- పేరున్న కళాశాలలకూ పీజీ వైద్య సీట్లు రాలేదు
- వసతుల్లేక దరఖాస్తు చేయడానికే వెనుకాడిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు పీజీ వైద్యసీట్లను తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. భారతీయ వైద్య మండలి నుంచి ఈ ఏడాది కొత్తగా ఒక్క పీజీ సీటునూ తేలేకపోయింది. ఓ వైపు ప్రైవేటు వైద్య కళాశాలలు ఎంబీబీఎస్‌తోపాటు పీజీ వైద్య సీట్లను తెచ్చుకోవడంలో దూసుకెళుతుంటే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉసూరుమంటున్నాయి. ఏ వైద్య కళాశాలకు సీట్ల కోసం దరఖాస్తు చేద్దామన్నా వసతుల కరువే. మరోవైపు పాఠాలు చెప్పే దిక్కూ లేదు. అందుకే ఈ ఏడాది కొత్తగా పీజీ వైద్య సీట్ల కోసం దరఖాస్తు చేయడానికీ వైద్య విద్యాశాఖ వెనుకాడింది.
ప్రధాన కళాశాలలదీ ఇదే పరిస్థితి..
రాష్ట్రంలో కడప, శ్రీకాకుళం, ఒంగోలులో ఉన్న రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్‌లు)ల పరిస్థితి ఎలాగూ బాగాలేదు. కనీసం ప్రధాన కళాశాలలైన ఆంధ్రా మెడికల్ కళాశాల(విశాఖపట్నం), గుంటూరు వైద్య కళాశాల, సిద్ధార్థ(విజయవాడ), రంగరాయ(కాకినాడ) కళాశాలల్లోనూ సీట్ల కోసం సర్కారు దరఖాస్తు చేయలేదు. లెక్చరర్ గ్యాలరీలు, క్యాజువాలిటీ వార్డులు లేకపోవడం, పీజీలకు హాస్టల్ వసతి లేకపోవడం, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కొరత, రోగులకు తగినన్ని పడకలు లేకపోవడం వంటి ఇబ్బందులతో పీజీ వైద్య సీట్లకు దరఖాస్తు చేయలేకపోయారు. ఈ ఏడాది కేవలం అనంతపురం ప్రభుత్వ కళాశాలకు తొలిసారిగా రెండు పీజీ సీట్లు మంజూరయ్యాయి.
ఈ ఏడాది 678 పీజీ వైద్యసీట్లు
ఇప్పటివరకూ భారతీయ వైద్యమండలి అనుమతినిచ్చిన సీట్ల వివరాలను బట్టి ఆంధ్రప్రదేశ్‌లోని 9 ప్రభుత్వ కళాశాలల్లో 678 పీజీ వైద్య, పీజీ డిప్లొమా సీట్లకు కౌన్సెలింగ్ జరగనున్నట్టు సమాచారం. రెండుమూడు సీట్ల తేడాతో గతేడాది కూడా ఇన్నే సీట్లకు కౌన్సెలింగ్ జరిగింది. తొలిసారి ఈ ఏడాది ఆన్‌లైన్‌లో పీజీ ఎంట్రెన్స్ జరిగింది. మరికొద్ది రోజుల్లో పీజీ వైద్యసీట్లకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహించనుంది.