బెంగళూరు: కర్ణాటక బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర కాగా.. మరొకటి సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ గ్రూప్‌గా తయారైంది. పార్టీలో అంతర్గత విబేధాల నేపథ్యంలో నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
తాజాగా బసనగౌడ, విజయేంద్ర వివాదంపై బీజేపీ హైకమాండ్ జోక్యం చేసుకుంది. ఈ మేరకు బసనగౌడ యత్నాల్‌కు షోకాజ్ నోటీసులు అందించింది. పార్టీ సిద్దాంత వ్యతిరేక వ్యాఖ్యలపై పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని లేకుంటే అధిష్టానం చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
‘రాష్ట్ర స్థాయి పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా యత్నాల్ ప్రవర్తిస్తున్నారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించడం, బహిరంగ ప్రకటనలు చేయడం ఆందోళన కలిగించే విషయం. యత్నాల్ వైఖరి రాజకీయ, ప్రజా ప్రాముఖ్యత ఉన్న అన్ని విషయాలపై పార్టీ అధికారిక వైఖరికి విరుద్ధంగా ఉంది.
పార్టీ నాయకులపై మీరు చేసిన తప్పుడు, ఆరోపణలు పార్టీ క్రమశిక్షణను తీవ్రంగా ఉల్లంఘించడమే. మీ చర్యలపై పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. లేనిపక్షంలో పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది’ అని షోకాజ్ నోటీసులో పేర్కొంది.
కాగా విజయేంద్రపై బసనగైడ తరుచూ విమర్శలు చేస్తున్నారు. విజయేంద్ర ఆయన వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని,పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఆయనే కారణమయ్యారని ఆరోపించారు. ఈ క్రమంలోనే హైకమాండ్ చర్యలు చేపట్టింది.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక, తాజాగా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బీఎస్ యడియూరప్ప, విజయేంద్రనే కారణమని పాటిల్ తీవ్ర విమర్శలు చేశారు. వీరిద్దరూ పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
క్రమశిక్షణా నోటీసులపై స్పందించిన యత్నాల్.. పార్టీ నోటీసులకు సమాధానం చెబుతానని పేర్కొన్నారు. కర్ణాటకలో పార్టీ ప్రస్తుత స్థితిని కూడా తెలియజేస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా శనివారం ఢిల్లీలో పార్టీ జాతీయ నాయకత్వంతో విజయేంద్ర భేటీ అయిన నేపథ్యంలో ఈ నోటీసులు వెలువడ్డాయి. రాజకీయ లబ్ధి కోసం యత్నాల్ తనపై, తన తండ్రి బీఎస్ యడియూరప్పపై నిత్యం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విజయేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment