చివరి మజిలీలో భరోసా | Special Center For Chronic patients In RIMS At Adilabad | Sakshi
Sakshi News home page

చివరి మజిలీలో భరోసా

Published Fri, Feb 15 2019 8:12 AM | Last Updated on Fri, Feb 15 2019 8:12 AM

Special Center For Chronic patients In RIMS At Adilabad - Sakshi

పాలియేటీవ్‌ సేవ కేంద్రంలో ఫిజియోథెరపీ నిర్వహిస్తున్న వైద్యురాలు

ఆదిలాబాద్‌టౌన్‌ : దీర్ఘకాలిక వ్యాధులు నయం కాక నరకయాతన పడుతున్న వ్యాధిగ్రస్తులకు భరోసా ఇచ్చేందుకు రిమ్స్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. చివరి మజిలీలో ప్రశాంత జీవనం గడపడానికి కౌన్సెలింగ్‌తోపాటు వైద్యం చేస్తున్నారు. ఫ్యాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ ద్వారా నయం కాని వ్యాధితో బాధపడుతున్న వారికి మనోధైర్యాన్నిస్తూ భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యంగా కాలేయం, కిడ్నీ, క్యాన్సర్, పక్షవాతం రోగులకు ఈ కేంద్రం ద్వారా చికిత్స అందిస్తున్నారు. వ్యాధి నయం కాదని తెలిసినా చివరి దశలో వారికి చికిత్సలు చేస్తూ ధైర్యం నింపుతున్నారు. అంతే కాకుండా ఆస్పత్రికి రాకుండా ఇంటి వద్ద మంచానికే పరిమితమైన రోగుల ఇళ్లకు చికిత్సలు అందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్, పుండ్లతో మంచం పట్టిన వారికి, పక్షవాతం వల్ల నడవలేని వారికి, కాలేయం, కిడ్నీ పాడైపోయిన వారికి కేంద్రంలో ముఖ్యంగా వైద్యసేవలు అందజేస్తూ మేమున్నామని భరోసానిస్తున్నారు వైద్యులు. 

రిమ్స్‌లో కేంద్రం..
దీర్ఘకాలిక వ్యాధితో మంచానికే పరిమితమై తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతనిచ్చేందుకు ప్యాలియేటీవ్‌ సేవ కేంద్రం రిమ్స్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడ 8 పడకలు అందుబాటులో ఉంచారు. 50శాతం క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తుండగా, మిగతా కాలేయం, కిడ్నీ, క్యాన్సర్, పక్షవాతం వ్యాధిగ్రస్తులకు చికిత్స నిర్వహిస్తున్నారు. బతకడం కష్టమని తెలిసినా ఇంటివద్ద రోగంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇక్కడ చికిత్స అందించి కొంతమేర అయిన నొప్పుల నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు. వారికి ప్రత్యేక భోజనంతోపాటు ఫిజియోథెరపీ, ఇతర చికిత్సలు చేస్తున్నారు. జాతీయ ఆరోగ్యమిషన్‌ ద్వారా పీఆర్‌పీసీ సొసైటీ ద్వారా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. 2018 అక్టోబర్‌ 8వ తేదీన ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. రోగాల బారిన పడి కుటుంబ సభ్యుల నుంచి చేయూతలేని వారికి ముఖ్యంగా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. 

ఇంటి వద్దే వైద్యం.. 
ఆస్పత్రికి రాలేని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇంటి వద్దే వైద్యం అందిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రోగులకు ఈ సేవలు అందజేస్తున్నారు. ప్రత్యేక వాహనం ద్వారా ఇంటికెళ్లి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 392 మందికి హోమ్‌కేర్‌ ద్వారా వైద్యం అందిస్తున్నట్లు ప్యాలియేటీవ్‌ కేంద్రం వైద్యులు తెలిపారు. ప్రతీరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి ఇంటికెళ్లి క్యాన్సర్, పక్షవాతం, కాలేయం వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 120 మంది క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు, 600 మంది ఇతర దీర్ఘకాలిక రోగులకు చికిత్సలు చేసినట్లు వారు చెబుతున్నారు.  

సేవలు ఇలా.. 
రిమ్స్‌లోని మొదటి అంతస్తులో ఈ కేంద్రం ఉంది. ఇక్కడ చేరిన రోగులకు వైద్యం అందించడంతోపాటు భోజనం వసతి కల్పిస్తున్నారు. అలాగే రోగి బంధువుకు కూడా భోజనం అందిస్తున్నారు. ప్రతినెలా 4వ బుధవారం హైదరాబాద్‌ నుంచి సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ (క్యాన్సర్‌ వైద్య నిపుణులు) వీరికి పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. అయితే రోగులకు వైద్యం అందించేందుకు ఒక వైద్యురాలు, ఒక ఫిజియోథెరపిస్ట్, నలుగురు స్టాఫ్‌ నర్సులు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, హోంకేర్‌ వెళ్లేందుకు వాహనం కోసం ఒక డ్రైవర్, నలుగురు కేర్‌గీవర్స్‌ పనిచేస్తున్నారు.

దీర్ఘకాలిక   వ్యాధిగ్రస్తులకు సేవలు 
పాలియేటీవ్‌ సేవ కేంద్రం ద్వారా దీర్ఘకాలిక వ్యాధి నయం కాని వారికి వైద్యసేవలు అందిస్తాం. మంచానికే పరిమితమైన వారికి నొప్పులు తగ్గించడానికి వైద్యసేవలు అందిస్తున్నాం. ఆస్పతికి రాలేని పరిస్థితిలో ఉన్న వారికి 30 కిలోమీటర్ల పరిధిలోని వారి ఇంటికి వెళ్లి వైద్యం చేస్తున్నాం. ప్రశాంత జీవనం గడపడం కోసం రోగులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. ఎవరైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడితే సేవ కేంద్రంలో చేరేందుకు సెల్‌ నం.9492903315లో సంప్రదించవచ్చు. – వెంకటలక్ష్మి, పాలియేటీవ్‌ సేవ కేంద్రం వైద్యురాలు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement