి. -
టీఆర్టీలో స్థానికత చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) విషయంలో స్థానికత అంశంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ దీనిపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వం 317 జీవోను అమలు చేసింది. దీని ప్రకారం స్థానికతను నిర్థారించింది. అయితే ఇది ఇప్పటివరకూ ఉద్యోగులకే పరిమితమైంది. తాజాగా టీచర్ల నియామకంలోనూ దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఒకటి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ నాలుగేళ్ళు చదివితే ఆ జిల్లాను స్థానికతగా పరిగణిస్తారు. గతంలో 4–10 తరగతుల్లో ఎక్కడ నాలుగేళ్ళు చదివి ఉంటే దాన్ని స్థానికతగా చూసేవాళ్ళు. ఈ నిబంధనలో మార్పు వల్ల స్థానికత నిర్ధారణలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు. అప్పటి స్కూళ్ళు ఇప్పుడు లేవు! సాధారణంగా ప్రాథమిక విద్యను సమీపంలో ఉన్న స్కూల్లో పూర్తి చేస్తారు. 6వ తరగతి నుంచే సరైన రికార్డు ఉంటుంది. కాబట్టి 4 నుంచి 10 తరగతుల వరకు కనీసం నాలుగేళ్ళు ఎక్కడ చదివిందీ ధ్రువీకరించడం కొంత తేలికగా ఉంటుంది. ఇప్పుడు టీఆర్టీ పరీక్ష రాసే అభ్యర్థులు దాదాపు 15 ఏళ్ళ క్రితం ఒకటి నుంచి 5 తరగతి వరకు చదివి ఉంటారు. ఇందులో చాలా స్కూళ్ళకు అనుమతి కూడా లేదని అభ్యర్థులు చెబుతున్నారు. ఆ తర్వాత 6, 7 తరగతులు వేర్వేరు స్కూళ్లలో చదివిన వారున్నారు. ఇందులో కొంతమంది వేరే జిల్లాల్లోనూ చదివి ఉంటారు. దీనివల్ల ‘1 నుంచి 7వ తరగతి వరకు’ అనే నిబంధన కింద నాలుగేళ్ళు వరసగా ఏ జిల్లాలో చదివారనేది నిరూపించుకోవడం కష్టంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. 1–5 వరకు చదివిన ప్రాథమిక ప్రైవేటు స్కూళ్ళు అనేకం ఇప్పటికే మూతపడటం, కొన్నిటికి అనుమతి లేకపోవడంతో డీఈవో కార్యాలయాల్లోనూ వారి డేటా లభించకపోవడంతో స్థానికత నిరూపణ కష్టంగా ఉందని అంటున్నారు. తల్లిదండ్రుల ఉద్యోగాల దృష్ట్యా, హాస్టళ్ళ కోసం ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల వేర్వేరు తరగతులు చదివిన వాళ్ళకూ ఈ సమస్య తప్పడం లేదని వాపోతున్నారు. ఇప్పుడు జిల్లాల విభజన జరిగి కొత్త జిల్లాలు ఏర్పడటం వల్ల కూడా స్థానికత ఏదో చెప్పడం కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాన్–లోకల్‌కు అవకాశమే లేదు! రాష్ట్రవ్యాప్తంగా 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రోస్టర్ విధానం తర్వాత అనేక జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు ఒక్కటి కూడా లేకుండా పోయాయి. 16 జిల్లాల్లో ఎస్ఏ గణితం, ఏడు జిల్లాల్లో ఎస్ఏ ఇంగ్లీష్, మూడు జిల్లాల్లో ఎస్ఏ ఫిజికల్ సైన్స్, రెండు జిల్లాల్లో సోషల్ పోస్టులే లేవు. దీంతో ఈ జిల్లాలకు చెందిన అభ్యర్థులు వేరే జిల్లాలో ఉండే పోస్టులకు నాన్–లోకల్ కేటగిరీ కింద పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే నియామకాల్లో స్థానికేతరుల కోటాను కేవలం 5 శాతానికే పరిమితం చేశారు. అంటే ఇతర జిల్లాల్లో కనీసం 20 పోస్టులు ఉంటేనే నాన్–లోకల్‌కు ఒక పోస్టు అయినా ఉంటుంది. కానీ ఏ జిల్లాలోనూ ఏ సబ్జెక్ట్‌కు సంబంధించి కూడా ఇన్ని పోస్టులు లేవు. అలాంటప్పుడు నాన్–లోకల్‌గా పరీక్ష రాసి ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నా స్థానికత తేలడం లేదు మహబూబాబాద్‌లో 1–5 వరకూ చదివాను. ఆ స్కూల్ ఇప్పుడు లేదు. ఆరు, ఏడు తరగతులు ప్రస్తుత వరంగల్ జిల్లాలో చదివాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇంటర్ వరకూ చదివాను. దీంతో నాలుగేళ్ళు ఎక్కడ చదివింది నిరూపించుకోవడం కష్టంగా ఉంది. – చదలవాడ నవీన్ (వరంగల్, టీఆర్టీ దరఖాస్తుదారు) స్థానికత నిబంధనపై ఆలోచించాలి 1 నుంచి 7 తరగతుల్లో నాలుగేళ్ళు ఎక్కడ చదివితే అక్కడి స్థానికులుగా పరిగణింపబడతారనే నిబంధన చాలామంది అభ్యర్థులకు ఇబ్బందిగా ఉంది. నాన్–లోకల్ కోటాను తగ్గించడం వల్ల కూడా చాలా జిల్లాల్లో టీచర్ పోస్టులు పొందే అవకాశం ఉండటం లేదు. దీనిపై అధికారులు పునః సమీక్షించాలి. – రావుల రామ్మోహన్‌రెడ్డి (తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు) -
‘జాతీయపార్టీలను కన్నడిగులు తిరస్కరిస్తారు’
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరానికి ఈసీ శంఖారావం పూరించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో.. పార్టీలన్నీ ప్రచారాన్ని ముమర్మం చేశాయి. మరోవైపు అభ్యర్థుల ఎంపికపైనా పార్టీలన్నీ కసరత్తులు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రాంతీయవాద నినాదంతో ఎన్నికలకు వెళ్తున్న జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్.. జాతీయ పార్టీలను తిరస్కరించేందుకు కన్నడిగులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారాయన. మే నెలలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. అదీ ఒకే విడతలో ముగించాలనుకోవడం మంచి పరిణామం. ఇప్పటికే మా పార్టీ 70 శాతం ప్రచారాన్ని ముగించింది అని పేర్కొన్నారాయన. ఇరు పార్టీల నుంచి పొత్తు కోసం తనకు ఆహ్వానం అందిందన్న ఆయన.. ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌లు కర్ణాటకకు చేసిందేమీ లేదని, ఈ లెక్కన ఈసారి ప్రాంతీయవాదానికే కన్నడ ప్రజలు కట్టం కడతారని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. అధికార బీజేపీ, మరో ప్రతిపక్షం కాంగ్రెస్‌లు సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ పాలనపై వ్యతిరేకత తమకు బాగా కలిసొస్తుందని చెబుతున్న కాంగ్రెస్.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్వరాష్ట్రం కావడంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇక ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి సీనియర్లు దృష్టి సారించిన కర్ణాటక ఎన్నికల్లో.. గెలుపు తమదేనన్న ప్రకటించుకుంటోంది బీజేపీ. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ప్రధాని మోదీ పలుమార్లు పర్యటించారు. పైగా 2024 సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకునే ఉద్దేశంలో ఉంది బీజేపీ. ఇదీ చదవండి: ఆత్మ విశ్వాసం.. ఆత్మ గౌరవం.. అసంతృప్తి చెరిపేయడం.. ఎవరికో? -
తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారికి గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి తరలివచ్చి ఏపీలో స్థిర నివాసముంటున్న వారికి విద్య, ఉద్యోగాలకు సంబంధించి మరో మూడేళ్ల పాటు స్థానికత కల్పించేందుకు గత ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర విభజన అనతరం తెలంగాణ నుంచి ఏపీకి తరలి వచి్చన వారికి విద్య, ఉద్యోగాలకు సంబంధించి ఏడేళ్ల పాటు స్థానికత కల్పిస్తూ 2014లో రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఏడేళ్ల గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఏడేళ్లకు బదులు పదేళ్లుగా సవరణలు చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 1974 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయగా.. ఉద్యోగుల స్థానికతకు సంబంధించి 1975నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్)లో సవరణలు చేస్తూ తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి స్థిరపడిన వారికి డైరెక్ట్ రిక్రూట్మెంట్లలో మరో మూడేళ్ల పాటు స్థానికత కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్(రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్లు)లో సవరణలు చేస్తూ.. విద్యా సంస్థల ప్రవేశాల్లో మరో మూడేళ్ల పాటు స్థానికత కల్పించారు. చదవండి: (కర్నూలులో రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఆస్పత్రి) -
Telangana: కొలువులకు ‘కొత్త’ సంకటం
వరంగల్ జిల్లా పోచమ్మ మైదాన్‌కు చెందిన గోపి రెండో తరగతి వరకు ఇంటి పక్కనున్న పాఠశాలలో చదివాడు. మంచి స్కూల్లో ఇంగ్లిష్ మీడియం చదివించాలని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నయీంనగర్‌లోని ప్రైవేటు పాఠశాలలో గోపిని తండ్రి చేర్పించాడు. అతను 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. ఇప్పుడు పునర్విభజనలో నయీంనగర్ హన్మకొండ జిల్లాలో భాగమవడం, గోపి ఒకటి నుంచి 7వ తరగతిలో ఎక్కువ సంవత్సరాలు నయీంనగర్‌లో చదువుకోవడంతో అతని స్థానికత హన్మకొండ అయింది. ఎల్బీనగర్కు చెందిన సృజన్ కుమార్ ఒకటి నుంచి మూడో తరగతి వరకు ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో, 4 నుంచి 10వ తరగతి వరకు ఉప్పల్‌లోని మరో ప్రైవేటు పాఠశాలలో చదివాడు. ఇంతకుముందు వరకు సృజన్‌ది రంగారెడ్డి జిల్లా స్థానికత. కానీ జిల్లాల పునర్విభజనతో రంగారెడ్డిని 3 జిల్లాలు చేశారు. సృజన్ పాఠశాల విద్యను ఎక్కువ సంవత్సరాలు మేడ్చల్ జిల్లాలో చదవడంతో ఆ జిల్లా స్థానికుడయ్యాడు. ఇక అతను ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే మేడ్చల్ జిల్లాలోని పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలి. పుట్టిపెరిగిన రంగారెడ్డి జిల్లాలో 5 శాతం ఓపెన్ కేటగిరీ కోటా కింద దరఖాస్తు చేసుకోవాలి. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో 80,039 ఉద్యోగ ఖాళీలున్నట్లు సీఎం కేసీఆర్ 4 రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇందులో జిల్లా కేడర్‌లోని పోస్టులు 39,829. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం రావడంతో జిల్లా కేడర్ పోస్టుల భర్తీలో స్థానిక, ఓపెన్ కేటగిరీ నిష్పత్తి 95:5గా నిర్ధారించారు. ఈ క్రమంలో జిల్లా కేడర్‌లోకి వచ్చే 39,829 పోస్టుల్లో 95 శాతం స్థానిక అభ్యర్థులతో భర్తీ చేయాలి. కొత్త జోనల్ విధానంతో స్థానిక అభ్యర్థులకు అత్యధిక అవకాశాలు పెరుగుతున్నా ఇప్పుడు స్థానికత తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. జిల్లాల పునర్విభజనతో అభ్యర్థుల స్థానికత మారింది. కొత్త జిల్లాల సరిహద్దుల్లోని మెజార్టీ అభ్యర్థులకు ఈ సమస్య ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పుట్టి, పెరిగిన జిల్లాలో స్థానిక కోటాలో దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో పలువురు అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. స్థానికత ఇలా.. అభ్యర్థి స్థానికతను నిర్ణయించడంలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ ఏడేళ్లు ఒకేచోట చదవకుంటే ఎక్కువ తరగతులు ఎక్కడ చదివాడో ఆ ప్రాంతం స్థానికతలోకి వస్తాడు. ఈ లెక్కన ఒకటి నుంచి ఏడో తరగతి వరకు గరిష్టంగా నాలుగేళ్లు ఎక్కడ చదువుకుంటే ఆ జిల్లా స్థానికత పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం జిల్లా స్థాయి ఉద్యోగాలన్నీ స్థానికత ప్రకారమే భర్తీ చేస్తారు. దీంతో స్థానికత ధ్రువీకరణకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. పట్టణ ప్రాంతంతో గజిబిజి రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలను 33 జిల్లాలుగా ప్రభుత్వం విభజించింది. ఇందులో హైదరాబాద్ జిల్లా మినహా మిగతా 9 జిల్లాలు 32 జిల్లాలుగా మార్పు చెందాయి. ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో స్థానికతకు ప్రాధాన్యమిస్తూ నియామకాలు చేపట్టే క్రమం తీవ్ర గందరగోళాన్ని కలిగిస్తోంది. చాలా జిల్లాల్లో పట్టణ ప్రాంతాలను విభజించడంతో స్థానికత సందిగ్ధంలో పడింది. ఉమ్మడి జిల్లా కేంద్రాలకు దగ్గర్లోని పట్టణ ప్రాంతాల్లో కొంత భాగం ఓ జిల్లాలో, మరికొంత భాగం మరో జిల్లాలో చేర్చారు. కొన్నిచోట్ల నగర ప్రాంతాన్ని ఓ జిల్లాగా, గ్రామీణ ప్రాంతాన్ని మరో జిల్లాగా ఏర్పాటు చేశారు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాను 3 జిల్లాలుగా విభజించారు. ఇందులో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మెజార్టీ భాగం పట్టణ ప్రాంతం కావడంతో ఈ రెండు జిల్లాల్లో చాలా మంది అభ్యర్థుల స్థానికతలో మార్పులు జరుగుతున్నాయి. వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మహబూబ్‌నగర్–నారాయణపేట, వనపర్తి–గద్వాల, కరీంనగర్–పెద్దపల్లి జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు అనేకం. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు ఉండటం.. దూరం నుంచి వచ్చి పట్టణ çప్రాంతాల్లో చదువుకోవడంతో స్థానికతలో మార్పులు జరుగుతున్నాయి. -
రెండు రాష్ట్రాల్లోనూ నాన్ లోకల్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఓవైపు వైద్యుల కొరత వేధిస్తుండగా, మరోవైపు స్పెషలిస్టు వైద్యులు ‘స్థానికత’ కారణంగా ఉద్యోగాలు పొందలేక తీవ్రంగా నష్టపోయారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చాక దరఖాస్తు చేసుకుంటే మీరు స్థానికులు కాదంటూ ఏపీ ప్రభుత్వం తిరస్కరించడంతో వైద్యులు కంగుతిన్నారు. రాష్ట్రం విడిపోయాక రెండేళ్లలోపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారందరినీ స్థానికులుగానే గుర్తిస్తామంటూ అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఇప్పుడేమో పదేళ్ల నుంచి ఏపీలో ఉంటూ ఇక్కడే చదువుకున్నా.. ప్రాథమిక విద్య తెలంగాణలో చదివారనే సాకుతో ఉద్యోగాలు ఇవ్వకుండా తిరస్కరించారు. ‘స్థానికత’పై ప్రభుత్వ ఉన్నతాధికారులెవరూ సమాధానం చెప్పడానికి ఇష్టపడటం లేదని నష్టపోయిన వైద్య అభ్యర్థులు వాపోతున్నారు. 8 వరకూ తెలంగాణలో.. ఆ తర్వాత ఏపీలో రాష్ట్రం విడిపోకముందు చాలామంది అభ్యర్థులు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ హైదరాబాద్‌లో, 9వ తరగతి నుంచి పీజీ వైద్య విద్య వరకూ ఏపీలో చదువుకున్నారు. తెలంగాణలో అక్కడి ప్రభుత్వం డాక్టరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకుంటే ఇలాంటి వారు స్థానికేతరులు(నాన్‌లోకల్) అవుతారని తేల్చిచెప్పింది. ఏపీలో కూడా నాన్‌లోకలే అంటున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఎక్కడ ఎక్కువ రోజులు చదివితే అక్కడే స్థానికులవుతారు. కానీ, తెలంగాణలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రెసిడెన్సీ సర్టిఫికెట్, మైగ్రేషన్ సర్టిఫికెట్, స్థానిక చిరునామాతో ఆధార్‌కార్డు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే మీరు 8వ తరగతి వరకూ తెలంగాణలో చదివారు కాబట్టి ఈ రాష్ట్రంలో మీరు స్థానికేతరులే అంటున్నారు. వాస్తవానికి వీళ్లు ఏపీలో పుట్టిపెరిగిన వారే. కాకపోతే తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడం వల్ల అక్కడ ప్రాథమిక విద్య అభ్యసించారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో 1,200కు పైగా పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 1,471 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండు రాష్ట్రాల్లో చదువుకున్న వైద్య అభ్యర్థుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారింది. రెండేళ్లలోపు వస్తే స్థానికులు 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగింది. విభజన అనంతరం మూడేళ్లలోపు ఏపీకి వచ్చిన వారిని స్థానికులుగా పరిగణిస్తారని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత మళ్లీ రెండేళ్లు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో 2019 జూన్ 1వ తేదీలోగా లోకల్ స్టేటస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో చదువుతున్న లేదా ఉద్యోగాలు చేస్తున్న వారు ఏపీకి వచ్చి స్థానికతకు దరఖాస్తు చేసుకోవచ్చని మాత్రమే పేర్కొంది. తెలంగాణలో కొన్నాళ్లు చదువుకుని, విభజనకు ముందే వచ్చి ఏపీలో స్థిరపడిన వారి విషయంలో కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అందుకే విభజనకు ముందు ఉన్న ఉత్తర్వుల ప్రకారం వీళ్ల విషయంలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఎక్కడ ఎక్కువ కాలం చదివి ఉంటే అక్కడే వారిని స్థానికులుగా పరిగణిస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. 1,700 మందికి ఒక డాక్టరే ఆంధ్రప్రదేశ్‌లో జనాభాకు సరిపడా సంఖ్యలో వైద్యులు లేరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టరు ఉండాలి. కానీ, ఏపీలో 1,700 మందికి ఒక డాక్టరు మాత్రమే ఉన్నారు. పొరుగు రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గానే ఉంది. నాకన్నా వెనకున్న వారికి ఉద్యోగం వచ్చింది ‘‘నేను 8వ తరగతి వరకూ హైదరాబాద్‌లో చదువుకున్నా. 9వ తరగతి నుంచి పీజీ వైద్యం వరకూ ఏపీలో చదివా. బీసీ–డి వర్గానికి చెందిన నేను ఏపీలో ప్రభుత్వ వైద్యకళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేస్తే నన్ను నాన్‌లోకల్ అంటున్నారు. హైదరాబాద్‌లో దరఖాస్తు చేసుకుంటే ఆధార్, రెసిడెన్స్, మైగ్రేషన్ సర్టిఫికెట్లు తెలంగాణలో ఉన్నట్టు తీసుకురమ్మంటున్నారు. ఏపీలో దరఖాస్తు చేసుకుంటే నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురు అభ్యర్థులకు ఉద్యోగం వచ్చింది. నన్ను నాన్‌లోకల్ అని చెప్పడంతో ఉద్యోగం కోల్పోయా. – డా.మంజూ యాదవ్, వైఎస్సార్ జిల్లా నేను ఏ రాష్ట్రానికి చెందుతానో.. ‘‘నేను 7వ తరగతి వరకూ హైదరాబాద్‌లో చదువుకున్నా. ఆ తర్వాత కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో చదివా. పీజీ వైద్యం (జనరల్ సర్జరీ) తిరుపతిలో చేశాను. ఏపీలో దరఖాస్తు చేసుకుంటే నన్ను నాన్‌లోకల్ అన్నారు. దీనిపై అధికారులను కలిస్తే తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. అసలు నేను ఏ రాష్ట్రానికి చెందిన వాడినో గుర్తించకపోవడం దారుణం. ప్రభుత్వం ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. – డా.కె.సుబ్రహ్మణ్యం, నెల్లూరు ప్రభుత్వమే పరిష్కరించాలి ‘‘ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వమే చొరవ తీసుకుని పరిష్కరించాలి. ఎంతో కష్టపడితే గానీ పీజీ వైద్యులు కాలేరు. వారు ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే మీరు మా రాష్ట్రం కాదంటే ఎక్కడికి వెళతారు? వీరంతా ఈ రాష్ట్రంలో పుట్టిపెరిగిన వాళ్లే. తల్లిదండ్రుల వృత్తి, ఉద్యోగం రీత్యా తెలంగాణకు వెళ్లారు. వారిని ఇక్కడే స్థానికులుగా గుర్తించాలి’’ – డా.జయధీర్, కన్వీనర్, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘంప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారమే చేశాం ‘‘రాష్ట్రపతి ఉత్తర్వులనే అమలు చేశాం. ఏ రాష్ట్రంలో చదివినా సరే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఎక్కడ ఎక్కువ కాలం చదువుకుని ఉంటే ఆ రాష్ట్రంలోనే స్థానికులవుతారు. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియలోనూ ఇదే నిబంధనను అమలు చేశాం’’ – అరుణాదేవి, జాయింట్ డైరెక్టర్, వైద్యవిద్యా శాఖ -
స్థానికతపై స్పష్టత అవసరం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్ వ్యవస్థ గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న స్థానికత విషయంలో మరింత స్పష్టత అవసరమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ ఇచ్చిన ఉత్తర్వుల్లోని అంశాలపై న్యాయవాదులు, ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత మరింత లోతుగా మాట్లాడుతానన్నారు. 95% స్థానిక రిజర్వేషన్ మంచిదేనన్నారు. తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరులకు గౌరవం దక్కడంలేదని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేదని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. హరికష్ణ స్మతివనానికి స్థలం కేటాయించి గౌరవించినట్లే తెలంగాణ కోసం జీవితాలను త్యాగం చేసిన కొండాలక్ష్మణ్ బాపూజీ, ప్రొఫె సర్ కేశవరావు జాదవ్, గూడ అంజన్న వంటి వారిని కూడా గౌరవించాలన్నారు. తెలంగాణ అమర వీరుల స్మారక చిహ్నం ఏర్పాటు కోసం సెప్టెంబరు 12న పార్టీ కార్యాలయంలో ఒకరోజు నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. -
ఏడేళ్లు ఎక్కడ చదివితే అక్కడే లోకల్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానికతను నిర్ధారించేందుకు 4 నుంచి 12వ తరగతి వరకు ఎక్కడ చదివారన్న అంశాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. కడియం శ్రీహరి కమిటీ సిఫారసు చేసిన విధంగా ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువును పరిగణనలోకి తీసుకోవద్దని పేర్కొంది. 4 నుంచి 12 దాకా వరుసగా ఏడేళ్ల పాటు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాకు లోకల్‌గా పరిగణించాలని సూచించింది. 4 నుంచి 12వ తరగతిని పరిగణనలోకి తీసుకునే క్రమంలో ఒకవేళ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదివితే వారి తల్లిదండ్రుల స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. బుధవారం టీఎన్జీవో భవన్లో చైర్మన్ కారెం రవీందర్‌రెడ్డి అధ్యక్షతన ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఇందులో జేఏసీ సెక్రటరీ జనరల్ వి.మమత, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ విధానం, స్థానికతపై పలు తీర్మానాలు ఆమోదించారు. అనంతరం జోనల్ విధానం ఉండాల్సిన తీరుపై ప్రతిపాదనలను సిద్ధం చేశారు. 4 జోన్ల విధానం వల్ల విద్యార్థులకు, నిరుద్యోగులకు నష్టం వాటిల్లుతుందని, కనీసం 5 జోన్లు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. 6 జోన్లు ఉన్నా ఓకేనని పేర్కొంది. పాత జిల్లా ప్రకారం ప్రస్తుతం ఉన్న రెండు జోన్లను రెండు మల్టీ జోన్లుగా చేయాలని ప్రతిపాదించింది. అలాగే అన్ని కేటగిరీల పోస్టుల్లో 80% లోకల్, 20% ఓపెన్ కేటగిరీ (రాష్ట్ర పరిధిలోని వారికే) విధానం ఉండాలని, లేదంటే 70:30 నిష్పత్తిన ఉండాలని పేర్కొంది. ఈ మేరకు వివిధ సంఘాల అభిప్రాయాలు, సమావేశ తీర్మానాలతో రూపొందించిన ప్రతిపాదనలను సమన్వయకర్త దేవీప్రసాద్‌కు జేఏసీ నేతలు అందజేశారు. వాటిపై గురువారం లేదా శుక్రవారం సీఎంతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఐదు జోన్లు ఉంటేనే సమస్యలు ఉండవని దేవీ ప్రసాద్ వద్ద జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఐదు వద్దనుకుంటే ఆరు జోన్లు చేసినా అంగీకారమేనని వెల్లడించారు. జోన్లపై ఇవీ ప్రతిపాదనలు.. జోన్లపై జేఏసీ రెండు రకాల ప్రతిపాదనలు చేసింది. ఒకటి ఐదు జోన్ల విధానం.. అది వద్దనుకుంటే ఆరు జోన్ల విధానం. ఐదు జోన్లలో.. పాత జిల్లాల ప్రకారం ఆదిలాబాద్, కరీంనగర్ ఒక జోన్‌గా, వరంగల్, ఖమ్మం ఒక జోన్‌గా, మహబూబ్‌నగర్, నల్లగొండ ఒక జోన్‌గా, మెదక్, నిజామాబాద్ ఒక జోన్‌గా, హైదరాబాద్, రంగారెడ్డి ఒక జోన్‌గా మొత్తం ఐదు జోన్లు ఉండాలి. పాత జిల్లాల పరిధిలోని ఆయా జిల్లాలన్నీ ఆయా జోన్ల పరిధిలోకి వస్తాయి. ఐదు జోన్లు వద్దనుకుంటే హైదరాబాద్ ఒక జోన్‌గా, రంగారెడ్డి మరో జోన్‌గా చేసి ఆరో జోన్లు ఏర్పాటు చేయాలి. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోని నిరుద్యోగ యువతకు సమానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఇది అవసరమని పేర్కొంది. ఇప్పుడున్న రెండూ మల్టీ జోన్లుగా... ప్రస్తుతమున్న 5వ జోన్‌ను మల్టీ జోన్–1గా చేయాలని, 6వ జోన్‌ను మల్టీ జోన్–2గా చేయాలని పేర్కొంది రాష్ట్ర స్థాయి పోస్టుల భర్తీ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉండకూడదు. పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలి. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పోస్టులుగా ఉన్న గ్రూప్–1 తరహా పోస్టులన్నీ మల్టీ జోన్ పరిధిలో నే భర్తీ చేయాలని సూచించింది. తద్వారా ఇతర రాష్ట్రాల వారిని నిరోధించవచ్చని తెలిపింది పోస్టుల భర్తీలో 70% పదోన్నతుల ద్వారా, 30% డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా చేయాలి. అవీ జిల్లా, జోన్, మల్టీ జోన్లోనే ఉండాలని పేర్కొంది జూనియర్ అసిస్టెంట్, అంతకంటే కిందిస్థాయి పోస్టులన్నీ జిల్లా స్థాయిలోనే భర్తీ చేయాలని వెల్లడించింది సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ జిల్లా కేడర్‌లో, గెజిటెడ్ హెడ్ మాస్టర్, మండల విద్యాధికారి జోనల్ కేడర్‌లో, డిప్యూటీ ఈవో మల్టీ జోన్ కేడర్‌లో, అంతకంటే పైస్థాయి పోస్టులన్నీ స్టేట్ కేడర్‌లో ఉండాలని జేఏసీ ప్రతిపాదించింది. -
నౌకరి ఈడ.. నివాసమాడ
పల్లెలో ఉద్యోగం.. పట్టణంలో నివాసం ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు స్థానికంగా నివాసముంటున్నట్లు నకిలీ పత్రాల సమర్పణ నేరడిగొండ : వారు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు.. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే గురుతర బాధ్యతలు కలిగినవారు. ప్రజలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు అందాలంటే వారిదే కీలక పాత్ర. వారే ప్రభుత్వ ఉద్యోగులు. వివిధ కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తించే చోట స్థానికంగా నివాసముండాలని ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. కానీ కొందరు ఉద్యోగులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఉద్యోగం ఒకచోట చేస్తారు. నివాసం మరోచోట ఉంటారు. దీంతో సమయానికి రారు. సక్రమంగా విధులు నిర్వర్తించరు. జనాలకు చేరువ కారు. మారని తీరు... ప్రజలకు సేవలందించడం కోసం అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలి. పనిచేసే చోటే నివాసముండాలని ప్రభుత్వం పెట్టిన నిబంధనలు జిల్లాలోని కొందరు అధికారులు తుంగలో తొక్కుతున్నారు. అధికారుల బాధ్యత, అవసరాలను గుర్తించి ప్రభుత్వం వారు పని చేసే చోటే నివాసముండాలని నిబంధనలు విధించింది. మండలంలోని 70 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కొంతమంది ఏకంగా పట్టణంలో నివసిస్తున్నారని మండలవాసులు ఆరోపిస్తున్నారు. మరికొందరు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. దీని వల్ల అవసరమైన సమయాల్లో ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో అటు జిల్లా ఉన్నతాధికారులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుసార్లు అధికారులు స్థానికంగా ఉండాలని తెలిపినా మండల అధికారుల తీరు మాత్రం మారడం లేదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తుదారులకు తిప్పలు తప్పడం లేదు. సమయపాలన అంటే..? ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న అధికారులు వాళ్లు. పని చేసే కార్యాలయాలకు సమయానికి రావడం లేదనేది కార్యాలయాల ముందు వేచి చూస్తున్న వివిధ గ్రామాల ప్రజలను చూస్తే చాలు అర్థమైపోతుంది. కొంత మంది ఉద్యోగుల తీరు మరీ విచిత్రంగా ఉంది. విధులకు సమయానికి రావడం లేదు. కానీ పని వేళ ముగియ ముందే బ్యాగులు సర్దుకుంటున్నారు. దీంతో ప్రజలకు న్యాయం జరగడం లేదు. అందరిదీ అదే దారి మండలంలో రెవెన్యూ, ప్రజా పరిషత్, వైద్య, విద్య, వ్యవసాయం, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు సుమారు 300 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధానంగా తహసీల్దార్, ఎంపీడీవో, మండల విద్యాధికారి, వైద్యాధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులంతా పట్టణంలో నివాసముంటున్నారు. సమయానికి ప్రభుత్వ కార్యాలయాలకు ఉద్యోగులు, పాఠశాలలకు ఉపాధ్యాయులు రావడం లేదన్న ఆరోపణలు గత కొద్ది రోజులుగా అధికమవుతున్నాయి. ఇంటి అద్దెలు స్వాహా.. ప్రభుత్వ ఉద్యోగులకు వారి హోదాలకనుగుణంగా ప్రభుత్వం వేల రూపాయలను ఇంటి అద్దె అందిస్తోంది. కొందరు ఉద్యోగులు స్థానికంగా ఉంటున్నట్లు రుజువులు చూపిస్తున్నా వాస్తవానికి చాలా మంది అధికారులు పట్టణాల్లోనే నివాసముంటున్నారు. దీంతో ప్రజాధనం అధిక మొత్తంలో దుర్వినియోగం అవుతోంది. అధికారులు స్థానికంగా ఉండకపోవడం వల్ల పనుల్లో జాప్యం నెలకొంటోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి మండలంలోని ప్రభుత్వ ఉద్యోగులు పని చేసే చోటే నివాసం ఉండేలా చర్యలు తీసుకుని, నిర్ణీత వేళకు విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు. -
రాజ్‌నాథ్‌సింగ్‌కు చంద్రబాబు లేఖ
-
స్థానికతకు వీలుగా 371(డి)ని సవరించండి
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఏపీ సీఎం బాబు లేఖ నేడు ప్రధాని, హోం, ఆర్థిక మంత్రులతో భేటీ నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశానికి ఢిల్లీ వెళ్లనున్న సీఎం సాక్షి, హైదరాబాద్: స్థానికతపై ఉద్యోగులు, విద్యార్థుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంగళవారం లేఖ రాశారు. తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా స్థానికతపై స్పష్టత ఇవ్వని పక్షంలో రాజధానికి తరలివెళ్లడానికి సిద్ధంగా లేమని ఉద్యోగులు తేల్చిచెప్పారు. దీంతో రాష్ట్ర విభజన జరిగిన మూడేళ్లలోపు.. అంటే 2017 జూన్ 2లోగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చే వారికి స్థానికత కల్పించడానికి వీలుగా రాజ్యాంగంలోని 371 (డి) అధికరణకు సవరణ చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రికి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. వాటిని సవరించండి.. తమ పిల్లలు విద్యా, ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాలు ఆందోళన చెందుతున్నాయని చంద్రబాబు లేఖలో తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వీలుగా ‘‘ది ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థలు (ప్రవేశాల నియంత్రణ) ఉత్తర్వు 1974లోని పేరా సంఖ్య నాలుగులో, ‘‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డెరైక్ట్ ఎంప్లాయిమెంట్)ఉత్తర్వు 1975లోని పేరా సంఖ్య ఏడులో ‘‘రాష్ర్ట విభజన దరిమిలా విభజన తేదీ నుంచి మూడేళ్లలోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చే వారు నివసించేందుకు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో ఏపీ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థాని కత కల్పిస్తారు’’ అని చేర్చాల్సిందిగా కోరారు. నేడు ఢిల్లీకి చంద్రబాబు స్వచ్ఛ భారత్‌పై నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ఉప సంఘానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న చంద్రబాబు ఉప సంఘం సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఉపసంఘం సమావేశంలో పాల్గొని అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో 3.45కు భేటీ అయి ఉపసంఘం