స్టాఫ్‌నర్సు నియామకాల్లో అక్రమాలు  | Irregularities In Staff Nurse Appointments | Sakshi
Sakshi News home page

‘మెరిట్‌’ మాయాజాలం 

Published Fri, Sep 18 2020 7:58 AM | Last Updated on Fri, Sep 18 2020 7:58 AM

Irregularities In Staff Nurse Appointments - Sakshi

స్టాఫ్‌నర్సుల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రమేష్‌నాథ్‌

వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్టాఫ్‌నర్సు అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారు. లోకల్‌ అభ్యర్థులకు 70 శాతం ఉద్యోగాలివ్వాలన్న నిబంధనను తుంగలో తొక్కి మెరిట్‌ లిస్ట్‌ తయారు చేశారు. నాన్‌లోకల్‌ అభ్యర్థులకు ఉద్యోగాలు కట్టబెట్టి జిల్లా అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారు. ఫలితంగా అర్హుత ఉండీ ఉద్యోగాలు దక్కని వారంతా లబోదిబోమంటున్నారు. 

అనంతపురం హాస్పిటల్‌: స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియలో జిల్లా అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఆరోగ్యశాఖ, ఏపీ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలో ఉండే పోస్టుల నియామకాలు, ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీంతో మన జిల్లా అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. వివిధ శాఖల ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా అర్హులకు మొండిచేయి చూపారన్న విమర్శలున్నాయి. పొరుగు జిల్లాలైనా వైఎస్సార్, కర్నూలులో లోకల్, నాన్‌లోకల్‌ కేటగిరిలో పోస్టులను పక్కాగా భర్తీ చేస్తుంటే ‘అనంత’లో మాత్రం నిబంధనలకు నీళ్లొదిలారు.  

కాంట్రాక్టు పోస్టుల భర్తీకి... 
కోవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వం పీహెచ్‌సీలు, సర్వజనాస్పత్రి, సూపర్‌ స్పెషాలిటీ, ఏరియా ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిన స్టాఫ్‌నర్సు పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇటీవల ఈ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

లోకల్‌ కాకపోయినా... 
ఈ నెల 14న 92 స్టాఫ్‌నర్సు పోస్టుల మెరిట్‌ లిస్టును డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రమేష్‌నాథ్‌ విడుదల చేశారు. మొదటి 28 పోస్టులు అన్‌రిజర్వ్‌ కేటగిరికి కేటాయించారు. మరో రెండు పోస్టులు పీహెచ్‌ – హెచ్‌హెచ్‌ (వికలాంగులు)కు కేటాయించారు. ఇక మిగతా 62 పోస్టులు స్థానికంగా ఉండే వారికి కేటాయించాలి. కానీ వైఎస్సార్‌ జిల్లాకు చెందిన     ఎ.అమరావతి (జాబితాలో 28వ నంబర్‌)కి పోస్టింగ్‌ ఇచ్చారు. అర్హుల జాబితాలోనూ ఈమెను లోకల్‌గానే చూపించారు. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ (సీరియల్‌ నెంబర్‌ 64 )ను అర్హుల జాబితాలో లోకల్‌గా చూపించారు. ఇదే విధంగా మరో నలుగురు నాన్‌లోకల్‌ వారిని లోకల్‌గా చూపించి పోస్టులను కేటాయించారు.  

ఆరోగ్యశాఖలోనూ... 
ఈ నెల 5న డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో స్టాఫ్‌నర్సులకు కౌన్సిలింగ్‌ నిర్వహించి పోస్టులు కేటాయించారు. మొత్తం 77 పోస్టులను భర్తీ చేశారు. అందులో వైఎస్సార్‌ జిల్లా గాలివీడుకు చెందిన కే.శైలజ (మెరిట్‌ నంబర్‌ 43) వర్కింగ్‌ ప్లేస్‌గా చూపించి పోస్టింగ్‌ కేటాయించారు. అలాగే మదనపల్లికి చెందిన ఉమాదేవి (సీరియల్‌ నంబర్‌ 65 ) , కర్నూలు జిల్లాకు చెందిన టి.సునీత (సీరియల్‌ నంబర్‌ 68)ను లోకల్‌ కేటగిరిలో చూపించారు. మెరిట్, ఫైనల్‌ మెరిట్‌ లిస్టుల్లో అభ్యర్థి ఏ ఊరు అనే అంశాన్ని కూడా నమోదు చేయకపోవడం గమనార్హం.  

అదేబాటలో వైద్య కళాశాల 
సూపర్‌ స్పెషాలిటీ పోస్టుల భర్తీలోనూ వైద్య కళాశాల డీఎంహెచ్‌ఓ, వైద్య విధానపరిషత్‌ అధికారులు అనుసరిస్తున్న వైఖరిని అవలంభిస్తుండం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మెరిట్‌ జాబితా ఎంపికపై అవగాహన లేకపోవడంతో పాటు కొందరు అధికారుల అనుయాయులకు పోస్టులు కట్టబెట్టడానికే ఈ అడ్డగోలు బాగోతానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని జిల్లా అభ్యర్థులు కోరుతున్నారు.     

92 పోస్టులకు 39 మంది హాజరు  
అనంతపురం హాస్పిటల్‌: డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయంలో డీసీహెచ్‌ఎస్‌ రమేష్‌నాథ్‌ ఆధ్వర్యంలో గురువారం స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 92 పోస్టులకు గానూ కేవలం 39 మంది అభ్యర్థులు మాత్రమే హాజరుకావడం గమనార్హం. అభ్యర్థుల మెరిట్‌ లిస్టు ప్రాతిపదికన స్థానాలను కేటాయించారు. అనంతరం డీసీహెచ్‌ఎస్‌ రమేష్‌నాథ్‌ అభ్యర్థులకు ఆర్డర్‌ కాపీలను అందజేశారు.

భర్తీ చేయాల్సిందిలా.. 
స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీలో 70 శాతం స్థానికులతోనే భర్తీ చేయాలి. 30 శాతం మాత్రం నాన్‌లోకల్‌ తో పాటు స్థానికులను మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేయాల్సి ఉంది.  

భర్తీ చేసిందిలా... 
70 శాతం లోకల్‌ కేటగిరీలోనే నాన్‌లోకల్‌ వారికి అవకాశమిచ్చి ఉద్యోగాలిచ్చారు. ఫలితంగా జిల్లాకు చెందిన అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. నాన్‌ లోకల్‌లోనూ మెరిట్‌ పక్కన పెట్టి జాబితా తయారు చేశారు. 

తప్పులుంటే సరిచేస్తాం 
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పోస్టుల భర్తీ జరుగుతుంది. స్టాఫ్‌నర్సు పోస్టుల్లో స్థానిక అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్న విషయంపై మరోసారి జాబితాను పరిశీలిస్తాం. ఏవైనా తప్పులు జరిగి ఉంటే సరిచేసేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవల డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోనూ ఇలాంటి సమస్య తలెత్తితే సరి చేసేలా చర్యలు తీసుకున్నాం. 
– సిరి , జాయింట్‌ కలెక్టర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement