పీజీ మెడికల్‌ ప్రవేశాలకు ‘స్థానికత’ బ్రేక్‌ | Break for PG medical admissions | Sakshi
Sakshi News home page

పీజీ మెడికల్‌ ప్రవేశాలకు ‘స్థానికత’ బ్రేక్‌

Published Fri, Nov 22 2024 4:42 AM | Last Updated on Fri, Nov 22 2024 4:42 AM

Break for PG medical admissions

ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ చదివిన తెలంగాణ విద్యార్థులు స్థానికేతరులే అంటున్న కాళోజీ వర్సిటీ

ప్రతిష్టాత్మక ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చదివినా స్థానిక పీజీ అడ్మిషన్లలో స్థానికేతరులే! 

కోర్టును ఆశ్రయించిన విద్యార్థులు.. నిలిచిపోయిన కౌన్సెలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: పీజీ మెడికల్‌ అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. స్థానికత వివాదంపై విద్యార్థులు కోర్టుకు ఎక్కడంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. కోర్టు కేసు తేలాకే ప్రవేశాలుంటాయని కాళోజీ వర్సిటీ స్పష్టం చేసింది. తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేస్తే వారు తెలంగాణలో జరిగే పీజీ మెడికల్‌ అడ్మిషన్లలో స్థానికేతరులు అవుతుండటంతో వివాదం నెలకొంది. 

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించిన పీజీ మెడికల్‌ నోటిఫికేషన్‌ ప్రకారం స్థానిక అభ్యర్థి అంటే వరుసగా నాలుగు సంవత్సరాలకు తక్కువ కాకుండా తెలంగాణలో చదివి ఉండాలి. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో చదివిన రాష్ట్ర విద్యార్థులు కూడా స్థానికులే అవుతారని వర్సిటీ పేర్కొంది. 

ఈ విధానం వల్ల తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. వారు ఎక్కడా స్థానికులు కాని పరిస్థితి నెలకొంటోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నీట్‌ పరీక్ష రాసిన విద్యార్థుల్లో టాప్‌ ర్యాంకర్లు ఎక్కువగా జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్‌లో చేరుతున్నారు. అలా జాతీయ విద్యాసంస్థల్లో చదివిన వారు రాష్ట్రంలో పీజీ మెడికల్‌ అడ్మిషన్లలో అన్యాయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారు కోర్టును ఆశ్రయించారు. 

ఇక కౌన్సెలింగ్‌ తరువాయి అనగా.. 
ఈ ఏడాది పీజీ మెడికల్‌ అడ్మిషన్ల ప్రక్రియ బాగా ఆలస్యమైంది. ఎట్టకేలకు గత నెలాఖరున 2024–25 సంవత్సరానికి కనీ్వనర్‌ కోటా కింద ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి వర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాళోజీ వర్సిటీకి, నిమ్స్‌కు అనుబంధంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

నీట్‌ పీజీ–2024లో అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి గత నెల 31 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించారు. వెంటనే కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా.. ‘స్థానికత’నిబంధనపై అభ్యర్థులు కోర్టుకు ఎక్కడంతో నిలిచిపోయింది. కోర్టు కేసు తేలాకే తదుపరి ప్రక్రియ జరుగుతుందని కాళోజీ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ జాప్యం కేవలం ప్రవేశాలు పొందే విద్యార్థులకే కాకుండా... ప్రస్తుతం మొదటి సంవత్సరం కోర్సు పూర్తి చేసిన పీజీ విద్యార్థులకు సైతం ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. జూనియర్లు ప్రవేశాలు పొందితే తప్ప వారు అక్కడ్నుంచి రిలీవ్‌ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. 

50% జాతీయ కోటాతోనూ అన్యాయం! 
స్థానిక కోటాతోపాటు తెలంగాణ విద్యార్థులకు నేషనల్‌ పూల్‌ కింద జాతీయ స్థాయికి వెళ్లే సీట్లలోనూ అన్యాయం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో 26 ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 2,800 పీజీ మెడికల్‌ సీట్లున్నాయి. అందులో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని సీట్లలో 50 శాతం జాతీయ కోటా కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. 

మిగిలిన వాటిని తెలంగాణ వాసులకు కేటాయిస్తారు. ఈ క్రమంలో జాతీయ కోటా కిందకు దాదాపు 600 సీట్లు వెళ్తాయి. ఇంత పెద్ద సంఖ్యలో సీట్లను జాతీయ కోటా నింపుతుండటంపై రాష్ట్ర విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కడ ఎక్కువగా అవకాశం పొందుతున్నారని వారంటున్నారు. 

ఎంబీబీఎస్‌లో నేషనల్‌ పూల్‌ కింద ప్రభుత్వ సీట్లలో 15 శాతం జాతీయ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తుండగా, పీజీ మెడికల్‌ సీట్లలో మాత్రం ఏకంగా సగం కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. జాతీయ కోటాలో నింపే మన రాష్ట్రంలోని 600 పీజీ మెడికల్‌ సీట్లలో దాదాపు 300 ఇతర రాష్ట్రాల వారే దక్కించుకుంటున్నారని కాళోజీ వర్సిటీ వర్గాలు సైతం చెబుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement