వైద్యుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న రిమ్స్.. | lack of doctors rims | Sakshi
Sakshi News home page

వైద్యుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న రిమ్స్..

Published Mon, Jul 14 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

వైద్యుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న రిమ్స్..

వైద్యుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న రిమ్స్..

ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్) ఆస్పత్రికి గడ్డుకాలం దాపురించింది. అసలే వైద్యుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న రిమ్స్.. ప్రస్తుతం వైద్యులు ఇంటిదారి పట్టడంతో అగమ్యగోచరంగా మారింది. జిల్లావాసులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి 2008లో రూ.121 కోట్లతో రిమ్స్ ప్రారంభించారు. వైఎస్ మరణానంతరం రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి కుంటుపడింది. ఆస్పత్రిలో 21 విభాగాలకు 148 వైద్య పోస్టులు మంజూరు చేశారు. కానీ ఈ పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ కాలేదు.
 
ఇంకా 83 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యమైన విభాగాలకు ప్రొఫెసర్లు లేరు. మెడిసిన్ మైక్రోబయోలజీ, ఫొరెన్సిక్ మెడిసిన్, ఫార్మాకాలేజీ, డెంటిస్టులో ఐదుగురు ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. వైద్యం, విద్యా బోధన చేయడంలో ప్రొఫెసర్లదే కీలకపాత్ర. రెండు నెలల్లో రిమ్స్ డెరైక్టర్, సూపరింటెండెంట్‌ల పదవీ కాలం ముగియనుండటం, వైద్యులు వెళ్లిపోతుండడంతో రిమ్స్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు.
 
వెళ్తున్న ఆంధ్రా, మహారాష్ట్ర వైద్యులు
రిమ్స్‌లో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్టలకు చెందిన వైద్యులు 50 శాతం మంది ఉంటారు. నెల రోజుల్లో రిమ్స్ నుంచి 10 మంది వైద్యులు వెళ్లిపోయారు. బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, మైక్రోబయోలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజ హంసన్, డెంటిస్టు అనిల్‌కుమార్, ఫార్మకాలజీ అసిస్టెం ట్ ప్రొఫెసర్ మహ్మద్‌షాకీర్, సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ షెంగుల్‌వార్‌లతోపాటు పలువురు వైద్యులు విధుల కాలపరిమితి ఉన్నా విధుల నుంచి తప్పుకోవడం గమనార్హం.
 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంతో ఆంధ్రా-మహారాష్ట్రలకు చెందిన వైద్యులు భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల, అధికారుల విభజన జరుపుతుండడంతో రిమ్స్‌లో ఉన్న ఆంధ్రప్రాంతం వారు ఆందోళనతో ముందస్తుగానే వారి ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్నవారు కూడా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన వైద్యులు కూడా తెలంగాణ ఏర్పాటుతోనే వెళ్లిపోతున్నట్లు సమాచారం. రిమ్స్ ప్రారంభం నుంచి ఆంధ్రా-మహారాష్ట్ర వైద్యల మధ్య విభేదాలు ఉన్నాయి. భవిష్యత్తులో సమస్యలు రావచ్చని ముందస్తుగానే ఇంటిముఖం పడుతున్నారు.
 
రూ.లక్షల్లో వేతనాలు
రిమ్స్‌లో పనిచేసే వైద్యులకు భారీగా వేతనాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి నెలకు ప్రొఫెసర్లకు రూ.లక్ష, అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.90 వేలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.75 వేలు, ట్యూటర్లకు రూ.40 వేలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నా రిమ్స్‌లో వైద్యులు పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు. ఎన్నిసార్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నా ఎవరు రావడం లేదు. దీనికి కారణం అధికారులు, పాలకుల నిర్లక్ష్యం. వెనుకబడిన జిల్లాకు దూరభారంతోపాటు, ఇక్కడ వసతులు ఉండవనే భావనతో వైద్యులు రావడం లేదు. దీనికి తోడు పలుమార్లు నిర్వహించిన ఇంటర్వ్యూలు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
 
పాలకుల నిర్లక్ష్యం.. రిమ్స్‌కు శాపం..
పాలకుల నిర్లక్ష్యమే రిమ్స్‌కు శాపంగా మారుతోంది. రూ.కోట్లు వెచ్చించి భవనాలు నిర్మించినా.. వైద్యులకు రూ.లక్షల వేతనాలు చెల్లిస్తున్నా.. ఆస్పత్రి తీరు మారడం లేదు. రిమ్స్‌లో 500 పడకల సామర్థ్యం, అత్యాధునిక వైద్య పరికరాలతో రోగులకు కార్పొరేట్ వైద్యం అందించే అవకాశం ఉంది. ఆస్పత్రి ప్రారంభమై ఐదేళ్లు గడుస్తున్నా సౌకర్యాలు, వైద్యం రోగులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. అత్యాధునిక హంగులతో భవనాలు నిర్మిస్తున్నప్పటికి రోగులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడం లేదు.
 
 ఆస్పత్రిలో వైద్యుల కొరత, పారిశుధ్య, అస్తవ్యస్త నిర్వహణ, పరికరాలు, మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వీటన్నింటిపైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యులకు సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ఇక్కడ ఉండేందుకు వారు విముఖత చూపుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రిమ్స్ అభివృద్ధిని గాలికొదిలేసింది. నిధులు మంజూరులో వివక్ష చూపడంతో రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందలేదు. ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వమైన రిమ్స్‌లో పూర్తిస్థాయిలో వైద్యులు నియమించి, అన్ని రకాల వసుతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement