అడ్డదారిలో క్లినికల్ శిక్షణ! | rims Hospital officials Shortcut clinical training | Sakshi
Sakshi News home page

అడ్డదారిలో క్లినికల్ శిక్షణ!

Published Tue, Apr 15 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM

rims Hospital officials Shortcut clinical training

రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్ : రిమ్స్ ఆస్పత్రి అధికారుల అడ్డగోలు వ్యవహారాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. ఎన్ని ఆరోపణ లు.. విమర్శలు వచ్చినా వారు చలించటం లేదు. తీరు మార్చుకోవటం లేదు. వైద్యవిద్య డెరైక్టర్(డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్-డీఎంఈ) అనుమతి లేకపోయినా ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు క్లినికల్ శిక్షణ ఇచ్చేస్తుండటమే ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది.
 జర గాల్సింది ఇదీ..
 
 జీవో నంబర్ 245 ప్రకారం..  ప్రైవేట్ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు క్లినికల్ శిక్షణను ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో ఇవ్వాలంటే ముం దుగా డీఎంఈ అనుమతి పొందాలి. దీనికోసం నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. దీనిని వైద్యవిద్య డెరైక్టర్ పరిశీలించి.. నర్సింగ్ కళాశాల నిబంధనల ప్రకారం నడుస్తోందని నిర్ధారణ చేసుకున్నాకే అనుమతి ఇస్తారు. ఆ తర్వాతే విద్యార్థినులకు ఆస్పత్రిలో శిక్షణ ఇవ్వాలి.
 ఇదీ జరిగింది..
 
 ఎచ్చెర్ల మండలం తోటపాలెంలోని విజయ నర్సింగ్ కళాశాల, శ్రీకాకుళంలో ఉన్న నారాయణ స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లు కొన్నేళ్లుగా తమ విద్యార్థులకు రిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ శిక్షణ ఇప్పిస్తున్నాయి. ఈ ఏడాది విజయ నర్సింగ్ కళాశాల యాజమాన్యం మాత్రమే డీఎంఈ నుంచి అనుమతి పొందింది. నారాయణ కళాశాల యాజమాన్యానికి అనుమతి రాలేదు. దీం తో ఆ కళాశాల యాజమాన్యం గతేడాది డీఎంఈ ఇచ్చిన అనుమతి పత్రాన్ని జతచేసి ఈ ఏడాది కూడా క్లినికల్ శిక్షణ ఇవ్వాలని కోరుతూ రిమ్స్ డెరైక్టర్‌కు దరఖాస్తు చేసుకుంది. 30 మందికి శిక్షణ కావాలంటూ ఒక్కొక్క విద్యార్థికి రూ.500 చొప్పున మొత్తం రూ.15,000 రూపాయల డీడీని రిమ్స్ కాలేజ్ డెవలప్‌మెంట్ సొసై టీ పేరిట తీసి జతపరిచింది. తెర వెనుక ఏం జరిగిందో కానీ నారాయణ కళాశాల యాజమాన్యానికి రిమ్స్‌అధికారులు దాసోహమయ్యారు. డీఎంఈ అనుమతి లేకున్నా ఈ నెల 1వ తేదీ నుంచి విద్యార్థినులకు శిక్షణ ఇచ్చేస్తున్నారు.
 
 30 మందికి ఫీజు కడితే 75 మందికి శిక్షణ!
 మరో విశేషమేమిటంటే.. నారాయణ కళాశాల యాజమాన్యం కేవలం 30 మంది విద్యార్థులకే ఫీజు చెల్లించగా రిమ్స్ అధికారులు ఏకంగా 75 మందికి ఉదారంగా శిక్షణ ఇచ్చేస్తున్నారు. దీని వల్ల రూ.22,500 రూపాయల మేర ఆస్పత్రి ఆదాయానికి గండి పడింది. దీనివెనుక ఏదో మతలబు ఉందని ఆస్పత్రి వర్గాలే అంటున్నాయి.
 
 అనుమతి రాని మాట వాస్తవమే
 ఈ విషయమై రిమ్స్ నర్సింగ్ సూపరింటెం డెంట్ జ్యోతి సరళను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా నారాయణ నర్సింగ్ స్కూల్ వారికి ఈ ఏడాది డీఎంఈ నుంచి ఎలాంటి అనుమతి రాని మాట వాస్తవమేనని అంగీకరించారు. ప్రస్తుతం సుమారు 75 మంది విద్యార్థినులకు క్లినికల్ శిక్షణను మూడు షిప్టుల్లో ఇస్తున్నామని చెప్పారు. రిమ్స్ డెరైక్టర్ ఊళ్లో లేనందున శిక్షణను ఆపలేదని, ఆయన వచ్చాక ఎలా చెబితే అలా చేస్తామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement