గాంధీనగర్: విద్యాసంస్థలోని సీనియర్ల ర్యాగింగ్‌కు ఓ విద్యాకుసుమం నేల రాలింది. ఈ ఘటన గుజరాత్‌లోని ఓ మెడికల్ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అనిల్ మథానియా అనే విద్యార్థి ఈ ఏడాది ధర్‌పూర్ పటాన్‌లోని జీఎంఈఆర్‌ఎస్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు.
హాస్టల్‌లోని తృతీయ సంవత్సరం విద్యార్థులు అనిల్‌ను పరిచయం పేరిట మూడు గంటల పాటు కదలకుండా నిలబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతసేపు నిలుచుకున్న అనిల్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో తోటి విద్యార్థులు అతనిని ఆస్పత్రికి తరలించారు. బాధిత విద్యార్థి తనను సీనియర్లు మూడు గంటల పాటు నిలబెట్టారని కాలేజీ యాజమాన్యానికి తెలిపాడు. చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందాడు. పోలీసులు అనిల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక అనిల్ మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
అనిల్ బంధువు ధర్మేంద్ర మీడియాతో మాట్లాడుతూ ‘అనిల్ కుటుంబం గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఉంటుంది. ఇది పటాన్‌లోని కళాశాలకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిన్న మాకు కాలేజీ నుండి ఫోన్ వచ్చింది. అనిల్ అపస్మారక స్థితిలో ఉన్నాడని, అతనిని ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు. తాము ఇక్కడికి చేరుకోగా, అనిల్‌ను మూడవ సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేసారని తెలిసింది. దీనిపై వెంటనే పోలీసులు దర్యాప్తు చేసి, తమకు న్యాయం చేయాలని’ కోరారు.
మెడికల్ కాలేజీ డీన్ హార్దిక్ షా మాట్లాడుతూ ‘అనిల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడని గుర్తించిన వెంటనే, అతన్ని ఆస్పత్రికి తరలించాం. ఆ సమయంలో అనిల్ తనను సీనియర్లు ర్యాగింగ్ చేశారని, మూడు గంటల పాటు నిలబెట్టాడని తెలిపాడు. ఈ విషయాన్ని మేము పోలీసులు, అనిల్ కుటుంబ సభ్యులకు తెలియజేశాం. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.
విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు ఇది ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా ముందుగా కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి కెకె పాండ్యా తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అందాక, దానిలోని వివరాల ఆధారంగా తదిపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాలేజీలో ర్యాగింగ్‌పై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గతంలోనే క్యాంపస్‌లలో ర్యాగింగ్‌ను నిషేధించింది. ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కళాశాల యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
ఇది కూడా చదవండి: స్విమ్మింగ్ పూల్‌లో గంతులేస్తూ..
Comments
Please login to add a commentAdd a comment