Rajiv Gandhi Institute of Medical Sciences
-
రిమ్స్‌లో కాన్పు కష్టాలు
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో అనస్తీషియా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రసవం కోసం చేరిన గర్భిణులు పురుటి నొప్పులతో అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం రిమ్స్ ఆస్పత్రిలోని ప్రసూతి వార్డులో 58 మంది గర్భిణులు ఉన్నారు. శుక్రవారం అనస్తీషియా (మత్తు) వైద్యులు విధులకు హాజరు కాకపోవడంతో ప్రసవాలు నిలిచిపోయాయి. అత్యవసరంగా ఏడుగురికి కాన్పులు జరగాల్సి ఉన్నా వైద్యులు స్పందించలేదు. దీంతో ముగ్గురిని వారి కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరో నలుగురు గర్భిణులు నొప్పులతో అవస్థలు పడుతూ ఆస్పత్రిలోనే ఉండిపోయారు. కాగా, దీనిపై ఆస్పత్రి ఇన్చార్జి డైరెక్టర్ కరుణాకర్‌ను సంప్రదించగా, ముగ్గురు మత్తు వైద్యులకు గాను ఇద్దరు అనారోగ్య కారణాలవల్ల సెలవులో ఉన్నారని, మరో వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్నారని తెలిపారు. పెద్ద ప్రాణానికి ఏమవుతుందో: షౌకత్ మాది నార్నూర్ మండల కేంద్రం. గర్భిణి అయిన నా భార్య హసీనాకు కడుపు నొప్పి రావడంతో గురువారం రిమ్స్‌కు తీసుకొచ్చాను. ఆస్పత్రిలో స్కానింగ్ చేయించాము. కడుపులోనే పిండం చనిపోయిందని వైద్యులు చెప్పారు. చనిపోయిన పిండాన్ని డాక్టర్లు ఆపరేషన్ చేసి ఇంకా బయటకు తీయలేదు. ఎప్పుడు ఆపరేషన్ చేస్తారని అడిగితే మత్తు డాక్టర్ ఎప్పుడు వస్తే అప్పుడే అని వైద్య సిబ్బంది చెబుతున్నారు. దీంతో పెద్ద ప్రాణానికి ఏమవుతుందోనని ఆందోళనగా ఉంది. -
చివరి మజిలీలో భరోసా
ఆదిలాబాద్‌టౌన్ : దీర్ఘకాలిక వ్యాధులు నయం కాక నరకయాతన పడుతున్న వ్యాధిగ్రస్తులకు భరోసా ఇచ్చేందుకు రిమ్స్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. చివరి మజిలీలో ప్రశాంత జీవనం గడపడానికి కౌన్సెలింగ్‌తోపాటు వైద్యం చేస్తున్నారు. ఫ్యాలియేటివ్ కేర్ సెంటర్ ద్వారా నయం కాని వ్యాధితో బాధపడుతున్న వారికి మనోధైర్యాన్నిస్తూ భరోసా కల్పిస్తున్నారు. ముఖ్యంగా కాలేయం, కిడ్నీ, క్యాన్సర్, పక్షవాతం రోగులకు ఈ కేంద్రం ద్వారా చికిత్స అందిస్తున్నారు. వ్యాధి నయం కాదని తెలిసినా చివరి దశలో వారికి చికిత్సలు చేస్తూ ధైర్యం నింపుతున్నారు. అంతే కాకుండా ఆస్పత్రికి రాకుండా ఇంటి వద్ద మంచానికే పరిమితమైన రోగుల ఇళ్లకు చికిత్సలు అందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్, పుండ్లతో మంచం పట్టిన వారికి, పక్షవాతం వల్ల నడవలేని వారికి, కాలేయం, కిడ్నీ పాడైపోయిన వారికి కేంద్రంలో ముఖ్యంగా వైద్యసేవలు అందజేస్తూ మేమున్నామని భరోసానిస్తున్నారు వైద్యులు. రిమ్స్‌లో కేంద్రం.. దీర్ఘకాలిక వ్యాధితో మంచానికే పరిమితమై తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతనిచ్చేందుకు ప్యాలియేటీవ్ సేవ కేంద్రం రిమ్స్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడ 8 పడకలు అందుబాటులో ఉంచారు. 50శాతం క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తుండగా, మిగతా కాలేయం, కిడ్నీ, క్యాన్సర్, పక్షవాతం వ్యాధిగ్రస్తులకు చికిత్స నిర్వహిస్తున్నారు. బతకడం కష్టమని తెలిసినా ఇంటివద్ద రోగంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇక్కడ చికిత్స అందించి కొంతమేర అయిన నొప్పుల నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు. వారికి ప్రత్యేక భోజనంతోపాటు ఫిజియోథెరపీ, ఇతర చికిత్సలు చేస్తున్నారు. జాతీయ ఆరోగ్యమిషన్ ద్వారా పీఆర్పీసీ సొసైటీ ద్వారా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. 2018 అక్టోబర్ 8వ తేదీన ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. రోగాల బారిన పడి కుటుంబ సభ్యుల నుంచి చేయూతలేని వారికి ముఖ్యంగా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఇంటి వద్దే వైద్యం.. ఆస్పత్రికి రాలేని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇంటి వద్దే వైద్యం అందిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రోగులకు ఈ సేవలు అందజేస్తున్నారు. ప్రత్యేక వాహనం ద్వారా ఇంటికెళ్లి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 392 మందికి హోమ్‌కేర్ ద్వారా వైద్యం అందిస్తున్నట్లు ప్యాలియేటీవ్ కేంద్రం వైద్యులు తెలిపారు. ప్రతీరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి ఇంటికెళ్లి క్యాన్సర్, పక్షవాతం, కాలేయం వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 120 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు, 600 మంది ఇతర దీర్ఘకాలిక రోగులకు చికిత్సలు చేసినట్లు వారు చెబుతున్నారు. సేవలు ఇలా.. రిమ్స్‌లోని మొదటి అంతస్తులో ఈ కేంద్రం ఉంది. ఇక్కడ చేరిన రోగులకు వైద్యం అందించడంతోపాటు భోజనం వసతి కల్పిస్తున్నారు. అలాగే రోగి బంధువుకు కూడా భోజనం అందిస్తున్నారు. ప్రతినెలా 4వ బుధవారం హైదరాబాద్ నుంచి సర్జికల్ ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ వైద్య నిపుణులు) వీరికి పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. అయితే రోగులకు వైద్యం అందించేందుకు ఒక వైద్యురాలు, ఒక ఫిజియోథెరపిస్ట్, నలుగురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ఏఎన్ఎంలు, హోంకేర్ వెళ్లేందుకు వాహనం కోసం ఒక డ్రైవర్, నలుగురు కేర్‌గీవర్స్ పనిచేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సేవలు పాలియేటీవ్ సేవ కేంద్రం ద్వారా దీర్ఘకాలిక వ్యాధి నయం కాని వారికి వైద్యసేవలు అందిస్తాం. మంచానికే పరిమితమైన వారికి నొప్పులు తగ్గించడానికి వైద్యసేవలు అందిస్తున్నాం. ఆస్పతికి రాలేని పరిస్థితిలో ఉన్న వారికి 30 కిలోమీటర్ల పరిధిలోని వారి ఇంటికి వెళ్లి వైద్యం చేస్తున్నాం. ప్రశాంత జీవనం గడపడం కోసం రోగులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఎవరైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడితే సేవ కేంద్రంలో చేరేందుకు సెల్ నం.9492903315లో సంప్రదించవచ్చు. – వెంకటలక్ష్మి, పాలియేటీవ్ సేవ కేంద్రం వైద్యురాలు -
రిమ్స్‌లో... నిర్భయోమెట్రిక్
శ్రీకాకుళం : శ్రీకాకుళంలోని రిమ్స్(రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్)లో గత ఏడాదినుంచే బయోమెట్రిక్ విధానం అమలవుతున్నా అధికారులు నిర్లక్ష్యంతో అది మూలకు చేరింది. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. గడచిన ఆరునెలలుగా బయోమెట్రిక్ హాజరును జిల్లా ఉన్నతాధికారులు పరిశీలిస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కొందరు వైద్యాధికారులు, స్టాఫ్‌నర్సులతో పాటు ఇతర సిబ్బంది తమకు ఇష్టం వచ్చిన సమయంలో వచ్చి నచ్చిపుడు వెళ్లిపోతున్నారు. కొందరు ఉద్యోగులు రెండు, మూడు రోజులకు ఒకసారి వ చ్చి హాజరుపట్టీలో సంతకాలు చేస్తున్నట్లు, స్థానికంగా నివాసం ఉండి కచ్చితంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు చెబుతున్నారు. కొందరు సిబ్బంది తమతోపాటు హాజరుపట్టీలో తమ సహోద్యోగుల సంతకాలను చేసేస్తున్నారని, మరొక రోజున వేరొకరు ఇంకొకరి సంతకాన్ని కూడా హాజరుపట్టీలో చేస్తూ పరస్పరం సహకరించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. గడచిన ఆరునెలలుగా బయోమెట్రిక్ హాజరు, హాజరు పట్టీలో దిద్దుబాట్లు, సంతకాలను పరిశీలిస్తే.. ఎన్నో అక్రమాలు బయటపడతాయని వారు అంటున్నారు. రెండుమూడు రోజులకోసారి వచ్చే కొందరు ఉద్యోగుల హాజరుపట్టీలో చిన్న అక్షరాలతో సీఎల్(సెలవు) నమోదు చేసి, వారు వచ్చాక వాటిపై సంతకాలు చే సేస్తున్నారని ఆక్షేపిస్తున్నారు. రాత్రి వేళ ఇటువంటి వారికి విధులు వేయడం లేదని ఒకవేళ వేసినా వారు హాజరుకావడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇటువంటి వాటిపై ఎన్నోసార్లు మౌకికంగా, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వారంటున్నారు. ఇటీవల ఓ ఉద్యోగి చేసిన ఫిర్యాదు చేయగా ఓ అధికారి హాజరుకానివారికి ఆబ్సెంట్ నమోదు చేశారు. దీంతో ఆయన ఆగ్రహంతో తాము నెలవారీ మామూళ్లిస్తున్నా ఇలా చేస్తారా అంటూ రచ్చరచ్చ చేశారు. అంతేగాదు తమపై ఫిర్యాదు చేసినవారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు పలువురు ఉద్యోగులు బహిరంగంగానే చెబుతున్నారు. జిల్లా అధికారులు జోక్యం చేసుకుని వాస్తవాలు పరిశీలించాలనీ, లేకుంటే ప్రత్యక్ష పోరాటానికి దిగక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై సూపరెండెంటెంట్ డా. సునీల్‌నాయక్ వద్ద సాక్షి ప్రస్తావించగా విధులకు సిబ్బంది సరిగ్గా హాజరుకాని విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరైతే విశాఖపట్నం నుంచి కానీ స్థానికంగా ఉండి కానీ విధులకు హాజరుకావడంలేదో వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. రిమ్స్ స్టాఫ్ ఉదయం 9.30 గంటల లోపల విధులకు హాజరై బయోమెట్రిక్ లో ఎంటర్ చేసుకోవాలని, అలాగే మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత వెళ్లేటప్పుడు కూడా బయోమెట్రిక్‌లో నమోదు చేసుకోవాలన్నారు. సిబ్బంది జీతాలకు బమోమెట్రిక్ను ఇక నుంచి ముడిపెట్టామన్నారు. ఒక వేళ బయోమెట్రిక్ పనిచేయని పక్షంలో రిజిస్టర్లో నైనా సంతకం తప్పనిసరిగా చేయాలన్నారు. ఒకవేళ పది నుంచి పదిహేను రోజులు సెలవుపెడితే డైరక్టర్‌కి ఆ లెటర్ ఇవ్వాలన్నారు. -
పీజీ వైద్యసీట్లు తేవడంలో వైఫల్యం
పేరున్న కళాశాలలకూ పీజీ వైద్య సీట్లు రాలేదు వసతుల్లేక దరఖాస్తు చేయడానికే వెనుకాడిన సర్కారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు పీజీ వైద్యసీట్లను తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. భారతీయ వైద్య మండలి నుంచి ఈ ఏడాది కొత్తగా ఒక్క పీజీ సీటునూ తేలేకపోయింది. ఓ వైపు ప్రైవేటు వైద్య కళాశాలలు ఎంబీబీఎస్‌తోపాటు పీజీ వైద్య సీట్లను తెచ్చుకోవడంలో దూసుకెళుతుంటే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉసూరుమంటున్నాయి. ఏ వైద్య కళాశాలకు సీట్ల కోసం దరఖాస్తు చేద్దామన్నా వసతుల కరువే. మరోవైపు పాఠాలు చెప్పే దిక్కూ లేదు. అందుకే ఈ ఏడాది కొత్తగా పీజీ వైద్య సీట్ల కోసం దరఖాస్తు చేయడానికీ వైద్య విద్యాశాఖ వెనుకాడింది. ప్రధాన కళాశాలలదీ ఇదే పరిస్థితి.. రాష్ట్రంలో కడప, శ్రీకాకుళం, ఒంగోలులో ఉన్న రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్‌లు)ల పరిస్థితి ఎలాగూ బాగాలేదు. కనీసం ప్రధాన కళాశాలలైన ఆంధ్రా మెడికల్ కళాశాల(విశాఖపట్నం), గుంటూరు వైద్య కళాశాల, సిద్ధార్థ(విజయవాడ), రంగరాయ(కాకినాడ) కళాశాలల్లోనూ సీట్ల కోసం సర్కారు దరఖాస్తు చేయలేదు. లెక్చరర్ గ్యాలరీలు, క్యాజువాలిటీ వార్డులు లేకపోవడం, పీజీలకు హాస్టల్ వసతి లేకపోవడం, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కొరత, రోగులకు తగినన్ని పడకలు లేకపోవడం వంటి ఇబ్బందులతో పీజీ వైద్య సీట్లకు దరఖాస్తు చేయలేకపోయారు. ఈ ఏడాది కేవలం అనంతపురం ప్రభుత్వ కళాశాలకు తొలిసారిగా రెండు పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది 678 పీజీ వైద్యసీట్లు ఇప్పటివరకూ భారతీయ వైద్యమండలి అనుమతినిచ్చిన సీట్ల వివరాలను బట్టి ఆంధ్రప్రదేశ్‌లోని 9 ప్రభుత్వ కళాశాలల్లో 678 పీజీ వైద్య, పీజీ డిప్లొమా సీట్లకు కౌన్సెలింగ్ జరగనున్నట్టు సమాచారం. రెండుమూడు సీట్ల తేడాతో గతేడాది కూడా ఇన్నే సీట్లకు కౌన్సెలింగ్ జరిగింది. తొలిసారి ఈ ఏడాది ఆన్లైన్లో పీజీ ఎంట్రెన్స్ జరిగింది. మరికొద్ది రోజుల్లో పీజీ వైద్యసీట్లకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. -
రిమ్స్, కేఎంసీల్లో సూపర్‌స్పెషాలిటీ సేవలు
* రూ.150 కోట్ల చొప్పున వాటి అనుబంధ ఆస్పత్రులకు నిధులు * ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్రం * ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ భవన నిర్మాణాలకు అంగీకారం * కేన్సర్, నెఫ్రాలజీ సహా ఎనిమిది కీలక వైద్య సేవలకు గ్రీన్‌సిగ్నల్ సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) కింద వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల (కేఎంసీ), ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్) ల్లోని అనుబంధ ఆస్పత్రులకు సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు కల్పిస్తూ, అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనల ను ఆమోదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఒక్కో వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రికి పీఎం ఎస్ఎస్వై కింద రూ.150 కోట్లు కేటాయించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రూ.120 కోట్లు కేంద్ర వాటా, రూ.30 కోట్లు రాష్ట్ర వాటా ఉంటుంది. ఆయా ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలను విస్తరించడం, ఆధునిక వైద్య సేవ లు, నిర్ధారణ పరికరాలను అందుబాటులోకి తేవడం ఈ పథకం ప్రధానోద్దేశం. తద్వారా ఆధునిక వైద్యాన్ని జిల్లాలకు అందుబాటులోకి తీసుకురావడం దీని లక్ష్యం. ఈ పథకంపై ఇటీవల పాట్నాలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, వైద్య విద్య సంచాలకుడు పుట్టా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ రెండు అనుబంధ ఆస్పత్రుల్లో చేపట్టాల్సిన పనులు, సేవల ను ఆ సమావేశంలో అధికారులు ప్రతిపాదించా రు. వాటిని ఆమోదిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఆస్పత్రిలో ఎనిమిది సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కేంద్రం ఆమోదించిన ప్రతిపాదనల ప్రకారం... కేఎంసీ, రిమ్స్‌లకు చెందిన అనుబంధ ఆసుపత్రులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తారు. ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటీ భవనాలను నిర్మిస్తారు. ఒక్కో దానిలో 8 వైద్య సేవలకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు కల్పిస్తారు. వరంగల్‌లోని కేఎంసీలో న్యూరో సర్జరీ, న్యూరాలజీ, కార్డియాలజీ, కార్డియో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, కేన్సర్ సంబంధిత జబ్బులకు అధునాతన వైద్య చికిత్సలు అందిస్తారు. రిమ్స్‌లో కూడా దాదాపు ఇటువంటి వైద్య సేవలనే అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ఈ సదుపాయాలతో వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలు, ఆ చుట్టుపక్క జిల్లాల ప్రజలు మెరుగైన వైద్యం కోసం రాజధానికి పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. అంతేగాక, ప్రస్తుతం ఎంబీబీఎస్ కోర్సుకే పరిమితమైన ఆయా క ళాశాలలకు పీజీ సీట్లు కూడా రానున్నాయి. దీంతో మారుమూల గ్రామాల్లోని సామాన్యులకు సమీపంలోనే ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు అంటున్నారు. -
రిమ్స్కష్టాలకు వైద్యం లేదా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లాకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్) అస్పత్రి సవాలక్ష సమస్యలతో అల్లాడుతోంది. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు అందకపోవడంతో అటు వైద్యులు.. ఇటు రోగులు ఇక్కట్లు పడుతున్నారు. రోజుకు సుమారు 500 మంది రోగులకు చికిత్స చేయాల్సిన వైద్యులు సరైన వసతులు లేక ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు ఁరిఫర్రూ. చేసేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే స్తోమత లేని పేద రోగుల ప్రాణాలు మధ్యలోనే హరీమంటున్నాయి. నిధుల మంజూరులో జాప్యం నాలుగేళ్ల క్రితం ఏపీఎండీసీ నుంచి రూ.40 కోట్ల అంచనాతో రిమ్స్ ఆస్పత్రి భవనాల నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇటీవల రూ.12 కోట్లే మంజూరు చేశారు. ఇవి ఏ మూలకూ సరిపోవని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా నిధుల విడుదల జాప్యం.. కోతలతో నిర్మాణ అంచనాలూ తారమారవుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన సూపర్ స్పెషాలిటీ భవనాలు, లిఫ్ట్ నిర్మించాల్సిన అవసరం ఉన్నా సకాలంలో నిధులు రాక పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆస్పత్రి తనిఖీలకు వచ్చినప్పుడు రోగులు ఇదే విషయం ఫిర్యాదు చేశారు. వైద్య సిబ్బంది కూడా సమస్యలు విన్నవించుకున్నా అవన్నీ గాల్లో కలిసిపోయాయి. బడ్జెట్ రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. 13 బ్లాకులకు గాను ఇప్పటికి ఆరు బ్లాకులే పూర్తయ్యాయి. మల్టీ ఐసీయూ వచ్చేనా? గుండెపోటు, తీవ్రగాయాలు, విషం సేవించడం, కాలిన గాయాలు సీరియస్ కేసులకు చికిత్స అందించేందుకు కావాల్సిన మల్టీ ఐసీయూ సౌకర్యం లేకపోవడంతో రోగులు తిరుగుముఖం పడుతున్నారు. వైద్యులు, మందుల కొరతతో పాటు తక్షణ వైద్యానికి కావాల్సిన ప్రత్యేక భవనాలు, ఆపరేషన్ పరికరాలూ ఇక్కడ కరువయ్యాయి. వెంటిలేటర్ లేకపోవడంతో ఆఖరి చూపునకూ రోగులు నోచుకోలేకపోతున్నారు. రూ. కోటి ఖర్చుతో మల్టీ పర్పస్ ఐసీయూ కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఉన్న ఒక్క సాధారణ ఐసీయూకూ పూర్తిస్థాయిలో (24గంటలూ) సాంకేతిక నిపుణులు లేకపోవడంతో ఖరీదైన పరికరాలూ మూలకు చేరాయి. స్పెషల్ వార్డులెక్కడ? ఇతర జిల్లాల్లోని రిమ్స్ ఆస్పత్రుల్లో మాదిరిగా ఇక్కడ కూడా స్నానపు గదులతో కూడిన స్పెషల్ వార్డులను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. స్పెషల్ వార్డులు ఉంటే యూజర్ చార్జీలు వసూలు చేసి ఆ నిధులతో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు వీలవుతుందని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ఒక్క ఆర్ధో విభాగానికే రోజుకు సరాసరి 80 మంది రోగులు వస్తున్నారని, మొత్తం ఆస్పత్రిలో 400 నుంచి 500 మంది ఇన్పేషెంట్లుగా ఉంటున్నారని, అందువల్ల 500 బెడ్లకు సరిపడా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని ఓ వైద్యుడు సూచించారు. జిల్లాలో ఓ మంత్రి, ప్రభుత్వ విప్, ఏడుగురు ఎమ్మెల్యేలున్నా నిధులు సమకూరడం కష్టతరంగా ఉందని వాపోయారు. కనీసం ఇక్కడ పీఆర్వో (ప్రజాసంబంధాల అధికారి) ఉంటే ధనికులు, స్వచ్చంద సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాల నుంచి విరాళాలు సేకరించి తక్షణ వైద్య సేవలకు కావాల్సిన సౌకర్యాలు సమకూరే అవకాశం ఉంటుందని, నేతలు ఈ దిశగా కృషి చేయాలని కోరుతున్నారు. అన్ని ఆపరేషన్లకూ ఒకటే థియేటర్ రిమ్స్‌లో ఒకే ఒక ఆపరేషన్ థియేటర్ ఉండడం కుటుంబ నియంత్రణతోపాటు అన్ని రకాల శస్త్రచికిత్సలు ఇక్కడే చేయాల్సి వస్తోంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చి వ్యాధులు సోకే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంత పెద్ద ఆస్పత్రిలో కనీసం నాలుగు ఆపరేషన్ థియేటర్లయినా ఉండాలంటున్నారు. ఇక గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలు లేకపోవడంతో ఈ రుగ్మతలతో వచ్చే వారిని విశాఖ కేజీహెచ్‌కు పంపించేస్తున్నారు. ఆస్పత్రి అభివృద్ధి నిధులు లేకపోవడంతో ఆస్పత్రి ప్రహరీ నిర్మాణ పనులు ఆగిపోయాయి. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు ఆస్పత్రి నిలయమవుతోంది. ఆస్పత్రికి కావాల్సినంత సంఖ్యలో వీల్చెయిర్లు, స్ట్రెచర్లు లేకపోవడంతో రోగుల ఇక్కట్లు పడుతున్నారు. -
నెరవేరిన కల..
సాక్షి, ఒంగోలు: వైద్యవిద్యార్థుల కల ఎట్టకేలకు నెరవేరింది. జిల్లాలోని రిమ్స్ (రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) వైద్య కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. ఈమేరకు భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) మంగళవారం అనుమతి ఉత్తర్వులను జారీ చేసింది. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి చొరవతో కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించడంతోనే వైద్యసీట్లు దక్కాయి. దీంతో ప్రస్తుతం మూడోఏడాది చదువుతోన్న విద్యార్థులు ఆఖరి (నాల్గో) సంవత్సరం కోర్సును కూడా ఇక్కడ్నే పూర్తిచేసి డాక్టర్ పట్టాతో బయటకు వెళ్లనున్నారు. మొదటి సంవత్సరం అడ్మిషన్ పొందేందుకు ఎంసెట్ కౌన్సెలింగ్‌లో రెండు, మూడో దశల్లో రిమ్స్‌ను కోరుకునే అవకాశం విద్యార్థులకు లభించింది. రిమ్స్‌లో వైద్యకోర్సు ఆరంభించి ఇప్పటికి మూడేళ్లు పూర్తయ్యింది. అయితే, నాలుగో ఏడాదికి ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్లకు తొలుత ఎంసీఐ కొర్రీలేసింది. వారం కిందట ఢిల్లీలో జరిగిన ఎంసీఐ కార్యనిర్వాహక సమావేశంలోనూ ఒంగోలు రిమ్స్‌కు సీట్ల కేటాయింపు లేనట్టేనని నిర్ణయం తీసుకున్నారు. ఎంసీఐ పరిశీలన క్రమంలో వారికి కళాశాల వసతులు, విద్యార్థులకు అవసరమైన ల్యాబ్ సౌకర్యాలు సక్రమంగా లేవనేది కొర్రీలకు ప్రధాన కారణమైంది. ఎంసీఐ నిబంధనల మేరకు పరిస్థితిలో మార్పు కోసం గతంలో కొంత గడువు ఇచ్చినప్పటికీ, రిమ్స్ అధికారులు సద్వినియోగం చేసుకోలేకపోయినట్లు విమర్శలున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని .. తాజాగా రిమ్స్‌కు 100 సీట్లు అడ్మిషన్లకు అనుమతి లభించడం విశేషమని వైద్యవిద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రంతో మాట్లాడటం.. లేఖ ఇవ్వడంతోనే సీట్లు దక్కాయని చెబుతున్నారు. ఈమేరకు రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ అంజయ్యతో పాటు ఆస్పత్రి, కళాశాల సిబ్బంది ఒంగోలు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవానికి ఈసారి ఎంబీబీఎస్ సీట్లు దక్కనట్లైతే, జిల్లాలో వైద్యకోర్సు నడిచే అవకాశముండేది కాదు. జిల్లాలో ఉన్న ఏకైక ప్రభుత్వ వైద్యకళాశాల రిమ్స్ ఒక్కటే.. కనీసం, ప్రయివేటు వైద్యకళాశాలలు కూడా ఇక్కడ లేవు. ప్రతిభగల విద్యార్థులు మొదటి ర్యాంకులు పొంది వైద్యకోర్సు చదివేందుకు జిల్లా నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా రిమ్స్ సీటుపొందే అవకాశం దక్కింది. భవనాల నిర్మాణాలు పూర్తయ్యేదెన్నడు..? జిల్లాకు వైద్య కళాశాలను తీసుకురావడంలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ ప్రశంసనీయం. అప్పటి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కృషితో నగరం నడిబొడ్డున మెడికల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వైద్య కళాశాలకు స్థలం కరువైన క్రమంలో బాలినేని అప్పటి కలెక్టర్‌తో చర్చించి వైద్య కళాశాలకు ఎన్ఎస్పీకి చెందిన 25 ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించారు. రాష్ట్రంలో ప్రారంభించిన నాలుగు రిమ్స్ కళాశాలల్లో ఒంగోలు ఒకటి. మిగతా జిల్లాల రిమ్స్ల్లో కళాశాలల భవనాల నిర్మాణాలు పూర్తయి.. ఒక బ్యాచ్ వైద్య విద్యార్థులు సైతం మెడిసిన్ పట్టా పుచ్చుకున్నారు. ఒంగోలు రిమ్స్ ప్రారంభించి ఆరేళ్లు గడుస్తున్నప్పటికీ, నేటికీ నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రూ.242.31 కోట్ల వ్యయం అంచనాతో నిధులు మంజూరైనా.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ఇంజినీరింగ్ అధికారుల అశ్రద్ధతోనే నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలున్నాయి. పూర్తి సౌకర్యాలున్న హాస్టల్ అందుబాటులోకి తేవడం. ఆస్పత్రి, కళాశాలకు అవసరమైన అత్యవసర సిబ్బంది నివాసముండేందుకు క్వార్టర్ల నిర్మాణం ఇప్పటికైనా పూర్తిచేస్తారని విద్యార్థులు ఆశపడుతున్నారు. అదేవిధంగా రిమ్స్‌కు ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. జనరల్ సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్, ఆర్ధోపెడిక్స్, రేడియాలజీ, టి.బి., సైకాలజీ, జనరల్ మెడిసన్ తదితర విభాగాల్లో ప్రొఫెసర్ల కొరత తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు లేనట్టే..!
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల అశ్రద్ధ వెరసి స్థానిక రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్) పాలిట శాపంగా మారింది. ఎంతో ఉన్నతాశయంతో నిర్మిస్తున్న ఈ మెడికల్ కాలేజీలో మౌలిక వసతుల లేమి కారణంగా ఈ ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం అడ్మిషన్లను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిలిపివేసింది. అంతేగాకుండా ఇప్పటికే ఈ కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఇదే కళాశాలలో నాలుగో సంవత్సరం తరగతులు నిర్వహించేందుకు కూడా అనుమతులు నిరాకరించింది. పలుమార్లు రిమ్స్‌ను సందర్శించి తనిఖీ చేసిన ఎంసీఐ బృందం.. ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం తరగతుల నిర్వహణకు అవసరమైన పరికరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులు ఇక్కడ లేకపోవడంతో ఆ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇక్కడ మూడో సంవత్సరం చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థులను అన్ని వసతులున్న ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేసే ఆలోచనలో ఉంది. అయితే, ఇక్కడే వసతులు, ఇతర సమస్యలు పరిష్కరించి నాలుగో సంవత్సరం తరగతులు నిర్వహిస్తారా..లేకుంటే ఇతర కళాశాలలకు విద్యార్థులను సర్దుబాటు చేస్తారా..? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. నిధులున్నా..నిర్లక్ష్యం... రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్)లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు పూర్తిస్థాయిలో నిధులున్నప్పటికీ అధికారుల చేతగానితనం, కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల నిర్లక్ష్యం కారణంగా చివరకు అడ్మిషన్లు నిలిపివేసే పరిస్థితి నెలకొంది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ఉన్నత లక్ష్యంతో రాష్ట్రంలోని పలుచోట్ల నాలుగు మెడికల్ కళాశాలలు మంజూరు చేశారు. వాటిలో ఒకటి ఒంగోలుకు కేటాయించగా అప్పటి స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో నిర్మాణ పనులు చేపట్టి వేగవంతం చేశారు. అయితే, అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పాలకులు పట్టించుకోకపోవడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పనులు నత్తనడక నడిచాయి. మిగిలిన జిల్లాల్లో దీంతో పాటు నిర్మాణం ప్రారంభించిన మెడికల్ కళాశాలల్లో ప్రస్తుతం ఒక ఎంబీబీఎస్ బ్యాచ్ పట్టా కూడా పుచ్చుకుని వెళ్లిపోయినప్పటికీ.. ఇక్కడ మాత్రం ఆలస్యంగా కళాశాలను ప్రారంభించడం వల్ల ప్రస్తుతం మూడో సంవత్సరం వరకే విద్యార్థులున్నారు. 120 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్రారంభించిన రిమ్స్‌కు ఇప్పటి వరకూ 242.31 కోట్ల రూపాయలు ఖర్చయింది. అయినప్పటికీ కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు నత్తనడకన పనులు నిర్వహిస్తున్నారు. 2013లో గత కాంట్రాక్టర్‌ను తప్పించి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించినప్పటికీ ముందుకు సాగడం లేదు. దీనివల్ల పూర్తిస్థాయిలో వసతులు లేకపోవడంతో పరిశీలించిన ఎంసీఐ బృందం పలు ఆంక్షలు విధించింది. ప్రొఫెసర్ల కొరత కూడా కారణమే... స్థానిక రిమ్స్‌ను ప్రొఫెసర్ల కొరత వేధిస్తోంది. జనరల్ సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్, అర్దోపెడిక్, రేడియాలజీ, టీబీ, సైకాలజీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలకు నేటికీ ప్రొఫెసర్లు లేరు. తరగతులు ప్రారంభించి మూడేళ్లయినప్పటికీ పూర్తిస్థాయిలో వసతులతో పాటు ప్రొఫెసర్లు లేకపోవడంతో ఎంసీఐ బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. మెడికల్ కళాశాల తరగతులు నిర్వహించాలంటే 8 మంది ప్రొఫెసర్లు, 14 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 9 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ఐదుగురు ట్యూటర్లు, 75 మంది ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు అవసరం. కానీ, ఆ మేరకు ఇక్కడ లేకపోవడంతో రిమ్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 200 మంది విద్యార్థులు ఉండాల్సిన హాస్టల్లో 300 మంది ఉంటూ అవస్థపడుతున్నారు. ఇవన్నీ రిమ్స్‌లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు, నాలుగో సంవత్సరం తరగతుల నిర్వహణకు ఆటంకంగా మారాయి. దీనిపై రిమ్స్ డెరైక్టర్ అంజయ్యను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా... రిమ్స్‌లో వసతులు, ఇతర అంశాల పరిశీలనకు మరోసారి రావాల్సిందిగా ఎంసీఐ బృందాన్ని ఆహ్వానించినట్లు తెలిపారు. -
రిమ్స్ తొలి విజయం
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : జిల్లాకే తలమానికంగా ఉన్న రిమ్స్(రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) వైద్య కళాశాల తొలి విజయం సాధించింది. పేద ప్రజలకు వైద్య సేవలందించడమే కాకుండా.. వైద్య విద్యను అభ్యసించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జిల్లా కేంద్రంలో 2008లో రిమ్స్‌ను ప్రారంభించారు. వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి బ్యాచ్ విద్యాభ్యాసం విజయవంతంగా ముగిసింది. ఐదు సంవత్సరాల విద్యతోపాటు, ఒక సంవత్సరం శిక్షణ పూర్తి చేసుకున్న 94 మంది వైద్య విద్యార్థులు సోమవారం డాక్టర్ పట్టాను అందుకున్నారు. భారతదేశంలోనే మొదటి సర్జన్ అయిన సుశ్రుత విగ్రహాన్ని రిమ్స్ వైద్య కళాశాలలో ముందుగా ఆవిష్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన గుస్సాడీ నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం కళాశాల నుంచి ఆడిటోరియం వరకు ర్యాలీగా వెళ్లారు. ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలన చేసి స్వాగత నృత్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ మొదటి న్యూరోసర్జన్ డాక్టర్ రాజారెడ్డి చేతుల మీదుగా విద్యార్థులు గ్రాడ్యుయేట్ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో వైద్య వృత్తి ఎంతో గొప్పదని, ప్రజలకు సేవలు చేసేందుకు ఎంతో కృషి చేస్తుందని అన్నారు. వైద్యులు వ్యక్తిగతంగా కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని కోరారు. వైద్యుడిని దేవునిగా కొలిచే ప్రజలను ఎప్పటికి మరిచిపోకూడదని అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ డాక్టర్గజరావు భూపాల్, రిమ్స్ డెరైక్టర్ శశిధర్, సూపరింటెండెంట్ సురేశ్ చంద్ర తదిత రులు మాట్లాడారు.