సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 విధుల్లోకి మరో 948 మంది మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎమ్‌ఎల్‌హెచ్‌పీ)లు అందుబాటులోకి రానున్నారు. ఈ నెల 10వ తేదీన వీళ్లందరూ విధుల్లో చేరాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు.
► ఈ ఏడాది జనవరిలో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన వారికి నోటిఫికేషన్ ఇచ్చి, తద్వారా అర్హత పరీక్ష రాశాక ఎంపికైన వారికి ఆరు మాసాలు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తయి విధుల్లో చేరే సమయంలోనే కరోనా వైరస్ వ్యాపించింది.
► వీళ్లందరి వేతనాలకు జాతీయ ఆరోగ్యమిషన్ నిధులిస్తుంది. దీంతో వీరిని విధుల్లోకి తీసుకోవాలా లేదా అన్న అంశంపై జాతీయ ఆరోగ్యమిషన్‌కు అధికారులు లేఖ రాశారు. లేఖకు స్పందించిన ఆరోగ్యమిషన్ అధికారులు వెంటనే వీళ్లందరినీ కోవిడ్–19 విధులకు వాడుకోవాలని సూచించారు.
► మొత్తం 948 మందిలో 120 మంది పురుషులు కాగా, 828 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
► ఏ జిల్లాకు చెందిన అభ్యర్థులు ఆ జిల్లాలోనే కోవిడ్‌కేర్ సెంటర్లలో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు.
► వాస్తవానికి మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సామాజిక ఆరోగ్యకేంద్రాలు, జిల్లా ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నియమిస్తారు. కోవిడ్ నేపథ్యంలో వారి సేవలు ఇలా వినియోగించుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
ఐఎంఏ డాక్టర్లూ కోవిడ్ విధుల్లోకి..
రాష్ట్ర వ్యాప్తంగా ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) పరిధిలో ఉన్న వైద్యులనూ కోవిడ్ విధుల్లో వినియోగించుకోవాలని సర్కారు నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖ ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఆదేశాల్లో ఏముందంటే..
► జిల్లాలవారీగా గుర్తించిన కోవిడ్ కేర్ సెంటర్లు లేదా ఇతర ఆస్పత్రుల్లో ఆ వైద్యులను వినియోగించుకోవాలి. వైద్యుల కొరత ఉన్న చోటా వినియోగించుకోవాలి.
► జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లోని ఐఎంఏ అధ్యక్షులతో మాట్లాడి డాక్టర్ల వివరాలు తీసుకుని, వాటిని నోడల్ అధికారి లేదా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఇవ్వాలి.
► ఆ సూపరింటెండెంట్ ప్రతి డాక్టరుకూ గుర్తింపు కార్డు ఇచ్చి.. రోజుకు 8 గంటల పాటు వారం రోజులు డ్యూటీ చేయించాలి. ఆ తర్వాత వారం రోజులు వారిని క్వారంటైన్‌కు పంపాలి.
► అవసరాన్ని బట్టి వారిని ఐసీయూ, నాన్ ఐసీయూ, జనరల్ డ్యూటీలకు వినియోగించుకోవచ్చు
► పీజీ వైద్యవిద్యార్థులు, హౌస్ సర్జన్లను రాష్ట్ర లేదా జిల్లా కోవిడ్ ఆస్పత్రుల్లో నియమించాలి.
► ఇలా పీజీ వైద్యవిద్యార్థులు, హౌస్ సర్జన్లు, ఐఎంఏ డాక్టర్లు కలిపి 22 వేల మంది అందుబాటులో ఉన్నారు. తాజా పరిస్థితులను బట్టి 28 వేల మంది వైద్యుల అవసరముంటుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment