staff nurses
-
రోడ్డెక్కిన స్టాఫ్ నర్సులు
సాక్షి, హైదరాబాద్, సుల్తాన్‌బజార్: వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న హెడ్ నర్సు, స్టాఫ్ నర్సుల కౌన్సెలింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ నర్సులు చేపట్టిన ఆందోళన శుక్రవారం కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణలోని 7 జోన్లకు ఒకేసారి కౌన్సెలింగ్ చేపట్టడంతో కళాశాల ఆడిటోరియంలో గందరగోళం నెలకొంది. డీహెచ్ రవీంద్రనాయక్ నేతృత్వంలో జరిగిన కౌన్సెలింగ్‌లో గ్రేడ్–1 అధికారి సుజాత రాథోడ్ వేదికపైకి వచ్చి బదిలీల లిస్టును మార్పు చేయించడంతో నర్సులు ఆగ్రహం వ్యక్తం చేశారు.బదిలీల కౌన్సెలింగ్‌ను పారదర్శంగా నిర్వహించాలని పెద్దపెట్టున నినదించారు. దీంతో డీహెచ్ కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది స్టాఫ్‌నర్సులు ధర్నాకు దిగారు. తమకు ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించాలని, డీహెచ్ డౌన్ డౌన్ అని నినదించారు. కొందరు అధికారులు యూనియన్ నేతలుగా చెప్పుకుంటున్న వారితో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు ఇస్తున్నారని ఆరోపించారు.ఓ యూనియన్ నేత రూ.5 కోట్ల వరకు వసూలు చేశాడని.. ఆ సొమ్ములో రూ. 3 కోట్లు ఒక కీలక అధికారికి కూడా ఇచి్చనట్లు ఆరోపించారు. ఉస్మానియా మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డును గంటసేపు దిగ్బంధనం చేశారు. దీంతో సుమారు రెండున్నర గంటల పాటు కోఠి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు వేల సంఖ్యల్లో స్టాఫ్ నర్సులను నిలువరించలేకపోవడంతో రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. -
ఏడాదిలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభు త్వ శాఖల్లో వచ్చే ఏడాదికాలంలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పోలీసుశాఖలో త్వరలో 15 వేల ఉద్యోగ నియామకాలకు చర్య లు చేపడతామని, పోలీసు నియామకాల బోర్డు ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. దీనితోపాటు వైద్యారోగ్య శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో 5వేల ఉద్యోగాలకు కూడా ప్రకటనలు ఇస్తామని.. తర్వాత తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా వేగంగా ఉద్యోగాల భర్తీ చేపడతామని తెలిపారు. వైద్యారోగ్య శాఖ పరిధిలోని స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు అర్హత పొందిన 6,956 మందికి బుధవారం ఎల్బీ స్టేడియంలో సీఎం ఆధ్వర్యంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్‌తో ఉద్యోగాలు.. నిరుద్యోగుల కలల సాకారమే తెలంగాణ రాష్ట్రమని.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్లపాటు నిరుద్యోగులు దగాపడ్డారని రేవంత్ వ్యాఖ్యానించారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం కేసీఆర్ కుటుంబీకులకే ఉద్యోగాలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో కేసీఆర్ బిడ్డ కవిత నిజామాబాద్‌లో ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీని చేసిన కేసీఆర్.. రాష్ట్రంలోని నిరుద్యోగులను మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టడంతో రాష్ట్రంలోని చదువుకున్న యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. మేం అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ అంశాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ నా దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి, భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తిచేశాం..’’అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై తాము ప్రమాణ స్వీకారం చేసినది ఎల్బీ స్టేడియంలోనేని.. ఆ కార్యక్రమంతో తమ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడ్డారని రేవంత్ చెప్పారు. ఇప్పుడు నర్సులుగా ఎంపికైనవారి కుటుంబాల్లో అలాంటి సంతోషాన్ని చూసేందుకే ఇక్కడ నియామకపత్రాల పంపిణీ చేపట్టామన్నారు. రోజుకు 16గంటలకుపైగా పనిచేస్తున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టి పెట్టామని రేవంత్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మొదలుపెట్టామని, కొత్త చైర్మన్, సభ్యులను నియమించామని చెప్పారు. శాఖలవారీగా ఉద్యోగ ఖాళీలు, భర్తీ ప్రక్రియపై మరింత దృష్టి పెడుతున్నామన్నారు. మంత్రులు రోజుకు సగటున 16 నుంచి 18 గంటలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం పనిచేస్తున్నారన్నారు. అలాంటి ప్రజా ప్రభుత్వాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నారని, వాటికి తాము వెరవబోమని వ్యాఖ్యానించారు. స్టాఫ్ నర్సులుగా ఎంపికైన వారి కళ్లలో ఆనందాన్ని చూసి ఫాంహౌజ్‌లోని వారు కుళ్లుకుంటారని విమర్శించారు. కేసీఆర్ మేనల్లుడు హరీశ్‌రావు ప్రజాప్రభుత్వంపై పిల్లి శాపాలు పెడుతున్నారని.. ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న కేసీఆర్ వెంటనే హరీశ్‌రావుకు గడ్డిపెట్టి నోరు మూయిస్తే మంచిదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో 6,956 మందికి స్టాఫ్ నర్స్ నియామక పత్రాలు అందజేసి, వారితో ఉద్యోగ ప్రతిజ్ఞ చేయించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. మాట నిలబెట్టుకుంటున్నాం: భట్టి విక్రమార్క ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన మాటను ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. వైద్యారోగ్య శాఖలో ఇంత పెద్ద సంఖ్యలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ గొప్ప విషయమన్నారు. ఇదే శాఖలో ఖాళీగా ఉన్న మరో 5 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు వేగవంతం చేశామని తెలిపారు. నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడానికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణబద్ధమై ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసిందని.. దీనిని గాడిన పెట్టేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని చెప్పారు. పైసా పైసా పోగు చేస్తూ పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి మంచిపేరు తేవాలి: రాజనర్సింహ కొత్తగా నియమితులైన స్టాఫ్ నర్సుల్లో 88శాతం మహిళలు ఉండటం ఆనందంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అత్యుత్తమ సేవలు అందించి ప్రభుత్వ వైద్య విభాగానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. సమాజానికి విద్య, వైద్యం, సంక్షేమం ఎంతో కీలకమని.. తమ ప్రభుత్వం వీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రాష్ట్రం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో వేగంగా స్టాఫ్ నర్సు నియామకాలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎందరు డాక్టర్లు వచ్చినా రోగికి దగ్గరగా ఉండి సేవలు అందించేది నర్సులేనని చెప్పారు. -
అప్పులున్నా.. ఆర్థిక భారమైనా ఉద్యోగాలిస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ప్రభుత్వానికి అప్పులు ఉన్నా.. ఆర్థిక భారమైన ఉద్యోగాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో స్టాఫ్ నర్స్ పరిక్షల్లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం నియామక ప్రతాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఇంకా ఎంతో మంది యువత, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగుల కలల సాకారం చేయటంలో ఇది తొలి అడుగని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి కారణమే నిరుద్యోగ సమస్య అని గుర్తుచేశారు. ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేదని మండిపడ్డారు. నిరుద్యోగుకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన కన్నా.. వాళ్ల కుటుంబానికి ఉద్యోగాలు గురించే ఆనాటి ప్రభుత్వం ఆలోచించిందని ఎద్దేవా చేశారు. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగులంలా వాళ్ల ఉద్యోగాలను తొలగించారని రేవంత్‌రెడ్డి అన్నారు. -
‘సాక్షి’ ఎఫెక్ట్: స్టాఫ్ నర్సుల ఎంపిక నిలుపుదల
మహారాణిపేట(విశాఖ దక్షిణ): స్టాఫ్ నర్సుల పోస్టు ల భర్తీని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఎంపిక జాబితాలో తమకు అన్యాయం జరిగిందని నిరుద్యోగ నర్సులు, వెయిటేజీ మార్కులు కలపలేదని తాత్కాలిక ఉద్యోగులు బుధవారం కూడా తన నిరసన గళం వినిపించారు. దాదాపు 30 నుంచి 40 మందికి వెయిటేజ్ మార్కులు కలపలేదని విషయం బయటకు రావడంతో.. ఈ జాబితాను పునఃపరిశీలన కోసం అధికారులు భర్తీ ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. స్టాఫ్ నర్సుల ఎంపికలో గందరగోళంపై బుధవారం ‘సాక్షి’లో కథనం రావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తప్పుల తడకలతో కూడిన 172 మంది అభ్యర్థుల జాబితాను మళ్లీ పరిశీలన చేస్తున్నారు. కొంత మందికి అనవసరంగా ఎలా మార్కులు కలిశాయన్న దానిపై యంత్రాంగం దృష్టి పెట్టింది. అమరావతి నుంచి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విశాఖ చేరుకుని జాబితాను పరిశీలిస్తున్నారు. సిబ్బంది తీరుపై మండిపాటు.. స్టాఫ్ నర్సుల పోస్టుల కోసం ఇప్పటివరకు నాలుగు సార్లు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది జాబితాను తయారు చేశారు. జీఓ ప్రకారం జాబితా తయారు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. ఎంపికలో సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులను తప్పించడం, అనర్హులను అందలం ఎక్కించడం కోసం సిబ్బంది చేతివాటం ప్రదర్శించారన్న విమర్శలు ఉన్నాయి. ఎంపికైన 172 మందిలో 100 మంది సర్టిఫికెట్లను మంగళవారం పరిశీలించారు. బుధవారం మరో 30 మంది సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. జాబితాను పునఃపరిశీలన చేస్తున్న క్రమంలో ఇందులో ఎంత మంది పేర్లు ఉంటాయో.. ఊడుతాయో తెలియని పరిస్థితి. కాగా.. ఎంపిక జాబితా రూపొందించడంలో సిబ్బంది తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తమ జీవితాలతో సిబ్బంది చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మార్కులు కలపడం, మరోసారి తొలగించడం, ఎంపిక జాబితాలో కొందరి పేర్లు ఇప్పుడు తొలగించడం.. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పనితీరుకు అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు. అభ్యర్థుల్లో ఉత్కంఠ.. పోస్టుల సంఖ్య పెరగడం, కోవిడ్ సమయంలో పనిచేసిన వారికి అదనపు మార్కులు కలపడం వంటి నిర్ణయాలు రావడంతో మెరిట్ లిస్ట్‌కు వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ ఉమాసుందరి ఆధ్వర్యంలో తుది మెరుగులు దిద్దుతున్నారు. అమరావతి నుంచి వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా ఇందుకు సహకారం అందిస్తున్నారు. దీంతో కొత్త జాబితా కోసం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కాగా..అర్హులకు అన్యాయం జరగదని డాక్టర్ ఉమా సుందరి హామీ ఇస్తున్నారు. -
హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
-
స్టాఫ్‌నర్స్‌ల ఆందోళన.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్సు పోస్టులకు వెయిటేజీ మార్కులు కలపడంలో అర్హులైన తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఈ వ్యవహారంలో వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన కొందరు అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు. మొదటి జాబితాలో అసలైన వారికి వెయిటేజీ మార్కులిచ్చి, సవరణ జాబితాలో వాటిని తీసేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. స్టాఫ్ నర్సు పోస్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తుది సవరణ జాబితాను సోమవారం ప్రకటించింది. అందులో అర్హులైన అభ్యర్థులు అనేక మందికి వెయిటేజీ కలపలేదు. దీంతో అన్యాయం జరిగిందంటూ ఆ అభ్యర్థులు మంగళవారం ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. అసలేం జరిగింది? 2017 నవంబర్‌లో 3,311 స్టాఫ్ నర్సు పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. బీఎస్సీ, ఎంఎస్సీ, జనరల్ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన వారిలో అనేక మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్నారు. కొందరు ప్రైవేట్‌లోనూ పనిచేస్తున్నారు. 2018 మార్చిలో స్టాఫ్ నర్స్ పోస్టులకు పరీక్ష జరిగింది. 150 మార్కులకు ఈ పరీక్ష నిర్వహించారు. అలాగే 30 మార్కులు వెయిటేజీగా నిర్ధారించారు. సర్వీసుకు గరిష్టంగా 20, అకడమిక్‌కు 10 వరకు వెయిటేజీ మార్కులుగా పేర్కొన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి గరిష్టంగా వారి సర్వీసును బట్టి 20 మార్కులు కలపాలనేది ఉద్దేశం.. ఆ ప్రకారం 2020 నవంబర్ 7వ తేదీన మొదటి మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అయితే కాంట్రాక్టు నర్సులకే కాకుండా, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేవారు తప్పుడు కాంట్రాక్టు సర్టిఫికెట్ పెట్టినా వెయిటేజీ ఇచ్చారని కొందరు ఆరోపించారు. దీనిపై ఏర్పాటైన కమిటీ ఆ మొదటి మెరిట్ లిస్టును రద్దు చేసింది. తప్పులు సరిదిద్దాక సవరణ రెండో జాబితాను టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. అయితే అనేక మంది అసలైన కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల వెయిటేజీని ఈ జాబితాలో తొలగించడంతో దుమారం రేగింది. మొదటి జాబితాలో ఉన్నప్పటికీ, సవరణ జాబితాలో చాలా మందికి వెయిటేజీ మార్కులను కలపలేదు. ఉదాహరణకు: మొదటి జాబితాలో వంద ర్యాంకున్నవారు, వెయిటేజీ మార్కులు వేయకపోవడం వల్ల సవరణ జాబితాలో ఏకంగా 2 వేలకు ర్యాంకు పడిపోయిన పరిస్థితి నెలకొంది. కొందరి వెయిటేజీ మార్కులను తక్కువగా వేశారు. పైగా దాని ప్రకారమే ఈ నెల 24 నుంచి సెలెక్షన్ వెరిఫికేషన్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే జాబితా తప్పులు తడకగా రూపొందించారంటూ టీఎస్పీఎస్సీ అధికారుల వద్ద ఫిర్యాదు చేయగా.. వైద్య, ఆరోగ్యశాఖ పంపిన వివరాల ఆధారంగానే వెయిటేజీ ఖరారు చేశామని వారు పేర్కొన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. పరీక్ష రాసిన వారిలో దాదాపు 2 వేల మంది కాంట్రాక్టు నర్సులు ఉంటారని అంచనా. సర్వీస్ మార్కులు తొలగించటం అన్యాయం.. నాకు మొదటి జాబితాలో కాంట్రాక్టు సర్వీస్ వెయిటేజీ మార్కులు 16, అకడమిక్ వెయిటేజీ మార్కులు 10 కలిశాయి. దీంతో నా ర్యాంక్ 35గా ఉంది. ఇప్పుడు సవరణ జాబితాలో సర్వీస్ మార్కులు 16 తీసి.. కేవలం అకడమిక్ మార్కులు 10 మాత్రమే వేశారు. దీంతో నా ర్యాంకు మొదటి జాబితా ప్రకారం 35 ఉంటే, సవరణ జాబితాలో ఏకంగా 773కు పోయింది. అలాగే ఒక కాంట్రాక్టు స్టాఫ్ నర్సుకు మొదటి జాబితాలో 500 ర్యాంకు ఉండగా, సవరణ జాబితాలో అది దాదాపు 5 వేలకు చేరింది. మాకు అన్యాయం జరిగినందున న్యాయం చేయాలని కోరుతున్నాం.. – నవనీత, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ -
స్టాఫ్‌నర్సు నియామకాల్లో అక్రమాలు
వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్టాఫ్‌నర్సు అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారు. లోకల్ అభ్యర్థులకు 70 శాతం ఉద్యోగాలివ్వాలన్న నిబంధనను తుంగలో తొక్కి మెరిట్ లిస్ట్ తయారు చేశారు. నాన్‌లోకల్ అభ్యర్థులకు ఉద్యోగాలు కట్టబెట్టి జిల్లా అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారు. ఫలితంగా అర్హుత ఉండీ ఉద్యోగాలు దక్కని వారంతా లబోదిబోమంటున్నారు. అనంతపురం హాస్పిటల్: స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియలో జిల్లా అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఆరోగ్యశాఖ, ఏపీ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉండే పోస్టుల నియామకాలు, ప్రొవిజినల్ మెరిట్ లిస్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీంతో మన జిల్లా అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. వివిధ శాఖల ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా అర్హులకు మొండిచేయి చూపారన్న విమర్శలున్నాయి. పొరుగు జిల్లాలైనా వైఎస్సార్, కర్నూలులో లోకల్, నాన్‌లోకల్ కేటగిరిలో పోస్టులను పక్కాగా భర్తీ చేస్తుంటే ‘అనంత’లో మాత్రం నిబంధనలకు నీళ్లొదిలారు. కాంట్రాక్టు పోస్టుల భర్తీకి... కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం పీహెచ్‌సీలు, సర్వజనాస్పత్రి, సూపర్ స్పెషాలిటీ, ఏరియా ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిన స్టాఫ్‌నర్సు పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇటీవల ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. లోకల్ కాకపోయినా... ఈ నెల 14న 92 స్టాఫ్‌నర్సు పోస్టుల మెరిట్ లిస్టును డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్‌నాథ్ విడుదల చేశారు. మొదటి 28 పోస్టులు అన్‌రిజర్వ్ కేటగిరికి కేటాయించారు. మరో రెండు పోస్టులు పీహెచ్ – హెచ్‌హెచ్ (వికలాంగులు)కు కేటాయించారు. ఇక మిగతా 62 పోస్టులు స్థానికంగా ఉండే వారికి కేటాయించాలి. కానీ వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎ.అమరావతి (జాబితాలో 28వ నంబర్)కి పోస్టింగ్ ఇచ్చారు. అర్హుల జాబితాలోనూ ఈమెను లోకల్‌గానే చూపించారు. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ (సీరియల్ నెంబర్ 64 )ను అర్హుల జాబితాలో లోకల్‌గా చూపించారు. ఇదే విధంగా మరో నలుగురు నాన్‌లోకల్ వారిని లోకల్‌గా చూపించి పోస్టులను కేటాయించారు. ఆరోగ్యశాఖలోనూ... ఈ నెల 5న డీఎంహెచ్ఓ కార్యాలయంలో స్టాఫ్‌నర్సులకు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టులు కేటాయించారు. మొత్తం 77 పోస్టులను భర్తీ చేశారు. అందులో వైఎస్సార్ జిల్లా గాలివీడుకు చెందిన కే.శైలజ (మెరిట్ నంబర్ 43) వర్కింగ్ ప్లేస్‌గా చూపించి పోస్టింగ్ కేటాయించారు. అలాగే మదనపల్లికి చెందిన ఉమాదేవి (సీరియల్ నంబర్ 65 ) , కర్నూలు జిల్లాకు చెందిన టి.సునీత (సీరియల్ నంబర్ 68)ను లోకల్ కేటగిరిలో చూపించారు. మెరిట్, ఫైనల్ మెరిట్ లిస్టుల్లో అభ్యర్థి ఏ ఊరు అనే అంశాన్ని కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. అదేబాటలో వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ పోస్టుల భర్తీలోనూ వైద్య కళాశాల డీఎంహెచ్ఓ, వైద్య విధానపరిషత్ అధికారులు అనుసరిస్తున్న వైఖరిని అవలంభిస్తుండం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మెరిట్ జాబితా ఎంపికపై అవగాహన లేకపోవడంతో పాటు కొందరు అధికారుల అనుయాయులకు పోస్టులు కట్టబెట్టడానికే ఈ అడ్డగోలు బాగోతానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని జిల్లా అభ్యర్థులు కోరుతున్నారు. 92 పోస్టులకు 39 మంది హాజరు అనంతపురం హాస్పిటల్: డీసీహెచ్ఎస్ కార్యాలయంలో డీసీహెచ్ఎస్ రమేష్‌నాథ్ ఆధ్వర్యంలో గురువారం స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించారు. 92 పోస్టులకు గానూ కేవలం 39 మంది అభ్యర్థులు మాత్రమే హాజరుకావడం గమనార్హం. అభ్యర్థుల మెరిట్ లిస్టు ప్రాతిపదికన స్థానాలను కేటాయించారు. అనంతరం డీసీహెచ్ఎస్ రమేష్‌నాథ్ అభ్యర్థులకు ఆర్డర్ కాపీలను అందజేశారు. భర్తీ చేయాల్సిందిలా.. స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీలో 70 శాతం స్థానికులతోనే భర్తీ చేయాలి. 30 శాతం మాత్రం నాన్‌లోకల్ తో పాటు స్థానికులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేయాల్సి ఉంది. భర్తీ చేసిందిలా... 70 శాతం లోకల్ కేటగిరీలోనే నాన్‌లోకల్ వారికి అవకాశమిచ్చి ఉద్యోగాలిచ్చారు. ఫలితంగా జిల్లాకు చెందిన అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. నాన్ లోకల్‌లోనూ మెరిట్ పక్కన పెట్టి జాబితా తయారు చేశారు. తప్పులుంటే సరిచేస్తాం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పోస్టుల భర్తీ జరుగుతుంది. స్టాఫ్‌నర్సు పోస్టుల్లో స్థానిక అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్న విషయంపై మరోసారి జాబితాను పరిశీలిస్తాం. ఏవైనా తప్పులు జరిగి ఉంటే సరిచేసేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోనూ ఇలాంటి సమస్య తలెత్తితే సరి చేసేలా చర్యలు తీసుకున్నాం. – సిరి , జాయింట్ కలెక్టర్ -
స్టాఫ్ నర్సుల ఆందోళన
ఎంజీఎం : వైద్య, ఆరోగ్యశాఖలో కొనసాగుతున్న స్టాప్ నర్సుల బదిలీల్లో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు స్టాఫ్ నర్సులు ఆందోళన చేపట్టారు. ఈమేరకు శుక్రవారం ఉదయం విధులు బహిష్కరించి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంజీఎం ఆస్పత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు.. సిటీ స్కాన్, ఐసీయూ ఆపరేషన్ థియేటర్ వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ పొందినుట్ల సర్టిఫికెట్లు తీసుకుని వచ్చి బదిలీలు కాకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బదిలీల్లో ఇటువంటి సర్టిఫికెట్లకు విలువ లేదని, పీడియాట్రిక్ విభాగంలో 15 రోజుల శిక్షణ ఆశావర్కర్లకు కూడా ఉంటుందని తెలిపారు. ఈ కోర్సులు ఎలాంటి స్పెషలైజేషన్, డిప్లొమా కోర్సుల కిందకు రావని పేర్కొన్నారు. అంతే కాకుండా స్టాఫ్ నర్సులకు రోటేషన్ పద్ధతిలో డ్యూటీలు వేయకపోవడంతోనే చాలా మంది సీటీ ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, పిడియాట్రిక్ వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆన్‌మ్యారీడ్ నర్సింగ్ హాస్టల్లో ఓ హెడ్‌నర్సు ఉంటూ హెచ్‌ఆర్‌ఓఏ తీసుకుంటోందని, ఆరోగ్యశ్రీ డబ్బుల చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంజీఎం సూపరింటెండెంట్ దొడ్డ రమేష్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షురాలు జ్ఞానసుందరి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, హెడనర్సులు స్వరూపారాణి, రోజ్లీనా, స్టాఫ్ నర్సులు సుధామణి, తిరుమల, నర్సమ్మ, ప్రేమలత, సరిత, నాగమణి, జయశీల, ప్రమీల, సుధారాణి, చిన్ని, కళావతి, విమలమ్మ,పావని, సరోజ తదితరులు పాల్గొన్నారు. -
మీడియాకు లెటర్లు రాయడం మానుకోండి..
ఆదోని టౌన్: ‘బుద్ధిగా డ్యూటీలు చేసుకోండి. అనవసరమైన తగవులు పెట్టుకోవద్దు. విభేదాలతో ఆస్పత్రికి చెడ్డపేరు వస్తుంది. మీలో కొంతమంది అధికారులకు, మీడియాకు లెటర్లు రాస్తున్నారు. ఇంతటితో ఆపేయండి. ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. నాకు ఎవరూ లెక్కకాదు. నలుగురు డీసీహెచ్ల్లో కంటే నేనే సీనియర్‌ను. ఎవరు చెప్పినా వినను. గిరిజన ప్రాంతాలకు బదిలీ చేస్తా’ అంటూ స్టాఫ్, హెడ్ నర్సులను ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ రామకృష్ణారావు హెచ్చరించారు. ఆదోని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, మాతా శిశు సంరక్షణ కేంద్రం, ఏరియా ఆస్పత్రిని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై డీసీహెచ్ విచారణ చేశారు. ప్రసవం కోసం వచ్చిన గ్రామీణప్రాంత పేద మహిళలను కొంతమంది డాక్టర్లు, సిబ్బంది భయపెడుతూ ప్రైవేటే ఆసుపత్రులకు తరలించి కమీషన్లు తీసుకుంటున్నారని మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ డీసీహెచ్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రసవం సమయంలో ఒక్కొక్క గర్భిణి నుంచి వెయ్యి, రెండువేలు దాకా వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇందుకు డీసీహెచ్ స్పందిస్తూ ఇక నుంచి విధి నిర్వహణలో ఎవరైన నిర్లక్ష్యంగా వ్యవహరించినా వెంటనే బదిలీ చేస్తానని హెచ్చరించారు. వచ్చేనెలలో ప్రిన్సిపాల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఆదోనిలో పర్యటించనున్నట్లు చెప్పారు. ఈఎస్ఐ ఆస్పత్రి ఆవరణలో ఐదెకరాల స్థలాన్ని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులు పరిశీలన కూడా చేసినట్లు తెలిపారు. బ్లడ్‌బ్యాంక్ ఉద్యోగుల వినతి ఆదోని బ్లడ్ బ్యాంక్, ఆలూరు, ఎమ్మిగనూరు, మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ కేంద్రాల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆరునెలలుగా జీతాలు అందలేదని, దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని డీసీహెచ్కు వినతి పత్రాన్ని సమర్పించారు. -
సజావుగా స్టాఫ్‌నర్సుల కౌన్సెలింగ్
అనంతపురం మెడికల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో స్టాఫ్‌నర్సుల కౌన్సెలింగ్ సజావుగా సాగింది. 24 గంటలు పని చేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీమాంక్ కేంద్రాల్లో 31 పోస్టులకు గాను ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. బుధవారం కౌన్సెలింగ్‌కు ముగ్గురు గైర్హాజరయ్యారు. దీంతో 28 మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేశ్‌నాథ్, సర్వజనాస్పత్రి డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ, సీనియర్ అసిస్టెంట్ అతావుల్లా తదితరులు పాల్గొన్నారు. -
స్టాఫ్ నర్సులకు వేతనాలు మంజూరు
సాక్షి ఎఫెక్ట్ అనంతపురం న్యూసిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలో విధులు నిర్వర్తించే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు గురువారం వేతనాలు మంజూరయ్యాయి. మూడు నెలలుగా వేతనాలు అందక నర్సులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 13న ‘సాక్షి’లో ‘స్టాఫ్‌నర్సుల పస్తులు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై ప్రభుత్వ సర్వజనాస్పత్రి యాజమాన్యం స్పందించింది. 70 మంది కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులకు రెండు నెలలు వేతనాలు ఖాతాల్లో జమ చేశారు. ఇంకో నెల వేతనం ఇవ్వాల్సి ఉంది. -
కోల్డ్‌వార్
– స్టాఫ్‌నర్సులు వర్సెస్ హౌస్‌సర్జన్స్ – విధుల విషయంలో భేదాభిప్రాయాలు – ఓపీ, వార్డు విధులు బహిష్కరించిన వైనం – తీవ్ర ఇబ్బందులు పడిన రోగులు – వైద్యం కోసం గంటల తరబడి నిరీక్షణ – ఎంబీబీఎస్ విద్యార్థులే డాక్టర్లయిన పరిస్థితి – మధ్యాహ్నం వరకు రోగులను డిశ్చార్జ్ చేయని వైనం అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో స్టాఫ్‌నర్సులు, హౌస్సర్జన్ల మధ్య కోల్ట్‌వార్ కొనసాగుతోంది. కొంత కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్నా తాజాగా బహిర్గతమైంది. ఐదు నెలలు కావస్తున్నా స్టైఫండ్ అందడం లేదంటూ హౌస్ సర్జన్లు మంగళవారం సర్వజనాస్పత్రి ఓపీ బ్లాక్ ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సైఫ్ఖాన్తో పాటు కొందరు హౌస్సర్జన్లు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నెలల తరబడి బకాయిలు పెడితే ఎలాగని ప్రశ్నించారు. ఆస్పత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆరోపించారు. ఫలితంగానే దశలవారీగా ఆందోళనకు శ్రీకారం చుట్టామన్నారు. విషయం తెలుసుకున్న ఆర్ఎంఓ డాక్టర్ లలిత అక్కడికొచ్చి మాట్లాడారు. రెండ్రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. డాక్టర్లయి ఉండి ఇలా చేయడం మంచిది కాదని, రోగులను దృష్టిలో ఉంచుకుని విధుల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో వారి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ‘స్టైఫండ్’ డిమాండ్ పక్కకు జరిగి విధుల విషయం తెరమీదకొచ్చింది. క్యాజువాలిటీ మొదలు వార్డులు, ఓపీ వరకు తాము బాధ్యతాయుతంగా పని చేస్తున్నామని హౌస్సర్జన్లు అన్నారు. అయితే స్టాఫ్‌నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇంజెక్షన్లు, సెలైన్ బాటిల్ ఎక్కించడం ఇతరత్రా డ్యూటీల విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. తమకు కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ల నుంచి డాక్టర్ల వరకు చాలా మంది తమకన్నా తక్కువగానే డ్యూటీ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో చివరకు ఆర్ఎంఓతో పాటు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు హౌస్‌సర్జన్లను తమ చాంబర్‌కు పిలిపించి మాట్లాడారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విధుల బహిష్కరణతో రోగుల కష్టాలు వాస్తవానికి హౌస్సర్జన్లు నల్లబ్యాడ్జీలతో కాసేపు నిరసన తెలుపుతామని చెప్పి ఏకంగా ఓపీ, వార్డు విధులను బహిష్కరించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హౌస్సర్జన్లు అందుబాటులో లేకపోయారు. దీంతో ఓపీ, వార్డుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓపీ గదుల్లో ఒక్కో డాక్టర్ మాత్రమే ఉండడంతో గంటల తరబడి రోగులు నిరీక్షించాల్సి వచ్చింది. ఎంబీబీఎస్ విద్యార్థులే వైద్యుల అవతారం ఎత్తి సేవలు అందించారు. ఓపీల్లో నిత్యం ఇద్దరు చొప్పున హౌస్సర్జన్లు విధుల్లో ఉంటారు. వీరు అందుబాటులో లేకపోయే సరిసరికి పరిస్థితి అధ్వానంగా మారింది. డిశ్చార్జ్ కోసం మధ్యాహ్నం వరకు నిరీక్షణ ఆస్పత్రిలో నిత్యం పదుల సంఖ్యలో రోగులు డిశ్చార్జ్ అవుతుంటారు. విధులు బహిష్కరించిన నేపథ్యంలో హౌస్సర్జన్లు అందుబాటులో లేకపోవడంతో చాలామంది అష్టకష్టాలు పడ్డారు. ఎఫ్ఎం వార్డులో సుమారు 20 మందిని డిశ్చార్జ్ చేయగా వారంతా హౌస్సర్జన్ల కోసం మధ్యాహ్నం వరకు వేచి చూశారు. చివరకు 12 గంటల తర్వాత స్టాఫ్‌నర్సులు సమస్యను ఆర్ఎంఓ దృష్టికి తీసుకెళ్లడంతో ఓ హౌస్‌సర్జన్‌ను కేటాయించి.. డిశ్చార్జ్ ప్రక్రియను పూర్తి చేయడం కన్పించింది. ఇదే పరిస్థితి దాదాపు అన్ని వార్డుల్లోనూ నెలకొంది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి ఆస్పత్రిలో పరిస్థితి ఇంత వరకు రావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం 97 మంది వరకు హౌస్సర్జన్లు విధులు నిర్వర్తిస్తుండగా ఏప్రిల్ నెల నుంచి వీరికి స్టైఫండ్ రావాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపలేదు. ఫలితంగానే ఇప్పుడు విధుల బహిష్కరణ వరకు వచ్చింది. -
వైద్యారోగ్యశాఖలో 2,101 పోస్టులు
- భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా - కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిన స్టాఫ్ నర్సులు, పారామెడికల్ ఉద్యోగాలు సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖలో 2,101 పారా మెడికల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేసేందుకు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టు తదితర పారామెడికల్ పోస్టులే కావడం గమనార్హం. వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగాల వారీగా పోస్టులను భర్తీ చేస్తారు. డీఎంఈ పరిధిలో 474, వైద్య విధాన పరిషత్‌లో 270, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం విభాగంలో 1,357 పోస్టులున్నాయి. శాశ్వత నియామకాలు జరిపే వరకు ఈ ఉద్యోగులు కొనసాగుతారని ఉత్తర్వులో తెలిపారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కొందరు కలెక్టర్ల నుంచి వచ్చిన విన్నపం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఇవీ... డీఎంఈ పరిధిలో... పోస్టులు సంఖ్య స్టాఫ్ నర్సులు 279 గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్లు 121 గ్రేడ్–2 ఫార్మసిస్టులు 74 మొత్తం 474 వైద్య విధాన పరిషత్ పరిధిలో.. పోస్టులు సంఖ్య నర్సింగ్ 129 ల్యాబ్ టెక్నీషియన్లు 51 గ్రేడ్–2 ఫార్మసిస్టులు 48 రేడియోగ్రాఫర్లు 42 మొత్తం 270 ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం పరిధిలో.. పోస్టులు సంఖ్య స్టాఫ్ నర్సులు 1,109 గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్లు 131 గ్రేడ్–2 ఫార్మసిస్టులు 100 ఎల్టీ మలేరియా 17 మొత్తం 1,357 -
ఎట్టకేలకు విధుల్లో చేరిన స్టాఫ్‌నర్సులు
► ఆస్పత్రికి వెళ్లి చేర్పించిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రొద్దుటూరు క్రైం: స్థానిక జిల్లా ఆస్పత్రిలో ఉద్యోగం పొందిన స్టాఫ్ నర్సులు ఎట్టకేలకు విధుల్లో చేరారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్వయంగా వారిని తీసుకొని మం గళవారం జిల్లా ఆస్పత్రికి వచ్చారు. మెడికల్ సూపరింటెం డెంట్ లక్ష్మీప్రసాద్‌ను కలసి హైకోర్టు ఆదేశాలను చూపించగా ఆయన స్టాఫ్ నర్సుల సర్టిఫికెట్లను పరిశీలించి విధుల్లో చేర్చుకున్నారు. స్టాఫ్ నర్సులు ధృవ జ్యోతి, అమరావతి, దివ్యలక్ష్మి, సుప్రజ, శోభారాణి, చాముండేశ్వరి, కల్యాణిరాణితోపాటు ఎంబీబీఎస్ డాక్టర్ కీర్తన విధుల్లో చేరారు. ఎమ్మెల్యే చొరవతో పోస్టులు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చొరవతోనే తమకు ఉద్యోగాలు వచ్చాయని స్టాఫ్ నర్సులు తెలిపారు. స్టాఫ్ నర్సులుగా ఎంపికైన ఏడుగురు మహిళలకు గత నెల 20న డీసీహెచ్ఎస్ జయరాజన్ నియామక ఉత్తర్వులు అందజేశారు. వారు ఆర్డర్ కాపీతో జిల్లా ఆస్పత్రికి వెళ్లగా.. టీడీపీ నేతల రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు చేర్చుకోలేదు. నాలుగైదు రోజుల పాటు వారిని ఆస్పత్రి చుట్టూ తిప్పుకొన్నారు. దీంతో నర్సులందరూ ఎమ్మెల్యే రాచమల్లు వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపారు. ప్రభుత్వం నియామక పత్రాలిస్తే ఎందుకు చేర్పించుకోరని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి గత నెల 25న జిల్లా ఆస్పత్రికి వెళ్లి నర్సులతోపాటు ధర్నా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే నర్సులను విధుల్లో చేర్పించుకోవాలని అధికారులను ఆయన డిమాండ్ చేశారు. ఒక వేళ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే, ఎందుకు చేర్చుకోరో అందుకు గల కారణాలను సూచిస్తూ లెటర్ ఇవ్వాలని అడిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెడికల్ సూపరింటెండెంట్ నర్సులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నామంటూ లెటర్ ఇచ్చారు. సూపరింటెండెంట్ ఇచ్చిన లెటర్ ఆధారంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. పరిశీలించిన కోర్టు ఉద్యోగ నియామక కమిటీలో ఉన్న అంశాలను వెంటనే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు రోజుల క్రితమే కోర్టు ఆదేశాలు వచ్చినా, ఆర్డర్ కాపీలు రావడానికి ఆలస్యమైంది. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన స్టాఫ్ నర్సులు విధుల్లో చేరిన అనంతరం నర్సులు, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు స్వీట్ తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సేవ చేయడంలో ఉన్న తృప్తి మరొకటి లేదని, మదర్«థెరీసా స్ఫూర్తితో రోగులకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని స్టాఫ్ నర్సులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి, నాయకులు శేఖర్, షమీమ్‌బాను, బలిమిడి చిన్నరాజా తదితరులు ఉన్నారు. -
సమస్యలతో స్టాఫ్ నర్సుల సతమతం
అసహాయస్థితిలో చేరినప్పుడు అమ్మలా... అక్కలా ఆదరించి అసహ్యిం చుకోకుండా సేవలు చేస్తూ అందరికీ ఆరోగ్యాన్ని అందించే వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రపంచ బ్యాంకు సూచన మేరకు ఉమ్మడి రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖను మూడు విభాగాలుగా విభజించడంతో స్టాఫ్ నర్సుల సీనియారిటీ, పదోన్నతులు, భద్రత, భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. 20, 30 ఏళ్లుగా పని చేసినా పదోన్నతులు రాక చాలా మంది పదవీ విరమణ పొందారు. పోరాడి సాధించుకున్న కొత్త రాష్ట్రంలోనైనా తమ బాధలు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు, డిమాండ్లు పరి ష్కారమవుతాయే మోనన్న గంపెడాశతో సేవాభావమే వృత్తి ధర్మం గల నర్సులందరూ ఎదురు చూస్తున్నారు. స్టాఫ్ నర్సులలో 1. స్టాఫ్‌నర్సు 2. హెడ్ నర్సు, 3. గ్రేడ్-2 నర్సింగ్ సూపరింటెండెంట్ 4. గ్రేడ్-1 నర్సింగ్ సూపరింటెండెంట్ 5. అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ నర్సింగ్ కేటగిరీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో దాదాపు 16 వేల మంది నర్సులుగా పనిచేస్తుండగా, సుమారు 8,600 పోస్టు లు వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో స్టాఫ్ నర్సులు, ఏఎన్ ఎంలు 12,522 మంది గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నా ఇప్పటికీ పర్మనెంట్ చేయలేదు. ఖాళీలు భర్తీ చేయకపోవడం వలన నలుగురి పనిని ఒక్కరే చేస్తూ షిష్ట్ అయిన వెంటనే బయటపడే పరిస్థితి ఉండటం లేదు. నైట్ డ్యూటీలు చేస్తున్న నర్సులకు సెక్యూరిటీ ఉండదు. పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రాంతీయ వైద్యశాలల్లో నర్సులకు దుస్తులు మార్చుకోవడానికి రూములు గానీ ప్రత్యేకంగా టాయ్‌లెట్స్, విశ్రాంతి గదుల్లాంటివి లేవు. కాబట్టి అఖిల భారత సంస్థల్లో మాదిరిగా నర్సింగ్ కేడర్లకు స్టాఫ్ నర్సు, హెడ్ నర్సు, అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెం డెంట్, చీఫ్ నర్సింగ్ అధికారిణి, అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ నర్సింగ్, జాయింట్ డెరైక్టర్‌గా వివిధ కేడర్ పోస్టులను సృష్టించి, కేంద్రం ఇస్తున్న వేతనాల మాదిరిగా రాష్ట్రం కూడా ఇవ్వాలి. నగరాల్లో అద్దె ఇళ్లు దొరక్క, దొరికినా వేలల్లో భరించలేని కిరాయిలతో ఇబ్బందులు పడుతున్నందున, ప్రభుత్వపరంగా గృహాలు నిర్మించి ఇవ్వాలి. నర్సులను ప్రోత్సహిస్తూ గతంలో జాతీయ అవార్డులు ఇచ్చేవారు. ఆగిపోయిన ఈ సంప్రదాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగించాలి. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న నర్సులకు ట్రైబల్ అలవెన్సులు, అత్యవసర పరిస్థితుల్లో, వరదలు, విషరోగాలు, తదితరాల్లో పనిచేసే నర్సులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలి. యూనిఫాం అలవెన్సు కింద రూ.24 వేలు ఇవ్వాలి. ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సులకు సైతం మెరుగైన వేత నాలు అందేటట్లు చూడాలి. హరి అశోక్‌కుమార్ గౌరవాధ్యక్షులు, తెలంగాణ ఉద్యోగుల ఐకాస, జగిత్యాల -
అడ్డదారులు
ఆదిలాబాద్ క్రైం : వైద్యులు, స్టాఫ్‌నర్సులు ఒకరి వెంట ఒకరు వెళ్తుండటంతో రిమ్స్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. వైద్యులు వారి భవిష్యత్తు దృష్ట్యా వెళ్తుండగా, స్టాఫ్ నర్సులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అడ్డదారులు తొక్కుతున్నారు. వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, విధులపై నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా ఒకరి వెంట ఒకరు వెళ్లిపోతుండటంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు 20 మంది నర్సులు వారి సొంత జిల్లాలకు వెళ్లిపోయారు. రిమ్స్‌లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, ఆదిలాబాద్‌లకు చెందిన వారు ఉన్నారు. ఇందులో అత్యధికంగా వరంగల్ జిల్లావారే ఉన్నారు. 240 మంది నర్సులకు 200 మంది ఉన్నారు. ప్రస్తుతం ఉన్న వారిలో 20 మంది హెడ్‌నర్సులు, 180 మంది స్టాఫ్ నర్సులు ఉన్నారు. వీరితోపాటు ఇద్దరు నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఐదుగురు ఎమ్మెస్సీ స్టాఫ్ నర్సులు ఉన్నారు. అయితే ప్రస్తుతం రిమ్స్‌లో నర్సింగ్ కళాశాల మొదటి బ్యాచ్ తరగతులు నడుస్తుండడంతో తప్పనిసరిగా మరో 20 మంది ఎమ్మెస్సీ స్టాఫ్ నర్సులు అవసరం. వీరు టీచింగ్ ఫ్యాకల్టీ కింద బోధన చేస్తారు. ఇంకా రిమ్స్‌కు 50 మంది స్టాఫ్ నర్సులు అవసరమున్నారు. రిమ్స్‌లోనే వీరి సర్వీస్ అవసరం ఉండగా ఇతర జిల్లాలకు రిలీవ్ చేయకూడదని పలువురు పేర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రిలీవ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రిమ్స్‌లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు రెండేళ్ల సర్వీస్ తర్వాత సొంత జిల్లాకు వెళ్లేందుకు రిలీవ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అది కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే రిలీవ్ చేస్తారు. అసలైతే ఐదేళ్ల తర్వాత బదిలీ చేయాలనే నిబంధన ఉంది. స్టాఫ్ నర్సులు నిబంధనలకు విరుద్ధంగా రిలీవ్ అయ్యేందుకు ఆర్డీ(రీజినల్ డెరైక్టర్, వరంగల్) స్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రిమ్స్‌లో వరంగల్ జిల్లాకు చెందిన నర్సులు సుమారు 80 మంది వరకు ఉన్నారు. ఎవరైనా రిలీవ్, డిప్యూటేషన్ మీద వెళ్లాలంటే రిమ్స్ డెరైక్టర్‌ను సంప్రదించాలి. చాలా మంది ఆర్డీకి దరఖాస్తు చేసుకుంటున్నారు. వారం రోజుల క్రితం ఓ స్టాఫ్ నర్సు ఆర్డీ నుంచి రిలీవ్ ఆర్డర్ తెచ్చుకుని వరంగల్‌లోని నర్సింగ్ కళాశాలలో వర్కర్డర్ చేస్తుంది. ఇది డెరైక్టర్ ప్రమేయం లేకుండా జరిగింది. రిలీవ్‌పై పలు అనుమానాలు ఆర్డీ నుంచి రిలీవ్ ఆర్డర్ తెచ్చుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీకాక సదరు నర్సును రిలీవ్ చేసిన ఆర్డీ కూడా ఇటీవల పదవీ విరమణ చేశారు. ఆయన వెళ్లిపోతూనే నిబంధనలు పట్టించుకోకుండా రిలీవ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఇప్పటివరకు 20 మంది వరకు నర్సులు రిమ్స్ నుంచి వరంగల్‌కు వెళ్లిపోయారు. వరంగల్‌కు చెందిన స్టాఫ్ నర్సులు ఎక్కువగా ఉండడంతో అందులోంచి కొంత మంది కమ్యునిటీగా ఏర్పడి, నర్సింగ్ కళాశాల ఉన్నతఅధికారులతో పైరవీలు చేయిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్డీ కార్యాలయంలో కొంత మంది అధికారులను మచ్చికచేసుకొని వారికి కాసులు ఇస్తూ బదిలీ చేసుకుంటున్నట్లు సమాచారం. ఏదేమైన జిల్లాలోని రిమ్స్‌లో అందించాల్సిన సేవలనుపదవీకాలం ముగియకుండానే సొంత జిల్లాలకు వెళ్లేందుకు అడ్డదారులు తొక్కడంపై ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిమ్స్ డెరైక్టర్ శశిధర్‌ను అడుగగా.. రిమ్స్‌కు మరో 50 మంది వరకు నర్సులు అవసరం ఉందన్నారు. వచ్చే ఏడాది నర్సింగ్ కళాశాల రెండో బ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక్కడ ఉన్న స్టాఫ్ నర్సులను రిలీవ్ చేసే ప్రసక్తేలేదని పేర్కొన్నారు.