ఎట్టకేలకు విధుల్లో చేరిన స్టాఫ్‌నర్సులు
► ఆస్పత్రికి వెళ్లి చేర్పించిన ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక జిల్లా ఆస్పత్రిలో ఉద్యోగం పొందిన స్టాఫ్ నర్సులు ఎట్టకేలకు విధుల్లో చేరారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్వయంగా వారిని తీసుకొని మం గళవారం జిల్లా ఆస్పత్రికి వచ్చారు. మెడికల్ సూపరింటెం డెంట్ లక్ష్మీప్రసాద్‌ను కలసి హైకోర్టు ఆదేశాలను చూపించగా ఆయన స్టాఫ్ నర్సుల సర్టిఫికెట్‌లను పరిశీలించి విధుల్లో చేర్చుకున్నారు. స్టాఫ్ నర్సులు ధృవ జ్యోతి, అమరావతి, దివ్యలక్ష్మి, సుప్రజ, శోభారాణి, చాముండేశ్వరి, కల్యాణిరాణితోపాటు ఎంబీబీఎస్ డాక్టర్ కీర్తన విధుల్లో చేరారు.
ఎమ్మెల్యే చొరవతో పోస్టులు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చొరవతోనే తమకు ఉద్యోగాలు వచ్చాయని స్టాఫ్ నర్సులు తెలిపారు. స్టాఫ్ నర్సులుగా ఎంపికైన ఏడుగురు మహిళలకు గత నెల 20న డీసీహెచ్‌ఎస్ జయరాజన్ నియామక ఉత్తర్వులు అందజేశారు. వారు ఆర్డర్ కాపీతో జిల్లా ఆస్పత్రికి వెళ్లగా.. టీడీపీ నేతల రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు చేర్చుకోలేదు. నాలుగైదు రోజుల పాటు వారిని ఆస్పత్రి చుట్టూ తిప్పుకొన్నారు. దీంతో నర్సులందరూ ఎమ్మెల్యే రాచమల్లు వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపారు.
ప్రభుత్వం నియామక పత్రాలిస్తే ఎందుకు చేర్పించుకోరని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి గత నెల 25న జిల్లా ఆస్పత్రికి వెళ్లి నర్సులతోపాటు ధర్నా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే నర్సులను విధుల్లో చేర్పించుకోవాలని అధికారులను ఆయన డిమాండ్ చేశారు. ఒక వేళ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే, ఎందుకు చేర్చుకోరో అందుకు గల కారణాలను సూచిస్తూ లెటర్ ఇవ్వాలని అడిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెడికల్ సూపరింటెండెంట్ నర్సులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నామంటూ లెటర్ ఇచ్చారు.
సూపరింటెండెంట్ ఇచ్చిన లెటర్ ఆధారంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. పరిశీలించిన కోర్టు ఉద్యోగ నియామక కమిటీలో ఉన్న అంశాలను వెంటనే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు రోజుల క్రితమే కోర్టు ఆదేశాలు వచ్చినా, ఆర్డర్ కాపీలు రావడానికి ఆలస్యమైంది.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన స్టాఫ్ నర్సులు
విధుల్లో చేరిన అనంతరం నర్సులు, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు స్వీట్ తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సేవ చేయడంలో ఉన్న తృప్తి మరొకటి లేదని, మదర్«థెరీసా స్ఫూర్తితో రోగులకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని స్టాఫ్ నర్సులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి, నాయకులు శేఖర్, షమీమ్‌బాను, బలిమిడి చిన్నరాజా తదితరులు ఉన్నారు.