ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల అశ్రద్ధ వెరసి స్థానిక రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్) పాలిట శాపంగా మారింది. ఎంతో ఉన్నతాశయంతో నిర్మిస్తున్న ఈ మెడికల్ కాలేజీలో మౌలిక వసతుల లేమి కారణంగా ఈ ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం అడ్మిషన్లను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిలిపివేసింది.
అంతేగాకుండా ఇప్పటికే ఈ కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఇదే కళాశాలలో నాలుగో సంవత్సరం తరగతులు నిర్వహించేందుకు కూడా అనుమతులు నిరాకరించింది. పలుమార్లు రిమ్స్‌ను సందర్శించి తనిఖీ చేసిన ఎంసీఐ బృందం.. ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం తరగతుల నిర్వహణకు అవసరమైన పరికరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులు ఇక్కడ లేకపోవడంతో ఆ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఇక్కడ మూడో సంవత్సరం చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థులను అన్ని వసతులున్న ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేసే ఆలోచనలో ఉంది. అయితే, ఇక్కడే వసతులు, ఇతర సమస్యలు పరిష్కరించి నాలుగో సంవత్సరం తరగతులు నిర్వహిస్తారా..లేకుంటే ఇతర కళాశాలలకు విద్యార్థులను సర్దుబాటు చేస్తారా..? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
నిధులున్నా..నిర్లక్ష్యం...
రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్)లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు పూర్తిస్థాయిలో నిధులున్నప్పటికీ అధికారుల చేతగానితనం, కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల నిర్లక్ష్యం కారణంగా చివరకు అడ్మిషన్లు నిలిపివేసే పరిస్థితి నెలకొంది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ఉన్నత లక్ష్యంతో రాష్ట్రంలోని పలుచోట్ల నాలుగు మెడికల్ కళాశాలలు మంజూరు చేశారు. వాటిలో ఒకటి ఒంగోలుకు కేటాయించగా అప్పటి స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో నిర్మాణ పనులు చేపట్టి వేగవంతం చేశారు.
అయితే, అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పాలకులు పట్టించుకోకపోవడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పనులు నత్తనడక నడిచాయి. మిగిలిన జిల్లాల్లో దీంతో పాటు నిర్మాణం ప్రారంభించిన మెడికల్ కళాశాలల్లో ప్రస్తుతం ఒక ఎంబీబీఎస్ బ్యాచ్ పట్టా కూడా పుచ్చుకుని వెళ్లిపోయినప్పటికీ.. ఇక్కడ మాత్రం ఆలస్యంగా కళాశాలను ప్రారంభించడం వల్ల ప్రస్తుతం మూడో సంవత్సరం వరకే విద్యార్థులున్నారు. 120 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్రారంభించిన రిమ్స్‌కు ఇప్పటి వరకూ 242.31 కోట్ల రూపాయలు ఖర్చయింది. అయినప్పటికీ కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు నత్తనడకన పనులు నిర్వహిస్తున్నారు. 2013లో గత కాంట్రాక్టర్‌ను తప్పించి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించినప్పటికీ ముందుకు సాగడం లేదు. దీనివల్ల పూర్తిస్థాయిలో వసతులు లేకపోవడంతో పరిశీలించిన ఎంసీఐ బృందం పలు ఆంక్షలు విధించింది.
ప్రొఫెసర్ల కొరత కూడా కారణమే...
స్థానిక రిమ్స్‌ను ప్రొఫెసర్ల కొరత వేధిస్తోంది. జనరల్ సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్, అర్దోపెడిక్, రేడియాలజీ, టీబీ, సైకాలజీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలకు నేటికీ ప్రొఫెసర్లు లేరు. తరగతులు ప్రారంభించి మూడేళ్లయినప్పటికీ పూర్తిస్థాయిలో వసతులతో పాటు ప్రొఫెసర్లు లేకపోవడంతో ఎంసీఐ బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. మెడికల్ కళాశాల తరగతులు నిర్వహించాలంటే 8 మంది ప్రొఫెసర్లు, 14 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 9 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ఐదుగురు ట్యూటర్లు, 75 మంది ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు అవసరం.
కానీ, ఆ మేరకు ఇక్కడ లేకపోవడంతో రిమ్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 200 మంది విద్యార్థులు ఉండాల్సిన హాస్టల్‌లో 300 మంది ఉంటూ అవస్థపడుతున్నారు. ఇవన్నీ రిమ్స్‌లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు, నాలుగో సంవత్సరం తరగతుల నిర్వహణకు ఆటంకంగా మారాయి. దీనిపై రిమ్స్ డెరైక్టర్ అంజయ్యను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా... రిమ్స్‌లో వసతులు, ఇతర అంశాల పరిశీలనకు మరోసారి రావాల్సిందిగా ఎంసీఐ బృందాన్ని ఆహ్వానించినట్లు తెలిపారు.
మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు లేనట్టే..!
Published Sat, May 17 2014 2:53 AM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM
Advertisement