PG medical students
-
పీజీ వైద్య విద్యార్థులకు భారీ షాక్..
-
మరోసారి తెరపైకి ప్రీతి కేసు.. హైకోర్టు ఏం చెప్పిందంటే..
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతి కేసులో సస్పెన్షన్‌కు గురైన సీనియర్ విద్యార్థి ఎంఏ సైఫ్ అలీ వాదన వినాలని కాకతీయ మె డికల్ కాలేజీని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత అతనిపై సస్పెన్షన్ ఎత్తివేయాలా? వద్దా? అనేదానిపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ‘వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ధరావత్ ప్రీతి ఎండీ అనస్థీషియా విద్యార్ధినిగా 2022లో చేరింది. రెండో సంవత్సరం చదువుతున్న సైఫ్ ఆమెను ర్యాగింగ్ చేస్తూ వేధింపులకు గురిచేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 21న సైఫ్ తన స్నేహితులతో కలసి ప్రీతికి విషపూరిత ఇంజక్షన్ ఇచ్చారు. చికిత్స పొందుతూ ప్రీతి మృతి చెందింది. దీనికి కారకులైనవారిపై కఠినచర్యలు తీసుకోవాలి’అని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో భాగంగా సైఫ్‌ను అధికారులు అరెస్టు చే యడమే కాకుండా సస్పెండ్ చేశారు. అయితే తన వాదనలు కూడా వినకుండా సస్పెండ్ చేశారని సైఫ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సస్పెన్షన్ కొట్టివేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూరేపల్లి నందా విచారణ చేపట్టారు. సైఫ్ వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. -
‘మేలు మరిచిపోలేం..రుణపడి ఉంటాం’
సాక్షి, విజయవాడ: ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్లు ఇవ్వకుండా అడ్డుకున్న సమయంలో అండగా నిలిచిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారుల సహకారం మరువలేనిదని పీజీ మెడికల్ విద్యార్థులు అన్నారు. వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 37 రోజులుగా జీవో 56 అమలుచేయాలని ఆందోళన చేశామని, చివరకు హైకోర్టులో తమకు న్యాయం జరిగిందని విద్యార్థులు పేర్కొన్నారు. జీవో 56 తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. పీజీ మెడికల్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులంతా రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల్లో చేరామని తెలిపారు. సహకరించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి మేలు మరిచిపోలేమని తెలిపారు. -
కోవిడ్ విధుల్లో 948 మంది నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 విధుల్లోకి మరో 948 మంది మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎమ్ఎల్హెచ్పీ)లు అందుబాటులోకి రానున్నారు. ఈ నెల 10వ తేదీన వీళ్లందరూ విధుల్లో చేరాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు. ► ఈ ఏడాది జనవరిలో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన వారికి నోటిఫికేషన్ ఇచ్చి, తద్వారా అర్హత పరీక్ష రాశాక ఎంపికైన వారికి ఆరు మాసాలు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తయి విధుల్లో చేరే సమయంలోనే కరోనా వైరస్ వ్యాపించింది. ► వీళ్లందరి వేతనాలకు జాతీయ ఆరోగ్యమిషన్ నిధులిస్తుంది. దీంతో వీరిని విధుల్లోకి తీసుకోవాలా లేదా అన్న అంశంపై జాతీయ ఆరోగ్యమిషన్‌కు అధికారులు లేఖ రాశారు. లేఖకు స్పందించిన ఆరోగ్యమిషన్ అధికారులు వెంటనే వీళ్లందరినీ కోవిడ్–19 విధులకు వాడుకోవాలని సూచించారు. ► మొత్తం 948 మందిలో 120 మంది పురుషులు కాగా, 828 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ► ఏ జిల్లాకు చెందిన అభ్యర్థులు ఆ జిల్లాలోనే కోవిడ్‌కేర్ సెంటర్లలో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ► వాస్తవానికి మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సామాజిక ఆరోగ్యకేంద్రాలు, జిల్లా ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నియమిస్తారు. కోవిడ్ నేపథ్యంలో వారి సేవలు ఇలా వినియోగించుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఐఎంఏ డాక్టర్లూ కోవిడ్ విధుల్లోకి.. రాష్ట్ర వ్యాప్తంగా ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) పరిధిలో ఉన్న వైద్యులనూ కోవిడ్ విధుల్లో వినియోగించుకోవాలని సర్కారు నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖ ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఆదేశాల్లో ఏముందంటే.. ► జిల్లాలవారీగా గుర్తించిన కోవిడ్ కేర్ సెంటర్లు లేదా ఇతర ఆస్పత్రుల్లో ఆ వైద్యులను వినియోగించుకోవాలి. వైద్యుల కొరత ఉన్న చోటా వినియోగించుకోవాలి. ► జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లోని ఐఎంఏ అధ్యక్షులతో మాట్లాడి డాక్టర్ల వివరాలు తీసుకుని, వాటిని నోడల్ అధికారి లేదా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఇవ్వాలి. ► ఆ సూపరింటెండెంట్ ప్రతి డాక్టరుకూ గుర్తింపు కార్డు ఇచ్చి.. రోజుకు 8 గంటల పాటు వారం రోజులు డ్యూటీ చేయించాలి. ఆ తర్వాత వారం రోజులు వారిని క్వారంటైన్‌కు పంపాలి. ► అవసరాన్ని బట్టి వారిని ఐసీయూ, నాన్ ఐసీయూ, జనరల్ డ్యూటీలకు వినియోగించుకోవచ్చు ► పీజీ వైద్యవిద్యార్థులు, హౌస్ సర్జన్లను రాష్ట్ర లేదా జిల్లా కోవిడ్ ఆస్పత్రుల్లో నియమించాలి. ► ఇలా పీజీ వైద్యవిద్యార్థులు, హౌస్ సర్జన్లు, ఐఎంఏ డాక్టర్లు కలిపి 22 వేల మంది అందుబాటులో ఉన్నారు. తాజా పరిస్థితులను బట్టి 28 వేల మంది వైద్యుల అవసరముంటుందని అంచనా. -
పీజీ మెడికల్ విద్యార్థుల ధర్నా
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్ యూనివర్శిటీ ఎదుట పీజీ మెడికల్ విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. పీజీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను తక్షణమే చేర్చుకోవాలని ఆందోళన చేశారు. పీజీ అడ్మిషన్లు పొందినా విద్యార్థులను చేర్చుకోకుండా ప్రవేట్ మెడికల్ కళాశాలలు కోర్టు ను ఆశ్రయించాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 56 తక్షణమే అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రవేట్ మెడికల్ కాలేజీలు వాదనల పై ఈనెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. పీజీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈనెల 27 వరకు మాత్రమే కాలేజీలో చేరేందుకు గడువు ఉంది. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో పీజీ మెడికల్ ఫీజులు తగ్గించి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అండగా నిలిచిందని విద్యార్థులు తెలిపారు. -
పీజీ మెడికల్ విద్యార్థుల ధర్నా
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ)/గన్నవరం రూరల్/నెల్లూరు అర్బన్/భీమిలి/శ్రీకాకుళం రూరల్/: ప్రైవేట్ మెడికల్ కళాశాల్లో సీట్లు పొందిన పీజీ మెడికల్, డెంటల్ అభ్యర్థులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం ధర్నాలకు దిగారు. ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో పీజీ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించిన విషయం విదితమే. కాగా.. తొలివిడత సీట్లు పొందిన అభ్యర్థులు బుధవారం మధ్యాహ్నం 3గంటల్లోగా కళాశాలల్లో చేరాల్సి ఉండగా, ప్రైవేట్ కళాశాలలు చేర్చుకోలేదు. దీనిని నిరసిస్తూ వందలాది విద్యార్థులు విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ, వివిధ ప్రైవేట్ కళాశాలల ఎదుట ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొన్ని వైద్య కళాశాలలు ఎక్కువ ఫీజులు డిమాండ్ చేస్తున్నాయని.. తమకు పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించడం లేదని వాపోయారు. ► కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల యాజమాన్యం తీరును నిరసిస్తూ పీజీ సీట్లు పొందిన విద్యార్థులు ఆ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ‘జీవో–56 విద్యార్థులకు వరం.. సేవ్ జీవో–56. వెంటనే సీట్లు కేటాయించాలి’ అంటూ నినాదాలు చేశారు. ► నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలో సీట్లు పొందిన పీజీ వైద్య విద్యార్థులు తమను వెంటనే కళాశాలలో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఎదుట ధర్నా జరిపారు. యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ.. తమ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని, అప్పటివరకు సంయమనం పాటించాలని సూచించారు. ► విశాఖ జిల్లా సంగివలస ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్ ఎదుట పీజీ అడ్మిషన్లు పొందిన 31 మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. ► శ్రీకాకుళంలోని రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో పీజీ కోర్సుల్లో తమకు ప్రవేశాలు కల్పించాలంటూ వైద్య విద్యార్థులు ఫ్లెక్సీలతో కళాశాల ఎదుట ఆందోళన జరిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేశారు. ► ఏలూరు సమీపంలోని ఆశ్రం మెడికల్ కళాశాల వద్ద పెద్ద సంఖ్యలో పీజీ అభ్యర్థులు ధర్నా చేశారు. ► విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట పీజీ అడ్మిషన్లు కోరుతూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ► అభ్యర్థులతో మాట్లాడిన యూనివర్సిటీ అధికారులు కళాశాలల్లో చేరే గడువును ఈనెల 18వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటించగా.. అభ్యర్థులు వెనుదిరిగారు. -
పీజీ చేసినా కాన్పు చేయడం రాదాయే!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ గైనకాలజీ పూర్తి చేసిన అనేకమంది విద్యార్థులు కనీసం కాన్పులు చేయలేని దుస్థితి నెలకొంది. పీజీ సీటు కోసం లక్షలకు లక్షలు.. మేనేజ్మెంట్ కోటాలోనైతే కోట్లు పెట్టి గైనిక్ పూర్తిచేసినా కనీసం ప్రసవం చేస్తామన్న ఆత్మవిశ్వాసం కూడా వారిలో లేకుండా పోయింది. దీంతో అనేకమంది విద్యార్థులు కోర్సు పూర్తయిన తర్వాత ఎక్కడో ఒకచోట సీనియర్ గైనకాలజీ డాక్టర్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో అనేక ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో నెలకొంది. మరోవైపు గైనిక్ సీట్లను కాపాడుకునేందుకు ప్రసవాలు ఎక్కువగానే చేస్తున్నామంటూ ప్రైవేటు కాలేజీలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. కాన్పులు చేయలేని పరిస్థితి ఏర్పడటంతో కనీసం ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని కొందరు జూనియర్ గైనిక్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సోమవారం కొందరు గైనిక్ విద్యార్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. తమకు ఎలాగైనా సాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వాస్పత్రులకే గర్భిణులు.. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకుంటే మగ బిడ్డను కన్న తల్లికి రూ.12 వేలు, ఆడ బిడ్డను కన్న తల్లికి రూ.13 వేలు ప్రోత్సాహకం ఇస్తుంది. దీంతోపాటు బిడ్డ, తల్లికి కలిపి వారి అవసరాల కోసం కొన్ని రకాల వస్తువులను కూడా ఉచితంగా ఇస్తుంది. దీంతో 2017 నుంచి ఇప్పటివరకు 6.5 లక్షల మంది మహిళలు కేసీఆర్ కిట్ పథకం ద్వారా లబ్ధి పొందారు. దీంతో ప్రైవేటు బోధనాస్పత్రులకు వెళ్లే గర్భిణీల సంఖ్య భారీగా పడిపోయింది. తక్కువ ఫీజుకే ప్రసవాలంటూ బోర్డులు.. కేసీఆర్ కిట్ దెబ్బతో అధికార పార్టీలోని ఓ కీలక ప్రజాప్రతినిధికి చెందిన ప్రైవేటు మెడికల్ కాలేజీకి చెందిన అనుబంధ ఆస్పత్రి ఇటీవల ఓ నిర్ణయం తీసుకుంది. గర్భిణీలను ఆకర్షించేందుకు ఒక బోర్డు తగిలించింది. గర్భిణీ స్త్రీలు మొదట రూ.2 వేలు చెల్లిస్తే చాలు.. వారికి మొదటి నుంచి తమ వద్దే చెకప్‌లు చేసి, ఆ తర్వాత కాన్పు కూడా చేసి పంపిస్తామని బోర్డులో పేర్కొంది. దీనికైనా ఆకర్షితులై గర్భిణీలు తమ వద్దకు వస్తారని, తద్వారా గైనిక్ పీజీ విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందుతుందని ఆశిస్తున్నారు. అలాగే మరో ప్రైవేటు అనుబంధ ఆస్పత్రి కూడా ఇలాగే బోర్డు తగిలించింది. మొదట తమకు రూ.2,500 చెల్లిస్తే చాలు, మిగిలిన మొత్తం ప్రక్రియ పూర్తి చేసి తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి చేర్చుతామని హామీ ఇస్తోంది. అయితే ఈ హామీలు ఇంకా పూర్తిస్థాయి ఫలితాలు ఇవ్వడం లేదని ఆయా కాలేజీలు అంటున్నాయి. తమకు కూడా కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తే ఈ సమస్య తీరుతుందని, సర్కారు ప్రోత్సాహకం వల్ల గర్భిణీలు అధికంగా వస్తారని, గైనిక్ విద్యార్థులకు మంచి శిక్షణ కూడా ఉంటుందని బోధనాస్పత్రులు ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో విన్నవించాయి. అయితే ఇలా చేస్తే పథకం దుర్వినియోగం అవుతుందన్న భయం సర్కారులో ఉంది. ప్రాక్టికల్ శిక్షణ ఇప్పిస్తే బాగుంటుంది.. కేసీఆర్ కిట్ అమలు తర్వాత ప్రభుత్వ బోధనాస్పత్రులకు, ఇతర సర్కారు ఆస్పత్రులకు గర్భిణీల రాక మరింత పెరిగింది. దీంతో ప్రైవేటు బోధనాస్పత్రులకు గర్భిణీల సంఖ్య కాస్తంత తగ్గి ఉండొచ్చు. దీంతో అక్కడ చదివే పీజీ విద్యార్థులకు సరైన ప్రాక్టికల్ శిక్షణ పెద్దగా ఉండటంలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో గైనిక్ పూర్తి చేసిన జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3 నెలలపాటు ప్రాక్టికల్ శిక్షణ ఇప్పిస్తే బాగుంటుంది. డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆందోళన.. రాష్ట్రంలో 12 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మెడికల్ పీజీ గైనకాలజీ కోర్సు ఉంది. ఆయా కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రులకు కేసీఆర్ కిట్ వల్ల గర్భిణీల సంఖ్య తగ్గింది. దీంతో పీజీ గైనిక్ విద్యార్థులకు ప్రసవాలు ఎలా చేయాలన్న దానిపై ప్రయోగాత్మకంగా నేర్చుకునే వెసులుబాటు తగ్గింది. దీంతో తమకు సరైన శిక్షణ అందడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జూనియర్ గైనిక్ డాక్టర్లు సాధారణ ప్రసవాలు కూడా చేయలేని పరిస్థితి నెలకొందని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. సాధారణ ప్రసవం చేయాలన్నా అత్యంత జాగ్రత్తలు తప్పనిసరి. ఏమాత్రం తేడా వచ్చినా మాతా శిశువుల ప్రాణానికే గండం ఏర్పడనుంది. ఇక సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా చేయడమంటే ఇంకా ఎక్కువ రిస్క్ చేయాల్సి ఉంటుంది. వీరికి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సరైన ప్రాక్టికల్ శిక్షణ లేకపోవడంతో సాధారణ, సిజేరియన్ ప్రసవాలు చేయలేని పరిస్థితి నెలకొంటుంది. తప్పుడు లెక్కలు.. ఇదిలావుంటే ప్రైవేటు మెడికల్ కాలేజీలు తమకు రోజుకు అవసరమైన గర్భిణీలు వస్తున్నారని, విద్యార్థులకు సరైన గైనిక్ ప్రాక్టికల్ శిక్షణ అందుతుందని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కు తప్పుడు నివేదికలు ఇస్తున్నాయి. తద్వారా తమ పీజీ గైనిక్ సీట్లు కోల్పోకుండా చూసుకుంటున్నాయి. ప్రైవేటు బోధనాస్పత్రులకు కాన్పు కేసులు కరువవుతుండగా, ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో కేసులు ఎక్కువై వైద్య సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారు. -
రెండు రాష్ట్రాల్లోనూ నాన్ లోకల్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఓవైపు వైద్యుల కొరత వేధిస్తుండగా, మరోవైపు స్పెషలిస్టు వైద్యులు ‘స్థానికత’ కారణంగా ఉద్యోగాలు పొందలేక తీవ్రంగా నష్టపోయారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చాక దరఖాస్తు చేసుకుంటే మీరు స్థానికులు కాదంటూ ఏపీ ప్రభుత్వం తిరస్కరించడంతో వైద్యులు కంగుతిన్నారు. రాష్ట్రం విడిపోయాక రెండేళ్లలోపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారందరినీ స్థానికులుగానే గుర్తిస్తామంటూ అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఇప్పుడేమో పదేళ్ల నుంచి ఏపీలో ఉంటూ ఇక్కడే చదువుకున్నా.. ప్రాథమిక విద్య తెలంగాణలో చదివారనే సాకుతో ఉద్యోగాలు ఇవ్వకుండా తిరస్కరించారు. ‘స్థానికత’పై ప్రభుత్వ ఉన్నతాధికారులెవరూ సమాధానం చెప్పడానికి ఇష్టపడటం లేదని నష్టపోయిన వైద్య అభ్యర్థులు వాపోతున్నారు. 8 వరకూ తెలంగాణలో.. ఆ తర్వాత ఏపీలో రాష్ట్రం విడిపోకముందు చాలామంది అభ్యర్థులు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ హైదరాబాద్‌లో, 9వ తరగతి నుంచి పీజీ వైద్య విద్య వరకూ ఏపీలో చదువుకున్నారు. తెలంగాణలో అక్కడి ప్రభుత్వం డాక్టరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకుంటే ఇలాంటి వారు స్థానికేతరులు(నాన్‌లోకల్) అవుతారని తేల్చిచెప్పింది. ఏపీలో కూడా నాన్‌లోకలే అంటున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఎక్కడ ఎక్కువ రోజులు చదివితే అక్కడే స్థానికులవుతారు. కానీ, తెలంగాణలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రెసిడెన్సీ సర్టిఫికెట్, మైగ్రేషన్ సర్టిఫికెట్, స్థానిక చిరునామాతో ఆధార్‌కార్డు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే మీరు 8వ తరగతి వరకూ తెలంగాణలో చదివారు కాబట్టి ఈ రాష్ట్రంలో మీరు స్థానికేతరులే అంటున్నారు. వాస్తవానికి వీళ్లు ఏపీలో పుట్టిపెరిగిన వారే. కాకపోతే తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడం వల్ల అక్కడ ప్రాథమిక విద్య అభ్యసించారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో 1,200కు పైగా పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 1,471 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండు రాష్ట్రాల్లో చదువుకున్న వైద్య అభ్యర్థుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారింది. రెండేళ్లలోపు వస్తే స్థానికులు 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగింది. విభజన అనంతరం మూడేళ్లలోపు ఏపీకి వచ్చిన వారిని స్థానికులుగా పరిగణిస్తారని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత మళ్లీ రెండేళ్లు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో 2019 జూన్ 1వ తేదీలోగా లోకల్ స్టేటస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో చదువుతున్న లేదా ఉద్యోగాలు చేస్తున్న వారు ఏపీకి వచ్చి స్థానికతకు దరఖాస్తు చేసుకోవచ్చని మాత్రమే పేర్కొంది. తెలంగాణలో కొన్నాళ్లు చదువుకుని, విభజనకు ముందే వచ్చి ఏపీలో స్థిరపడిన వారి విషయంలో కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అందుకే విభజనకు ముందు ఉన్న ఉత్తర్వుల ప్రకారం వీళ్ల విషయంలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఎక్కడ ఎక్కువ కాలం చదివి ఉంటే అక్కడే వారిని స్థానికులుగా పరిగణిస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. 1,700 మందికి ఒక డాక్టరే ఆంధ్రప్రదేశ్‌లో జనాభాకు సరిపడా సంఖ్యలో వైద్యులు లేరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టరు ఉండాలి. కానీ, ఏపీలో 1,700 మందికి ఒక డాక్టరు మాత్రమే ఉన్నారు. పొరుగు రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గానే ఉంది. నాకన్నా వెనకున్న వారికి ఉద్యోగం వచ్చింది ‘‘నేను 8వ తరగతి వరకూ హైదరాబాద్‌లో చదువుకున్నా. 9వ తరగతి నుంచి పీజీ వైద్యం వరకూ ఏపీలో చదివా. బీసీ–డి వర్గానికి చెందిన నేను ఏపీలో ప్రభుత్వ వైద్యకళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేస్తే నన్ను నాన్‌లోకల్ అంటున్నారు. హైదరాబాద్‌లో దరఖాస్తు చేసుకుంటే ఆధార్, రెసిడెన్స్, మైగ్రేషన్ సర్టిఫికెట్లు తెలంగాణలో ఉన్నట్టు తీసుకురమ్మంటున్నారు. ఏపీలో దరఖాస్తు చేసుకుంటే నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురు అభ్యర్థులకు ఉద్యోగం వచ్చింది. నన్ను నాన్‌లోకల్ అని చెప్పడంతో ఉద్యోగం కోల్పోయా. – డా.మంజూ యాదవ్, వైఎస్సార్ జిల్లా నేను ఏ రాష్ట్రానికి చెందుతానో.. ‘‘నేను 7వ తరగతి వరకూ హైదరాబాద్‌లో చదువుకున్నా. ఆ తర్వాత కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో చదివా. పీజీ వైద్యం (జనరల్ సర్జరీ) తిరుపతిలో చేశాను. ఏపీలో దరఖాస్తు చేసుకుంటే నన్ను నాన్‌లోకల్ అన్నారు. దీనిపై అధికారులను కలిస్తే తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. అసలు నేను ఏ రాష్ట్రానికి చెందిన వాడినో గుర్తించకపోవడం దారుణం. ప్రభుత్వం ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. – డా.కె.సుబ్రహ్మణ్యం, నెల్లూరు ప్రభుత్వమే పరిష్కరించాలి ‘‘ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వమే చొరవ తీసుకుని పరిష్కరించాలి. ఎంతో కష్టపడితే గానీ పీజీ వైద్యులు కాలేరు. వారు ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే మీరు మా రాష్ట్రం కాదంటే ఎక్కడికి వెళతారు? వీరంతా ఈ రాష్ట్రంలో పుట్టిపెరిగిన వాళ్లే. తల్లిదండ్రుల వృత్తి, ఉద్యోగం రీత్యా తెలంగాణకు వెళ్లారు. వారిని ఇక్కడే స్థానికులుగా గుర్తించాలి’’ – డా.జయధీర్, కన్వీనర్, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘంప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారమే చేశాం ‘‘రాష్ట్రపతి ఉత్తర్వులనే అమలు చేశాం. ఏ రాష్ట్రంలో చదివినా సరే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ఎక్కడ ఎక్కువ కాలం చదువుకుని ఉంటే ఆ రాష్ట్రంలోనే స్థానికులవుతారు. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియలోనూ ఇదే నిబంధనను అమలు చేశాం’’ – అరుణాదేవి, జాయింట్ డైరెక్టర్, వైద్యవిద్యా శాఖ -
ప్రైవేటు పీజీ విద్యార్థులకు స్టైఫండ్
- కాలేజీ యాజమాన్యాలు తప్పనిసరిగా ఇవ్వాలి - మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య విద్యార్థులకు నెలనెలా స్టైఫండ్ ఇవ్వాలన్న నిబంధనను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తప్పనిసరి చేసింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. గతంలో స్టైఫండ్ ఇవ్వాలన్న నిబంధన ఉన్నా ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు సరిగా అమలు చేయలేదు. దీనిపై ముమ్మరంగా తనిఖీలు చేసిన ఎంసీఐ చివరకు సీరియస్‌గా ఆదేశాలు జారీచేసింది. ఎవరైనా ఈ ఏడాది నుంచి సై్టఫండ్ ఇవ్వకపోతే ఆయా కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అందుకే ఫీజుల పెంపు... స్టైఫండ్ ఇవ్వాలన్న నిబంధన నేపథ్యంలో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు కోరినట్లుగా ఫీజులు పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి, ప్రైవేటు కాలేజీలకు మధ్య జరిగిన చర్చల్లోనూ ఇదే ప్రధాన అంశంగా ఉంది. తమకు వచ్చే ఫీజులు ఏమాత్రం చాలవని యాజమాన్యాలు ప్రభుత్వం వద్ద పంచా యితీ పెట్టాయి. ఫీజులు పెంచితే స్టైఫండ్ ఇస్తామన్నాయి. అందుకే ఫీజులు పెంచామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు మాత్రం స్టైఫండ్‌కు మెలిక పెడుతున్నాయి. ప్రస్తుతం చేరుతున్న సమయంలోనే సై్టఫండ్ ఇవ్వబోమని, అందుకు ఒప్పుకోవాలని విద్యార్థుల నుంచి అంగీకార పత్రం తీసుకుంటున్నాయని ఆరోగ్య సంస్కరణల వైద్యుల సంఘం (హెచ్ఆర్డీఏ) సెక్రటరీ జనరల్ శ్రీని వాస్ ‘సాక్షి’తో అన్నారు. ఈ మేరకు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ విషయంపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డికి ఫిర్యాదు ఇచ్చామని ఆయన తెలిపారు. అంతేకాకుండా విద్యార్థుల నుంచి ప్రైవేటు కాలేజీలు బ్యాంకు గ్యారంటీ తీసుకోకూడదని ఆయన స్పష్టంచేశారు. రూ. 30 వేల వరకు సై్టఫండ్... పీజీ వైద్య విద్య చదివే విద్యార్థులు ఒకవైపు చదువుతూనే మరోవైపు బోధనాసుపత్రులు, సంబంధిత ప్రైవేటు మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లుగా వైద్య సేవలు అందిస్తుంటారు. వారు చేసే సర్వీసుకు ఆయా కాలేజీలు రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తాయి. ఈ నేపథ్యంలో పీజీ వైద్య విద్యార్థులు చేసే వైద్య సేవలకు తప్పనిసరిగా స్టైఫండ్ ఇవ్వాలి. ఈ నిబంధనను ప్రభుత్వ వైద్య కాలేజీలు అమలుచేస్తున్నా, ప్రైవేటు కాలేజీలు అమలుచేయడంలేదు. మొదటి ఏడాది పీజీ విద్యార్థులకు నెలకు రూ. 27 వేలు, రెండో ఏడాదికి రూ. 28 వేలు, మూడో ఏడాదికి రూ. 30 వేలు ఇవ్వాలి. ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటాలో సీట్లు పొందిన వారికీ ఇదే వర్తిస్తుంది. కానీ ఇప్పటివరకు కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థుల నుంచే కొంత మొత్తం తీసుకొని స్టైఫండ్‌గా ఇచ్చేవి. మరికొన్ని అదీ లేకుండా మొండిచెయ్యి చూపేవి. -
పీజీ వైద్య విద్యార్థుల తప్పనిసరి సర్వీసు రద్దు
వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం శాసనసభలో ప్రత్యేక బిల్లు పెట్టే అవకాశం తప్పనిసరి సర్వీసుతో ప్రయోజనం లేదనే ఈ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య విద్య పూర్తి చేసిన వారు తప్పనిసరిగా ప్రభుత్వ సర్వీసులో ఏడాదిపాటు పనిచేయా లన్న నిబంధనను రద్దు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో ప్రత్యేక బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఈ అంశంపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిం చింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బిల్లును రూపొం దించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఒక ఏడాది ప్రభుత్వ సర్వీసు.. మెడికల్ విద్యార్థులు తమ కోర్సు ముగిసిన తర్వాత కచ్చి తంగా ఒక ఏడాది ప్రభుత్వ సర్వీసులో గ్రామీణ ప్రాంతా ల్లో పనిచేయాలనే నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకు ఈ నిబంధనను అమలుపరిచారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు ఈ నిబంధన నుంచి ఇప్పటికే మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం పీజీ, సూపర్‌స్పెషాలిటీ వైద్య కోర్సు పూర్తి చేసిన వారికి దీన్ని అమలు చేస్తున్నారు. ఏడాదిపాటు ప్రభుత్వ సర్వీసు పూర్తిచేసిన తర్వాతే వారికి ప్రైవేటుగా వైద్యం చేయడానికి తెలంగాణ వైద్య మండలి అనుమతిస్తోంది. నిపుణుల కమిటీ సూచనలతో.. అయితే తప్పనిసరి ప్రభుత్వ వైద్య సేవల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల నుంచి ఏటా 1,400 మంది వరకు పీజీలు పూర్తి చేసి బయటకు వస్తున్నారు. అంటే వీరంతా ఏడాదిపాటు ప్రభుత్వ సర్వీసులో కొనసాగాలి. ఈ ఏడాది కాలంలో పీజీ వైద్య విద్యార్థులకు నెలకు రూ.40 వేలు, సూపర్ స్పెషాలిటీలకు రూ.45 వేలు, డిప్లొమా వారికి రూ.38 వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. వారిని బోధనాసుపత్రులకు పంపినా ఎవరూ కూడా హైద రాబాద్‌ను వీడి బయటకు పోవడానికి ఇష్టపడటంలేదు. నగరంలో పోస్టింగ్‌లు ఇచ్చినా అక్కడా బాధ్యతలు నిర్వ హించడంలేదు. ప్రభుత్వ సర్వీసు చేయకుండానే నెలనెలా వేతనాలు మాత్రం పొందుతున్నారు. రికార్డుల్లో మాత్రమే వీరు ప్రభుత్వ సర్వీసు చేసినట్లు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విధానంపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ తప్పనిసరి ప్రభుత్వ సర్వీసు ఎత్తివేయాలని సూచించింది. తప్పనిసరి సర్వీసును తొలగించి ప్రభుత్వానికి అవసరమైన వారిని పూర్తిస్థాయిలో నియమించాలన్న ఆలోచన ఉంది. ఇష్టమైన వారు.. ఎక్కడికైనా వెళ్లడానికి ఆసక్తి చూపే వారికి ఇప్పుడిస్తున్న దానికంటే ఎక్కువగా వేతనం ఇచ్చి ఔట్ సోర్సింగ్ పద్ధతిన నియమిం చుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. -
గ్రేస్ మార్కులు కలిపేది లేదు : కామినేని
చేతులు తడవకుండానే పదోన్నతులు కల్పించాం సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇక కలపబోమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్రం విడిపోయి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గతంలో గ్రేస్ మార్కులు కలిపామని, ఇకపై అలాంటిదేమీ ఉండదన్నారు. తాజాగా వైద్యులకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు చేతులు తడవకుండా కల్పించామని విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్స్‌ను తానెప్పుడూ కలవలేదని, వాళ్ల పనితీరును బట్టే చెల్లింపులు చేస్తున్నామన్నారు. మిగతా పథకాలకు నిధులు ఆపేసి మెడాల్‌కు మాత్రమే ఏడాదిలో రూ.102 కోట్లు ఎందుకు చెల్లించారని ప్రశ్నించగా.. మెడాల్ సంస్థ పనితీరు అద్భుతంగా ఉందని, జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ వైద్య సేవలకు అవార్డు కూడా వచ్చిందని మంత్రి చెప్పుకొచ్చారు. వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్‌కు అవార్డు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టీవీ సత్యనారాయణ గురువారం హరియాణా హిస్సార్‌లోని చౌదరీ చరణ్ సింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. భారత వ్యవసాయ ఇంజనీర్ల సమాఖ్య మూడు రోజుల జాతీయ సదస్సులో ఆయనకు నేషనల్ ఫెలోషి‹ప్ అవార్డును అందజేయనున్నట్టు సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఇంద్రమణి తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తకు గత 20 ఏళ్లలో ఇటువంటి పురస్కారం లభించడం ఇదే తొలిసారి. బాపట్ల వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విద్యను అభ్యసించిన డాక్టర్ సత్యనారాయణ నీటి యాజమాన్య సంస్థ, ఉప్పునీటి పరిశోధన కేంద్రం, భూగర్భ మురుగు నీటి పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తగా పనిచేశారు. వ్యవసాయ యాంత్రీకరణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయనకు ఈ అవార్డు రావడంపై వర్సిటీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో సెంచూరియన్ యూనివర్సిటీ: వీసీ సాక్షి, విశాఖపట్నం: ఇప్పటిదాకా ఒడిశాలోని పర్లాకిమిడి, భువనేశ్వర్లలో ఉన్న తమ విశ్వవిద్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌కూ విస్తరిస్తున్నట్టు సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ జీఎస్ఎన్ రాజు తెలిపారు. ఇందులో భాగంగా ప్రస్తుతం విశాఖ జిల్లా ఆనందపురం వద్ద ఉన్న తాత్కాలిక క్యాంపస్‌ను విజయనగరం జిల్లా గజపతినగరం సమీపంలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నామని విశాఖలో బుధవారం విలేకరులకు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంజనీరింగ్ తరగతులను నిర్వహిస్తామన్నారు. వర్సిటీ చాన్సలర్ పి.పట్నాయక్ మాట్లాడుతూ ఏపీలో తమ విశ్వవిద్యాలయం ప్రత్యేకత పొందుతుందన్నారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు డీఎన్ రావు మాట్లాడుతూ కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే యూనివర్సిటీకి రూ.130 కోట్లు వెచ్చించబోతున్నామని చెప్పారు. తమ వర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఈ–రిక్షాల అమ్మకానికి అనుమతి లభించిందని తెలిపారు. -
వైద్య విద్యార్థులకు ప్రత్యేక ఫిర్యాదుల విభాగం
అమరావతి: త్వరలోనే అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేస్తున్నట్టు వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ ఎన్.సుబ్బారావు తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులతో సంధ్యారాణి అనే వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రత్యేక ఫిర్యాదుల విభాగం లో ఒక మెయిల్ ఐడీ ఉంటుందని.. ఏరోజుకారోజు ఈ మెయిల్‌కు వచ్చిన ఫిర్యాదులను బట్టి తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేస్తే ఎవరు రాశారో తెలుసుకుని, వారిపై కక్షసాధింపు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనే.. ఇలా కొత్త తరహాలో చర్యలు చేపట్టినట్టు చెప్పారు. పీజీ వైద్యులు తనకు నేరుగా ఫోన్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తామని, వారి ఫోన్ వివరాలు, కళాశాల, విద్యార్థి పేరు, వేధిస్తున్న ప్రొఫెసర్, సమస్య తీవ్రత వంటివన్నీ ప్రత్యేకంగా రాసుకుని చర్యలు తీసుకుంటామన్నారు.