కళాశాలల దరి చేరని బయోమెట్రిక్ | Biometric did not make it to all of the colleges | Sakshi
Sakshi News home page

కళాశాలల దరి చేరని బయోమెట్రిక్

Published Fri, Aug 7 2015 12:12 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Biometric did not make it to all of the colleges

శ్రీకాకుళం న్యూకాలనీ : సర్కారీ విద్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే దీన్ని అమలు చేయాలని భావించిన ప్రభుత్వం ఆచరణ దిశగా చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తోంది. కళాశాలల్లో విద్యార్థులు గైర్హాజరు కావడంతో ఉత్తీర్ణత శాతం పడిపోతుందని, స్కాలర్‌షిప్ నిధులు పక్కదారిపడుతున్నాయని, అర్హులకు అందడంలేదని, బినామీ పేర్లతో కళాశాలల యాజమన్యాలు భారీ అక్రమాలకు పాల్పడతున్నాయని గుర్తించిన ప్రభుత్వ అందుకు అవసరమైన చర్యలను పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని భావించింది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ అమలు చేసేందుకు మాత్రం మీనమేషాలు లెక్కిస్తుంది.
 
 జిల్లాలో పరిస్థితి..
 జిల్లాలో  43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 11 సాంఘీక, ఐదు గిరిజన, 14 మోడల్ కళాశాలలు ఉన్నాయి. కార్పొరేట్ కళాశాలలను కలుపుకొని మరో 95కుపైగా ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. బీఆర్ ఏయూ అనుబంధంగా 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 90కుపైగా ప్రైవేటు కళాశాలలు, ఎనిమిదికిపైగా పీజీ కోర్సులను అందిస్తున్న కళాశాలతోపాటు తొమ్మిది ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అయితే బయోమెట్రిక్ విధానం ఎక్కడా అమలు కాకపోవడంతో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
 
 తొలుత జూనియర్ కళాశాలల్లోనే.. కానీ!
 బయోమెట్రిక్ విధానాన్ని తొలుత జూనియర్ కళాశాలల్లో అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలతోపాటు సాంఘీక, గిరిజన, గురుకుల సంక్షేమ, మోడల్‌స్కూల్ కాలేజీల్లో విస్తరించాలని భావించింది. ఉదయం కళాశాలకు వచ్చినప్పుడు, తిరిగి ఇళ్లకు వెళ్లే సమయంలో బయోమెట్రిక్ మిషన్‌లో విద్యార్థుల బొటనవేలును ప్రెస్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థి ఆధార్‌కార్డుతో బయోమెట్రిక్‌ను అనుసంధానం చేయాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితిల్లో ఈ పద్ధతిని అమలు చేయడం అంత సులువు కాదని విద్యావేత్తలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సర్కార్ కళాశాలల్లోనే ఈ విధానం అమలు కానప్పుడు ప్రైవేటు కళాశాలల్లో అసలు అమలు చేసే అవకాశం లేదంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement