బదిలీల కౌన్సెలింగ్ తాత్కాలిక వాయిదా
కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల రోడ్డును దిగ్బంధనం చేసిన వేలాది మంది స్టాఫ్ నర్సులు
భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్, సుల్తాన్‌బజార్: వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న హెడ్ నర్సు, స్టాఫ్ నర్సుల కౌన్సెలింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ నర్సులు చేపట్టిన ఆందోళన శుక్రవారం కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణలోని 7 జోన్లకు ఒకేసారి కౌన్సెలింగ్ చేపట్టడంతో కళాశాల ఆడిటోరియంలో గందరగోళం నెలకొంది. డీహెచ్ రవీంద్రనాయక్ నేతృత్వంలో జరిగిన కౌన్సెలింగ్‌లో గ్రేడ్–1 అధికారి సుజాత రాథోడ్ వేదికపైకి వచ్చి బదిలీల లిస్టును మార్పు చేయించడంతో నర్సులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బదిలీల కౌన్సెలింగ్‌ను పారదర్శంగా నిర్వహించాలని పెద్దపెట్టున నినదించారు. దీంతో డీహెచ్ కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది స్టాఫ్‌నర్సులు ధర్నాకు దిగారు. తమకు ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించాలని, డీహెచ్ డౌన్ డౌన్ అని నినదించారు. కొందరు అధికారులు యూనియన్ నేతలుగా చెప్పుకుంటున్న వారితో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు ఇస్తున్నారని ఆరోపించారు.
ఓ యూనియన్ నేత రూ.5 కోట్ల వరకు వసూలు చేశాడని.. ఆ సొమ్ములో రూ. 3 కోట్లు ఒక కీలక అధికారికి కూడా ఇచి్చనట్లు ఆరోపించారు. ఉస్మానియా మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డును గంటసేపు దిగ్బంధనం చేశారు. దీంతో సుమారు రెండున్నర గంటల పాటు కోఠి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు వేల సంఖ్యల్లో స్టాఫ్ నర్సులను నిలువరించలేకపోవడంతో రాకపోకలు భారీగా నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment