కోల్డ్‌వార్
– స్టాఫ్‌నర్సులు వర్సెస్ హౌస్‌సర్జన్స్
– విధుల విషయంలో భేదాభిప్రాయాలు
– ఓపీ, వార్డు విధులు బహిష్కరించిన వైనం
– తీవ్ర ఇబ్బందులు పడిన రోగులు
– వైద్యం కోసం గంటల తరబడి నిరీక్షణ
– ఎంబీబీఎస్ విద్యార్థులే డాక్టర్లయిన పరిస్థితి
– మధ్యాహ్నం వరకు రోగులను డిశ్చార్జ్ చేయని వైనం
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో స్టాఫ్‌నర్సులు, హౌస్‌సర్జన్ల మధ్య కోల్ట్‌వార్ కొనసాగుతోంది. కొంత కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్నా తాజాగా బహిర్గతమైంది. ఐదు నెలలు కావస్తున్నా స్టైఫండ్ అందడం లేదంటూ హౌస్ సర్జన్లు మంగళవారం సర్వజనాస్పత్రి ఓపీ బ్లాక్ ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సైఫ్‌ఖాన్‌తో పాటు కొందరు హౌస్‌సర్జన్లు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నెలల తరబడి బకాయిలు పెడితే ఎలాగని ప్రశ్నించారు. ఆస్పత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆరోపించారు. ఫలితంగానే దశలవారీగా ఆందోళనకు శ్రీకారం చుట్టామన్నారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఎంఓ డాక్టర్ లలిత అక్కడికొచ్చి మాట్లాడారు. రెండ్రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు.
డాక్టర్లయి ఉండి ఇలా చేయడం మంచిది కాదని, రోగులను దృష్టిలో ఉంచుకుని విధుల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో వారి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ‘స్టైఫండ్’ డిమాండ్ పక్కకు జరిగి విధుల విషయం తెరమీదకొచ్చింది. క్యాజువాలిటీ మొదలు వార్డులు, ఓపీ వరకు తాము బాధ్యతాయుతంగా పని చేస్తున్నామని హౌస్‌సర్జన్లు అన్నారు. అయితే స్టాఫ్‌నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇంజెక‌్షన్లు, సెలైన్ బాటిల్ ఎక్కించడం ఇతరత్రా డ్యూటీల విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. తమకు కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ల నుంచి డాక్టర్ల వరకు చాలా మంది తమకన్నా తక్కువగానే డ్యూటీ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో చివరకు ఆర్‌ఎంఓతో పాటు ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు హౌస్‌సర్జన్లను తమ చాంబర్‌కు పిలిపించి మాట్లాడారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
విధుల బహిష్కరణతో రోగుల కష్టాలు
వాస్తవానికి హౌస్‌సర్జన్లు నల్లబ్యాడ్జీలతో కాసేపు నిరసన తెలుపుతామని చెప్పి ఏకంగా ఓపీ, వార్డు విధులను బహిష్కరించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హౌస్‌సర్జన్లు అందుబాటులో లేకపోయారు. దీంతో ఓపీ, వార్డుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓపీ గదుల్లో ఒక్కో డాక్టర్ మాత్రమే ఉండడంతో గంటల తరబడి రోగులు నిరీక్షించాల్సి వచ్చింది. ఎంబీబీఎస్ విద్యార్థులే వైద్యుల అవతారం ఎత్తి సేవలు అందించారు. ఓపీల్లో నిత్యం ఇద్దరు చొప్పున హౌస్‌సర్జన్లు విధుల్లో ఉంటారు. వీరు అందుబాటులో లేకపోయే సరిసరికి పరిస్థితి అధ్వానంగా మారింది.
డిశ్చార్జ్ కోసం మధ్యాహ్నం వరకు నిరీక్షణ
ఆస్పత్రిలో నిత్యం పదుల సంఖ్యలో రోగులు డిశ్చార్జ్ అవుతుంటారు. విధులు బహిష్కరించిన నేపథ్యంలో హౌస్‌సర్జన్లు అందుబాటులో లేకపోవడంతో చాలామంది అష్టకష్టాలు పడ్డారు. ఎఫ్‌ఎం వార్డులో సుమారు 20 మందిని డిశ్చార్జ్ చేయగా వారంతా హౌస్‌సర్జన్ల కోసం మధ్యాహ్నం వరకు వేచి చూశారు. చివరకు 12 గంటల తర్వాత స్టాఫ్‌నర్సులు సమస్యను ఆర్‌ఎంఓ దృష్టికి తీసుకెళ్లడంతో ఓ హౌస్‌సర్జన్‌ను కేటాయించి.. డిశ్చార్జ్ ప్రక్రియను పూర్తి చేయడం కన్పించింది. ఇదే పరిస్థితి దాదాపు అన్ని వార్డుల్లోనూ నెలకొంది.
అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి
ఆస్పత్రిలో పరిస్థితి ఇంత వరకు రావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం 97 మంది వరకు హౌస్‌సర్జన్లు విధులు నిర్వర్తిస్తుండగా ఏప్రిల్ నెల నుంచి వీరికి స్టైఫండ్ రావాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపలేదు. ఫలితంగానే ఇప్పుడు విధుల బహిష్కరణ వరకు వచ్చింది.