ఉద్యోగుల స్థానికత నిర్ధారణకు కమిటీ | a committe for deciding locality of employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల స్థానికత నిర్ధారణకు కమిటీ

Published Wed, Apr 8 2015 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

a committe for deciding locality of employees

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతి కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల స్థానికతను నిర్ధారించేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం జీఓ నం. 1045 జారీ చేశారు. సచివాలయంలో సంబంధిత విభాగాల వారీగా కమిటీలు ఉంటాయి. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి ఆయా కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. విభాగాధిపతి సభ్యునిగా, కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి తరపున ఒకరు (నామినీ) సభ్యునిగా, సంబంధిత శాఖల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు/నామినీ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ లు ఉద్యోగులు తమ సర్వీసు రిజిస్టర్లలో పేర్కొన్న స్థానికత వాస్తవమా.. కాదా? అనే అంశాలను పరిశీలించి నిర్ధారించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.  ఉద్యోగులు/సంఘాల నుంచి వచ్చే అభ్యంతరాలను స్వీకరించి వారి పాఠశాల రికార్డులు/సర్వీసు రికార్డులు పరిశీలించి, చర్యలు చేపట్టేందుకు ఆయా కమిటీలు తమ సిఫారసులను ప్రభుత్వానికి అందజేయాలని స్పష్టం చేశారు.
 
13 వరకు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ తత్కాల్ ఫీజు గడువు
ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు తత్కాల్ కింద ఈనెల 13 వరకు పరీక్ష ఫీజులను చెల్లించవచ్చని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్ష ఫీజుతోపాటు తత్కాల్ ఫీజు కింద ఇంటర్‌కు రూ.1000, ఎస్సెస్సీకి రూ.500 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement