house surgeons
-
తెలంగాణ జూడాలు, హౌస్ సర్జన్లకు తీపి కబురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పది రోజుల క్రితం జూనియర్ డాక్టర్లు జీతాలు పెంచాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన హామీ మేరకు జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం 15 శాతం స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. హౌస్ సర్జన్ మెడికల్, హౌస్ సర్జన్ డెంటల్కు 19,589 రూపాయల నుంచి రూ.22,527కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పీజీ డిగ్రీ, డిప్లొమా, సూపర్ స్పెషాలిటీ, ఎండీఎస్ వారికి.. ప్రస్తుత స్టైఫండ్‌కి 15 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నేటి ఉదయం స్నేహ సోమారెడ్డి అనే వైద్యురాలు గత నాలుగు నెలలుగా తమకు సరిగా జీతాలు అందడం లేదంటూ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ‘‘సార్ కరోనా కష్టకాలంలో మీరు ఎందరికో సహాయం చేస్తున్నారు. కానీ రెసిడెంట్ డాక్టర్లు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో నిరంతరం సేవలందిస్తున్నారు. గత నాలుగు నెలల నుంచి మాకు జీతాలు అందడం లేదు. కోవిడ్ డ్యూటీలకు హాజరైన వారికి ఇతర రాష్ట్రాల్లో ప్రోత్సహకాలు ఇస్తున్నారు. మాకు ఇలాంటివి ఏం అందడం లేదు. మా ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఎలా వర్క్ చేయగలం సార్’’ అంటూ ట్వీట్ చేశారు. We have brought this issue to Hon’ble CM’s notice and he has issued orders to Health secretary to enhance stipends of house surgeons and PGs by 15% GOs being issued today https://t.co/A88ptZfbut — KTR (@KTRTRS) May 18, 2021 ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. వారికి 15 శాతం స్టైఫండ్ పెంచాలని హెల్త్ సెక్రటరీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ జీవో విడుదల అవుతుందని’’ కేటీఆర్ రీట్వీట్ చేశారు. మొత్తంగా ఇవాళ మధ్యాహ్నం 15 శాతం స్టైఫండ్ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. చదవండి: డెత్ సర్టిఫికెట్ కోసం ‘యుద్ధం’: స్పందించిన మంత్రి కేటీఆర్ -
కోవిడ్ విధుల్లో 948 మంది నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 విధుల్లోకి మరో 948 మంది మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎమ్ఎల్హెచ్పీ)లు అందుబాటులోకి రానున్నారు. ఈ నెల 10వ తేదీన వీళ్లందరూ విధుల్లో చేరాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు. ► ఈ ఏడాది జనవరిలో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన వారికి నోటిఫికేషన్ ఇచ్చి, తద్వారా అర్హత పరీక్ష రాశాక ఎంపికైన వారికి ఆరు మాసాలు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తయి విధుల్లో చేరే సమయంలోనే కరోనా వైరస్ వ్యాపించింది. ► వీళ్లందరి వేతనాలకు జాతీయ ఆరోగ్యమిషన్ నిధులిస్తుంది. దీంతో వీరిని విధుల్లోకి తీసుకోవాలా లేదా అన్న అంశంపై జాతీయ ఆరోగ్యమిషన్‌కు అధికారులు లేఖ రాశారు. లేఖకు స్పందించిన ఆరోగ్యమిషన్ అధికారులు వెంటనే వీళ్లందరినీ కోవిడ్–19 విధులకు వాడుకోవాలని సూచించారు. ► మొత్తం 948 మందిలో 120 మంది పురుషులు కాగా, 828 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ► ఏ జిల్లాకు చెందిన అభ్యర్థులు ఆ జిల్లాలోనే కోవిడ్‌కేర్ సెంటర్లలో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ► వాస్తవానికి మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సామాజిక ఆరోగ్యకేంద్రాలు, జిల్లా ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నియమిస్తారు. కోవిడ్ నేపథ్యంలో వారి సేవలు ఇలా వినియోగించుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఐఎంఏ డాక్టర్లూ కోవిడ్ విధుల్లోకి.. రాష్ట్ర వ్యాప్తంగా ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) పరిధిలో ఉన్న వైద్యులనూ కోవిడ్ విధుల్లో వినియోగించుకోవాలని సర్కారు నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖ ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఆదేశాల్లో ఏముందంటే.. ► జిల్లాలవారీగా గుర్తించిన కోవిడ్ కేర్ సెంటర్లు లేదా ఇతర ఆస్పత్రుల్లో ఆ వైద్యులను వినియోగించుకోవాలి. వైద్యుల కొరత ఉన్న చోటా వినియోగించుకోవాలి. ► జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లోని ఐఎంఏ అధ్యక్షులతో మాట్లాడి డాక్టర్ల వివరాలు తీసుకుని, వాటిని నోడల్ అధికారి లేదా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఇవ్వాలి. ► ఆ సూపరింటెండెంట్ ప్రతి డాక్టరుకూ గుర్తింపు కార్డు ఇచ్చి.. రోజుకు 8 గంటల పాటు వారం రోజులు డ్యూటీ చేయించాలి. ఆ తర్వాత వారం రోజులు వారిని క్వారంటైన్‌కు పంపాలి. ► అవసరాన్ని బట్టి వారిని ఐసీయూ, నాన్ ఐసీయూ, జనరల్ డ్యూటీలకు వినియోగించుకోవచ్చు ► పీజీ వైద్యవిద్యార్థులు, హౌస్ సర్జన్లను రాష్ట్ర లేదా జిల్లా కోవిడ్ ఆస్పత్రుల్లో నియమించాలి. ► ఇలా పీజీ వైద్యవిద్యార్థులు, హౌస్ సర్జన్లు, ఐఎంఏ డాక్టర్లు కలిపి 22 వేల మంది అందుబాటులో ఉన్నారు. తాజా పరిస్థితులను బట్టి 28 వేల మంది వైద్యుల అవసరముంటుందని అంచనా. -
ఉస్మానియాలో ఆగిన అత్యవసర సేవలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం మరో సారి బయటపడింది. రోగులకు అందుబాటులో ఉండాల్సిన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు విశ్రాంతి గదులకే పరిమితం కావడం, కనీస సమాచారం లేకుండా ముగ్గురు హౌస్సర్జన్లు విధులకు డుమ్మాకొట్టడంతో శనివారం రాత్రి అత్యవసర విభాగంలో వైద్య సేవలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి తర్వాత సూపరింటెండెంట్ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేసి, విధులకు గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్సర్జన్లు విధులకు డుమ్మా... అత్యవసర విభాగానికి రోజుకు వందకుపైగా కేసులు వస్తుంటాయి. వీటిలో రోడ్డు, ఇతర ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రుల కేసులే అధికం. శనివారం రాత్రి క్యాజువాలిటీలో ముగ్గురు హౌస్ సర్జన్లు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండానే విధులకు గైర్హాజరయ్యారు. ప్రత్యామ్నాయ ఏ ర్పాట్లు చేయాల్సిన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో అర్ధరాత్రి వరకు వైద్యసేవలు నిలిచిపోయాయి. దీం తో రోగులు, వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. రోగులు, బంధువులు ఆగ్రహం వైద్యులు లేకపోవడంతో బాధితుల కు రాత్రంతా నిరీక్షణ తప్పలేదు. దీం తో రోగులు, బంధువులు ఆస్పత్రి వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఆస్పత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేశా రు. విధుల్లో ఉన్న సీఎంఓలు రోగులను పట్టించు కోకపోవడంతో పాటు, ముగ్గురు హౌస్ సర్జన్లు విధులకు గైర్హాజరైనట్లు గుర్తించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర విభాగాల్లో ఉన్న సీనియర్ రెసిడెంట్లను పిలిపించి వైద్యసేవలను పునరుద్ధరించారు. చర్యలు తీసుకుంటాం: నాగేందర్ విధులకు ౖగైర్హాజరైన ముగ్గురు హౌస్‌సర్జన్లపై చర్యలు తీసుకుంటామని నాగేందర్ తెలిపారు. -
కోల్డ్‌వార్
– స్టాఫ్‌నర్సులు వర్సెస్ హౌస్‌సర్జన్స్ – విధుల విషయంలో భేదాభిప్రాయాలు – ఓపీ, వార్డు విధులు బహిష్కరించిన వైనం – తీవ్ర ఇబ్బందులు పడిన రోగులు – వైద్యం కోసం గంటల తరబడి నిరీక్షణ – ఎంబీబీఎస్ విద్యార్థులే డాక్టర్లయిన పరిస్థితి – మధ్యాహ్నం వరకు రోగులను డిశ్చార్జ్ చేయని వైనం అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో స్టాఫ్‌నర్సులు, హౌస్సర్జన్ల మధ్య కోల్ట్‌వార్ కొనసాగుతోంది. కొంత కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్నా తాజాగా బహిర్గతమైంది. ఐదు నెలలు కావస్తున్నా స్టైఫండ్ అందడం లేదంటూ హౌస్ సర్జన్లు మంగళవారం సర్వజనాస్పత్రి ఓపీ బ్లాక్ ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సైఫ్ఖాన్తో పాటు కొందరు హౌస్సర్జన్లు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నెలల తరబడి బకాయిలు పెడితే ఎలాగని ప్రశ్నించారు. ఆస్పత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆరోపించారు. ఫలితంగానే దశలవారీగా ఆందోళనకు శ్రీకారం చుట్టామన్నారు. విషయం తెలుసుకున్న ఆర్ఎంఓ డాక్టర్ లలిత అక్కడికొచ్చి మాట్లాడారు. రెండ్రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. డాక్టర్లయి ఉండి ఇలా చేయడం మంచిది కాదని, రోగులను దృష్టిలో ఉంచుకుని విధుల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో వారి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ‘స్టైఫండ్’ డిమాండ్ పక్కకు జరిగి విధుల విషయం తెరమీదకొచ్చింది. క్యాజువాలిటీ మొదలు వార్డులు, ఓపీ వరకు తాము బాధ్యతాయుతంగా పని చేస్తున్నామని హౌస్సర్జన్లు అన్నారు. అయితే స్టాఫ్‌నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇంజెక్షన్లు, సెలైన్ బాటిల్ ఎక్కించడం ఇతరత్రా డ్యూటీల విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. తమకు కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ల నుంచి డాక్టర్ల వరకు చాలా మంది తమకన్నా తక్కువగానే డ్యూటీ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో చివరకు ఆర్ఎంఓతో పాటు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు హౌస్‌సర్జన్లను తమ చాంబర్‌కు పిలిపించి మాట్లాడారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విధుల బహిష్కరణతో రోగుల కష్టాలు వాస్తవానికి హౌస్సర్జన్లు నల్లబ్యాడ్జీలతో కాసేపు నిరసన తెలుపుతామని చెప్పి ఏకంగా ఓపీ, వార్డు విధులను బహిష్కరించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హౌస్సర్జన్లు అందుబాటులో లేకపోయారు. దీంతో ఓపీ, వార్డుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓపీ గదుల్లో ఒక్కో డాక్టర్ మాత్రమే ఉండడంతో గంటల తరబడి రోగులు నిరీక్షించాల్సి వచ్చింది. ఎంబీబీఎస్ విద్యార్థులే వైద్యుల అవతారం ఎత్తి సేవలు అందించారు. ఓపీల్లో నిత్యం ఇద్దరు చొప్పున హౌస్సర్జన్లు విధుల్లో ఉంటారు. వీరు అందుబాటులో లేకపోయే సరిసరికి పరిస్థితి అధ్వానంగా మారింది. డిశ్చార్జ్ కోసం మధ్యాహ్నం వరకు నిరీక్షణ ఆస్పత్రిలో నిత్యం పదుల సంఖ్యలో రోగులు డిశ్చార్జ్ అవుతుంటారు. విధులు బహిష్కరించిన నేపథ్యంలో హౌస్సర్జన్లు అందుబాటులో లేకపోవడంతో చాలామంది అష్టకష్టాలు పడ్డారు. ఎఫ్ఎం వార్డులో సుమారు 20 మందిని డిశ్చార్జ్ చేయగా వారంతా హౌస్సర్జన్ల కోసం మధ్యాహ్నం వరకు వేచి చూశారు. చివరకు 12 గంటల తర్వాత స్టాఫ్‌నర్సులు సమస్యను ఆర్ఎంఓ దృష్టికి తీసుకెళ్లడంతో ఓ హౌస్‌సర్జన్‌ను కేటాయించి.. డిశ్చార్జ్ ప్రక్రియను పూర్తి చేయడం కన్పించింది. ఇదే పరిస్థితి దాదాపు అన్ని వార్డుల్లోనూ నెలకొంది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి ఆస్పత్రిలో పరిస్థితి ఇంత వరకు రావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం 97 మంది వరకు హౌస్సర్జన్లు విధులు నిర్వర్తిస్తుండగా ఏప్రిల్ నెల నుంచి వీరికి స్టైఫండ్ రావాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపలేదు. ఫలితంగానే ఇప్పుడు విధుల బహిష్కరణ వరకు వచ్చింది.