నౌకరి ఈడ.. నివాసమాడ
-
పల్లెలో ఉద్యోగం.. పట్టణంలో నివాసం
-
ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు
-
స్థానికంగా నివాసముంటున్నట్లు నకిలీ పత్రాల సమర్పణ
నేరడిగొండ : వారు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు.. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే గురుతర బాధ్యతలు కలిగినవారు. ప్రజలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు అందాలంటే వారిదే కీలక పాత్ర. వారే ప్రభుత్వ ఉద్యోగులు. వివిధ కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తించే చోట స్థానికంగా నివాసముండాలని ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. కానీ కొందరు ఉద్యోగులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఉద్యోగం ఒకచోట చేస్తారు. నివాసం మరోచోట ఉంటారు. దీంతో సమయానికి రారు. సక్రమంగా విధులు నిర్వర్తించరు. జనాలకు చేరువ కారు.
మారని తీరు...
ప్రజలకు సేవలందించడం కోసం అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలి. పనిచేసే చోటే నివాసముండాలని ప్రభుత్వం పెట్టిన నిబంధనలు జిల్లాలోని కొందరు అధికారులు తుంగలో తొక్కుతున్నారు. అధికారుల బాధ్యత, అవసరాలను గుర్తించి ప్రభుత్వం వారు పని చేసే చోటే నివాసముండాలని నిబంధనలు విధించింది. మండలంలోని 70 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కొంతమంది ఏకంగా పట్టణంలో నివసిస్తున్నారని మండలవాసులు ఆరోపిస్తున్నారు. మరికొందరు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. దీని వల్ల అవసరమైన సమయాల్లో ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో అటు జిల్లా ఉన్నతాధికారులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుసార్లు అధికారులు స్థానికంగా ఉండాలని తెలిపినా మండల అధికారుల తీరు మాత్రం మారడం లేదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తుదారులకు తిప్పలు తప్పడం లేదు.
సమయపాలన అంటే..?
ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న అధికారులు వాళ్లు. పని చేసే కార్యాలయాలకు సమయానికి రావడం లేదనేది కార్యాలయాల ముందు వేచి చూస్తున్న వివిధ గ్రామాల ప్రజలను చూస్తే చాలు అర్థమైపోతుంది. కొంత మంది ఉద్యోగుల తీరు మరీ విచిత్రంగా ఉంది. విధులకు సమయానికి రావడం లేదు. కానీ పని వేళ ముగియ ముందే బ్యాగులు సర్దుకుంటున్నారు. దీంతో ప్రజలకు న్యాయం జరగడం లేదు.
అందరిదీ అదే దారి
మండలంలో రెవెన్యూ, ప్రజా పరిషత్, వైద్య, విద్య, వ్యవసాయం, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు సుమారు 300 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధానంగా తహసీల్దార్, ఎంపీడీవో, మండల విద్యాధికారి, వైద్యాధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులంతా పట్టణంలో నివాసముంటున్నారు. సమయానికి ప్రభుత్వ కార్యాలయాలకు ఉద్యోగులు, పాఠశాలలకు ఉపాధ్యాయులు రావడం లేదన్న ఆరోపణలు గత కొద్ది రోజులుగా అధికమవుతున్నాయి.
ఇంటి అద్దెలు స్వాహా..
ప్రభుత్వ ఉద్యోగులకు వారి హోదాలకనుగుణంగా ప్రభుత్వం వేల రూపాయలను ఇంటి అద్దె అందిస్తోంది. కొందరు ఉద్యోగులు స్థానికంగా ఉంటున్నట్లు రుజువులు చూపిస్తున్నా వాస్తవానికి చాలా మంది అధికారులు పట్టణాల్లోనే నివాసముంటున్నారు. దీంతో ప్రజాధనం అధిక మొత్తంలో దుర్వినియోగం అవుతోంది. అధికారులు స్థానికంగా ఉండకపోవడం వల్ల పనుల్లో జాప్యం నెలకొంటోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి మండలంలోని ప్రభుత్వ ఉద్యోగులు పని చేసే చోటే నివాసం ఉండేలా చర్యలు తీసుకుని, నిర్ణీత వేళకు విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు.