jobers
-
గుండెపోటుతో ఆర్టీసీ ఉద్యోగి మృతి
మంచిర్యాల: ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న బూసి బాపు(53) శనివారం విధులు నిర్వహిస్తుండగా మధ్యాహ్నం భోజనం తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మంచిర్యాలకు తీసుకెళ్లమని సూచించారు. వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసువెళ్లి చూపించగా వారు కూడా మంచిర్యాలకు రెఫర్ చేశారు. కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య గౌరుబాయి, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
డీఈఓ ఆఫీస్, ఎస్ఎస్ఏ ఉద్యోగుల విభజన
కలిపేసి సీనియార్టీ ప్రాతిపదికన కేటాయింపు పలువురు ఉద్యోగుల ఆందోళన విద్యారణ్యపురి : హన్మకొండలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఉద్యోగులు, సర్వశిక్షాభియాన్(ఎస్ఎస్ఏ) జిల్లా ప్రాజెక్టు ఉద్యోగులను కలిపి సీనియారిటీ ప్రాతిపదికన నాలు గు జిల్లాలకు కేటాయించారు. దీంతో కొంతమంది ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డీఈఓ కార్యాలయం, ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లను ఈనెల 26న రాత్రి డీఈఓ పీ.రాజీవ్ తన చాంబర్లోకి పిలిచి సీనియార్టీ ప్రతిపదికన పిలిచి జిల్లాలకు కేటాయించారు. అంతకుముందే సూపరింటెండెంట్లు 8 మందిని కూడా కలిపి సీనియార్టీ ప్రకారం కేటాయించారు. వరంగల్ జిల్లాను భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలుగా పునర్విభజన చేస్తున్న విషయం తెలిసిందే. డీఈఓ కార్యాలయంలోని 14 సీనియర్ అసిస్టెంట్లతోపాటు సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టులో పనిచేస్తున్న ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లు కూడా కలుపగా మొత్తం 21మంది సీనియర్ అసిస్టెంట్లతో సీనియార్టీ రూపొందించి వారిని జిల్లాలకు కేటాయిం చారు. దీంతో పలువురు ఎస్ఎస్ఏలోని సీనియర్ అసిస్టెంట్లు తమను ఎలా డీఈఓ కార్యాలయం ఉద్యోగులతో కలిపి సీనియా ర్టీ రూపొందిస్తారని, దీంతో తాము భూపాలపల్లి జిల్లాకు వెళ్లాల్సి వస్తోందని పలువురు డీఈఓ పి.రాజీవ్‌తో వాగ్వాదానికి ది గారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మౌఖిక ఆదేశాలతోనే కలిపి సీనియారిటీ ప్రాతిపదికను జిల్లాలకు కేటాయిస్తున్నామని డీఈవో పేర్కొన్నారు. అసలు సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టును డీఈవో పరిధిలోకి విలీనం చేసినట్లుగా ప్రభుత్వం నుంచి జీవో జారీ కాలేదని, ఆ రెండుశాఖల ఉద్యోగులను కలిపి సీనియారిటీ రూపొం దించాలని కూడా ఉత్తర్వులు రాలేదని, అయినా ఇలా ఎలా కేటాయిస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ఎస్ఎస్ఏను డీఈఓ పరిధిలోకి చేర్చినా కూడా అందులో పని చేసే వారిని సీనియార్టీ ప్రకారంగానే జిల్లాలకు కేటాయించాలని అన్నారు. ఈమేరకు పలువురు మహిళా ఉద్యోగులు జిల్లా కలెక్టర్ ను విన్నవించేందుకు సన్నద్ధమవుతున్నా రు. ఈ విషయంపై మంగళవారం ‘సాక్షి’ డీఈవో పి.రాజీవ్‌ను వివరణ కోరగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మౌఖిక ఆదేశాల మేరకు రెండు రకాలుగా ఉద్యోగులను విభజించి జిల్లాలకు సీనియారిటీ ప్రాతిపదికను కేటాయిస్తూ వారి పేర్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల సీనియార్టీ ప్రాతిపదికన జిల్లాలను కేటాయిస్తూ ఒక జాబితా, డీఈఓ కార్యాలయం, ఎస్ఎస్ఏలోని ఉద్యోగులను కలిపి సీని యార్టీ ప్రతిపదికన మరో జాబితా రూపొం దించి ప్రభుత్వానికి ప్రతిపాదించామని తెలి పారు. వీటిలో దేన్ని అమలు చేస్తారో వేచి చూడాలని తెలిపారు. పలుమార్లు వీడియో కాన్ఫరెన్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టును డీఈవో పరిధిలోకే విలీనం చేస్తారని చెప్పారని పేర్కొన్నారు. అందుకే రెండూ కలిపి సినియారిటీ ప్రాతిపదిన కేటాయించామన్నారు. -
ఎన్టీపీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయం
హెచ్ఎంఎస్ ప్రధానకార్యదర్శి సీహెచ్.ఉపేందర్ ఐక్యఫ్రంట్ విజయానికి సహకరించాలని వినతి 6న హోంమంత్రి నాయిని ప్రచారం జ్యోతినగర్ : ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగుల సమస్యల సాధనే ధ్యేయంగా ఎన్నికలలో ఐక్య ఫ్రంట్ పేరుతో యూనియన్లను కలుపుకుని విజయం దిశగా ముందుకుసాగుతున్నామని ఎన్టీపీసీ డెమోక్రటిక్ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్ఎంఎస్) ప్రధాన కార్యదర్శి సీహెచ్.ఉపేందర్ అన్నారు. పీటీఎస్‌లో ఐక్యఫ్రంట్ కూటమి శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఐఎన్టీయూసీ యూనియన్ కాంట్రాక్టు కంపెనీగా మారిందన్నారు. సమస్యలను సాధించకుండా ఉన్న హక్కులను పోగొట్టిన ఘనత ఆ యూనియన్‌కే దక్కిందని పేర్కొన్నారు. ఈనెల 13న ఉద్యోగ గుర్తింపు ఎన్నికల్లో ఐక్యఫ్రంట్‌ను గెలిపించాలని కోరారు. సీఐటీయూ జాతీయ నాయకులు, ఎన్బీసీ సభ్యుడు దేవరాయ్ నేతృత్వంలో ఉద్యోగులకు మెరుగైన వేతన ఒప్పందం కుదరడానికి ఐక్యఫ్రంట్ కృషి చేస్తుందని తెలిపారు. ఐక్యఫ్రంట్ ఎన్నికల గుర్తు స్కూటర్‌పై ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈనెల 6న తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి రామగుండంలో ప్రచారం చేస్తారని తెలిపారు. బీఎంఎస్, ఐఎన్టీయూసీ నాయకులు వ్యక్తిగత ఆరోపణలు మానకుంటే ఉద్యోగులే వారికి గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో సీఐటీయూ అనుబంధ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కనకరాజు, మాధవరావు, హెచ్ఎంఎస్కు చెందిన గోపాల్, రాంరెడ్డి, హన్మంతరావు, మొగురం గట్టయ్య, గోపాల్‌రెడ్డి, తిరుపతి, సత్యనారాయణగౌడ్, సాగికిషన్రావు, కంది రాజేశం, చంద్రయ్య, రవికుమార్, రమేష్, శామ్యూల్ జిప్స్ తదితరులు పాల్గొన్నారు. -
నౌకరి ఈడ.. నివాసమాడ
పల్లెలో ఉద్యోగం.. పట్టణంలో నివాసం ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు స్థానికంగా నివాసముంటున్నట్లు నకిలీ పత్రాల సమర్పణ నేరడిగొండ : వారు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు.. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే గురుతర బాధ్యతలు కలిగినవారు. ప్రజలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు అందాలంటే వారిదే కీలక పాత్ర. వారే ప్రభుత్వ ఉద్యోగులు. వివిధ కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తించే చోట స్థానికంగా నివాసముండాలని ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. కానీ కొందరు ఉద్యోగులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఉద్యోగం ఒకచోట చేస్తారు. నివాసం మరోచోట ఉంటారు. దీంతో సమయానికి రారు. సక్రమంగా విధులు నిర్వర్తించరు. జనాలకు చేరువ కారు. మారని తీరు... ప్రజలకు సేవలందించడం కోసం అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలి. పనిచేసే చోటే నివాసముండాలని ప్రభుత్వం పెట్టిన నిబంధనలు జిల్లాలోని కొందరు అధికారులు తుంగలో తొక్కుతున్నారు. అధికారుల బాధ్యత, అవసరాలను గుర్తించి ప్రభుత్వం వారు పని చేసే చోటే నివాసముండాలని నిబంధనలు విధించింది. మండలంలోని 70 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కొంతమంది ఏకంగా పట్టణంలో నివసిస్తున్నారని మండలవాసులు ఆరోపిస్తున్నారు. మరికొందరు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. దీని వల్ల అవసరమైన సమయాల్లో ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో అటు జిల్లా ఉన్నతాధికారులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుసార్లు అధికారులు స్థానికంగా ఉండాలని తెలిపినా మండల అధికారుల తీరు మాత్రం మారడం లేదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తుదారులకు తిప్పలు తప్పడం లేదు. సమయపాలన అంటే..? ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న అధికారులు వాళ్లు. పని చేసే కార్యాలయాలకు సమయానికి రావడం లేదనేది కార్యాలయాల ముందు వేచి చూస్తున్న వివిధ గ్రామాల ప్రజలను చూస్తే చాలు అర్థమైపోతుంది. కొంత మంది ఉద్యోగుల తీరు మరీ విచిత్రంగా ఉంది. విధులకు సమయానికి రావడం లేదు. కానీ పని వేళ ముగియ ముందే బ్యాగులు సర్దుకుంటున్నారు. దీంతో ప్రజలకు న్యాయం జరగడం లేదు. అందరిదీ అదే దారి మండలంలో రెవెన్యూ, ప్రజా పరిషత్, వైద్య, విద్య, వ్యవసాయం, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు సుమారు 300 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధానంగా తహసీల్దార్, ఎంపీడీవో, మండల విద్యాధికారి, వైద్యాధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులంతా పట్టణంలో నివాసముంటున్నారు. సమయానికి ప్రభుత్వ కార్యాలయాలకు ఉద్యోగులు, పాఠశాలలకు ఉపాధ్యాయులు రావడం లేదన్న ఆరోపణలు గత కొద్ది రోజులుగా అధికమవుతున్నాయి. ఇంటి అద్దెలు స్వాహా.. ప్రభుత్వ ఉద్యోగులకు వారి హోదాలకనుగుణంగా ప్రభుత్వం వేల రూపాయలను ఇంటి అద్దె అందిస్తోంది. కొందరు ఉద్యోగులు స్థానికంగా ఉంటున్నట్లు రుజువులు చూపిస్తున్నా వాస్తవానికి చాలా మంది అధికారులు పట్టణాల్లోనే నివాసముంటున్నారు. దీంతో ప్రజాధనం అధిక మొత్తంలో దుర్వినియోగం అవుతోంది. అధికారులు స్థానికంగా ఉండకపోవడం వల్ల పనుల్లో జాప్యం నెలకొంటోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి మండలంలోని ప్రభుత్వ ఉద్యోగులు పని చేసే చోటే నివాసం ఉండేలా చర్యలు తీసుకుని, నిర్ణీత వేళకు విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు.