స్థానికతకు వీలుగా 371(డి)ని సవరించండి
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్కు ఏపీ సీఎం బాబు లేఖ
నేడు ప్రధాని, హోం, ఆర్థిక మంత్రులతో భేటీ
నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశానికి ఢిల్లీ వెళ్లనున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: స్థానికతపై ఉద్యోగులు, విద్యార్థుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంగళవారం లేఖ రాశారు. తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా స్థానికతపై స్పష్టత ఇవ్వని పక్షంలో రాజధానికి తరలివెళ్లడానికి సిద్ధంగా లేమని ఉద్యోగులు తేల్చిచెప్పారు. దీంతో రాష్ట్ర విభజన జరిగిన మూడేళ్లలోపు.. అంటే 2017 జూన్ 2లోగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చే వారికి స్థానికత కల్పించడానికి వీలుగా రాజ్యాంగంలోని 371 (డి) అధికరణకు సవరణ చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రికి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
వాటిని సవరించండి..
తమ పిల్లలు విద్యా, ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాలు ఆందోళన చెందుతున్నాయని చంద్రబాబు లేఖలో తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వీలుగా ‘‘ది ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థలు (ప్రవేశాల నియంత్రణ) ఉత్తర్వు 1974లోని పేరా సంఖ్య నాలుగులో, ‘‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డెరైక్ట్ ఎంప్లాయిమెంట్)ఉత్తర్వు 1975లోని పేరా సంఖ్య ఏడులో ‘‘రాష్ర్ట విభజన దరిమిలా విభజన తేదీ నుంచి మూడేళ్లలోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చే వారు నివసించేందుకు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో ఏపీ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థాని కత కల్పిస్తారు’’ అని చేర్చాల్సిందిగా కోరారు.
నేడు ఢిల్లీకి చంద్రబాబు
స్వచ్ఛ భారత్‌పై నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ఉప సంఘానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న చంద్రబాబు ఉప సంఘం సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఉపసంఘం సమావేశంలో పాల్గొని అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో 3.45కు భేటీ అయి ఉపసంఘం నివేదికను అందజేస్తారు. అమరావతి నగర నిర్మాణ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానపత్రిక ఇస్తారు. తర్వాత హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీలతో సమావేశమవుతారు.
అనుమానాలెన్నో..
ముఖ్యమంత్రి లేఖ నేపథ్యంలో స్థానికత కల్పనకు ఆధారంగా తీసుకొనే అంశాల గురించి తెలంగాణలోని ఏపీ విద్యార్థులు, నిరుద్యోగులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లేదా తెలంగాణలోని ఏ ఇతర ప్రాం తాల్లో చదువుతున్న విద్యార్థులకు మినహాయిం పు లభిస్తుందా? లేదా? అని అనుమానాలు వ్య క్తం చేశారు. ఫలానా తేదీన ఏపీకి తరలి వచ్చారని నిర్ధారించి స్థానికత కల్పించడానికి ఎలాంటి ఆధారం ఉండాలి? తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులైతే వారి బదిలీ ఉత్తర్వుల ఆధారంగా పిల్లలకు స్థానికత కల్పిస్తారా? వంటి సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.