సాక్షి, ఒంగోలు: వైద్యవిద్యార్థుల కల ఎట్టకేలకు నెరవేరింది. జిల్లాలోని రిమ్స్ (రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) వైద్య కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. ఈమేరకు భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) మంగళవారం అనుమతి ఉత్తర్వులను జారీ చేసింది.
ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి చొరవతో కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించడంతోనే వైద్యసీట్లు దక్కాయి. దీంతో ప్రస్తుతం మూడోఏడాది చదువుతోన్న విద్యార్థులు ఆఖరి (నాల్గో) సంవత్సరం కోర్సును కూడా ఇక్కడ్నే పూర్తిచేసి డాక్టర్ పట్టాతో బయటకు వెళ్లనున్నారు. మొదటి సంవత్సరం అడ్మిషన్ పొందేందుకు ఎంసెట్ కౌన్సెలింగ్‌లో రెండు, మూడో దశల్లో రిమ్స్‌ను కోరుకునే అవకాశం విద్యార్థులకు లభించింది. రిమ్స్‌లో వైద్యకోర్సు ఆరంభించి ఇప్పటికి మూడేళ్లు పూర్తయ్యింది.
అయితే, నాలుగో ఏడాదికి ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్లకు తొలుత ఎంసీఐ కొర్రీలేసింది. వారం కిందట ఢిల్లీలో జరిగిన ఎంసీఐ కార్యనిర్వాహక సమావేశంలోనూ ఒంగోలు రిమ్స్‌కు సీట్ల కేటాయింపు లేనట్టేనని నిర్ణయం తీసుకున్నారు. ఎంసీఐ పరిశీలన క్రమంలో వారికి కళాశాల వసతులు, విద్యార్థులకు అవసరమైన ల్యాబ్ సౌకర్యాలు సక్రమంగా లేవనేది కొర్రీలకు ప్రధాన కారణమైంది. ఎంసీఐ నిబంధనల మేరకు పరిస్థితిలో మార్పు కోసం గతంలో కొంత గడువు ఇచ్చినప్పటికీ, రిమ్స్ అధికారులు సద్వినియోగం చేసుకోలేకపోయినట్లు విమర్శలున్నాయి.
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ..
తాజాగా రిమ్స్‌కు 100 సీట్లు అడ్మిషన్‌లకు అనుమతి లభించడం విశేషమని వైద్యవిద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రంతో మాట్లాడటం.. లేఖ ఇవ్వడంతోనే సీట్లు దక్కాయని చెబుతున్నారు. ఈమేరకు రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ అంజయ్యతో పాటు ఆస్పత్రి, కళాశాల సిబ్బంది ఒంగోలు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
వాస్తవానికి ఈసారి ఎంబీబీఎస్ సీట్లు దక్కనట్లైతే, జిల్లాలో వైద్యకోర్సు నడిచే అవకాశముండేది కాదు. జిల్లాలో ఉన్న ఏకైక ప్రభుత్వ వైద్యకళాశాల రిమ్స్ ఒక్కటే.. కనీసం, ప్రయివేటు వైద్యకళాశాలలు కూడా ఇక్కడ లేవు. ప్రతిభగల విద్యార్థులు మొదటి ర్యాంకులు పొంది వైద్యకోర్సు చదివేందుకు జిల్లా నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా రిమ్స్ సీటుపొందే అవకాశం దక్కింది.
భవనాల నిర్మాణాలు పూర్తయ్యేదెన్నడు..?
జిల్లాకు వైద్య కళాశాలను తీసుకురావడంలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ ప్రశంసనీయం. అప్పటి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కృషితో నగరం నడిబొడ్డున మెడికల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వైద్య కళాశాలకు స్థలం కరువైన క్రమంలో బాలినేని అప్పటి కలెక్టర్‌తో చర్చించి వైద్య కళాశాలకు ఎన్‌ఎస్‌పీకి చెందిన 25 ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించారు.
రాష్ట్రంలో ప్రారంభించిన నాలుగు రిమ్స్ కళాశాలల్లో ఒంగోలు ఒకటి. మిగతా జిల్లాల రిమ్స్‌ల్లో కళాశాలల భవనాల నిర్మాణాలు పూర్తయి.. ఒక బ్యాచ్ వైద్య విద్యార్థులు సైతం మెడిసిన్ పట్టా పుచ్చుకున్నారు. ఒంగోలు రిమ్స్ ప్రారంభించి ఆరేళ్లు గడుస్తున్నప్పటికీ, నేటికీ నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రూ.242.31 కోట్ల వ్యయం అంచనాతో నిధులు మంజూరైనా.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ఇంజినీరింగ్ అధికారుల అశ్రద్ధతోనే నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలున్నాయి.
పూర్తి సౌకర్యాలున్న హాస్టల్ అందుబాటులోకి తేవడం. ఆస్పత్రి, కళాశాలకు అవసరమైన అత్యవసర సిబ్బంది నివాసముండేందుకు క్వార్టర్ల నిర్మాణం ఇప్పటికైనా పూర్తిచేస్తారని విద్యార్థులు ఆశపడుతున్నారు. అదేవిధంగా రిమ్స్‌కు ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. జనరల్ సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్, ఆర్ధోపెడిక్స్, రేడియాలజీ, టి.బి., సైకాలజీ, జనరల్ మెడిసన్ తదితర విభాగాల్లో ప్రొఫెసర్ల కొరత తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.
నెరవేరిన కల..
Published Wed, Jul 9 2014 3:11 AM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM
Advertisement
Advertisement