ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌పై నీలినీడలు | Confusion over MBBS state level counselling | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌పై నీలినీడలు

Published Fri, Sep 6 2024 4:50 AM | Last Updated on Fri, Sep 6 2024 4:50 AM

Confusion over MBBS state level counselling

స్థానికతపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాని స్పష్టత  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎంబీబీఎస్‌ రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. స్థానికతపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరింత గందరగోళం నెలకొంది. ఈ తీర్పు నేపథ్యంలో కౌన్సెలింగ్‌ నిర్వహించడం సాధ్యం కాదని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. 

స్థానికతపై కోర్టును ఆశ్రయించిన వారే కాకుండా కాళోజీ విశ్వవిద్యాలయం రూపొందించిన నాన్‌ లోకల్‌ జాబితాలో ఉన్న దాదాపు 1,100 మంది విద్యార్థులకు కొత్త మార్గదర్శకాలు అమలు చేయాలని తీర్పులో ఉందని... అందువల్ల అది తేలకుండా కౌన్సెలింగ్‌ నిర్వహించడం సాధ్యంకాదని పేర్కొన్నాయి. 

ప్రభుత్వం తీసుకొనే నిర్ణయంపైనే అంతా ఆధారపడి ఉందని తెలిపాయి. ప్రభుత్వం అప్పీలుకు వెళ్లడం ద్వారా పరిష్కారం వెతకడమో లేదా కొత్త మార్గదర్శకాలు ఖరారు చేసి అమలు చేయడమో ఇప్పుడున్న ప్రత్యామ్నాయ మార్గాలని అధికారులు అంటున్నారు. దీనివల్ల కౌన్సెలింగ్‌ మరింత ఆలస్యం కానుందని చెబుతున్నారు. 

స్థానికతపై రాజుకున్న లొల్లి... 
రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సహా ఇతర మెడికల్‌ కోర్సుల్లో స్థానికత నిర్ధారణకు ప్రభుత్వం ఈసారి మార్పులు చేసింది. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్‌ మధ్యలో ఏదైనా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగా గుర్తించేది. అయితే ఈ నిబంధన వల్ల చాలా మంది ఏపీకి చెందిన విద్యార్థులు 6–9 తరగతులు చదివినట్లు తప్పుడు సర్టిఫికెట్లు తెచ్చి తెలంగాణ స్థానికులుగా చెలామణి అవుతున్నారని ప్రభుత్వం భావించింది. 

దీనికి అడ్డుకట్ట వేసేందుకు 9, 10, ఇంటర్‌ రెండేళ్లు కలిపి మొత్తం నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదివిన వారినే స్థానికులుగా గుర్తించాలని ఉత్తర్వులు జారీచేసింది. దీంతో కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమకు అన్యాయం జరుగుతుందని కోర్టుకు వెళ్లారు. 

కౌన్సెలింగ్‌ జరిగేదెప్పుడు? 
ప్రస్తుతం 15 శాతం ఆలిండియా కోటా సీట్లు డీమ్డ్‌ వర్సిటీలు, సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఈఎస్‌ఐసీ, ఏఎఫ్‌ఎంసీ, బీహెచ్‌యూ, ఏఎంయూ సీట్లకు కౌన్సెలింగ్‌ జరుగుతోంది. తొలివిడత కౌన్సెలింగ్‌ పూర్తయింది. రెండో విడత జరుగుతోంది. వాస్తవానికి జాతీయ స్థాయిలో తొలివిడత కౌన్సెలింగ్‌ ముగిశాక రాష్ట్రస్థాయిలో తొలివిడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. 

కానీ స్థానికత అంశం కోర్టులో ఉండటంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కౌన్సెలింగ్‌ మొదలవలేదు. ఏదిఏమైనా తెలంగాణలో ఈసారి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆలస్యం కానుందని కాళోజీ వర్గాలు తెలిపాయి. మరో రెండు వారాలు కౌన్సెలింగ్‌ నిర్వహించే అవకాశం లేదని పేర్కొన్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement