శ్రీకాకుళం : శ్రీకాకుళంలోని రిమ్స్(రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్)లో గత ఏడాదినుంచే బయోమెట్రిక్ విధానం అమలవుతున్నా అధికారులు నిర్లక్ష్యంతో అది మూలకు చేరింది. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. గడచిన ఆరునెలలుగా బయోమెట్రిక్ హాజరును జిల్లా ఉన్నతాధికారులు పరిశీలిస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కొందరు వైద్యాధికారులు, స్టాఫ్‌నర్సులతో పాటు ఇతర సిబ్బంది తమకు ఇష్టం వచ్చిన సమయంలో వచ్చి నచ్చిపుడు వెళ్లిపోతున్నారు.
కొందరు ఉద్యోగులు రెండు, మూడు రోజులకు ఒకసారి వ చ్చి హాజరుపట్టీలో సంతకాలు చేస్తున్నట్లు, స్థానికంగా నివాసం ఉండి కచ్చితంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు చెబుతున్నారు. కొందరు సిబ్బంది తమతోపాటు హాజరుపట్టీలో తమ సహోద్యోగుల సంతకాలను చేసేస్తున్నారని, మరొక రోజున వేరొకరు ఇంకొకరి సంతకాన్ని కూడా హాజరుపట్టీలో చేస్తూ పరస్పరం సహకరించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. గడచిన ఆరునెలలుగా బయోమెట్రిక్ హాజరు, హాజరు పట్టీలో దిద్దుబాట్లు, సంతకాలను పరిశీలిస్తే.. ఎన్నో అక్రమాలు బయటపడతాయని వారు అంటున్నారు. రెండుమూడు రోజులకోసారి వచ్చే కొందరు ఉద్యోగుల హాజరుపట్టీలో చిన్న అక్షరాలతో సీఎల్(సెలవు) నమోదు చేసి, వారు వచ్చాక వాటిపై సంతకాలు చే సేస్తున్నారని ఆక్షేపిస్తున్నారు.
రాత్రి వేళ ఇటువంటి వారికి విధులు వేయడం లేదని ఒకవేళ వేసినా వారు హాజరుకావడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇటువంటి వాటిపై ఎన్నోసార్లు మౌకికంగా, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వారంటున్నారు. ఇటీవల ఓ ఉద్యోగి చేసిన ఫిర్యాదు చేయగా ఓ అధికారి హాజరుకానివారికి ఆబ్సెంట్ నమోదు చేశారు. దీంతో ఆయన ఆగ్రహంతో తాము నెలవారీ మామూళ్లిస్తున్నా ఇలా చేస్తారా అంటూ రచ్చరచ్చ చేశారు. అంతేగాదు తమపై ఫిర్యాదు చేసినవారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు పలువురు ఉద్యోగులు బహిరంగంగానే చెబుతున్నారు. జిల్లా అధికారులు జోక్యం చేసుకుని వాస్తవాలు పరిశీలించాలనీ, లేకుంటే ప్రత్యక్ష పోరాటానికి దిగక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
ఈ విషయమై సూపరెండెంటెంట్ డా. సునీల్‌నాయక్ వద్ద సాక్షి ప్రస్తావించగా విధులకు సిబ్బంది సరిగ్గా హాజరుకాని విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరైతే విశాఖపట్నం నుంచి కానీ స్థానికంగా ఉండి కానీ విధులకు హాజరుకావడంలేదో వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. రిమ్స్ స్టాఫ్ ఉదయం 9.30 గంటల లోపల విధులకు హాజరై బయోమెట్రిక్ లో ఎంటర్ చేసుకోవాలని, అలాగే మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత వెళ్లేటప్పుడు కూడా బయోమెట్రిక్‌లో నమోదు చేసుకోవాలన్నారు. సిబ్బంది జీతాలకు బమోమెట్రిక్‌ను ఇక నుంచి ముడిపెట్టామన్నారు. ఒక వేళ బయోమెట్రిక్ పనిచేయని పక్షంలో రిజిస్టర్‌లో నైనా సంతకం తప్పనిసరిగా చేయాలన్నారు. ఒకవేళ పది నుంచి పదిహేను రోజులు సెలవుపెడితే డైరక్టర్‌కి ఆ లెటర్ ఇవ్వాలన్నారు.
రిమ్స్‌లో... నిర్భయోమెట్రిక్
Published Sun, Aug 2 2015 1:17 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement