సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఓవైపు వైద్యుల కొరత వేధిస్తుండగా, మరోవైపు స్పెషలిస్టు వైద్యులు ‘స్థానికత’ కారణంగా ఉద్యోగాలు పొందలేక తీవ్రంగా నష్టపోయారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చాక దరఖాస్తు చేసుకుంటే మీరు స్థానికులు కాదంటూ ఏపీ ప్రభుత్వం తిరస్కరించడంతో వైద్యులు కంగుతిన్నారు. రాష్ట్రం విడిపోయాక రెండేళ్లలోపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారందరినీ స్థానికులుగానే గుర్తిస్తామంటూ అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఇప్పుడేమో పదేళ్ల నుంచి ఏపీలో ఉంటూ ఇక్కడే చదువుకున్నా.. ప్రాథమిక విద్య తెలంగాణలో చదివారనే సాకుతో ఉద్యోగాలు ఇవ్వకుండా తిరస్కరించారు. ‘స్థానికత’పై ప్రభుత్వ ఉన్నతాధికారులెవరూ సమాధానం చెప్పడానికి ఇష్టపడటం లేదని నష్టపోయిన వైద్య అభ్యర్థులు వాపోతున్నారు.
8 వరకూ తెలంగాణలో.. ఆ తర్వాత ఏపీలో
రాష్ట్రం విడిపోకముందు చాలామంది అభ్యర్థులు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ హైదరాబాద్‌లో, 9వ తరగతి నుంచి పీజీ వైద్య విద్య వరకూ ఏపీలో చదువుకున్నారు. తెలంగాణలో అక్కడి ప్రభుత్వం డాక్టరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకుంటే ఇలాంటి వారు స్థానికేతరులు(నాన్‌లోకల్) అవుతారని తేల్చిచెప్పింది. ఏపీలో కూడా నాన్‌లోకలే అంటున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఎక్కడ ఎక్కువ రోజులు చదివితే అక్కడే స్థానికులవుతారు. కానీ, తెలంగాణలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రెసిడెన్సీ సర్టిఫికెట్, మైగ్రేషన్ సర్టిఫికెట్, స్థానిక చిరునామాతో ఆధార్‌కార్డు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే మీరు 8వ తరగతి వరకూ తెలంగాణలో చదివారు కాబట్టి ఈ రాష్ట్రంలో మీరు స్థానికేతరులే అంటున్నారు. వాస్తవానికి వీళ్లు ఏపీలో పుట్టిపెరిగిన వారే. కాకపోతే తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడం వల్ల అక్కడ ప్రాథమిక విద్య అభ్యసించారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో 1,200కు పైగా పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 1,471 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండు రాష్ట్రాల్లో చదువుకున్న వైద్య అభ్యర్థుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారింది.
రెండేళ్లలోపు వస్తే స్థానికులు
2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగింది. విభజన అనంతరం మూడేళ్లలోపు ఏపీకి వచ్చిన వారిని స్థానికులుగా పరిగణిస్తారని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత మళ్లీ రెండేళ్లు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో 2019 జూన్ 1వ తేదీలోగా లోకల్ స్టేటస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో చదువుతున్న లేదా ఉద్యోగాలు చేస్తున్న వారు ఏపీకి వచ్చి స్థానికతకు దరఖాస్తు చేసుకోవచ్చని మాత్రమే పేర్కొంది. తెలంగాణలో కొన్నాళ్లు చదువుకుని, విభజనకు ముందే వచ్చి ఏపీలో స్థిరపడిన వారి విషయంలో కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అందుకే విభజనకు ముందు ఉన్న ఉత్తర్వుల ప్రకారం వీళ్ల విషయంలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఎక్కడ ఎక్కువ కాలం చదివి ఉంటే అక్కడే వారిని స్థానికులుగా పరిగణిస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
1,700 మందికి ఒక డాక్టరే
ఆంధ్రప్రదేశ్‌లో జనాభాకు సరిపడా సంఖ్యలో వైద్యులు లేరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టరు ఉండాలి. కానీ, ఏపీలో 1,700 మందికి ఒక డాక్టరు మాత్రమే ఉన్నారు. పొరుగు రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గానే ఉంది.
నాకన్నా వెనకున్న వారికి ఉద్యోగం వచ్చింది
‘‘నేను 8వ తరగతి వరకూ హైదరాబాద్‌లో చదువుకున్నా. 9వ తరగతి నుంచి పీజీ వైద్యం వరకూ ఏపీలో చదివా. బీసీ–డి వర్గానికి చెందిన నేను ఏపీలో ప్రభుత్వ వైద్యకళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేస్తే నన్ను నాన్‌లోకల్ అంటున్నారు. హైదరాబాద్‌లో దరఖాస్తు చేసుకుంటే ఆధార్, రెసిడెన్స్, మైగ్రేషన్ సర్టిఫికెట్లు తెలంగాణలో ఉన్నట్టు తీసుకురమ్మంటున్నారు. ఏపీలో దరఖాస్తు చేసుకుంటే నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురు అభ్యర్థులకు ఉద్యోగం వచ్చింది. నన్ను నాన్‌లోకల్ అని చెప్పడంతో ఉద్యోగం కోల్పోయా.
– డా.మంజూ యాదవ్, వైఎస్సార్ జిల్లా
నేను ఏ రాష్ట్రానికి చెందుతానో..
‘‘నేను 7వ తరగతి వరకూ హైదరాబాద్‌లో చదువుకున్నా. ఆ తర్వాత కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో చదివా. పీజీ వైద్యం (జనరల్ సర్జరీ) తిరుపతిలో చేశాను. ఏపీలో దరఖాస్తు చేసుకుంటే నన్ను నాన్‌లోకల్ అన్నారు. దీనిపై అధికారులను కలిస్తే తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. అసలు నేను ఏ రాష్ట్రానికి చెందిన వాడినో గుర్తించకపోవడం దారుణం. ప్రభుత్వం ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి.
– డా.కె.సుబ్రహ్మణ్యం, నెల్లూరు
ప్రభుత్వమే పరిష్కరించాలి
‘‘ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వమే చొరవ తీసుకుని పరిష్కరించాలి. ఎంతో కష్టపడితే గానీ పీజీ వైద్యులు కాలేరు. వారు ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే మీరు మా రాష్ట్రం కాదంటే ఎక్కడికి వెళతారు? వీరంతా ఈ రాష్ట్రంలో పుట్టిపెరిగిన వాళ్లే. తల్లిదండ్రుల వృత్తి, ఉద్యోగం రీత్యా తెలంగాణకు వెళ్లారు. వారిని ఇక్కడే స్థానికులుగా గుర్తించాలి’’
– డా.జయధీర్, కన్వీనర్, ఏపీ ప్రభుత్వ
వైద్యుల సంఘంప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారమే చేశాం
‘‘రాష్ట్రపతి ఉత్తర్వులనే అమలు చేశాం. ఏ రాష్ట్రంలో చదివినా సరే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఎక్కడ ఎక్కువ కాలం చదువుకుని ఉంటే ఆ రాష్ట్రంలోనే స్థానికులవుతారు. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియలోనూ ఇదే నిబంధనను అమలు చేశాం’’ – అరుణాదేవి, జాయింట్ డైరెక్టర్, వైద్యవిద్యా శాఖ
Comments
Please login to add a commentAdd a comment