నివేదికను అందజేస్తారు. అమరావతి నగర నిర్మాణ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానపత్రిక ఇస్తారు. తర్వాత హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి ఆరుణ్జైట్లీలతో సమావేశమవుతారు. అనుమానాలెన్నో.. ముఖ్యమంత్రి లేఖ నేపథ్యంలో స్థానికత కల్పనకు ఆధారంగా తీసుకొనే అంశాల గురించి తెలంగాణలోని ఏపీ విద్యార్థులు, నిరుద్యోగులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఏ ఇతర ప్రాం తాల్లో చదువుతున్న విద్యార్థులకు మినహాయిం పు లభిస్తుందా? లేదా? అని అనుమానాలు వ్య క్తం చేశారు. ఫలానా తేదీన ఏపీకి తరలి వచ్చారని నిర్ధారించి స్థానికత కల్పించడానికి ఎలాంటి ఆధారం ఉండాలి? తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులైతే వారి బదిలీ ఉత్తర్వుల ఆధారంగా పిల్లలకు స్థానికత కల్పిస్తారా? వంటి సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఉద్యోగుల స్థానికత నిర్ధారణకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతి కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల స్థానికతను నిర్ధారించేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం జీఓ నం. 1045 జారీ చేశారు. సచివాలయంలో సంబంధిత విభాగాల వారీగా కమిటీలు ఉంటాయి. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి ఆయా కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. విభాగాధిపతి సభ్యునిగా, కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి తరపున ఒకరు (నామినీ) సభ్యునిగా, సంబంధిత శాఖల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు/నామినీ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ లు ఉద్యోగులు తమ సర్వీసు రిజిస్టర్లలో పేర్కొన్న స్థానికత వాస్తవమా.. కాదా? అనే అంశాలను పరిశీలించి నిర్ధారించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉద్యోగులు/సంఘాల నుంచి వచ్చే అభ్యంతరాలను స్వీకరించి వారి పాఠశాల రికార్డులు/సర్వీసు రికార్డులు పరిశీలించి, చర్యలు చేపట్టేందుకు ఆయా కమిటీలు తమ సిఫారసులను ప్రభుత్వానికి అందజేయాలని స్పష్టం చేశారు. 13 వరకు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ తత్కాల్ ఫీజు గడువు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు తత్కాల్ కింద ఈనెల 13 వరకు పరీక్ష ఫీజులను చెల్లించవచ్చని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్ష ఫీజుతోపాటు తత్కాల్ ఫీజు కింద ఇంటర్‌కు రూ.1000, ఎస్సెస్సీకి రూ.500 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. -
'అలా అయితే నాకు కూడా కష్టమే'
హైదరాబాద్: ఎన్నికలకు ముందు కేసీఆర్ తెలంగాణ వారంతా స్థానికులే అన్నారని, గెలిచిన తర్వాత ఆ హామీని మరిచిపోవడం సమంజం కాదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. స్థానికతకు 1956 ప్రాతిపదిక సరికాదన్నారు. ఆ ప్రాతిపదికన తన లాంటి వారు కూడా స్థానికతను రుజువు చేసుకోవడానికి కష్టడాల్సిందేనని వాపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను ఎటువంటి మార్పులు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయాలని సుధీర్‌రెడ్డి కోరారు. 1956, నవంబర్ 1 నుంచి తెలంగాణలో ఉంటున్న వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
విద్యార్థుల సమస్యను రాజకీయం చేయొద్దు: గంటా
న్యూఢిల్లీ: 1956 స్థానికత వివాదం, ఎంసెట్ కౌన్సిలింగ్ వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. దేశరాజధానిలో రాజ్‌నాథ్‌సింగ్, అనిల్ గోస్వామి, వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీలను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యను రాజకీయం చేయొద్దు అని అన్నారు. 1956 స్థానికతకు ప్రామాణికంగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 371 డి, ఆరుసూత్రాలు నాలుగేళ్లు ఎక్కడ నివసిస్తే అక్కడే స్థానికుడిగా గుర్తించాలనే నిబంధనలున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరిస్తామని హోంమంత్రి హామీఇచ్చారని మంత్రి గంటా అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అఖిలపక్షం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.