అడ్డదారులు
ఆదిలాబాద్ క్రైం : వైద్యులు, స్టాఫ్‌నర్సులు ఒకరి వెంట ఒకరు వెళ్తుండటంతో రిమ్స్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. వైద్యులు వారి భవిష్యత్తు దృష్ట్యా వెళ్తుండగా, స్టాఫ్ నర్సులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అడ్డదారులు తొక్కుతున్నారు. వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, విధులపై నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇలా ఒకరి వెంట ఒకరు వెళ్లిపోతుండటంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు 20 మంది నర్సులు వారి సొంత జిల్లాలకు వెళ్లిపోయారు. రిమ్స్‌లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, ఆదిలాబాద్‌లకు చెందిన వారు ఉన్నారు. ఇందులో అత్యధికంగా వరంగల్ జిల్లావారే ఉన్నారు. 240 మంది నర్సులకు 200 మంది ఉన్నారు.
ప్రస్తుతం ఉన్న వారిలో 20 మంది హెడ్‌నర్సులు, 180 మంది స్టాఫ్ నర్సులు ఉన్నారు. వీరితోపాటు ఇద్దరు నర్సింగ్ సూపరింటెండెంట్‌లు, ఐదుగురు ఎమ్మెస్సీ స్టాఫ్ నర్సులు ఉన్నారు. అయితే ప్రస్తుతం రిమ్స్‌లో నర్సింగ్ కళాశాల మొదటి బ్యాచ్ తరగతులు నడుస్తుండడంతో తప్పనిసరిగా మరో 20 మంది ఎమ్మెస్సీ స్టాఫ్ నర్సులు అవసరం. వీరు టీచింగ్ ఫ్యాకల్టీ కింద బోధన చేస్తారు. ఇంకా రిమ్స్‌కు 50 మంది స్టాఫ్ నర్సులు అవసరమున్నారు. రిమ్స్‌లోనే వీరి సర్వీస్ అవసరం ఉండగా ఇతర జిల్లాలకు రిలీవ్ చేయకూడదని పలువురు పేర్కొంటున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా రిలీవ్
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రిమ్స్‌లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు రెండేళ్ల సర్వీస్ తర్వాత సొంత జిల్లాకు వెళ్లేందుకు రిలీవ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అది కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే రిలీవ్ చేస్తారు. అసలైతే ఐదేళ్ల తర్వాత బదిలీ చేయాలనే నిబంధన ఉంది.
స్టాఫ్ నర్సులు నిబంధనలకు విరుద్ధంగా రిలీవ్ అయ్యేందుకు ఆర్డీ(రీజినల్ డెరైక్టర్, వరంగల్) స్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రిమ్స్‌లో వరంగల్ జిల్లాకు చెందిన నర్సులు సుమారు 80 మంది వరకు ఉన్నారు. ఎవరైనా రిలీవ్, డిప్యూటేషన్ మీద వెళ్లాలంటే రిమ్స్ డెరైక్టర్‌ను సంప్రదించాలి. చాలా మంది ఆర్డీకి దరఖాస్తు చేసుకుంటున్నారు. వారం రోజుల క్రితం ఓ స్టాఫ్ నర్సు ఆర్డీ నుంచి రిలీవ్ ఆర్డర్ తెచ్చుకుని వరంగల్‌లోని నర్సింగ్ కళాశాలలో వర్కర్డర్ చేస్తుంది. ఇది డెరైక్టర్ ప్రమేయం లేకుండా జరిగింది.
రిలీవ్‌పై పలు అనుమానాలు
ఆర్డీ నుంచి రిలీవ్ ఆర్డర్ తెచ్చుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీకాక సదరు నర్సును రిలీవ్ చేసిన ఆర్డీ కూడా ఇటీవల పదవీ విరమణ చేశారు. ఆయన వెళ్లిపోతూనే నిబంధనలు పట్టించుకోకుండా రిలీవ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఇప్పటివరకు 20 మంది వరకు నర్సులు రిమ్స్ నుంచి వరంగల్‌కు వెళ్లిపోయారు.
వరంగల్‌కు చెందిన స్టాఫ్ నర్సులు ఎక్కువగా ఉండడంతో అందులోంచి కొంత మంది కమ్యునిటీగా ఏర్పడి, నర్సింగ్ కళాశాల ఉన్నతఅధికారులతో పైరవీలు చేయిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్డీ కార్యాలయంలో కొంత మంది అధికారులను మచ్చికచేసుకొని వారికి కాసులు ఇస్తూ బదిలీ చేసుకుంటున్నట్లు సమాచారం. ఏదేమైన జిల్లాలోని రిమ్స్‌లో అందించాల్సిన సేవలనుపదవీకాలం ముగియకుండానే సొంత జిల్లాలకు వెళ్లేందుకు అడ్డదారులు తొక్కడంపై ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిమ్స్ డెరైక్టర్ శశిధర్‌ను అడుగగా.. రిమ్స్‌కు మరో 50 మంది వరకు నర్సులు అవసరం ఉందన్నారు. వచ్చే ఏడాది నర్సింగ్ కళాశాల రెండో బ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక్కడ ఉన్న స్టాఫ్ నర్సులను రిలీవ్ చేసే ప్రసక్తేలేదని పేర్కొన్నారు.