రిమ్స్‌కష్టాలకు వైద్యం లేదా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లాకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్) అస్పత్రి సవాలక్ష సమస్యలతో అల్లాడుతోంది. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు అందకపోవడంతో అటు వైద్యులు.. ఇటు రోగులు ఇక్కట్లు పడుతున్నారు. రోజుకు సుమారు 500 మంది రోగులకు చికిత్స చేయాల్సిన వైద్యులు సరైన వసతులు లేక ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు ఁరిఫర్‌రూ. చేసేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే స్తోమత లేని పేద రోగుల ప్రాణాలు మధ్యలోనే హరీమంటున్నాయి.
నిధుల మంజూరులో జాప్యం
నాలుగేళ్ల క్రితం ఏపీఎండీసీ నుంచి రూ.40 కోట్ల అంచనాతో రిమ్స్ ఆస్పత్రి భవనాల నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇటీవల రూ.12 కోట్లే మంజూరు చేశారు. ఇవి ఏ మూలకూ సరిపోవని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా నిధుల విడుదల జాప్యం.. కోతలతో నిర్మాణ అంచనాలూ తారమారవుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన సూపర్ స్పెషాలిటీ భవనాలు, లిఫ్ట్ నిర్మించాల్సిన అవసరం ఉన్నా సకాలంలో నిధులు రాక పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆస్పత్రి తనిఖీలకు వచ్చినప్పుడు రోగులు ఇదే విషయం ఫిర్యాదు చేశారు. వైద్య సిబ్బంది కూడా సమస్యలు విన్నవించుకున్నా అవన్నీ గాల్లో కలిసిపోయాయి. బడ్జెట్ రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. 13 బ్లాకులకు గాను ఇప్పటికి ఆరు బ్లాకులే పూర్తయ్యాయి.
మల్టీ ఐసీయూ వచ్చేనా?
గుండెపోటు, తీవ్రగాయాలు, విషం సేవించడం, కాలిన గాయాలు సీరియస్ కేసులకు చికిత్స అందించేందుకు కావాల్సిన మల్టీ ఐసీయూ సౌకర్యం లేకపోవడంతో రోగులు తిరుగుముఖం పడుతున్నారు. వైద్యులు, మందుల కొరతతో పాటు తక్షణ వైద్యానికి కావాల్సిన ప్రత్యేక భవనాలు, ఆపరేషన్ పరికరాలూ ఇక్కడ కరువయ్యాయి. వెంటిలేటర్ లేకపోవడంతో ఆఖరి చూపునకూ రోగులు నోచుకోలేకపోతున్నారు. రూ. కోటి ఖర్చుతో మల్టీ పర్పస్ ఐసీయూ కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఉన్న ఒక్క సాధారణ ఐసీయూకూ పూర్తిస్థాయిలో (24గంటలూ) సాంకేతిక నిపుణులు లేకపోవడంతో ఖరీదైన పరికరాలూ మూలకు చేరాయి.
స్పెషల్ వార్డులెక్కడ?
ఇతర జిల్లాల్లోని రిమ్స్ ఆస్పత్రుల్లో మాదిరిగా ఇక్కడ కూడా స్నానపు గదులతో కూడిన స్పెషల్ వార్డులను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. స్పెషల్ వార్డులు ఉంటే యూజర్ చార్జీలు వసూలు చేసి ఆ నిధులతో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు వీలవుతుందని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ఒక్క ఆర్ధో విభాగానికే రోజుకు సరాసరి 80 మంది రోగులు వస్తున్నారని, మొత్తం ఆస్పత్రిలో 400 నుంచి 500 మంది ఇన్‌పేషెంట్లుగా ఉంటున్నారని, అందువల్ల 500 బెడ్లకు సరిపడా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని ఓ వైద్యుడు సూచించారు. జిల్లాలో ఓ మంత్రి, ప్రభుత్వ విప్, ఏడుగురు ఎమ్మెల్యేలున్నా నిధులు సమకూరడం కష్టతరంగా ఉందని వాపోయారు. కనీసం ఇక్కడ పీఆర్‌వో (ప్రజాసంబంధాల అధికారి) ఉంటే ధనికులు, స్వచ్చంద సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాల నుంచి విరాళాలు సేకరించి తక్షణ వైద్య సేవలకు కావాల్సిన సౌకర్యాలు సమకూరే అవకాశం ఉంటుందని, నేతలు ఈ దిశగా కృషి చేయాలని కోరుతున్నారు.
అన్ని ఆపరేషన్లకూ ఒకటే థియేటర్
రిమ్స్‌లో ఒకే ఒక ఆపరేషన్ థియేటర్ ఉండడం కుటుంబ నియంత్రణతోపాటు అన్ని రకాల శస్త్రచికిత్సలు ఇక్కడే చేయాల్సి వస్తోంది. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చి వ్యాధులు సోకే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంత పెద్ద ఆస్పత్రిలో కనీసం నాలుగు ఆపరేషన్ థియేటర్లయినా ఉండాలంటున్నారు. ఇక గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలు లేకపోవడంతో ఈ రుగ్మతలతో వచ్చే వారిని విశాఖ కేజీహెచ్‌కు పంపించేస్తున్నారు. ఆస్పత్రి అభివృద్ధి నిధులు లేకపోవడంతో ఆస్పత్రి ప్రహరీ నిర్మాణ పనులు ఆగిపోయాయి. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు ఆస్పత్రి నిలయమవుతోంది. ఆస్పత్రికి కావాల్సినంత సంఖ్యలో వీల్‌చెయిర్లు, స్ట్రెచర్లు లేకపోవడంతో రోగుల ఇక్కట్లు పడుతున్నారు.