ఆరోగ్య సిబ్బందితో మాట్లాడుతున్న డీసీహెచ్ రామకృష్ణారావు
ఆదోని టౌన్: ‘బుద్ధిగా డ్యూటీలు చేసుకోండి. అనవసరమైన తగవులు పెట్టుకోవద్దు. విభేదాలతో ఆస్పత్రికి చెడ్డపేరు వస్తుంది. మీలో కొంతమంది అధికారులకు, మీడియాకు లెటర్లు రాస్తున్నారు. ఇంతటితో ఆపేయండి. ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. నాకు ఎవరూ లెక్కకాదు. నలుగురు డీసీహెచ్‌ల్లో కంటే నేనే సీనియర్‌ను. ఎవరు చెప్పినా వినను. గిరిజన ప్రాంతాలకు బదిలీ చేస్తా’ అంటూ స్టాఫ్, హెడ్ నర్సులను ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ రామకృష్ణారావు హెచ్చరించారు. ఆదోని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, మాతా శిశు సంరక్షణ కేంద్రం, ఏరియా ఆస్పత్రిని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై డీసీహెచ్ విచారణ చేశారు.
ప్రసవం కోసం వచ్చిన గ్రామీణప్రాంత పేద మహిళలను కొంతమంది డాక్టర్లు, సిబ్బంది భయపెడుతూ ప్రైవేటే ఆసుపత్రులకు తరలించి కమీషన్లు తీసుకుంటున్నారని మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ డీసీహెచ్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రసవం సమయంలో ఒక్కొక్క గర్భిణి నుంచి వెయ్యి, రెండువేలు దాకా వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇందుకు డీసీహెచ్ స్పందిస్తూ ఇక నుంచి విధి నిర్వహణలో ఎవరైన నిర్లక్ష్యంగా వ్యవహరించినా వెంటనే బదిలీ చేస్తానని హెచ్చరించారు. వచ్చేనెలలో ప్రిన్సిపాల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఆదోనిలో పర్యటించనున్నట్లు చెప్పారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి ఆవరణలో ఐదెకరాల స్థలాన్ని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులు పరిశీలన కూడా చేసినట్లు తెలిపారు.
బ్లడ్‌బ్యాంక్ ఉద్యోగుల వినతి
ఆదోని బ్లడ్ బ్యాంక్, ఆలూరు, ఎమ్మిగనూరు, మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ కేంద్రాల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆరునెలలుగా జీతాలు అందలేదని, దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని డీసీహెచ్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment